7, జులై 2014, సోమవారం

కలల్ని ఆవిష్కరించిన కేసీయార్



ఆ సమయంలో కరెంటు వుండడం వల్ల నేను ఆసాంతం కేసీయార్ ప్రసంగాన్ని టీవీ తెరపై చూడగలిగాను. మాటల మాంత్రికుడని, మాటలతో ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తారని ఆయనకు పేరుంది. అయితే ఈరోజు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో  నవ తెలంగాణా లక్ష్యాలు వివరిస్తూ ఆయన చేసిన  ప్రసంగానికి శ్రోతలుగా వున్నది అంత ఆషామాషీ వ్యక్తులు కాదు. మొత్తం తెలంగాణా అధికారయంత్రాంగం ఆయన మాటల్ని ఆలకించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.



బహుశా వారిలో చాలామందికి తాము ఎరిగివున్న కేసీయార్ కు బదులు కొత్త కేసీయార్ కనబడివుంటాడని టీవీలో చూస్తున్న నాకు అనిపించింది. నవ తెలంగాణా యెలా వుండాలి అనే దానిపై ఆయన అభిప్రాయాలు యెలా వుంటాయి అనేదానిపై నాకు అవగాహన వుంది. ఎందుకంటే ఎన్నికలకు చాలా పూర్వమే తెలంగాణా జర్నలిస్టులు ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో ఆయన అంతరంగ ఆవిష్కరణకు నేను ప్రత్యక్ష శ్రోతను. ఇవాల్టి సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమి మాట్లాడింది రేపటి పత్రికల్లో వివరంగా వస్తుంది. అంచేత ఆ వివరాల జోలికి పోవడం లేదు. కానీ ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను. చెప్పదలచుకున్న అంశాలను సంగ్రహంగా, సూటిగా, అరటి పండు వొలిచి చేతిలో పెట్టిన చందంగా చెప్పగలిగే చతురత కేసీయార్ కు వున్నట్టు వర్తమాన రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరికీ వున్నట్టు లేదు. తెలంగాణా సమస్యలపట్ల తనకు అవగాహన హెచ్చు అని చెప్పుకుంటూనే, కొన్ని కొన్ని గణాంకాల ప్రస్తావన  వచ్చినప్పుడు ఎలాటి భేషజాలకు పోకుండా పక్కనే కూర్చున్న సేద్యపు నీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకుని సరిదిద్దుకున్న విధానం గమనించినప్పుడు ఆయనలోని నిజాయితీ అధికారులకు తెలిసివచ్చింది. 'కింది అధికారులతో, సిబ్బందితో తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ లో అడిగి బెదరగొట్టకండి' అంటూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసిన పద్దతి కూడా బాగుంది. 'అందర్నీ కలుపుకు పోవడం ద్వారా మాత్రమే కన్న కలలు నిజం చేసుకోగలుగుతామని ఓ పక్క సుతిమెత్తగా చెబుతూనే, ప్రతి విషయంలో ఆలోచన, ఆచరణ కేవలం తెలంగాణాను దృష్టిలో పెట్టుకుని సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన తీరు పరికించినప్పుడు రానున్న రోజుల్లో ఆయన అనుసరించబోయే ఎత్తుగడలు యెంత కఠినంగా వుండబోతున్నాయో కూడా అవగతమైంది.                    

6 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"తాము ఎరిగివున్న కేసీయార్ కు బదులు కొత్త కేసీయార్ కనబడివుంటాడని టీవీలో చూస్తున్న నాకు అనిపించింది"

మారింది అవతలి వ్యక్తి కాదేమో మన కళ్ళలోనే మార్పు వచ్చిందేమో అని ఆత్మవిమర్శ చేసుకోవడం విజ్ఞుల లక్షణం.

"ప్రతి విషయంలో ఆలోచన, ఆచరణ కేవలం తెలంగాణాను దృష్టిలో పెట్టుకుని సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన తీరు"

ఇది నిజంగా మంచిదే. అవతలి వారిపై దృష్టి కేంద్రీకరిస్తే మన ప్రయోజనాలకు న్యాయం చేయలేము. తెలంగాణేతరులు ఎటుతిరిగీ తెలంగాణకు ఏమో చేస్తారన్న ఆశ కనిపించడం లేదు. కనీసం మనం తెలంగాణా గురించి ఆలోచించడం ఎంతయినా అవసరం.

buddhamurali చెప్పారు...

మీడియా చూపించిన కెసిఆర్ కు బదులు కొత్త కేసీయార్ కనబడివుంటాడని అనిపించి ఉంటుంది

అజ్ఞాత చెప్పారు...

హైదరబాద్ అక్కడి ప్రజలు కూడా తెలంగాణ లో భాగమని ఆయన భావిస్తే బావుణ్ణు. ఆయనకి ఇక్కడ సీట్లు రాలేదని బాధ అనుకుంట. ఇక్కడి ఆదాయం తో తెలంగాణా అభివ్రుధి చేసి ఇక్కడి వాల్లపై రాజకీయం చేసి జిల్లాల్లో బలపడాలని ఆలోచనా?

hari.S.babu చెప్పారు...

నెల రోజుల్లో భూనభోంతరాళాలు బద్దలవుతాయని ఆశించలేదు గానీ పని తీరు యెలా వుంటుందో తెలిసింది.

1.విధ్యార్ధి అయినా వుద్యొగి అయినా స్థానికత గురించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోనూ రాజ్యాంగంలోనూ వున్న వాటికి బదులుగా ఫీస్ రీ ఇంబర్స్మెంట్ కి మాత్రం తండ్రి పుట్టుక అనే కొత్త ప్రతిపాదన తెచ్చారు.విధ్యార్ధికి సంబంధించిన అతి ముఖ్యమయిన స్థానికతకు సంబంధించిన సాంకేతిక వివరాలకు విరుధ్ధంగా వున్నందువల్ల చెల్లకుండా పోతే?చెల్లినా చెల్లకపోయినా పీనాసితనంగా లేదూ?
2.విడిపోయి కలిసుందామని సుద్దులు చెప్పిన వాళ్ళు సచివాలయంలోనే బ్యారికేడ్లు కట్టేశారు.మాకు తెలీదు గవర్నరు కార్యాలయం చేసింది అనేశారు స్కూలు పిల్లల్లాగ.గవర్నరు కార్యాలయం వాళ్ళు కూడా మేము కట్టలేదంటున్నారు, మరి కాకులు కట్టాయా పిల్లులు కట్టాయా?
3.నీటి పారుదలకి సంబంధించిన వ్యవహారాలన్నీ గవర్నరు కార్యాలయం ద్వారానే నడవాలని నిబందనల్లో వున్నా కృష్ణా దెల్టాకు మంచి నీళ్ళకి కూడా అడ్దం పడుతున్నారు,అదేమంటే ఆంధ్రోళ్ళు సాగునీరుగా వాడుకుంటున్నారని అక్కడి నుంచే ఇక్కడ జరుగుతున్నదేంటో చూసినట్టుగానే మాట్లాడు తున్నారు.
4.ఒకప్పుడు ఆంధ్రోళ్ళు “మావన్నీ మాకే, మీవి కూడా మాకే” అనే విధంగా మమ్మల్ని దోచుకున్నారు అన్నవాళ్ళు ఇవ్వాళ కరెంటు విషయాని కొచ్చేసరికి “మా కరెంటు మాకే, మీ కరెంటు కూడా మాకే” అంటున్నారు.చాలా గంభీరమయిన సాంకేతికాంశాల్నికూడా లేవనెత్తుతున్నారు.
5.కరెంటు విషయంలో మాత్రం ఆంధ్రా అభ్యంతరాల్ని పట్టించుకోకుండా బిల్లులేని అంశాల్ని మక్కీకి కి మక్కీ గా అమలు చెయ్యాలట, పోలవరం విషయంలో మాత్రం తెలంగాణా అభ్యంతరాలకి విలువ నిచ్చి డిజయిను వారు చెప్పినట్టుగా మార్చాలట!
6.ఆర్భాటంగా ల్యాంకో హిల్ల్స్ మీదకి వెళ్తే అక్కడ సహేంద్ర తక్షకాయ స్వాహా అన్నట్టు మైక్రోసాఫ్ట్ లాంటివి కూడా పక్కనే వున్నాయని తేలింది.వాళ్ళని బయటికి లాగాలంటే తామే పరిహారం ఇస్తే తప్ప కుదరదు,వారు ముందు చెప్పినట్టుగా అవి వక్ఫ్ భూములు అనే వాదనకి కట్టుబడితే తామివ్వాల్సింది ఒంకా తడిసి మోపెడవుతుంది!ప్రస్తుతానికి కిమ్మనకుండా వుండి పోవటమా దొడ్డిదారిన వెళ్ళటమా యేది శ్రేయస్కరం?
7.పాత భవంతుల్ని కూలుస్తున్నారని దాదాపు పూర్తి కావచ్చే మెట్రో పనుల్ని అర్ధాంతరంగా నిలిపెయ్య మన్నారు,దాని వల్ల చేసే పని మధ్యలో ఆపడం ద్వారా లార్సన్ అండ్ టబ్రో వాళ్లకి యెంత నష్టం?అది వాడు భరించడే, మళ్ళీ పని మొదలెట్టినప్పుడో మరొకప్పుడో ప్రభుత్వం దగ్గిర్నుంచే వసూలు చేస్తాడు గదా!
8.విభజన జరిగిన తీరు చూస్తే చేసిన వాళ్లకి ఇంతకు ముందు రాష్ట్రంలో తేంగాణాతో పాటూ ఆంధ్రా రాయల సీమా అనే మరో రెండు ప్రాంతాలు కూడా వుండేవి అని గానీ విడిపోయాక కూడా అవి వుండాలని గానీ అనే అవగాహన వున్నట్టు కనిపించదు.యేది పడీతే అది వేసెయ్ తెలంగాణాకే, అక్కడ పడే వోట్ల వర్షంతో ప్రధాని పదవి రాహు బాబుకే అన్నట్టు రెచ్చిపోయారు.ఆఖరి నిముషాల్లో వెంకయ్య నాయుడు నోటి మాటగా కొన్ని హామీలు రాబట్టాడు గాబట్టి ఆంధ్రా ఈ మాత్రమయినా ధీమాగా వుంది, లేకపోతే?నోటి మాటే తప్ప నికరమయిన హామీలు కాదని వొకవైపున యేదుస్తుంటే వాటికి కూడా మాకూ కావాలి అని పోటీకి తగులుకున్నారు, అవి కూడా రాకుండా చెయ్యటానికి!.
9.రెండున్నర జిల్లాలోళ్ళు అనే వంకర కూత వొచ్చినప్పుడే తెలివి తెచ్చుకుని జవాబు చెప్పకుండా ఆ మాట అన్నందుకా అన్నట్టు ప్రజాకవనీ మహాకవనీ మోసినందుకూ, ఇన్నేళ్ళ నుంచీ వుద్యమం యే తీరుగా జరుగుతుందో చూసి కూడా విబజన తప్పదని తెలుసుకోకుండా హైదరాబాదు ఆదాయంలో తమ న్యాయమయిన వాటా గట్టిగా అడగకుండా తెల్ల మొహాలేసుకుని చూసినందుకు ఆంధ్రోళ్లకి ఈ శాస్తి జర్గాల్సిందే గానీ, ఈ రకంగా జరిగిన గందరగోళపు విభజన వల్ల తెలంగాణా కూడా నష్టపోతుందని యెంతమందికి తెలుసు?విభజనకి ముందు ప్రతిపాదించబడి నిర్మాణం మొదలయిన నీటి పారుదల ప్రాజెక్టులు యెన్నో వున్నాయి.వాటికి అప్పుడు అవిభక్త రాష్ట్రం నుంచి వచ్చినంత కేటాయింపులు ఇప్పుడు కొత్త రాష్ట్రం నిక్కచ్చిగా చెయ్యగలదా?ఇష్టం లేని వాళ్ళని పరిహారాలిచ్చి బయటికి పంపడానికీ,జరుగుతున్న పనుల్ని హఠాత్తుగా అపేసి తీరిగ్గా మొదలు పెట్టటానికీ, ధారాళంగా యెక్కణ్ణించయినా సరే యెంత ఖర్చయినా సరే నని కరెంటు కొనడానికీ యెంత ఖర్చవుతుంది?ఇప్పుడు పంపకాలు పూర్తయ్యాక తెలంగాణా వార్షికాదాయం యెంత?వీటన్నింటికీ అయ్యే ఖర్చు ఆదాయాన్ని మించితే కొత్త ఆదాయ మార్గాలు యేమిటి?
10.ఈ ప్రశ్నల్లో వేటికయినా నికరమయిన జవాబు వుందా తెలంగాణా ముఖ్యమంత్రి గారి నుంచి గానీ ఇక్కడ బ్లాగుల్లో తిరుగుతున్న వీర తెవాదులకి గానీ?

ఆవిడెవరూ “విడిపోతే చాలు గుగ్గిళ్ళయినా తిని బతుకుదాం గానీ ఈ ఆంధ్రోళ్ళతో మాత్రం కలిసుండకూడదు” అనేసింది.ఆవిడ కేం ఖర్మ గుగ్గిళ్ళు తినడానికి?తండ్రీ భర్తా కోట్లకి పడగ లెత్తి వున్నారు!ముఖ్యమంత్రిగా శ్రీమాన్ కచరా గారు చేసే ఈ మహాద్భుత కార్యాల్ని చూసి సంబరంగా తెలంగాణా ప్రజలు తింటారు ఇనప గుగ్గిళ్ళు!!

అజ్ఞాత చెప్పారు...

కేవలం ఒక ప్రాంత ప్రజలని, ఒక ప్రాంతాన్ని తిట్టడానికి ఒక పత్రిక నడపడం నిజంగా గ్రేట్ .
అందులో ఉన్న వార్తలు చదివి మన బ్లాగుల్లో ఒకరు విపరీతంగా రెచ్చిపోవడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది .
ఇలాంటి పత్రిక ఆంధ్రా లో రాకుడదని కోరుకుంటున్నాను .

మిగతా విషయాలు చదవలేదు కాని, ఈ యాస గురించి గొడవ ఏంటో అర్ధం కావడం లేదు .
ఇలా ఐతే , గోదావరి కి అటు ఇటు ఉన్నవాళ్ళంత కలిసి గోదావరి లో దుకాలి , వాళ్ళ మీద వేసే జోక్ ల కి .
సినిమాల్లో అన్ని యాసలు విన్నాను , మన రావు గోపాలరావు గారు మాట్లిడింది ఏ యాసా ?

:venkat

అజ్ఞాత చెప్పారు...

కేవలం ఒక ప్రాంత ప్రజలని, ఒక ప్రాంతాన్ని తిట్టడానికి ఒక పత్రిక నడపడం నిజంగా గ్రేట్ .
అందులో ఉన్న వార్తలు చదివి మన బ్లాగుల్లో ఒకరు విపరీతంగా రెచ్చిపోవడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది .
ఇలాంటి పత్రిక ఆంధ్రా లో రాకుడదని కోరుకుంటున్నాను .

మిగతా విషయాలు చదవలేదు కాని, ఈ యాస గురించి గొడవ ఏంటో అర్ధం కావడం లేదు .
ఇలా ఐతే , గోదావరి కి అటు ఇటు ఉన్నవాళ్ళంత కలిసి గోదావరి లో దుకాలి , వాళ్ళ మీద వేసే జోక్ ల కి .
సినిమాల్లో అన్ని యాసలు విన్నాను , మన రావు గోపాలరావు గారు మాట్లిడింది ఏ యాసా ?

:venkat