2, జులై 2014, బుధవారం

జంప్ జిలానీలకు ముకుతాడు వేయాలంటే


ఎక్స్ ప్రెస్ టీవీ ఈనాటి (02-07-2014) రాత్రి ఎనిమిది గంటలకు ఈ అంశంపై ఎక్స్ ప్రెషన్స్ కార్యక్రమం నిర్వహించింది. ప్రెజెంటర్ రోజా. కాంగ్రెస్ నాయకురాలు మాజీమంత్రి శ్రీమతి డీ.కే. అరుణ,  ఫోన్ ఇన్ ద్వారా పాల్గొన్నారు. నా అభిప్రాయాలు క్లుప్తంగా:


"ఎన్నికలకు ముందు వోటర్లు ప్రలోభాలకు యెలా గురవుతోంది, అందువల్ల మన ప్రజాస్వామ్యానికి ముప్పు యెలా వాటిల్లుతోందీ అని వివరిస్తూ మేధావి వర్గాలు తెగ ఆందోళన పడిపోయాయి. కానీ మన సగటు ఓటరు మాత్రం  అభ్యర్ధులు యెంత ఖర్చుపెట్టినా ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తన ఇష్ట ప్రకారమే పాత ప్రభుత్వాలను మార్చుకున్నాడు, కొత్త ప్రభుత్వాలను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు నిస్సిగ్గుగా పార్టీలు మారుతుంటే ఆ వర్గాలు మాత్రం  పెదవి విప్పడం లేదు. పార్టీలు మారి వచ్చిన వారిని వేరే పార్టీలు కండువాలు కప్పి సగౌరవంగా ఆహ్వానించడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదో ఘన కార్యం అన్నట్టుగా మీడియాలో ఆ దృశ్యాలు చూపిస్తున్నారు. ఇలా పార్టీలు మారేవారిని మళ్ళీ తమ గుమ్మం తొక్కడానికి అనుమతించేది లేదని ఏ పార్టీ కూడా  గట్టిగా చెప్పడం లేదు. అంటే,  రేపు దశ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కాదని  పోయిన వాళ్ళంతా తిరిగి  అదే వేగంతో స్వగృహ ప్రవేశం చేస్తారన్న ధీమా కాబోలు. ఆకర్షించడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఆకర్షితులు కావడానికి కూడా అన్నే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అధికారం లేకపోతే అంతా అంధకారమే అనే నాయకులు వున్నంత వరకు ఇదే పరిస్తితి తప్పదు."  

  

కామెంట్‌లు లేవు: