నిజానికి ఈ పేచీలు కొత్త విషయం ఏం కాదు, చార్వాకుడి కాలం నుంచి చూస్తున్న తతంగమే.
దేవుడ్ని నమ్మని ఈ
చార్వాకుడు బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత
కర్త. చార్వాక, లోకాయత ఇలా అనేక పేర్లు వున్నాయి ఈ శాఖకు.
‘లోకాయత’ అంటే
ప్రజల తత్వశాస్త్రం అనీ, ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా
ఒక మూల పురుషుడు లేడు. సామాన్య ప్రజల్లో కొన్ని అనుమానాలు వుంటాయి. ఉదాహరణకు
భగవంతుడికి పెట్టే ప్రసాదం ఆయన ఎప్పుడన్నా తిన్నాడా? ఇలాంటి తర్కాలను
లేవదీసి, ఈ లోకాయతులు ఆనాటి ఆధ్యాత్మిక వాదుల తిరస్కరణకు గురయ్యారు. నమ్మకానికీ,అపనమ్మకానికీ ఇది
అనాదిగా జరుగుతున్న సంఘర్షణే ఇది. ఈ లోకాయతులు దేవుడ్ని నమ్మరు. ఆత్మను, పునర్జన్మలను
విశ్వసించరు. ఒక రకంగా అది వారి నమ్మకం.
ఈనాటి చర్చల్లో ఒక
కులానికి సంబంధించిన అనవసర ప్రస్తావనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ విషయం
చెప్పాల్సి వస్తోంది. లోకాయత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన చార్వాకుడు ఒక
బ్రాహ్మణుడు. మరో చిత్రం ఏమిటంటే చార్వాక వధకు పూనుకున్నవారు కూడా బ్రాహ్మణులే.
‘మహాభారతం’లోని
శాంతిపర్వంలో ఈ చార్వాక వధ గురించిన ప్రస్తావన వుంది.
కురుక్షేత్ర
మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలాదిమంది బ్రాహ్మణులు
నగర ద్వారం వద్ద యుధిష్టురుని ఆశీర్వదించడానికి జమవుతారు. వారితో కలిసివచ్చిన
చార్వాకుడు ధర్మజుడితో వాగ్వాదానికి దిగుతాడు. ‘యుద్హంలో అనేకమంది బంధు మిత్రుల
మరణానికి నువ్వే కారకుడివి. ఇంత చేసి నీవు సాధించింది ఏమిటి? నువ్వు బతికి
ఉండడానికి వీల్లేదు’ అంటూ గద్దిస్తున్న చార్వాకుడిని చూసి ధర్మరాజు ఖిన్నుడై
బలవంతంగా తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ తరుణంలో తెప్పరిల్లిన మిగిలిన
బ్రాహ్మణులు, చార్వాకుడు తమ ప్రతినిధి కాదని ధర్మరాజుకు నచ్చచెప్పి, ఆ కోపంలో
చార్వాకుడిపై మూకుమ్మడిగా దాడిచేసి అతడిని వధిస్తారు. చార్వాకుడు యుధిష్ఠిరునికి
ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు
అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని
ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే.
అలా చార్వాకుడి
నుంచి ఈ నాటి దాకా పురాణాలను అధిక్షేపించిన అనేకమంది మనకు చరిత్ర పుటల్లో
కనిపిస్తారు. అయినా వాటిపట్ల ప్రజల మనస్సుల్లో ఉన్న భక్తి శ్రద్ధలు ఏమీ
చెరిగిపోలేదు.
ఒక్క మనదేశంలోనే
కాదు, అనేక దేశాల్లో ఇలా దేవుడ్ని నమ్మిన వారికీ, నమ్మని వారికీ
ఇలాటి సంఘర్షణలు జరుగుతూ వస్తూనే వున్నాయి. దేవుడనేది ఒక నమ్మకం. అలా నమ్మేవారి
నమ్మకాన్ని శంకించాల్సిన పనిలేదు. దేవుడ్ని నమ్మకపోవడం కూడా ఒక నమ్మకమే. ఎవరి
నమ్మకం వారిది. నమ్మకం మూఢనమ్మకంగా మారనంతవరకు వచ్చిన నష్టం ఏమీ లేదు.
ఒక సినిమా నటుడ్ని
గురించి ఒకింత నిరసనగా మాట్లాడితేనే తట్టుకోలేని అభిమానుల నడుమ జీవిస్తున్నాం. మరి
కోట్లాదిమంది అనునిత్యం దేవుడిగా పూజించే పురాణ పురుషులను గురించి ఎగతాళిగా
మాట్లాడితే ......
రాముడు దేవుడు
కాదని మీ నమ్మకమైతే దాన్ని నమ్మేవారితో పంచుకోండి. దేవుడిని నమ్మేవారితో మీకు
పేచీలు ఎందుకు?
1 కామెంట్:
నాకు దేవుడు మీద నమ్మకం ఉంది : ఐన్-స్టీన్ !!
◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆
విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్భర్ట్ ఐన్-స్టీన్ పలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అతడిని, 'మీకు దేవుడి మీద నమ్మకం ఉందా ' అని అడిగేవాళ్ళట.
"ఉంది. స్పినోజా చెప్పిన దేవుడి మీద నమ్మకం" అనేవాడట ఐన్-స్టీన్.
స్పినోజా 17 వ శతాబ్దపు డచ్ తత్వవేత్త.
అతడు చెప్పినదాన్ని ఎవరో చాలా గొప్పగా తెలుగులో ఈ విధంగా అనువదించారు.
దేవుడు మనిషికి చెప్పేది.. స్పినోజా మాటల్లో
"..ప్రార్థనలేవీ అక్కర్లేదు. ప్రపంచం లోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి. సృష్టి సర్వం తో మమేకం కండి. హాయిగా నవ్వండి. భువన గానం లో భాగం కండి.
ప్రార్థనా మందిరాలకు వెళ్లడం దేనికి? నేనక్కడ ఉంటానని ప్రకటిస్తూ అవన్నీ మీ నిర్మాణాలేగా!
పర్వతాలూ, చొరలేని అరణ్యాలూ, నదులూ, సరోవరాలూ, సాగర తీరాలూ... ఇవీ నా నివాసాలు.
మీ దౌర్భాగ్యాలకు నన్ను నిందించడం వదిలెయ్యండి. మీ తప్పటడుగులూ, పాపాలతో నాకు ప్రమేయం లేదు.
మీ పవిత్ర గ్రంధాలతో నాకే సంబంధమూ లేదు.
ఒక పొద్దు పొడుపులో, ఒక నిర్జన మైదానంలో, ఒక ఆత్మీయ మిత్రుడి స్పర్శలో, మీ బిడ్డ కళ్ళలో ఉంటాను నేను. ఏవో పుస్తకాల పుటల్లో కాదు.
అవధి లేని ప్రేమ నేను. నేను ఏ తీర్మానాలు చెయ్యను, నిన్ను విమర్శించను. నువ్వంటే కోపాలూ , పట్టింపులూ ఉండవు.
క్షమాపణలేవీ నన్ను అడగకు. క్షమించ వలసినవేవీ ఉండవు.
నీ పరిధులూ, పరితాపాలూ, ఉద్వేగాలూ, సుఖాలూ, అవసరాలూ అన్నీ నేను నీలో నింపినవే. అలాంటప్పుడు నీ అతిక్రమణలకు నిన్నెలా శిక్షిస్తాను నేను?
నిన్ను కాల్చివేసే నరకమొకటి నేను సృష్టించి ఉంటే నేనేం దేవుణ్ణి ?
నిత్య జాగృతిలో బతుకు. అదే నీ దిక్సూచి. ఇతరులు నీకేది చేయకూడదని నువ్వు భావిస్తావో అది నువ్వు వాళ్లకు చెయ్యకు.
బతుకంటే అదేదో పరీక్ష కాదు. ఒక రిహార్సల్ కాదు. ఏ స్వర్గద్వారాలకో పీఠిక అసలు కాదు. ఇక్కడ నడిచే, గడిచే వాస్తవం!!! అంతమాత్రంగానే చూడు దాన్ని.
పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాను నీకు. శిక్షలూ, పురస్కారాలూ, పాపాలూ, సద్గుణాలూ నా నిఘంటువులో మాటలు కాదు. ఏదో కలంతో వాటినెవ్వరూ నా దివాణంలో లెక్క కట్టరు. స్వర్గం, నరకం నీకు నువ్వే నిర్మించుకోవాలి. ఆ స్వేఛ్చ నీదే.
ఈ బతుకు ముగిశాక ఇంకొకటేదైనా ఉందో, లేదో నేను చెప్పను. కానీ దీని తరువాత ఇంకేదీ లేదన్నంత దీక్షగా బతుకు. ఇంకొక బతుకు ఉంటే ఇంతకుముందు నువ్వు ఏం చేశావు, ఇంకేం విస్మరించావు - అనే లెక్కలు నేను తిరగదోడను.
నన్ను నమ్మకు. నమ్మడం అన్నది ఊహాత్మకం. నిన్ను నువ్వు నమ్ముకో.
ఏ సాగర జలంలోనో ఈత కొడుతున్నప్పుడో, ఒక శిశువును హత్తుకున్నప్పుడో, పెంపుడు పశువును నిమిరేటప్పుడో నేను గుర్తురావడమే నేను ఆశించేది.
నీ కీర్తనలు అన్నీ వదిలెయ్యి. వాటికి ఉప్పొంగిపోతే నేనేం దైవాన్ని?
నీ ఆరోగ్యం, నీ సంబంధాలూ, సంతోషాలూ సరిచూసుకో.
అదే నాకు నువ్వు పఠించే స్తోత్ర పాఠం.
నా గురించి ఇప్పటికే నీ బుర్ర నిండా ఉన్న సరంజామా అంతా చేజార్చుకో. చిక్కుముడి అదంతా. అద్భుతాలూ, వాటికి అన్నేసి వివరణలూ దేనికి ?
నువ్వు ఇప్పుడు ఇక్కడ శ్వాసిస్తూ ఉన్నావ్.
అంతకు మించిన అద్భుతం ఏదో ఇంకా ఎందుకు..?"
From whatsapp...
కామెంట్‌ను పోస్ట్ చేయండి