మన దేశానికి స్వాతంత్రం ఇవ్వాళా వద్దా అని
బ్రిటిష్ పాలకులు మల్లగుల్లాలు పడిన సందర్భంలో వాళ్లకు వచ్చిన అనుమానాల్లో ఒకటి -
ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు వున్న భారత దేశానికి స్వతంత్రం ఇవ్వడం అంత మంచిది
కాదేమో అని.
అదే ఇప్పుడు స్వతంత్రం ఇవ్వాల్సి వస్తే వారికి
పూర్తిగా విభిన్నమైన సందేహం కలిగేదేది, ఇంతమంది చదువుకున్నవాళ్ళు వున్న దేశంలో
ఎక్కువ స్వతంత్రం అనేది కూడా అంత మంచి చేయదేమో
అని.
సానియా మీర్జా వ్యవహారంపై సాగుతున్న చర్చ, జరుగుతున్న
రచ్చ చూసిన తరువాత ఇది నిజమేమో అని అనిపిస్తోంది.
ఎవరు అవునన్నా కాదన్నా సానియా మీర్జా
అంతర్జాతీయంగా పేరున్న టెన్నిస్ స్టార్. ఏ ప్రభుత్వం అయినా 'బ్రాండ్ అంబాసిడర్' ని
నియమించుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాటి పేరు ప్రఖ్యాతులు వున్నవాళ్లనే ఎంపిక
చేసుకుంటుంది. అలాటి వాళ్లు తమ రాష్ట్రానికే
చెందినవారై వుండాలన్న నిబంధన ఏమీ వుండదు. అంచేతనే కేసీయార్ ఆమెను ఎంపిక చేసి
వుంటారు.
ఇక ఆమె జాతీయత గురించి. టెన్నిస్ తార అయిన
తరువాతనే ఆమె పెళ్లి జరిగింది. అంతర్జాతీయ క్రీడారంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఆ
స్థాయి కలిగిన క్రీడాకారులని పెళ్లి చేసుకోవడం చాలా సహజమైన విషయం. పెళ్ళాడినంత
మాత్రాన జాతీయత మార్చుకున్నట్టు కాదు. ఆ మాటకు వస్తే, రాజీవ్ గాంధీని పెళ్ళాడిన
చాలా ఏళ్ళ వరకు సోనియా తన ఇటలీ పౌరసత్వం మార్చుకోలేదని చెబుతారు. ఈ ఉదాహరణలు
కోకొల్లలు.
ఇక కోటి రూపాయల సంగతా! సాధారణంగా ఈ పారితోషికాలు అనండి, గౌరవ
పురస్కారాలు అనండి, ఇవన్నీ ఆయా వ్యక్తుల స్థాయికి తగ్గట్టుగా వుంటాయి. సచిన్ టెండూల్కర్
వంటి మేటి క్రీడాకారుడికి భారతరత్న ఇచ్చారు. అంతే కాని, చిన్నవాటితో సరిపుచ్చరు కదా!
అయితే ఒక విషయం. సానియా మీర్జా గతంలో యేమో కాని ఇప్పుడు సంపన్నురాలు. ప్రభుత్వం గౌరవంగా ఇచ్చిన మొత్తాన్ని మళ్ళీ సర్కారుకే ఇచ్చి క్రీడల్లో చురుకుదనం కలిగిన బడుగు బలహీన వర్గాల పిల్లలకోసం ఖర్చుపెట్టమని కోరివుంటే ఆమెకూ గౌరవంగా వుండేది.
అనవసర విషయాలపట్ల
రాద్ధాంతం చేయడం అంటే, అత్యవసర విషయాల
నుంచి దృష్టి మళ్ళించడం అనే అపోహ ఇప్పటికే జనంలో వుంది. దాన్ని నిజం చేయడం మంచిది
కాదేమో! కాస్త ఆలోచించుకోవాలి.అయితే ఒక విషయం. సానియా మీర్జా గతంలో యేమో కాని ఇప్పుడు సంపన్నురాలు. ప్రభుత్వం గౌరవంగా ఇచ్చిన మొత్తాన్ని మళ్ళీ సర్కారుకే ఇచ్చి క్రీడల్లో చురుకుదనం కలిగిన బడుగు బలహీన వర్గాల పిల్లలకోసం ఖర్చుపెట్టమని కోరివుంటే ఆమెకూ గౌరవంగా వుండేది.
