8, ఆగస్టు 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో : (207) : భండారు శ్రీనివాసరావు

 


వర్షార్పణం

జీవితంలో పుట్టింది ఒక్క రోజునే అయినా, పుట్టిన రోజులు ప్రతియేటా వస్తుంటాయి. చిన్నప్పుడు పండగలా అనిపించేది. ఇప్పుడు అన్ని రోజుల్లో అదొక రోజు. అంతకంటే ప్రత్యేకత ఏమీ లేదనిపిస్తోంది.

ఈ ఫేస్ బుక్ లేనిరోజుల్లో ఈ రోజు ఎలా గడిచేదో ఆలోచిస్తే నవ్వు వస్తుంది. అమ్మా నాన్నా కొత్త బట్టలు కొనిపెడతారు అనే చిరు ఆశ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేసేది.  స్కూలు రోజుల్లో అయితే, ఆ రోజు పుట్టిన రోజు జరుపుకునే  పిల్లాడు ఇచ్చే చాక్ లెట్ రుచిని ఆనందంగా  ఆస్వాదించడం. మరొకటి ఇస్తే ఎంత బాగుంటుందో అనుకోవడం.   కొంచెం పెద్దయ్యాక, గ్రీటింగు కార్డుల సంబరాలు, ఇచ్చేది ఆడపిల్లకు అయితే,  అందమైన కొటేషన్లు వున్న కార్డులకోసం ఒక పూటల్లా  షాపుల చుట్టూ తిరగడం,   ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పడం, నలుగురు దోస్తులతో కలిసి హోటల్లో టిఫినో, భోజనమో  చేసి, వీలయితే (డబ్బులు వుంటే) ఓ  సినిమా చూడడం, మరి కొంచెం పెరిగాక అంటే అటు వయసులో, ఇటు జీవితంలో అన్నమాట, దగ్గరి  స్నేహితులతో  పార్టీలు, పెళ్లయ్యాక వచ్చే పుట్టిన రోజున భార్య ఇచ్చే మంగళ హారతులు, దేవాలయ దర్శనాలు,  కుటుంబంతో కలిసి మంచి హోటల్లో భోజనాలు అలా అలా గడిచిపోయేవి పుట్టిన రోజులు.   

అదొక అందమైన కాలం. మళ్ళీ మళ్ళీ తిరిగి రాని మంచి  కాలం.

ఫేస్ బుక్ మితృలు, బుక్ వెలుపలి  మితృలు, చుట్టపక్కాలు, ఆత్మీయులు, ఆప్తబంధువులు చేసిన  ఫోన్లు, పంపిన సందేశాలు, చెప్పిన శుభాకాంక్షల వరదలల్లో ఒక పక్క కొట్టుకు పోతూ, మరోపక్క ఆకాశానికి చిల్లులు పడ్డట్టు   కురుస్తున్న భారీ వర్షంలో,  చుట్టూ గట్లు తెగిన చెరువులా చుట్టుముట్టిన నీటి నడుమ నడుస్తున్నదో, కొట్టుకుపోతున్నదో తెలియని ఒక కారులో, దిక్కు తోచని స్థితిలో దారులు వెతుక్కుంటూ, ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి సందులు, గొందుల బాట పట్టి వెళ్ళిన దారిలోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఇళ్లకు చేరడం కోసం   దాదాపు ఆరు గంటల పాటు చేసిన  ప్రయాణం తలచుకుంటే, ఇంతకంటే విభిన్నంగా, విచిత్రంగా,  వైవిధ్యంగా ఎవరికైనా వాళ్ళ పుట్టిన రోజు గడుస్తుందా చెప్పండి. సాయంత్రం అయిదు గంటలకు మొదలైన  ఈ వర్షంలో ప్రయాణం రాత్రి పదకొండు గంటలకు ముగిసింది.

ఈ నడుమ ఫోను పలకరింపులు. వీటితో వున్న కాస్త మొబైల్  ఫోన్ చార్జ్ అయిపోతుందేమో అనే భయం.  కారు అద్దాల నుంచి, కురుస్తున్న వర్షపు ధారల్లో తడిసిముద్దవుతున్న బాహ్య ప్రపంచం కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ,  చార్జ్ అయిపోతే అయిన వాళ్ళతో  మాటా  ముచ్చటా లేకుండా పోతుందేమో అనే సందేహంతో, ఫోను చేసి శుభాకాంక్షలు చెప్పేవారితో కట్టె కొట్టె అన్నట్టు  ముక్తసరిగా మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించింది.

నా మేనల్లుడు డాక్టర్ రంగారావు గారి కుమారుడు డాక్టర్ భరత్ ముచ్చటపడి కొనుక్కున్న కొత్త కారు. ఇంటి నుంచి గంట దూరంలో నార్సింగ్ దగ్గర  ఒక రిసార్ట్ లో జరుగుతున్న  పెళ్లి వేడుక కోసం ఈ ప్రయాణం. వెళ్ళేటప్పుడు బయట  భానుడి చండ్ర నిప్పుల ప్రతాపం ఎంత తీవ్రంగా వుందన్నది రిసార్ట్ దగ్గర కారు దిగిన తర్వాత తెలిసింది. ఈ మధ్య కురిసిన వానల వల్ల నగరం చాలావరకు చల్లబడింది అనే భావనతో ఉన్నాము. ఊరి బయట దూరంగా విశాలమైన ప్రాంతంలో  చక్కని వేప వృక్షాలతో బయట  వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుందనే ఊహతో కారు డోరు తీసి దిగిన మాకు బయట ఎండ పెడేల్మని మొహం మీద ఈడ్చి కొట్టింది. దాంతో  వేగంగా నడుచుకుంటూ వెళ్లి పెళ్లి బృందాన్ని కలిశాము.  ఏసీ హాళ్ళు, ఏసీ గదులు, ఏసీ భోజన మందిరాలు. చాలా గొప్పగా తీర్చి దిద్దారు ఆ రిసార్ట్ ని. పేరు ‘ఆయన’ (AYANA).  తెలుగు ‘ఆయన’ ఈ ఆయన కాదు అనుకుని గూగులమ్మని అడిగితే, చాలా చెప్పింది. ఉత్తరాయణం, దక్షిణాయనంలో వున్న ఆయనలతో పోల్చింది. ఇది కుదరదు అనుకుంటే చక్కని అమ్మాయి అనుకోమంది. అయినా ఈ మధ్య పిల్లలకు పెడుతున్న పేర్లే సరిగా అర్ధం కావడం లేదు. ఇక రిసార్టులు, కాంప్లెక్సుల సంగతి చెప్పాలా!

పేరు సంగతి అటుంచి రిసార్ట్ ను మాత్రం చాలా వైవిధ్యంగా తీర్చి దిద్దారు. దగ్గరి బంధువులు ఎంతమంది వచ్చినా, హాయిగా మూడు రోజుల పెళ్లి  వేడుకలను అక్కడే బస చేసి తీరికగా తిలకించేలా స్టార్ హోటళ్ళను తలదన్నే రీతిలో వసతి సౌకర్యాలు వున్నాయి.

ఎదుర్కోలు సాంప్రదాయ వేడుక హంగామాగా ముగిసిన తర్వాత, భోజనాలు చేసి,  నేను, నామేనల్లుడు డాక్టర్ మనోహర్, డాక్టర్ భరత్ కారులో ఇళ్లకు బయలుదేరాము. అప్పటికి వాతావరణం కొంత చల్లబడింది. భరత్ మొబైల్ లో తెలంగాణా వెదర్ మ్యాన్ అనే పేరుతో ఒక కుర్రవాడు తయారు చేసిన APP వుంది. అది చెప్పిన ప్రకారం కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం వుంది. కురిసే సమయాలు, వర్షం పడే ప్రాంతాలు కూడా వివరంగా చూపింది. భారీని మించిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తబోతోందన్న హెచ్చరిక తెలంగాణా వెదర్ మ్యాన్ ఫోర్ కాస్ట్ సారాంశం.

మనోహర్ వుండేది అశోక్ నగర్ లో. మధ్యలో మేము వుండే యూసుఫ్ గూడా, ఎల్లారెడ్డి గూడా. డ్రైవర్ వుండేది కూకట్ పల్లి. అంచేత ముందు మేము దిగి మనోహర్ ని కారులో పంపిచ్చేద్దాం అని భరత్ అన్నాడు.

కారు ప్రయాణం సజావుగా సాగుతోంది. నేనూ మనోహర్ ఒక ఈడు వాళ్ళం (నా కంటే ఏడాది చిన్న) కాబట్టి చిన్నతనంలో మా ఇళ్ళల్లో జరిగిన పెళ్ళిళ్ళ ముచ్చట్లు మననం చేసుకున్నాము. ఒకే కాలానికి చెందిన ఇద్దరు కలిస్తే కాలం తెలియకుండానే గడిచిపోతుంది. ఈ ముచ్చట్ల మధ్య ఆ వెదర్ మ్యాన్ అంచనా వాస్తవరూపం దాలుస్తోందన్న సంగతి  మాకు తెలియలేదు. వేటూరి రాసిన ‘చినుకులా రాలి,నదులుగా సాగి, వరదలై పోయి, కడలిగా పొంగు’ పాటలా కాకుండా, వర్షం మొదలు కావడమే తద్విరుద్ధంగా జరిగింది. చినుకులు లేవు, ఆకాశానికి చిల్లులు పడ్డట్టు ఏకంగా ఏనుగు తొండపు ధారలే! చూస్తుండగానే రోడ్ల మీద ఎక్కడినుంచో తన్నుకు వస్తున్నట్టు వరద నీటి ప్రవాహాలు.

నిమిషాల వ్యవధిలో ట్రాఫిక్ అస్తవ్యస్తం. బహుశా వాహనదారులు అందరూ గూగుల్ మ్యాపులని  నమ్ముకున్నట్టున్నారు. ఎటు నీలి రంగు ఇండికేటర్ కనిపిస్తే అటు వాహనాలని అడ్డదిడ్డంగా మళ్లిస్తున్నారు. దాంతో అంతా అస్తవ్యస్తం.

భరత్  కాల్ డ్రైవర్ భాస్కర్ నెమ్మదస్తుడు. వేగంగా నడిచే కారు వేగాన్ని నత్త నడకను తలదన్నే రీతిలో అతి తక్కువ వేగానికి తగ్గించి నడపడంలో వున్న కష్టం నడిపే వాడికే తెలుస్తుంది. కారులో వున్న ముగ్గురం ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేము. మా ముచ్చట్లలో మేమున్నాము.

కాసేపటి తర్వాత చూస్తే చుట్టూ నీళ్ళు, మధ్యలో కారు, కారు ముందు కారు, కారు వెనక కారు. ఎన్ని కార్లు అలా ఆగిపోయాయో లెక్క చెప్పడం కష్టం. ఎటు చూసినా ఆగిపోయిన కార్లే. ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతూ పారుతున్న వర్షపు వరద నీళ్ళే. అప్పటికే మేము బయలుదేరి రెండు గంటలు దాటింది. పరిస్థితిలో తీవ్రత అర్ధం అయింది. అశోక్ నగర్ లో ముందు మనోహర్ ని దింపి మేము వెనక్కి వద్దామనుకున్నాము. గూగుల్ మ్యాపు చూస్తే అన్నీ ఎర్ర గీతలే.

అశోక్ నగర్ పోయి రావాలంటే మూడు, నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువే పట్టేలా వుంది. అంచేత రెండు కిలోమీటర్ల దూరంలో వున్న మా ఇంటికి కానీ, భరత్ ఇంటికి కానీ పోవాలని నిర్ణయించారు. కానీ పోవడం ఎలా అన్ని రోడ్లు కిక్కిరిసి వున్నాయి. మా ప్రయాణం ఆగుతోంది కానీ వర్షం ఆగడం లేదు. దాని ఉధృతి ఇసుమంత కూడా తగ్గడం లేదు.

మొత్తం మీద మా ఇంటికి కూతవేటు దూరానికి చేరాము. అదిగో ద్వారక అని ఆనందంగా పద్యం అందుకునే లోపల మా వాచ్ మన్ ని గేటు తీసి వుంచమని ఫోన్ చేస్తే కరెంటు పోయింది లిఫ్ట్ లేదు అని చెప్పాడు.

మళ్ళీ భరత్ రూటు మార్చి కారు తన ఇంటి వైపు పొమ్మన్నాడు. అది మాఇంటికి దగ్గరే. మామూలుగా అయితే కారులో అయిదు నిమిషాలు. మాకు గంటకు పైగా పట్టింది. కాంప్లెక్స్ మెయిన్ గేటు దగ్గర పక్కకు తిరగడానికి వీలు లేకుండా వాహనాలు వున్నాయి. ఆ రద్దీ క్లియర్ కావడానికి చాలాసేపు ఇంటి ముందే వెయిట్ చేయాల్సి వచ్చింది.

మొత్తం మీద ఒక ఇంటి కప్పు కిందకు చేరగలిగాము. మా వలలి వనితకి  ఫోన్ చేస్తే ఏమీ పర్వాలేదు, వర్షం తగ్గితే, రాత్రి పదకొండు దాటినా సరే,  ఫోన్ చేయండి,  మా అబ్బాయి మోటార్ సైకిల్ మీద వచ్చి మీకు పోపన్నం చేసిపెట్టి వెళతానని అని హామీ ఇచ్చింది.   అమ్మయ్య పర్వాలేదు అనుకున్నా. కానీ భరత్ బలవంతం మీద  భోజనాలు అక్కడే కానిచ్చాము.  వర్షం పూర్తిగా తగ్గిన గంట తర్వాత ట్రాఫిక్ ఒక పద్దతిలోకి వచ్చిన సంగతి గూగుల్ ద్వారా తెలుసుకుని కారులో మనోహర్ ని అశోక్ నగర్ లో దింపి, మళ్ళీ తేదీ మారే ముందు ఎవరి ఇళ్లకు వాళ్ళం చేరుకున్నాము.

కధ సుఖాంతం.

మా పెద్ద కోడలు భావన చెప్పినట్టు ఇబ్బందులను చూసి కష్టాలుగా భ్రమ పడరాదు.  



(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: