25, జులై 2014, శుక్రవారం

సానియా విషయంలో కేసేయార్ చేసిన తప్పేమిటి?


మన దేశానికి స్వాతంత్రం ఇవ్వాళా వద్దా అని బ్రిటిష్ పాలకులు మల్లగుల్లాలు పడిన సందర్భంలో వాళ్లకు వచ్చిన అనుమానాల్లో ఒకటి - ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు వున్న భారత దేశానికి స్వతంత్రం ఇవ్వడం అంత మంచిది కాదేమో అని.
అదే ఇప్పుడు స్వతంత్రం ఇవ్వాల్సి వస్తే వారికి పూర్తిగా విభిన్నమైన సందేహం కలిగేదేది, ఇంతమంది చదువుకున్నవాళ్ళు వున్న దేశంలో ఎక్కువ స్వతంత్రం అనేది కూడా అంత  మంచి చేయదేమో అని.
సానియా మీర్జా వ్యవహారంపై సాగుతున్న చర్చ, జరుగుతున్న రచ్చ చూసిన తరువాత ఇది నిజమేమో అని అనిపిస్తోంది.


ఎవరు అవునన్నా కాదన్నా సానియా మీర్జా అంతర్జాతీయంగా పేరున్న టెన్నిస్ స్టార్. ఏ ప్రభుత్వం అయినా 'బ్రాండ్ అంబాసిడర్' ని నియమించుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాటి పేరు ప్రఖ్యాతులు వున్నవాళ్లనే ఎంపిక చేసుకుంటుంది. అలాటి  వాళ్లు తమ రాష్ట్రానికే చెందినవారై వుండాలన్న నిబంధన ఏమీ వుండదు. అంచేతనే కేసీయార్ ఆమెను ఎంపిక చేసి వుంటారు.
ఇక ఆమె జాతీయత గురించి. టెన్నిస్ తార అయిన తరువాతనే ఆమె పెళ్లి జరిగింది. అంతర్జాతీయ క్రీడారంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఆ స్థాయి కలిగిన క్రీడాకారులని పెళ్లి చేసుకోవడం చాలా సహజమైన విషయం. పెళ్ళాడినంత మాత్రాన జాతీయత మార్చుకున్నట్టు కాదు. ఆ మాటకు వస్తే, రాజీవ్ గాంధీని పెళ్ళాడిన చాలా ఏళ్ళ వరకు సోనియా తన ఇటలీ పౌరసత్వం మార్చుకోలేదని చెబుతారు. ఈ ఉదాహరణలు కోకొల్లలు.
ఇక కోటి  రూపాయల సంగతా! సాధారణంగా ఈ పారితోషికాలు అనండి, గౌరవ పురస్కారాలు అనండి, ఇవన్నీ ఆయా వ్యక్తుల స్థాయికి తగ్గట్టుగా వుంటాయి. సచిన్ టెండూల్కర్ వంటి మేటి క్రీడాకారుడికి భారతరత్న ఇచ్చారు. అంతే కాని,  చిన్నవాటితో సరిపుచ్చరు కదా!
అయితే ఒక విషయం. సానియా మీర్జా గతంలో యేమో కాని ఇప్పుడు సంపన్నురాలు. ప్రభుత్వం గౌరవంగా ఇచ్చిన మొత్తాన్ని మళ్ళీ సర్కారుకే ఇచ్చి క్రీడల్లో చురుకుదనం కలిగిన బడుగు బలహీన వర్గాల పిల్లలకోసం ఖర్చుపెట్టమని కోరివుంటే ఆమెకూ గౌరవంగా వుండేది.
అనవసర విషయాలపట్ల రాద్ధాంతం చేయడం అంటే, అత్యవసర  విషయాల నుంచి దృష్టి మళ్ళించడం అనే అపోహ ఇప్పటికే జనంలో వుంది. దాన్ని నిజం చేయడం మంచిది కాదేమో! కాస్త ఆలోచించుకోవాలి.

5 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

సార్ నేను చదివిన వివరాలు. సానియా మిర్జా అమెరికన్ ఓపెన్ చామ్పియన్షిప్పులో పోటీ చేయబోతుంది. అందు నిమిత్తం ఖర్చుల (శిక్షణ, ప్రయాణం వగైరా) కోసం ఆవిడ అడిగిన ఆర్ధిక సాయం ప్రభుత్వం మంజూరు చేసింది. మామూలుగా వ్యాపార సంస్థలు ఇలాంటి సాయం చేస్తాయి.

అంచేత ఈ మొత్తం బ్రాండ్ అంబాసడర్ పదవికి పారితోషికం కాదు.

Narsimha Kammadanam చెప్పారు...

మీకు ఇప్పటి కోటి మాత్రమే కనిపిస్తోంది .... ఛ.బాబు ... వై. ఎస్ ... కిరణ్ గారు ఇప్పుడు కే.సీ.ఆర్ ... ఇలా మన సీ.ఎం లు అంతా సానియకి కోట్లు ధారా దత్తం చేశారు ... భూమి.. డబ్బు అకాడమీ పేరిట ఇచ్చారు ... కానీ అవుట్ పుట్ సున్నా ...

సీ. ఎం ల ఒళ్ళో నుండి ఇవ్వడం.లేదుగదా ... జనం డబ్బు ఒక్కరికే మేపడం కంటే
..4..5 మంది క్రీడాకారుల్కి 2...3...,రకాల ఆటలని ప్రోత్సహించవచ్చుగదా ... ఒక్క టెన్నిసె ఎందుకు .....

ఇది ఖచ్చితంగా జీ. హెచ్. ఎంసి ఎన్నిలల జిమ్మిక్కు.

Narsimha Kammadanam చెప్పారు...

సైనా నెహ్వాల్ అంబాసిడర్ ఎందుకు కాకూడదు ...
పుట్టుకనే ఆధారం చేసుకున్న కే .సీ ఆర్ కి ... ముంబాయి లో పుట్టిన సానియా మిర్జా స్తానికురాలు ఎలా అయ్యింది?


అయినా సోనియా ఇటలీ ... భారతీయున్ని పెల్లి చేసుకుంటే భారతీయురాలు అయినప్పుడు పాకిస్తానీ ని పెల్లి చేసుకున్న సానియా పాకిస్తానీ ఎందుకు కాదు ...
ఎందుకంటే ఎక్కడ 4డబ్బులు రాలితే ఆది మనది.


ఈ చీపు విధానాలు బానిసలు అయిన మన భారతీయులకే సాద్యం.

Jai Gottimukkala చెప్పారు...

@Narsimha Kammadanam:

సానియాకు అకాడెమీ కోసం ఒక్క చదరపు అంగుళం భూమి కానీ ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు. మీరు వేరే క్రీడాకారుల అకాడెమీల గురించి అంటున్నట్టు ఉంది.

కెసిఆర్ చెప్పే కొత్త ఆర్ధిక సాయం పథకంలో పుట్టుక గురించి కాదు డోమిసైల్ గురించి. ఆవిడ తన ముత్తాతల కాలం నించి చెప్పింది మీరు చదవలేదా?

సోనియా గాంధీ పెళ్లి చేసుకున్న ఎన్నో ఏళ్ల తరువాత భారతీయ పౌరసత్వానికి అర్జీ పెట్టుకుంది. అప్పటిదాకా ఆవిడ ఇటాలీ దెశస్తురాలె

అజ్ఞాత చెప్పారు...

Its all about appeasement of muslim community in view of coming Hyderabad municipal elections. To read more into it waste of time.