కొద్దిగా గతం
1908 లో మూసీ నదికి వరదలు వచ్చాయి. అవి కలిగించిన నష్టం
అంతా ఇంతా కాదు. అప్పటి నిజాం నవాబు హైదరాబాదును ఇలా వొదిలేస్తే ప్రమాదం అని
భావించి నగరాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలని సంకల్పించాడు. మైసూరు నుంచి
ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రభుత్వం తరపున ఆహ్వానించి
వరదలు రాకుండా అరికట్టడానికి, నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేయడానికి తన సలహాదారుగా
నియమించుకున్నారు. విశ్వేశ్వరయ్యగారి దూరదృష్టి పుణ్యమా అని నగరానికి ఉస్మాన్
సాగర్, హిమాయత్ సాగర్ అనే రెండు మంచి నీటి జలాశయాలు ఏర్పడ్డాయి. మూసీ వరదలకు కూడా
ముకుతాడు వేసినట్టూ అయింది. అలాగే 1912 లోనే
నిజాం నగరాభివృద్ధి మండలిని ఏర్పాటు చేసారు. ఈ మండలి ముందు చూపు ఫలితంగా హైదరాబాదు
నగరానికి అప్పట్లోనే చక్కని రహదారులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు ఏర్పాటయ్యాయి.
కొద్దిగా ప్రస్తుతం
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త
రాజధాని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం శివరామ కృష్ణన్ కమిటీ వేసింది. ఈ కమిటీ
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదిక ఇవ్వబోతోంది. ఈ లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు కూడా మరో కమిటీ వేసారు. రాజకీయ నాయకులతో పాటు నిర్మాణ రంగ ప్రతినిధులకు
కూడా ఇందులో చోటు కల్పించారు. అభ్యంతర పెట్టాల్సింది ఏమీ లేదు. కానీ నిజాం నవాబు
మాదిరిగా కొత్త రాజధాని నిర్మాణం విషయంలో చక్కని సూచనలు చేసేందుకు ప్రముఖ ఇంజినీర్లు కొందరికి ఈ కమిటీలో స్థానం కల్పించి వుంటే బాగుండేది.
ఇంతవరకు రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరికీ లభించని అపూర్వ అవకాశం చంద్రబాబు
నాయుడికి రాజధాని నగర నిర్మాణ రూపంలో లభించింది. నిజాం నవాబును విమర్శించేందుకు
ఎన్నో కారణాలు వున్నాయి కాదనలేము. కానీ, హైదరాబాదు నగర పునర్నిర్మాణంలో ఆయన పాత్రను
కూడా కాదనలేము.
కొత్త ముఖ్యమంత్రికి ఇంతకన్నా చెప్పేది ఏమీ లేదు.
4 కామెంట్లు:
ఎవరేం చెప్పినా వినక పోవడం ఆయన నైజం.తనకే అన్నీ తెలుసుననేనది ఆయన విశ్వాసం.ఆర్థిక విషయాల్లో తనకెవరి సలహాలూ అక్కర లేదని అసెంబ్లీ లోనే ప్రకటించారుగా.
"కానీ, హైదరాబాదు నగర పునర్నిర్మాణంలో ఆయన పాత్రను కూడా కాదనలేము"
జాగ్రత్త సార్ మిమ్మల్ని తెలబాన్ అంటారేమో?
"కొత్త ముఖ్యమంత్రికి ఇంతకన్నా చెప్పేది ఏమీ లేదు"
మీరంటున్నది కెసిఆర్ గురించా చంద్రబాబు గురించా?
పాపం శమించుగాక! మోక్షగుండంవారిని సీమంధ్ర దోపిడీదారుడు, సీమంధ్రులకి సహాయం చెయ్య దానికే ఇవన్ని చేసాడు అని ఆరోపించలేదు.
@Jai Gottimukkala - "మీరంటున్నది కెసిఆర్ గురించా చంద్రబాబు గురించా?"మీ సందేహం."బాబుగారు వింటున్నారా?" నా సమాధానం.ఇందులో కేసీఆర్ గారి ప్రసక్తి లేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి