20, జులై 2014, ఆదివారం

ఏలికల్లో పోలికలు


(22-07-2014 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, తెలంగాణా ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావుకు పేర్లలో మాత్రమే కాకుండా  ఇంకా అనేక విషయాల్లో అనేక పోలికలు వున్నాయి. ఇద్దరూ కొత్తగా ఏర్పడ్డ రెండు రాష్ట్రాలకు ఏలికలు. రెండు ప్రాంతీయ పార్టీలకు అధినేతలు. ప్రభుత్వ యంత్రాంగం మీదా పార్టీ మీదా  గట్టి పట్టున్న నాయకులు. పరిపాలనా అనుభవం వున్నవారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరినవారు. ఏకబిగిన గంటలకొద్దీ  ప్రసంగాలు చేయగల సామర్ధ్యం వున్నవారు.  ఈ కారణాలన్నీ వారు అధికారంలోకి రావడానికి కొంతమేరకు దోహదం చేసాయి. బహుశా వీరికి వున్న అనుభవాన్నే కొలమానంగా తీసుకుని ఇటీవలి ఎన్నికల్లో  రెండు ప్రాంతాల ఓటర్లు వారిద్దరికీ ఎవరిమీద ఆధారపడకుండా పాలన సాగించగల మెజారిటీ కట్టబెట్టారు. పోతే,  ఎన్నికల సమయంలో ఈ ఇద్దరు సాధ్యాసాధ్యలతో నిమిత్తంలేకుండా  చేసిన వాగ్దానాలకు కూడా సామ్యాలున్నాయి.  వాటిని పక్కనబెట్టి వేరే అంశాలను తెరమీదకు తీసుకువచ్చి మీడియా కళ్ళన్నీ వాటిపై వుండేలా చేయడంలో కూడా ఇద్దరినడుమా  పోలికలున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వుంది.


ఓ వారం పదిరోజులు అటూ ఇటూగా ఇద్దరూ రెండు కొత్త రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులుగా పదవులు స్వీకరించారు. స్వీకరించి కూడా మండల కాలం గడిచిపోయింది. అయితే ఇన్ని రోజులు గడిచినా,  ప్రజలు వారి మీద పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా వారు అడుగులు వేగంగా  వేయకపోవడంలో సైతం పోలికలు వున్నాయి. దేనికయినా కొంత వ్యవధానం ఇచ్చితీరాలన్న వాదన ఒకటి వినిపిస్తున్నప్పటికీ, సరైన దిక్కులో వీరి నడక సాగుతోందా అంటే అవునని గట్టిగా చెప్పుకోవడానికి ఏమీ కనబడడం లేదు. పైగా అధికార పగ్గాలు చేపట్టినప్పటినుంచి వీరువురి నడుమ టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఫిలిం మోస్తరుగా ఎత్తులు పైఎత్తులతోనే కాలం గడిచిపోతోందన్న అభిప్రాయం కూడా బలంగానే వినిపిస్తోంది. ప్రమాణ స్వీకారం రోజు ప్రసంగాలలో కానవచ్చిన వడీ వేగం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే అందుకు చెబుతూ వస్తున్న కారణాలు వారి అభిమానులను అలరిస్తున్నా సామాన్య జనాల్లో మాత్రం  సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
సరే ఇవన్నీ ఇలా వుంచితే, మరో పక్క,  ప్రతి విషయంలో వీరిద్దర్నీ పోల్చి చూసి, వారి పనితీరును లెక్కించే కొత్త సంప్రదాయం తెర మీదకు వచ్చింది. ఏ రాష్ట్రానికయినా ఇరుగుపొరుగు రాష్ట్రాలు వుంటాయి. ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు వుంటారు. కానీ వీరిలాగా గతంలో ఏ ఇద్దరు ముఖ్యమంత్రుల నడుమా ఈ రకమైన రాజకీయ విన్యాసాలు జరిగిన దాఖలా లేదు. 'తమలపాకుతో నేనిట్లంటే  తలుపు చెక్కతో తానిట్లంది' అన్న చందంగా   'చంద్రబాబు ఏమన్నారు దానికి ప్రతిగా కేసీయార్ ఏమన్నారు' అన్న అనవసర విషయాలపై రాద్ధాంతాలు జరుగుతున్నాయి. వాటిపై మళ్ళీ  మీడియాలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. వెనక సినిమారంగానికే పరిమితమైన అభిమానుల వీరంగాలు  రాజకీయ రంగ ప్రవేశం చేసాయి. 'తమ నాయకులపై ఈగ వాలినా వూరుకునేది లేదు' అనే  ధోరణిలో దుందుడుకు వాదనలు సాగుతున్నాయి.  దీనితో 'ఏది ఒప్పు ఏది తప్పు' అనే విచక్షణ వెనక్కుమళ్లి పోతోంది.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల దగ్గరనుంచి రాజుకున్న రగడ ఇతర విషయాలకు పాకి ఇప్పటికీ ఆరిపోకుండా గండదీపం మాదిరిగా  ప్రజ్వరిల్లుతూనే వుంది. అనేక విషయాల్లో వీరిద్దరు విడివిడిగా లేవనెత్తుతున్న వివాదా౦శాలు, వారి వాక్చతురత పుణ్యమా అని  ఇరు ప్రాంతాల ప్రజల్లో కొత్త వివాదాలకు కారణమవుతున్నాయి.
ఇరువురికీ పోలికలు ఎన్ని వున్నప్పటికీ కొన్ని విషయాల్లో మౌలికమైన తేడాలు కూడా  వున్నాయి.
కేసేయార్ కు మాటల మాంత్రికుడని పేరుంది. తనతో విభేదించేవారిని కూడా తన వాక్చాతుర్యంతో సమాధానపరచగల ప్రతిభ ఆయన సొంతం. తనకున్న ఈ కళను ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొన్న మొదటి విలేకరుల సమావేశంలో పూర్తిగా ప్రదర్శించారు. అనుకూలమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, అననుకూల మైన వాటిని అసలు  ప్రస్తావనకే రాకుండా చూసుకుంటూ, వచ్చినా వాటిని తెలివిగా దాటవేస్తూ 'ఆహా! యెంత బాగా మాట్లాడారు' అని ప్రత్యర్ధుల ప్రశంసలను కూడా పొందిన తీరు ఇందుకు తార్కాణం.
చెప్పదలచుకున్న అంశాలను సంగ్రహంగా, సూటిగా, అరటి పండు వొలిచి చేతిలో పెట్టిన చందంగా చెప్పగలిగే చతురత కేసీయార్ కు వున్నట్టు వర్తమాన రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరికీ వున్నట్టు లేదు. తెలంగాణా అధికారుల విస్తృత సమావేశంలో ఆయన,  'ఆ ప్రాంతపు  సమస్యలపట్ల తనకు అవగాహన హెచ్చు' అని చెప్పుకుంటూనే, కొన్ని కొన్ని గణాంకాల ప్రస్తావన  వచ్చినప్పుడు ఎలాటి భేషజాలకు పోకుండా పక్కనే కూర్చున్న సేద్యపు నీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకుని సరిదిద్దుకున్న విధానం గమనించినప్పుడు ఆయనలోని నిజాయితీ అధికారులకు తెలిసివచ్చింది. 'కింది అధికారులతో, సిబ్బందితో తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ లో అడిగి బెదరగొట్టకండి' అంటూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసిన పద్దతి కూడా బాగుంది. 'అందర్నీ కలుపుకు పోవడం ద్వారా మాత్రమే కన్న కలలు నిజం చేసుకోగలుగుతామ'ని ఓ పక్క సుతిమెత్తగా చెబుతూనే, ప్రతి విషయంలో ఆలోచన, ఆచరణ కేవలం తెలంగాణాను దృష్టిలో పెట్టుకుని సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన తీరు పరికించినప్పుడు రానున్న రోజుల్లో ఆయన అనుసరించబోయే ఎత్తుగడలు యెంత కఠినంగా వుండబోతున్నాయో కూడా అవగతమైంది. 'ఉగ్ర నరసింహావతారం' ప్రస్తావన, తరువాత 'ముఖ్యమంత్రితో ముఖాముఖి' కార్యక్రమంలో 'ఫెడరల్ వ్యవస్థ ప్రాధాన్యం' గురించి అన్యాపదేశంగా చేసిన ప్రకటన  - 'దేనికయినా రెడీ' అన్న హెచ్చరికకు అద్దం పడుతున్నాయి. అయితే, విద్యార్ధుల భవిష్యత్తుతో ముడిపడివున్న అంశాలకు మరిన్ని  చిక్కు ముళ్లు వేసే ఆలోచనలు అంతిమంగా ఆయన్నే చిక్కుల్లో పడేయకుండా జాగ్రత్త వహించాలి.
ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, ఎలాటి పరిమితులు, అవరోధాల నడుమ తన పాలన మొదలయిందన్న విషయాన్ని ప్రజలకు వివరించడానికి అందుబాటులోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూనే వున్నారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రధాన వాగ్దానం 'రైతు రుణాల మాఫీ' అమలులో వున్న ఇబ్బందులు ఏకరువు పెడుతూ, ప్రజలనుంచి తీవ్రమైన ప్రతిఘటన రాకుండా తన శక్తియుక్తులన్నీ వాడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తలెత్తిన బాలారిష్టాలను అధిగమించడానికే యావత్తు సమయాన్ని వినియోగించాల్సి వస్తోందని ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి నుంచి తగిన  సహకారం అందడం లేదనీ, అందువల్లనే కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు వివరించే కృషి చేస్తున్నారు. కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి కొత్త ప్రాజెక్టులు, ఆర్ధిక సాయం సంపాదించే విషయంలో గట్టి చర్యలే తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణ పేరుతొ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని పిలిచి సన్మానించడం ఇందులో భాగం అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు జోడీ కొత్త రాష్ట్రానికి మేలు చేస్తుందని నమ్మే వారు కూడా వున్నారు. 'రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్రంలో ఎండీయే  అధికారంలోకి రాక పోయివుంటే ఇబ్బందులు తప్పకపోయేవి' అనే చంద్రబాబు వ్యాఖ్యలో వాస్తవం వుంది. ఎన్నో ఆటుపోటుల నడుమ పాలన ప్రారంభించిన తెలుగుదేశం పార్టీకి నిజమైన వూరట, ఉపశమనం కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయే ప్రభుత్వమే. అయితే కేంద్ర సాయం ఆశించిన రీతిలో అందకపోవడం అనేది కూడా ఆయన్ని కలత పెడుతున్నట్టు వుంది. ఇవన్నీ కలిపి చూస్తే,  గతంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  ఆయనలో కానవచ్చిన చురుకుదనం పాలు కొంత తగ్గినట్టుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కొత్తగా పుట్టుకొస్తున్నసమస్యలతో, పదేళ్ళ తరువాత తిరిగి అధికారంలోకి వచ్చిన ఆనందం కాస్తా ఆవిరి అయిపోతోంది. కొత్త రాజధాని నిర్మాణం కోసం సచివాలయంలో హుండీ ఏర్పాటుచేయడం ఈ నైరాశ్యంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన కావచ్చు. అయితే వెంటనే వెలువెత్తిన విమర్శలను గమనించి హుండీని ఏర్పాటు చేసి కొన్ని గంటలు కూడా గడవకముందే  తొలగించడం జరిగింది. హుండీ ఏర్పాటు యెంత తొందరపాటు నిర్ణయమో, దాన్ని వెంటనే తొలగించడం కూడా అంతే సరైన నిర్ణయం అని చెప్పుకోవాలి.
మొన్నటి జిల్లా పర్యటనల్లో సింహభాగం సమయాన్ని ఎన్నికల వాగ్దానాలు, ముఖ్యంగా రుణాల మాఫీ గురించి వివరణ ఇచ్చుకునేందుకు ముఖ్యమంత్రి వాడుకున్న వైఖరి  గమనించినప్పుడు,  ఈ వాగ్దానానికి కట్టుబడివుండడం యెలా అన్న  అంశం ఆయన్ని ఎంతగా కలచివేస్తోందో అర్ధం చేసుకోవచ్చు. పోతే, ఎన్నికల ప్రచారంలో చేసిన షరా మామూలు ప్రసంగాలను పునశ్చరణ చేస్తూ పోవడం వల్ల  ఈ పర్యటనల్లో  ఆశించిన ఫలితాలు రావు అన్న సంగతి గమనంలో పెట్టుకోవడం కూడా అవసరం.  చేస్తున్నదీ, చేయగలిగినదీ అంతా  తన వల్లనే చెప్పుకున్నా పరవాలేదు కానీ, చేయలేకపోయినవాటికి గత ప్రభుత్వాలను నిందించే విషయంలో కొంత సంయమనం పాటించడం మంచిది.  నిజమే.  ఆయన సామర్ధ్యం పట్ల నమ్మకం పెంచుకున్న అభిమానులు రాష్ట్రంలోనే కాక దేశవిదేశాల్లో  పెద్ద  సంఖ్యలో  వున్నమాట వాస్తవమే కావచ్చు.  వారి బలం, మద్దతు  ఆయనకు శ్రీరామరక్ష. వాగ్దానాల  అమలు విషయంలో  చంద్రబాబుకు  తగిన వ్యవధానం ఇచ్చి తీరాలనే వాదన ప్రబలుతుండడానికి ఇదే కారణం. లేని పక్షంలో  ఈ 'నిష్క్రియాపరత్వం' అనే  అంశం, కొత్త రాష్ట్రంలో ఈపాటికే రచ్చరచ్చగా మారివుండేది. అయితే, చంద్రబాబు వివరణలతో ఆయన  అభిమానులు, పార్టీ కార్యకర్తలు సమాధానపడ్డా,  ప్రధాన ప్రతిపక్షం అయిన వై.ఎస్.ఆర్.సీ.పీ. వూరుకోకపోవచ్చు. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు తెలుగు దేశం పార్టీ కూడా నాటి పాలక పక్షంపై ఇలాటి విమర్శలే చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  రుణ మాఫీ విషయంలో గడువులు విధించి హెచ్చరిక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే,  రాజకీయంగా అనవసర రాద్ధాంతం  చేస్తున్నారంటూ  అలాటి ప్రయత్నాలను  అడ్డుకుంటే  కొంతమంది కొంత కాలం  విశ్వసించవచ్చు. కానీ నిరసన జ్వాలలు రైతాంగం నుంచి మొదలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీనమేషాలు లెక్కబెట్టకుండా, కాలయాపన చేయకుండా,  చేయగలిగింది వెంటనే చేయడం, చేయలేని పరిస్తితి వుంటే దాన్ని గురించి భేషజాలకు పోకుండా ప్రజలకు వివరించడం ఈ రెండే ఆయన ముందున్న ప్రత్యామ్నాయాలు.        

ఏదిఏమైనా ఈ ఇద్దరు 'చంద్రుల'వల్ల రెండు రాష్ట్రాలకు మేలు జరగాలనే చాలామంది కోరుకుంటున్నారు. వారికి సహజ సిద్ధంగా వున్న శక్తి సామర్ధ్యాలన్నీ ఇందుకే ఉపయోగపడాలని ఉభయ రాష్ట్రాలలో రాజకీయాలతో ప్రమేయంలేని అధిక సంఖ్యాకులు ఆశ పడుతున్నారు. విశేష రాజాకీయానుభవం వున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయంలో పోటీ పడితే అది వాళ్ళను నమ్ముకున్న జనాలకు మేలు చేస్తుంది. ఈ వాస్తవం గుర్తించగలిగిన నేర్పు వారికి వుందనీ, వుండాలని కోరుకుందాం. అయితే, సమస్యల పరిష్కారానికి యెంత సమయం తీసుకున్నా ఎవ్వరూ అభ్యంతర పెట్టరు  కానీ  అలా తీసుకున్న వ్యవధానాన్ని  సమస్యలని ఆటక ఎక్కించడానికి వాడుకునే ప్రయత్నం చేస్తే అది చివరికి వారికే   కొరుకుడు పడని సమస్యగా తయారయ్యే ప్రమాదం వుంది. (20-07-2014)

5 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

దొందూ దొనేనా? కాదా? అనేది తేలడానికి కొంత సమయం పడుతుందని నా అభిప్రాయం.

పల్లా కొండల రావు చెప్పారు...

దొందూ దొనేనా? కాదా? అనేది తేలడానికి కొంత సమయం పడుతుందని నా అభిప్రాయం.

పల్లా కొండల రావు చెప్పారు...

దొందూ దొనేనా? కాదా? అనేది తేలడానికి కొంత సమయం పడుతుందని నా అభిప్రాయం.

Jai Gottimukkala చెప్పారు...

ప్రతి దానికీ ఆంద్ర-తెలంగాణా మధ్య పోలికలు అనవసరం. ఎవరికి వారు తమతమ పరిస్తితుల దృష్ట్యా అభివృద్ధి సాదిస్తారు. చీటికి మాటికీ వారితో వీరిని పోలిస్తే మీడియాకు రేటింగులు తప్ప రాష్ట్రాలకు ఎటువంటి ఉపయోగం లేదు.

అజ్ఞాత చెప్పారు...

నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్న వీళ్లిద్దరిని పోల్చటం విడ్డురాల్లో కెల్లా విడ్డూరం.

ఒకరు ఆలోచన ఉన్న లీడర్ అయితే, రెండో వారు నోటికి వచ్చింది మాట్లాడి ఎమోషన్స్ రెచ్చకొట్టి తక్షణ లాభం చూసుకునే వ్యక్తి. సక్సెస్ అయిన ప్రతి politician లీడర్ కాలేడు. పీరియడ్.

ఈ ఎమోషనల్ బ్లాక్మైలేర్ ముఖ్యమంత్రి అయిన తరవాత వివాదం కాకుండా, దిద్దుబాట్లు లేకుండా చేసిన ఒక్కపని చెప్పండి?! చివరికి మొట్టమొదటి సంతకం చేసిన తెలంగాణా రాజముద్ర కూడా సరిచేయాల్సిందే.