“నెంబరు చెప్పండి” అన్నాడు ఎయిర్ టెల్ ఉద్యోగి రవి నా ఫోన్ తన చేతిలోకి తీసుకుని.
ఆరేళ్ల క్రితం చనిపోయిన మా ఆవిడ ఫోను నెంబరు చెప్పాను “ 9959692977”. దాదాపు చాలా కాలం నుంచి ఈ నెంబరు వాడకంలో లేదు. మొబైల్ ఎక్కడో బీరువాలో దాచిపెట్టాను. ఆ నెంబరుని మరో కొత్త మొబైల్ లో వేసి వాడుకుంటే తను నాకు తోడుగా వుంటుందనే సెంటిమెంటు. అంతకంటే ఏం లేదు. రెండో ఫోన్ అవసరం ఏమాత్రం లేదు.
అతడు స్పీకర్ ఆన్ చేసి నెంబర్ నొక్కాడు. రింగవుతోంది. ఇంతలో ఒక గొంతు ‘హలో’ అంది. అక్కడ వున్న అందరం ఆశ్చర్యపోయాము. ఫోన్ కట్ చేసి అడిగాడు, ‘ఈ ఫోను ఇప్పుడు ఎక్కడ వుంది’ అని.
ఇంట్లోనే వుంది. అదీ తాళం వేసిన బీరువాలో.
ఇన్నేళ్ళుగా మోగని ఫోను ఇప్పుడెలా రింగవుతోంది. హలో అన్నది ఎవరు?
ఇదెలా సాధ్యం?
మొన్న ఉదయం ప్రాభాత సంకీర్తన పూర్ణా టిఫిన్స్ తో మొదలయింది. ‘వర్షం లేకపోతే వచ్చి, అంతకు ముందు రోజు పెట్టిన బాకీ తీరుస్తాను’ అని ఇచ్చిన మాట ప్రకారం వెళ్లాను. నా పోస్టు చూసి ‘ఆ హోటలు మా ఇంటికి దగ్గరే, ముందుగా చెబితే వచ్చి కలిసేవాడిని కదా’ అన్నారు ఫేస్ బుక్ స్నేహితులు KOTNANA SIMHACHALAM Naidu గారు. వారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఎలాగూ వర్షం పడడం లేదు కదా అని. ఎన్నాళ్ళబట్టో ఆయన మా ఇంటికి వద్దామని అనుకుంటున్నారు. సరే ఈ విధంగా కలవవచ్చులే అనుకుని ‘హోటల్ కే రండి’ అని ఫోను చేసి వెళ్లాను. ఈ సారి ఇంటి తాళం చెవితోపాటు, పర్సు జేబులో పెట్టుకున్నానా లేదా అని ఒకటికి రెండు సార్లు తడిమి చూసుకుని బయలుదేరాను.
ఆ పెద్దమనిషి మాట ప్రకారం వచ్చారు. వారిని ప్రత్యక్షంగా చూడడం ఇవ్వాళే. వారి జీవితానుభవాలు ఫేస్ బుక్ పోస్టుల్లో చదివిన తర్వాత ఆయన జీవితంలో ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకున్నాను. ఇన్నాల్టికి కలుసుకున్నాను.
టిఫిన్ కార్యక్రమాలు, మాటా మంతీ, మంచీ చెడు మాట్లాడుకోవడం పూర్తయిన తర్వాత వర్షం మొదలుకాకముందే ఆటోలో వారిని దారిలో అమ్మవారి గుడి దగ్గర దింపి ఇంటికి వచ్చాను.
వాతావరణం వాళ్ళు చెబుతున్న వర్షం జాడ లేదు. ఆకాశం నిర్మలంగానే వుంది. మా ఆవిడ నిర్మల జ్ఞాపకం వచ్చింది.
ఆమె జీవించి వున్న కాలంలో మా పెద్దబ్బాయి సందీప్ ఒక చిన్న సైజు ఐ ఫోన్ ఇచ్చాడు. అది ఆ కాలం నాటిది. అయినా అది మార్చడానికి ఆమెకు ఇష్టం వుండేది కాదు, పిల్లవాడు ఇచ్చిన గిఫ్ట్ అని ఆమె సెంటిమెంటు.
అమెరికా వెళ్ళినప్పుడు మా వాడు నాకు ఒక కొత్త తాజా మోడల్ ఐ ఫోన్ కొంటున్నట్టు చెప్పాడు. నేను వద్దన్నాను. నాకు ఫీచర్స్ కంటే తేలికగా ఆపరేట్ చేసుకునే యూజర్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇష్టం. దాంతో నాకున్న సాంసంగ్ లేటెస్ట్ మోడల్ ఒకటి కొనిచ్చాడు.
అంతవరకూ వాడుతున్న పాత దానిలో మా ఆవిడ ఫోన్ చిప్ వేసి వాడకంలోకి తేవాలని నా సంకల్పం. చెప్పాను కదా! కేవలం సెంటిమెంటు.
ఖాళీగా వున్నాను. వర్షం లేదు. వచ్చే సూచన కూడా లేదు.
దగ్గరలో ఎయిర్ టెల్ ఆఫీసు ఎక్కడ అని అడిగాను గూగులమ్మని. నవోదయా కాలనీ, మై హోం దగ్గర అని చూపించింది. మా ఇంటికి దగ్గరే. ఉబెర్, ర్యాపిడోలని ట్రై చేస్తే పదినిమిషాలు పడుతుంది రావడానికి అన్నారు. గూగుల్ మ్యాపు వాళ్ళు ఎనిమిది నిమిషాల నడక అన్నారు. సరే అని నడకనే ఎంచుకున్నాను.
వర్షం లేదన్న మాటే కానీ వర్షపు నీళ్ళు కాలనీ రోడ్లలో అలాగే నిలవవున్నాయి. జాగ్రత్తగా నడుచుకుంటూ వెడుతుంటే, నా వెనుక వస్తున్న కారు నామీద బురద నీళ్ళు చల్లకుండా, బాగా ఎడంగా వెళ్లి కొద్ది దూరంలో ఆగింది. ఎవరీ పెద్దమనిషి, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఇంత జాగ్రత్తగా బండి నడుపుతున్నాడు అనుకున్నా.
అందులోనుంచి దిగాడు ఆ కారు తాలూకు ఓనరు. నా వైపే నడుచుకుంటూ వచ్చాడు. ‘రండి గురువు గారూ, నేను ఇటే వెడుతున్నాను. మిమ్మల్ని దింపి వెడతాను. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి’ అన్నాడు.
తీరా చూస్తే అతడు నా ఒకప్పటి రేడియో కొలీగ్. చక్కటి గాత్ర సౌలభ్యం కలిగిన అనౌన్సర్. పేరు మురళీ కృష్ణ. అంబడిపూడి మురళీకృష్ణ. మరో ఇంటి పేరు వృత్తిరీత్యా వచ్చింది వుంది. అదే వాచస్పతి. ఆలిండియా రేడియోలో సీనియర్ గ్రేడ్ అనౌన్సర్ గా పనిచేశాడు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలకి దశాబ్దాల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా సినిమా రంగంలో కూడా అడుగుపెట్టి చిన్నా పెద్దా (వయసులో) వేషాలు అడపాదడపా వేస్తున్నాడు. వినగానే గుర్తు పట్టగల స్వరం, చూడగానే పోల్చుకోగల రూపం.
నాలుగడుగులు వేస్తె నేను వెళ్ళే ఆఫీసు వుంది అన్నాకూడా వినకుండా, డోరు తెరిచి కారు ఎక్కించాడు.
ఇద్దరం కలిసి దాపునే వున్న ఎయిర్ టెల్ ఆఫీసుకు వెళ్ళాము. అక్కడ రవి అనే ఉద్యోగి నేను చెప్పిన దంతా విన్నాడు. కంప్యూటర్ లో డిటైల్స్ చెక్ చేశాడు. ఆరేళ్లుగా వాడకుండా వున్న ఫోనుకు జాయింటుగా బిల్లులు చెల్లిస్తున్న సంగతి తెలుసుకుని మనసులో నవ్వుకున్నాడేమో తెలియదు కానీ, నా ఫోన్ తీసుకుని మా ఆవిడ నెంబరు చెప్పమన్నాడు.
చెప్పాను. అతడు స్పీకర్ ఆన్ చేసి నేను చెప్పిన నెంబరు డయల్ చేశాడు. అది రింగ్ అయింది. కాసేపటి తర్వాత ఎవరో హలో అన్నారు. అందరం ఆశ్చర్యపోయాం.
ఇదెలా సాధ్యం?
నేను ఫోను తీసుకుని మళ్ళీ నెంబరు డయల్ చేశాను. ‘మీరు ప్రయత్నిస్తున్న వారు ప్రస్తుతం అందుబాటులో లేరు, మరోసారి ప్రయత్నించండి ‘ అని వినబడింది.
రవికి కారణం అర్ధం అయింది. తాను డయల్ చేసిన నెంబరు సరిచూసుకున్నాడు. అన్ని తొమ్మిదులు వున్న నెంబరు కాబట్టి ఎక్కడో తభావతు జరిగి ఎవరి నెంబరుకో కనెక్ట్ అయింది.
అర్ధం కాని విషయం మరోటి చెప్పాడు. సాధారణంగా ఉపయోగంలో లేని నెంబర్లు తాత్కాలికంగా పనిచేయడం మానేస్తాయి. లేదా వాటిని మరొకరికి కేటాయించే అవకాశం వుంటుంది. అంచేత అవసరం వున్నా లేకపోయినా అప్పుడప్పుడూ ఒకటో రెండో కాల్స్ చేయడమూ, రిసీవ్ చేసుకోవడమూ జరుగుతుండాలి(ట).
పాత నెంబరు తోనే కొత్త ఫోన్ లో చిప్ వేయడానికి నా కనుపాపల ముద్రలు ఫోటో తీసుకున్నాడు. డబ్బులు అడగకుండానే కొత్త చిప్ వేసి ఇచ్చాడు.
అసలు సమస్య అప్పుడు ఎదురయింది. ఓపెన్ చేయడానికి పాస్ వర్డ్ అడిగింది. ఆ నెంబరు తీసుకుని ఇరవై ఏళ్ళు దాటింది. అప్పుడు ఈ పాస్ వర్డుల గోల వున్నట్టు లేదు.
ఏమి చేయాలో అతడే చెప్పాడు. ఏదైనా మొబైల్ స్టోర్ కు వెళ్ళమని.
మురళీ కృష్ణకు థాంక్స్ చెప్పి దగ్గరలో వున్న ఒక మొబైల్ షాపుకు వెళ్లాను. అతడు ‘అమీర్ పేట వెళ్ళండి, అక్కడ ఐ ఫోన్లు కూడా డేటా చెడకుండా ఓపెన్ చేసే ఘనులు వున్నార’ని చెప్పాడు.
మరో షాపులో అడిగితే గంట సమయం పడుతుంది, కానీ డేటా పోతుంది అన్నాడు. మా ఆవిడ ఫోన్ లో తన ఫ్రెండ్స్, బంధువులు కలిసి ఓ నలభై, యాభై మంది నెంబర్లు తప్ప వుండవు. ఫోన్ చేయడం , మాట్లాడడం తప్పిస్తే ఫోటోలు గట్రా వుండవు. అంచేత డేటా పోయినా సరే పరవాలేదన్నాను.
గంట తర్వాత ఫోన్ చేసి రమ్మన్నాడు. వెళ్లాను. వెళ్లి, చనిపోయిన మా ఆవిడ ఫోన్ ను బతికించి తెచ్చుకున్నాను.
ఇంత లాయలాస అవసరమా! అనొచ్చు. ముందే చెప్పాను కదా! సెంటిమెంటుకు రీజన్లు వుండవు. సెంటిమెంట్లు రీజన్లకు లొంగవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి