వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.
బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ – ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. కిరాయి మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.
గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. (ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి