చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా
వుండేది. మొదటిసారి సీఎం అయినప్పుడు చేతిలో వెండి పిడి తాపడం చేసిన పొన్నుకర్రతో
అధికార దర్పం ప్రదర్శించిన తీరు ఆయన్ని విమర్శలకు గురిచేసింది. ఆయన పార్టీకే
చెందిన బీ. రామారావు అనే ఎమ్మెల్యే ఆయన్ని అనుకరిస్తూ శాసనసభలో పొన్ను కర్ర
వూపుకుంటూ తిరగడం ఒక ఉపాఖ్యానం.
పేరుకుపోయిన ఫైళ్ళను ఒక్క పెట్టున క్లియర్
చేయడానికి ఆయన అనేక పద్దతులు అనుసరించేవారు. ఒక్కోసారి వూరికి బాగా దూరంగా వున్న
బీ హెచ్ ఈ ఎల్ గెస్ట్ హౌస్ ల్లో రాత్రి పొద్దుపోయేదాకా వుండి పని పూర్తి చేసేవారు. అలాగే హైదరాబాదు నుంచి యే విశాఖ
పట్నమో వెళ్ళాల్సి వస్తే, ఫైళ్ళు
వెంటబెట్టుకుని రైల్లో ప్రయాణం చేసే వారు.
రైలు కాజీపేటలో ఆగగానే అప్పటివరకు సంతకం చేసిన ఫైళ్ళను హైదరాబాదు చేర్చడానికి
ప్రభుత్వ వాహనం ఒకటి అక్కడ స్టేషన్లో సిద్దంగా వుండేది. అలాగే ఖమ్మం, విజయవాడ వచ్చేసరికి మరికొన్ని ఫైళ్ళు చూసి
సంతకం చేసేవారు. అవన్నీ ఆ రాత్రికి రాత్రే హైదరాబాదులోని సచివాలయానికి చేరేవి.
చెన్నారెడ్డి గారికి అభిజాత్యం ఎక్కువ
కావొచ్చుకాని ప్రచారంలో వున్నట్టు కుల దురభిమానం లేదని ఆయన్ని బాగా ఎరిగున్న వారు
చెబుతుంటారు. రెండోసారి పదవీ గండం దాపురించినప్పుడు, రేపోమాపో ముఖ్యమంత్రి పదవి
నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్న సమాచారం తెలియగానే
చెన్నారెడ్డి మద్దతుదారులయిన నాటి
మంత్రులు శ్రీ బాగారెడ్డి, శ్రీ హషీం కలసి నామినేటేడ్ పదవుల భర్తీ కోసం ఒక జాబితా
తయారు చేసి ఇచ్చారు. దాన్నొకసారి పరకాయించి చూసిన చెన్నారెడ్డి గారు 'ఇదేమిటయ్యా
అందరూ రెడ్లే వున్నారు, వేరేవాళ్ళు ఎవరూ మీ కంటికి ఆనలేదా!' అని నిలదీశారు.
అప్పుడు వాళ్లు ఇచ్చిన సమాధానం వాస్తవ పరిస్తితికి అద్దం పడుతుంది.'రెడ్లు
కానివాళ్ళు ఇంకా మనవెంట ఎవరున్నారు సారూ, అందరూ అటే (అసమ్మతి వైపు)
వెళ్ళిపోయారు"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి