6, ఆగస్టు 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (206) : భండారు శ్రీనివాసరావు

 

ఆగస్టు జ్ఞాపకాలు
నిన్న ఆగస్టు ఐదో తేదీన సుప్రసిద్ధ పాత్రికేయులు, సీనియర్ సంపాదకులు ఐ. వెంకట్రావ్ గారి పుస్తకావిష్కరణ సభలో లోగడ ఆంధ్రజ్యోతిలో పనిచేసిన సుధాకర్ కనిపించాడు. ఒకానొక సందర్భంలో అతడిని ఒక కోరిక కోరదామని మనసులో అనిపించింది. కానీ మొహమాట పడి అడగలేకపోయాను. అడిగివుంటే నా జీవితంలో నాకొక అపూర్వమైన కానుక లభించి వుండేది. ఆ మాట గుర్తు చేస్తే సుధాకర్, ‘అయ్యో! అదేమంత పనండీ! ఎందుకు అడగలేదు, నేను సంతోషంగా చేసి వుండేవాడిని’ అన్నాడు.
గతజలసేతుబంధనం. ఇప్పుడు విచారించి ఏమి లాభం?
అణు విస్పోటనాల నడుమ నా జననం
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, 1945 ఆగస్టు ఆరో తేదీన జపాన్ లోని హిరోషిమా పై అమెరికా మొట్టమొదటి అణు బాంబును ప్రయోగించింది. తరువాత మూడు రోజులకు రెండో ఆటంబాంబును నాగసాకిపై జారవిడిచింది.
ఈ రెండు బాంబులు సృష్టించిన అణు విలయం నడుమ ఆగస్టు ఏడో తేదీన నేను పుట్టాను. గోరా గారిని సలహా అడిగివుంటే, తన పిల్లలకు లవణం, సమరం అని పేర్లు పెట్టినట్టే, నాపేరు ఆటంబాంబు అని పెట్టమనేవారేమో.
బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు.
'బుడ్గూ' అంటాడు గోపాళం.
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ.
'బుడుగా ఏంటి బుడుగు అసయ్యంగా. మడుగూ బుడుగూ. నాకో పేరు లేదా ఆయ్' అంటాడు బుడుగు అగ్నిహోత్రావధాన్లు లాగా గయ్యి మంటూ.
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం.
'ఏంది గురూ ఈ పేర్ల గోల పొద్దున పొద్దున్నే అంటుంది సీగానపెసూనాంబ
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు.
బుడుగుకే కాదు, పుట్టిన ప్రతివారికీ ఈ పేర్ల తిప్పలు తప్పవు.
చిన్నప్పుడు నేను పుట్టినప్పుదు నామ నక్షత్రం ప్రకారం శ్రీనివాసరావు.
కానీ ఇంట్లో ముద్దు పేరు సీనప్ప.
అలాగే ఆ పేరుతోనే పెరిగాను. పెరిగి పెరిగి పెద్దయి ఆంధ్రజ్యోతిలో చేరాను.
చేరిన తరవాత తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు జ్యోతి శ్రీనివాస్ అన్నారు. కావమ్మ గారి మొగుడిలా కామోసు అనుకున్నా. తర్వాత రేడియోలో చేరిన తర్వాత రేడియో శ్రీనివాస్.
ఆ పిమ్మట జీవన స్రవంతి శ్రీనివాస్.
అక్కడితో ఆగిందా.
మాస్కో శ్రీనివాస్.
ఇలాగే ప్రతివారికి జీవితం చివరాఖర్లో .. చెప్పుకోవడానికి, పిలవడానికి ఎన్నో ఇంటి పేర్లు.
కొన్నేళ్ళ క్రితం ఒక మీడియా ఫంక్షన్ కు వెళ్లాను.
ఆక్కడ అందరూ నన్ను పలానా టీవీ శ్రీనివాస్ రావు అనడం మొదలు పెట్టారు. నిజానికి ఒక్కొక్కరు ఓ టీవీ పేరు చెబుతున్నారు. నాకూ ఆ టీవీలకి ఏమీ సంబంధం లేదు, రోజూ పొద్దున్నా సాయంత్రం ఏదో ఒక టీవీ చర్చకు వారాలబ్బాయి మాదిరిగా వెళ్లి రావడం తప్ప. ఇప్పుడు అదీ లేదు, ఫేస్ బుక్ లో తోచినవి, తోచనివి గిలకడం తప్ప.
సియాటిల్ లో వున్నప్పుడు ఒకరోజు ఇండియన్ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళాము. ఒకతను నావైపు దీక్షగా చూసి మీరు ఫేస్ బుక్ శ్రీనివాస రావు కదా అని పలకరించాడు. నన్నెలా గుర్తుపట్టాడు అని ఆశ్చర్యపోతూ వుంటే ఆయనే సందేహ నివృత్తి చేసారు.
' లోగడ టీవీ చర్చల్లో కనపడే వారు, ఇప్పుడు రావడం లేదు. నేను ఫేస్ బుక్ లో మీరు రాసినవి ప్రతీదీ చదువుతుంటాను. మీరు సియాటిల్ వచ్చారని ఫేస్ బుక్ ద్వారానే తెలిసింది. అంచేతే తేలిగ్గా గుర్తు పట్టాను అన్నారు కరచాలనం చేస్తూ.
అంటే నా సహస్ర గృహ నామావళిలో మరో ఇంటి పేరు ఫేస్ బుక్ శ్రీనివాసరావు చేరిందన్న మాట.
నా వయసు రేపు ఏడున ఎనభయ్యవ పడిలో పడుతుంది. ఉద్యోగం చేసే వయసు కాదు, అలా అని ఎవరన్నా తలచుకుని, పెద్ద మనసు చేసుకుని ఉద్యోగం ఇచ్చే వయసు అంతకంటే కాదు.
అసలు విషయం ఇది కాదు.
జనం నన్ను గుర్తు పడుతున్నారు. గుర్తుపట్టి పలకరిస్తున్నారు ఆప్యాయంగా. ఏ ఉద్యోగం లేకపోయినా.
2019 ఆగస్టు నెలలో ఒకరోజు.
ప్రతి నెలా మొదటి వారంలో అలా నడుచుకుంటూ వెళ్లి రత్నదీప్ సూపర్ మార్కెట్లో నెల వారీ సరుకులు కొని, హోం డెలివరీ చేయమని చెప్పి మళ్ళీ నడుచుకుంటూ తిరిగి రావడం కొన్నేళ్లుగా మా ఇద్దరికీ ఓ అలవాటుగా మారింది. అలాగే ఆరేళ్ల క్రితం ఆగస్టు మొదటివారంలో ఈ నెలవారీ నడక మొదలు పెట్టాం. ఎప్పుడూ లేనిది మా ఆవిడ ఓ సంచీ చేతబట్టుకుని వచ్చింది.
తిరిగి వస్తుంటే ఇదిగో ఈ పక్క సందులోనే మన అరుణ ఇల్లు ఒకసారి చూసిపోదాం అంది. అరుణ అంటే మా వలలి. అంటే వంట అమ్మాయి. మూడు నెలల నుంచి వంటకు రావడం లేదు. అరుణ వాళ్ళు వుండేది మూడో అంతస్తులో. మెట్లెక్కి వెళ్ళాలి. ఫోన్ చేసి కిందికి పిలవరాదా అన్నాను.
“లేదు పొద్దునే తనతో మాట్లాడాను. వాళ్లమ్మ గారి ఊరికి పోతోందిట. ఉత్తమనిషి కూడా కాదు, మెట్లు దిగి ఏమి వస్తుంది. మీరిక్కడే వుండండి, నేను కలిసి వస్తాను’ అన్నది స్థిరంగా. ఇక నేనూ ఆవిడతో పాటు వెళ్లక తప్పలేదు.
పైన ఒకటే గది. మమ్మల్ని చూడగానే అరుణ భారంగా లేవలేక లేచింది. వెలిగిపోతున్న మొహంతో మమ్మల్ని చూస్తూ మంచం మీద కూర్చోమంది.
మా ఆవిడ తాను తెచ్చిన సంచీలో నుంచి కుంకుమ భరిణ, చీరె, జాకెట్ పీస్ తీసి బొట్టుపెట్టి ఇచ్చింది. తీసుకువచ్చిన మిఠాయిలు, పూలు అందించింది.
‘పండంటి బిడ్డను కనడమే కాదు, రాగానే నాకు తీసుకువచ్చి చూపించాలి సుమా’ అని అరుణ దగ్గర మాట తీసుకుంది.
అరుణ మాట నిలబెట్టుకుంటూ మూడు నెలల తర్వాత పసిబిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. కానీ ఆ బిడ్డను చూడడానికి తను లేదు.
అరుణ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె బతికి వుంది కేవలం పది రోజులే.
మరపురాని బాధ కన్నా మధురమే లేదు అనే పాట అలెక్సాలో విన్నప్పుడల్లా వింతగా అనిపిస్తుంది.
ఆగస్టు అంటేనే జ్ఞాపకాలు. మరచిపోవాలని ఎంత ప్రయత్నించినా మరపున పడని ఇలాంటి సంగతులు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూనే వుంటాయి. జ్ఞాపకాలకు అడ్డుకట్ట వేసే టెక్నాలజీ ఇంకా కనుక్కోలేదు.
పెళ్ళయిన కొత్తల్లో నాకు దేవుడు అంటే భయం, భక్తీ అంతా ఇంతా కాదు. ఆమెకు పూజా పునస్కారాలు అంతగా లేవు. కానీ కొన్నేళ్ళ తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఆమె వుంటే ఇక నాకు దేముడితో పనేమిటి అనే భరోసా నాలో పెరిగితే, ఇల్లూ వాకిలీ పట్టని నాలాంటి మొగుడు దొరికాక, దేవుడి అవసరం ఆమెకు బాగా పెరిగింది.
2019 ఆగస్టు ఏడోతేదీ. ఆ రోజు నా పుట్టిన రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన చేయించి, పులిహోర ప్రసాదం తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ నాకు అర్ధం కాని విషయాలే కాదు, అవసరం లేని విషయాలు కూడా. ఎప్పుడైనా గుడికి వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోను.
గుడి మహా ద్వారం దగ్గర ఫోటో తీసుకుందామని అనిపించింది. సెల్ఫీ తీయడం రాదు, తీసేవాడు కనిపించలేదు. కనపడిన వాడిని అడగడానికి మొహమాటం. లేకపోతే ఆ ఫోటో మా జీవితంలో ఆఖరిసారి కలిసి దిగిన ఒక అపూర్వమైన జ్ఞాపకంగా మిగిలిపోయేది. పైగా కనబడ్డవాడు అపరిచితుడేమీ కాదు. పాతిక ముప్పయ్యేళ్ల స్నేహం. అతడే ఆంధ్రజ్యోతి సుధాకర్.
కింది ఫోటో:




(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: