నడక ఎంత నరకం
ఈరోజు ఉదయం తొమ్మిదిన్నరకు ఫోన్ చేసింది మా వలలి వనిత. ఈ పూట రావడం లేదు అనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఎన్నో ఏళ్ళుగా అలవాటయిన నాగాలే కనుక ఈ పూటకి బయటి బ్రేక్ ఫాస్టే దిక్కు.
స్విగ్గీ ఆర్డర్ అయినా ఒక్కళ్ళకు మూడు వందలకు తక్కువ కాదు అనేది అనుభవం చెప్పే మాట. దీని బదులు ఏ రాపిడో ఆటోలో ఏదైనా హోటల్ కు వెళ్లి తినివస్తే కూడా అంతే అవుతుంది. ఈ ఆలోచన చేసి, రాపిడో ఆటో పిలిపించుకుని కృష్ణా నగర్ లోని పూర్ణా టిఫిన్ సెంటర్ కు వెళ్లాను. దిగి జీపే ద్వారా వంద రూపాయలు ఆటో డబ్బులు చెల్లించాను. ఇవ్వాళ ఫేర్లు ఎందుకు ఎక్కువ వున్నాయని అడక్క ముందే, రాపిడో కెప్టెన్ హోదా సంపాదించుకున్న ఆటోడ్రైవర్ వెంకటేషే చెప్పాడు, ఈరోజు రేపూ భయంకరమైన వర్షాలు కురుస్తాయంటున్నారు, అంచేత వాన మొదలు కాకముందే ఎంతో కొంత సంపాదించి ఇంటికి చేరాలని, తక్కువ రేట్లు ఎక్కువకు సవరించడం జరిగిందని సంజాయిషీ చెప్పాడు. నిజంగా ఇలాంటి మెకానిజం డెవలప్ అయి వుంటే, జనాలకు జీతాలు కూడా, ఏ రోజుకారోజు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనిపించింది.
హోటల్లో అడుగు పెట్టగానే ఒకతను ఎదురు వచ్చి ఒక్కరే వచ్చారేమిటి అన్నాడు. మా అబ్బాయి సంతోష్ వున్నప్పుడు కారులో నన్నూ కోడల్ని, మనుమరాలి కేర్ టేకర్ని, వలలి రానప్పుడు ఈ హోటల్ కే తీసుకువచ్చేవాడు. కారు బయట ఆపుకుంటే టిఫిన్లు అక్కడికే తెచ్చి ఇచ్చేవాళ్ళు. అతడి పలకరింపుతో పాత గాయం మళ్ళీ సెల వేసినట్టు అయింది.
సరే ఒక ప్లేటు ఇడ్లీ చెప్పాను. 85 అని ఒక చీటీ మీద రాశాడు. ఎదురుగా వున్న స్కానర్ పై స్కాన్ చేశాను. పేమెంట్ ఫెయిల్ అని వచ్చింది. తప్పు పిన్ నొక్కానేమో అనుకుని మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ అదే ఎర్రర్. ఇప్పుడే కదా ఆటో వాడికి పే చేశాను. ఇంతలో ఏమైంది? పైగా ఫోన్ చేతిలో వుందని పర్సు తీసుకురాలేదు.
ఇంతలో హోటల్ కౌంటర్ లో వున్నతను ‘పర్వాలేదు, రేపు వచ్చినప్పుడు ఇవ్వండి’ అన్నాడు. అతడు ఎవరో నాకు తెలియదు. నేను సంతోష్ తండ్రిని అని అర్ధం అయినట్టుంది. ‘రేపు ఇవ్వవచ్చు అనుకోండి, కానీ రేపు కూడా వర్షాలు అంటున్నారు. రాలేకపోతే ఎలా!’ అన్నాను. ‘వచ్చినప్పుడే ఇవ్వండి. నెల రోజుల తర్వాత ఇవ్వండి, పెద్దవారు, వచ్చారు, టిఫిన్ చేసి వెళ్ళండి’ అన్నాడు.
ఏదో పైకి చెప్పలేని గిల్టీ ఫీలింగ్. తిఫిన్ తిన్నానంటే తిన్నాను. కానీ మనసు వేరే ఆలోచిస్తోంది.
సరే! హోటల్ బిల్లు సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు ఇంటికి పోవడం ఎలా! ఆటో బుక్ చేసుకుంటే దిగిన తర్వాత ఫేర్ చెల్లించడం ఎలా! లిఫ్ట్ లో వెళ్లి తాళం తీసి, డబ్బులు తీసుకువచ్చి ఇస్తాను అంటే ఏం బాగుంటుంది?
ఈ శుష్కఆలోచనలతో నడవడం మొదలు పెట్టాను. బయట బట్టతడుపు జల్లు మొదలైంది. తిరుపతి వెళ్లి వచ్చిన తలే కనుక జుట్టు తడుస్తుందనే బాధ లేదు. కానీ వర్షంలో ఆ రోడ్ల మీద నడవడం అనే బాధ వుంది చూసారు, అదీ భరించలేనిది. ఒక పక్క వర్షపు నీళ్ళు. మరో పక్క ఏమాత్రం వేగం తగ్గించకుండా ఆ నీళ్ళను సర్రున కోసుకుంటూ వెళ్ళే వాహనాలు. వర్షం మరింత పెద్దది అవుతుందేమో అనే భయంతో వన్ వే అని కూడా లెక్కచేయకుండా ఎదురుగా దూసుకువస్తున్న ద్విచక్ర వాహన చోదకులు. ఒక్క అడుగు అటూ ఇటూ చూడకుండా వేస్తే ఇక ఇంతే సంగతులు.
ఎవరి తొందరవారిదే, కాదనను, కానీ పాదచారుల సంగతి ఏమిటి? సరైన ఫుట్ పాతులు లేవు. ఈ లోగా అనేకమంది మిత్రుల ఫోన్లు. తలదాచుకునే చోటు లేదు. చిన్న వానే అయినా ఒక చోట నిలబడి మాట్లాడే వీలు లేదు, వీటికి తోడు ఎడతెగకుండా మోగుతున్న వాహనాల హారన్లు. అందుకే అందరికీ పొడి పొడి సమాధానాలే. పక్క నుంచి వాహనం వెళ్లినప్పుడు మరో పక్కకు దూకడం, అటునుంచి వాహనం ఎదురైనప్పుడు ఇటు గెంతడం.
కొంతదూరం ఇలా రోడ్ల మీద కధాకళీ, భరత నాట్యం చేస్తూ నడిచిన తర్వాత జ్ఞానోదయం అయింది. ఎక్కడైనా ఆటో దొరికితే అడిగినంత ఇచ్చి (అదే ఇంటికి చేరిన తర్వాత నా కధ చెప్పి) వెడదామని చూశాను.
ఎల్లారెడ్డి గూడా అనాలో, యూసుఫ్ గూడా బస్తీ అనాలో అక్కడ మునిసిపాలిటీ వాళ్ళ చెత్త డంప్ యార్డు వుంది. లోపలి సుందర దృశ్యం బయటకి కనబడకుండా చుట్టూ ఇనుప రేకుల దడి కట్టారు. దాని పక్కన ఆగివున్న ఆటో కనిపించింది. చూస్తే అందులో డ్రైవర్ లేడు. ఓ నాలుగు అడుగుల అవతల అల్పాచమానం చేస్తూ కనపడ్డాడు. అది చూసిన తర్వాత ఇక ఆగకుండా వడివడిగా అడుగులు వేయడం మొదలెట్టాను. వర్షం కూడా పెద్దది అయింది. తడిసిపోతానేమో అనే భయం పోయింది. అప్పటికే తడిసిపోయాను. ముద్దకాక ముందే ఇంటికి చేరితే చాలు. ఎందుకైనా మంచిదని ఒకసారి జేబు తడిమి చూసుకున్నాను. ఇంటి తాళం చెవి తగిలింది. పొద్దున్న హడావిడిలో మరచిపోయానేమో అన్న సందేహం తీరింది.
ఇంటికి సరిగ్గా పది అడుగుల దూరంలో వున్నప్పుడు హఠాత్తుగా, చిత్రంగా వర్షం ఆగిపోయింది.
ఇప్పుడు సాయంత్రం అయిదు అవుతోంది. వాతావరణ శాఖ నిన్నటి నుంచి పదేపదే చేస్తున్న భారీ, అతి భారీ వర్షం జాడ మా దగ్గర లేదు. ఇవ్వాలా రేపూ అన్నారు కదా! ఇంకా రాత్రి సమయం అంతే వుంది. రేపు కూడా వ్యవధి వుంది. చూద్దాం!
ఈ ఉదయపు వర్షపు నడకలో చాలా దృశ్యాలు కనిపించాయి. ఫోటో తీయడానికి వెగటు అనిపించి మానుకున్నాను.
(13-08-2025)
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి