‘గుడికి
వెళ్లి వద్దామా’ అని అడిగేవాళ్ళు ఎవరూ లేకపోయినా, ఈరోజు ఉదయం స్నానం చేసి మా ఇంటికి
ఆనుకునే వున్న హనుమంతుడి గుడికి వెళ్లాను. ఆలయంలో పూజారి ఇంకా కొందరు భక్తులు
వున్నారు. మా ఆవిడ వున్నప్పుడు, మా రెండోవాడు సంతోష్ వున్నప్పుడు ఎన్నోసార్లు
వెళ్లాను. కానీ ఏనాడు ఒక్కడినీ ఆ గుడిలో అడుగుపెట్టలేదు. ఈ గుడి అనే కాదు జీవితంలో
ఒంటరిగా దైవ దర్శనాలు చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. నుదుట సింధూరం దిద్దుకునేవాడిని కాదు.
చెప్పాను
కదా లోగడ ఎన్నోసార్లు నాది తిన్నడి (భక్త
కన్నప్ప) భక్తి అని. కానీ ఏదీ తిన్నగా
వుండదు. ఎందుకో ఈరోజు అప్రయత్నంగా కనీ
కనబడనట్టు బొట్టు పెట్టుకున్నాను. అనేక ఏళ్ళుగా మా ఇంట్లో ఏటేటా జరిగే తద్దినాలకి, మాసికాలకి క్రమం తప్పకుండా వచ్చే పూజారి సూర్య నారాయణ గారు కూడా నన్ను గుర్తు పట్టలేదు, పట్టిన తర్వాత ఆయన కళ్ళల్లో రవంత
ఆశ్చర్యం. బహుశా దేవుళ్ళు కూడా
ఆశ్చర్యపోయివుంటారు. కానీ లీలా మానుషరూపాలు కదా! వారి ముఖకవళికలను గుర్తించడం
మానవుడినైన నా వంటివారికి అసాధ్యం.
చేయగలిగినది, చేయించగలిగినది అర్చన. చేయించాను.
గోత్రం ఒక్కటే కానీ నామాలు పెక్కు. అందరివీ చెప్పాను మా అమ్మానాన్నల నుండి మొదలెట్టి
చిన్నారి మనుమరాలు జీవిక దాకా.
ఉదయం
నుంచి చుట్టపక్కాలు,
స్నేహితులు, ఫేస్
బుక్ మితృలు అనేక మంది, అన్ని వయసుల వాళ్ళ నుంచి ఫోన్లు. సందేశాలు. పిలుపుల్లో
అంకుల్ నుంచి తాతయ్యదాకా ప్రమోషన్ వచ్చింది. పెద్దరికంలో వున్న మజా కూడా అనుభవంలోకి
వచ్చింది.
అందరికీ
నమస్కారాలు,
అభివందనాలు,
కృతజ్ఞతలు,
ఆశీస్సులు.
(07-08-2025)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి