11, జులై 2014, శుక్రవారం

వూహల్ని వాస్తవాలతో ముడిపెట్టిన మోడీ బడ్జెట్

  
ఉరుములు లేవు మెరుపులు లేవు. అలా అని సాదా సీదాగా లేదు. మోడీ మార్క్ బడ్జెట్ కాదందామా అంటే అలానూ  లేదు. ఏమైతేనేం,  మోడీ సర్కారు మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది అని అనిపించుకుంది.
షరా మామూలుగానే  సర్కారు వారు వారి మిత్ర పక్షాల వారు 'ఆహా' బడ్జెట్ అన్నారు. ప్రతిపక్షాలవారు వారి పద్ధతిలోనే,  స్వరం పెంచి  బడ్జెట్ ని తూర్పారబట్టే ప్రయత్నం చేశారు. ఇంతకీ జైట్లీ అమాత్యులు మోడీ పేరుతొ ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ గురించి సామాన్యులు ఏమనుకుంటున్నారు?
ఈ సామాన్యుల్లో రైతులు  వున్నారు. రైతు కూలీలు వున్నారు. రోజు కూలీలు వున్నారు. రోజు గడవని వారు వున్నారు. అసలు బడ్జెట్  అంటే ఏమిటో, దాని కధాకమామిషు ఏమిటో తెలియని అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారే  ఎక్కువమంది వున్నారు. నిజానికి  వారికి బతుకుతెరువే తప్ప బడ్జెట్ గురించి పట్టించుకునే తీరిక వుండదు.



అయినా సరే బడ్జెట్ గొప్పగా వుందని పొగిడే పాలకపక్షం వారు,  సామాన్యుడిని దృష్టిలో వుంచుకుని రూపొందించిన దంటారు. ఇక  ప్రతిపక్షాలవాళ్ళు మాత్రం సంపన్నులకోసం తయారు చేసిన బడ్జెట్ అని తీసిపారేస్తుంటారు. ఈ విషయాలు పక్కనబెడితే-
జైట్లీ గారు ఈ ఇరువురి వాదనలకు మద్దతు ఇచ్చే విధంగా కసరత్తు చేసినట్టు కనబడుతోంది. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం ఓ పక్క సాగుతుండగానే స్టాక్ మార్కెట్లలో కలవరం మొదలయింది. రైల్వే బడ్జెట్ సృష్టించిన ప్రకంపనాల స్థాయిలో  లేకపోయినా ఏదో జరగబోతోంది అన్న భయ సందేహాలు కలిగేలా సెన్సెక్స్ కదలికలు కానవచ్చాయి.  త్వరలోనే కోలుకున్నా కొంత సమయం అదే గందరగోళం కొనసాగింది. మొత్తం మీద మార్కెట్ కుదుటపడింది. పూర్తిగా కాకపోయినా కొంత మేర  కోలుకుని పారిశ్రామిక వర్గాల మన్ననలు మోడీ బడ్జెట్ కి లభించేలా సాయపడింది. బడ్జెట్ మంచి చెడులను అవగాహన చేసుకునేందుకు ఇటీవలి కాలంలో పారిశ్రామిక, సంపన్న వర్గాలకు సెన్సెక్స్ కదలికలు ఓ ధర్మామీటర్ మాదిరిగా ఉపయోగపడుతున్నట్టు వున్నాయి.
మోడీ ప్రధానమంత్రిగా ప్రభుత్వ పగ్గాలు స్వీకరించిన తరువాత తొలి బడ్జెట్ కావడం, ఎన్నికలకు పూర్వం నుంచే సమాజంలోని అనేక వర్గాల వారు ఆయన దీక్షాదక్షతలమీద అపారమైన నమ్మకాలూ పెంచుకుని వుండడం ఇవన్నీ బడ్జెట్ పై అంచనాలు బాగా పెరిగిపోవడానికి దోహదం చేసాయి. అంచనాలు ఆకాశం అంచులవరకు చేరడంవల్లే బడ్జెట్ వెలువడిన తరువాత ప్రాధమిక  ఆశలు నీరుకారిపోయిన అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. కానీ బడ్జెట్ గురించీ అందులో పొందుపరచిన దీర్ఘకాలిక లక్ష్యాలు గురించీ  కొద్దికొద్దిగా వెల్లడయిన తరువాత మిశ్రమ స్పందన కానవచ్చింది.
గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రవేశపెట్టిన బడ్జెట్ లకు, మోడీ బడ్జెట్ కు స్తూలంగా తేడా ఏమీ లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఆర్దిక సంస్కరణల విషయంలో ఈ రెండు కూటములకు మౌలికమైన తేడా లేదన్న అంశాన్ని  గమనంలో వుంచుకుంటే ఈ సందేహం తలెత్తదు అనేవాళ్ళు కూడా వున్నారు. మోడీ అయినా, మన్మోహన్ అయినా, జైట్లీ అయినా చిదంబరం అయినా, ఎన్డీయే అయినా యూపీయే అయినా వారిని, వారి విధానాలను అదుపుచేసే లేదా నిర్దేశించే విదేశీ, స్వదేశీ శక్తులు ఒకటే కావడం ఇందుకు కారణం అని వాదించేవారు సైతం వున్నారు.
ఒకటి మాత్రం స్పష్టంగా గోచరిస్తోంది. ఎవరు ప్రారంభించినా సరే, మొదలు పెట్టిన ఆర్ధిక సంస్కరణలను మరింత పటిష్టంగా ఇంకా ముందుకు తీసుకువెళ్లాలనే పట్టుదల ఈ బడ్జెట్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధించాలంటే స్వల్పకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టాలని సంస్కరణల వేగం పెంచాలని కోరుకునేవారు అంటుంటారు. ఈ క్రమంలో ఆర్ధికంగా వెనుకబడివున్న వర్గాలపై కొంత భారం పడే ప్రమాదం వుంది. అందుకే ఈ విషయంలో మోడీ మహాశయులవారు శషభిషలకు ఆస్కారం ఇవ్వడంలేదు. కొన్ని కఠిన నిర్ణయాలకు జాతిని సంసిద్ధం చేసే ప్రయత్నంలోనే ఆయన వున్నట్టుగా కానవస్తోంది. సంస్కరణలను రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టి,  వాటి వేగాన్ని నియంత్రణ చేస్తూ పోవడంవల్ల సంస్కరణల  ఫలితాలు అనుకున్నంత త్వరగా అనుభవంలోకి రావడం లేదని వాటి సమర్ధకులు తరచూ చెప్పే మాట. అది నిజమే కావచ్చు. కానీ మరికొన్ని వాస్తవాలను కూడా ఏలినవారు గమనంలో పెట్టుకోవాలి. పై పూత మెరుగులతో అభివృద్ధి చెందుతున్న సంపన్న దేశంగా కానవచ్చే మన దేశంలో కుబెరులకంటే, కూటికోసం అల్లాడేవారే సంఖ్యే అధికం. జాతిని ముందుకు తీసుకుపోయే వేగంలో వారి బతుకులు మరింత చిద్రం కాకుండా చూడాల్సిన ధర్మం కూడా ఏలికల మీద వుంది. ఈ ధర్మాన్ని మరవనంతవరకు సంస్కరణల వడీ వేగం పెంచినందువల్ల ఇబ్బంది ఏమీ వుండదు.
ఏ బడ్జెట్ లక్ష్యం అయినా సర్వజన శ్రేయస్సు కావాలి. మోడీ బడ్జెట్ ఈ దిశగా సాగుతుంది అనుకుంటే దాన్ని స్వాగతించాలి.

కామెంట్‌లు లేవు: