నా చిన్నతనంలో ఎక్కువ కాలం గడిపిన బెజవాడకు గుంటూరు చాలా దగ్గర అయినప్పటికీ ఆ ఊరు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. మా చిన్న బావగారు తుర్లపాటి రంగారావు గారు గుంటూరులో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న రోజుల్లో నేను బెజవాడనుంచి గుంటూరు వెళ్లి అక్కడ పట్టాభి పురంలో ఉన్న బావగారింట్లో ఉండేవాడిని. ఆయన కారులో (జీపులో) ఆఫీసుకు వెడుతూ నన్ను వెంటబెట్టుకుని తీసుకువెళ్లి నాజ్ సెంటర్ లో వదిలేసి మళ్ళీ భోజనానికి ఇంటికి వెళ్ళేటప్పుడు పికప్ చేసుకునేవారు. ఈలోగా అక్కడ ఏదో ఒక సినిమా హాలు పట్టుకుని అందులో ఏ సినిమా ఆడుతుందో అనేది పట్టించుకోకుండా వెళ్లి థియేటర్ లో కూర్చొనే వాడిని. బెజవాడ ఎండలను తలపించే గుంటూరు వేడిని తట్టుకోవడానికి ఏసీ థియేటర్ ను ఎంచుకునేవాడిని. బహుశా ఆ రోజుల్లో ఎయిర్ కూల్డ్ థియేటర్లు అనేవారు అనుకుంటా.
అలా ఒకరోజు నాజ్ థియేటర్ లో చూసిన సినిమా లీడర్. పేరు
చూసి ఇంగ్లీష్ సినిమా అనుకున్నాను. తీరా చూస్తే అది హిందీ పిక్చర్. దిలీప్ కుమార్
హీరో. భాష అర్ధం కాకపోయినా సినిమా నాకు బాగా నచ్చింది. అచ్చం మన తెలుగు సినిమా
హాస్య నటుడు చలం మాదిరిగా వున్నాడు, దిలీప్ కుమార్.
దేశ విభజనకు ముందు దిలీప్ కుమార్ జన్మించింది ఈనాటి
పాకిస్తాన్ లో అయినా, పేరు
మార్చుకుని (అసలు పేరు యూసుఫ్ ఖాన్ అనుకుంటా) మన దేశంలోనే ఒక అత్యుత్తమ సినీ కథానాయకుడిగా
పేరు తెచ్చుకుని దేశానికి కూడా ప్రతిష్ఠ తెచ్చారు.
తొంభయ్ ఎనిమిదేళ్లు, అంటే కొంచెం అటూ ఇటూగా శతాయుష్కుడిగా
జీవించి ఈరోజు ఉదయం ముంబైలో కన్ను మూశారు.
(07-07-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి