(కధలకోసం
కంచికే పోనక్కరలేదు.వెతుక్కుంటే జీవితాల్లోనే కనబడతాయని ప్రబోధిస్తూ నెట్లో
సంచరిస్తున్న ఆంగ్ల కధనానికి స్వేచ్చానువాదం. ఆస్ట్రేలియాలోని వృద్ధుల
సంరక్షణ కేంద్రంలో ఓ
ముదివగ్గు మరణిస్తూ వొదిలి వెళ్ళిన ఓ లేఖ ఇది. - భండారు శ్రీనివాసరావు)
‘అప్పుడు నాకు పదేళ్లు. అమ్మానాన్న, అన్నలు,తమ్ముళ్ళు,అక్కలు చెల్లెళ్ళు ఒకరికోసం
ఒకరు, అందరికోసం
అందరూ.
‘పదహారేళ్ళు వచ్చేసరికి మొలుచుకొచ్చాయి కాళ్ళకు రెక్కలు.
‘ఇల్లు పట్టదు. ఇంట్లోవాళ్ళు పట్టరు. ఏ ఆడపిల్లను చూసినా నా
కోసమే పుట్టిందనే నమ్మకం.
‘పాతికేళ్ళు వచ్చాయి. వెనక్కు తిరిగి చూసుకుంటే అన్నీ నెరవేర్చని
హామీలే నిలబెట్టుకోలేని వాగ్దానాలే.
‘మూడుపదుల వయస్సు మీదపడింది. పెళ్లయింది. పిల్లలు పుట్టారు. బాధ్యతలు మీద పడ్డాయి.
‘మూడుపదుల వయస్సు మీదపడింది. పెళ్లయింది. పిల్లలు పుట్టారు. బాధ్యతలు మీద పడ్డాయి.
‘మరో అయిదేళ్లు గడిచాయి. పిల్లలు పెరుగుతున్నారు. పిల్లలతో పాటే
వారితో అనుబంధాలు పెరుగుతున్నాయి. భుజానపడ్డ బరువు బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి.
‘నలభయ్యో పడిలో పడేసరికి చదువులపేరుతోనో, ఉద్యోగాల పేరుతోనో
పిల్లలు బయటి వూళ్ళ బాట పట్టారు. బాధ్యతల భారం తగ్గింది. కాని వాళ్ళతో దూరం
పెరిగింది.
‘చూస్తుండగానే యాభై! అప్పుడే సగం జీవితం గడిచిపోయిందా!
‘అనుకునేంతలో కాస్త స్వాంతన. పిల్లల పిల్లలతో బతుకు కొత్త చిగురు
వేస్తోందన్న చిన్న ఆశ.
‘బాధ్యతలు పూర్తికాకుండానే షష్టిపూర్తి.
‘పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలు తీరకుండానే నేను పుట్టిన సంవత్సరం
గిర్రున తిరిగొచ్చి పలకరించింది.
‘మరో పదేళ్లు గడిచాయి. విధి చావుదెబ్బ కొట్టింది.
‘మరో పదేళ్లు గడిచాయి. విధి చావుదెబ్బ కొట్టింది.
‘నాతో జీవితాన్ని
పంచుకుని, నా
వెంటే నడిచివస్తున్న నా సహధర్మచారిణి ‘ఇంక సెలవం’టూ శాశ్వితంగా సెలవు తీసుకుంది.
‘నా ముసలితనాన్ని కూడా లెక్కచేయకుండా వొంటరితనం నన్ను
కౌగలించుకుంది. ఆ కౌగిట్లో అంతా అంధకారమే!
‘పెరిగి పెద్దయిన మా పిల్లలు వాళ్ల పిల్లల పెంపకంలో మునిగి తేలుతున్నారు.
‘ఒకప్పటి నా ఆ వయస్సు గుర్తుకొచ్చింది. అమ్మానాన్నలు లీలగా
కళ్ళల్లో కదిలారు. వాళ్లు అనుభవించిన వొంటరి జీవితం తడారిపోయిన నా
కంటిగుడ్డుపై కదలాడింది.
‘ఆ రోజుల్లో అద్దంలో పదే పదే చూసుకుని మురిసిన నా రూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
‘నిగనిగ లాడే నల్లని జుట్టు, కండలు తిరిగిన వొళ్ళు, కంకర రాళ్ళను సైతం కరకర నమిలే పళ్ళు, ఖంగున మోగే కంఠం, ఆయాసపడకుండా అంతస్తులను ఎక్కగలిగిన పటుత్వం. ఇవన్నీ అనుకున్నాను శాశ్వితం.
‘కానీ! ఏవీ అవి ఎక్కడ?
‘ముడతలు
పడ్డ మొహం, నెరిసి
రాలిపోయిన జుట్టు, బోసి
నోరు, నంగి
మాటలు, ఎవరు
ఎవరో చప్పున గుర్తుపట్టలేని స్తితి.
‘వొళ్ళు వొణుకుతుంది, మాట తడబడుతుంది.
‘ఒకప్పుడు స్పందించే, జ్వలించే గుండె వుండేది. ఇప్పుడక్కడ వుంది మాత్రం చలనం లేని
ఓ బండ.
‘అయితే- ఎవరో కవి అన్నట్టు ‘ఎముకలలో,బొమికలలో
కానరానిదొకటున్నది’
‘ఈ ఎముకల గూటిలో పరికించి చూస్తే ఒకనాటి యువకుడు కనబడతాడు.
‘అతడి కనుకొలకుల్లో నాటి ఆశారేఖలు రేఖామాత్రంగా కానవస్తాయి.
‘ఆ ఆశల తడిలో ఇంకా పచ్చగా వున్న జీవితేచ్చ కనబడుతుంది.
‘జీవితంపై పెంచుకున్న ప్రేమ కనబడుతుంది.
‘చూడండి. కళ్ళు తెరుచుకుని ఓమారు చూడండి.
‘నాలో మిమ్మల్ని చూసుకోండి.
‘ఇది జీవితం. ఇదే జీవితం. వద్దన్నా వొదిలిపోదు.
‘కట్టిపడేసుకుందామన్నా కట్టుబడి వుండదు.
‘ఈ సత్యం తెలుసుకోండి.’
(ఉత్తరం
రాసిన అజ్ఞాత వ్యక్తికి, ఇమేజ్
సొంతదారుకు కృతజ్ఞతలతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి