అయాం ఎ బిగ్ జీరో ( 205 ) : భండారు శ్రీనివాసరావు
మరికొన్ని అమెరికా సంగతులు
సియాటిల్ నుంచి బయలుదేరి సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. రాత్రి నిద్ర మొత్తం బుధవారం పగటి వేళ బాకీ తీర్చుకున్నాము.
ఎందుకంటే మర్నాడు గురువారం ఆ మర్నాడు శుక్రవారం హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది.
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారు, విమానం ఎక్కమంటారు.
గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సీ అంతా కలయ తిరిగాము. Nations' most famous address వైట్ హౌస్ మా ప్రియారిటీ.
సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా అనుమతించే ఏర్పాటు వుందట.
విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో, దానికి కూతవేటు దూరంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్లు (హోం లెస్) కనిపించారు. అదే దోవలో దారిపక్కన టోపీలు, టీ షర్టులు అమ్ముకుంటున్న వాళ్ళు కనిపించారు.
అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. ఎటు తిరిగినా, ఏమి చేసినా, ఫోటోలు తీసుకుంటున్నా, అక్కడ అడిగేవాళ్ళు, అభ్యంతర పెట్టేవాళ్ళు ఎవరూ లేకపోవడం చిత్రంగా అనిపించింది. అటకాయించే భద్రతా సిబ్బంది మాకు కనబడలేదు.
అమెరికా రాజధానిలో మేము చూసినంతమేరకు , పెద్ద పెద్ద భవనాలు వున్నాయి కానీ, ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం అడిగితే, వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.
సాయంత్రం తిరిగి బాల్టి మోర్ వస్తూ, రీగన్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్రెవెల్లీ పాయింట్ అనే ఒక టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళాము. అప్పటికే అక్కడ వందకు పైగా వాహనాలు పార్కింగు ఏరియాలో ఆగి ఉన్నాయి. విమానాశ్రయం నుంచి బయలుదేరే లేదా అక్కడ ల్యాండ్ అయ్యే విమానాలను ఆ పాయింట్ నుంచి చాలా దగ్గరగా చూడవచ్చు.
హైదరాబాదు బేగంపేటలో ఎయిర్పోర్ట్ వున్నప్పుడు దగ్గరలో ఒక ఫ్లై ఓవర్ మీద నిలబడి, ఇలానే వచ్చిపోయే విమానాలను జనం ఆసక్తిగా చూసిన సంగతులు గుర్తుకు వచ్చాయి.
విమానాలను కనుక్కున్న దేశం అమెరికా. ఎగిరే విమానాలను దగ్గర నుంచి చూడాలని వందలమంది కార్లలో తరలి వెడుతున్న దేశం అమెరికా. చిత్రంగా అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?
అయితే ఒక విషయం ఒప్పుకుని తీరాలి.
ఎంత చిన్న విషయాన్ని అయినా పర్యాటక ఆకర్షణగా మార్చి జనాలను రప్పించడంలో వారి తెలివితేటలు అమోఘం.
మర్నాడు ఉదయం న్యూయార్క్ ప్రయాణం.
అమెరికాలో పర్యాటక ప్రదేశాలు చుట్టబెట్టాలి అంటే ముందు సిద్ధపడాల్సింది కాలి నడకకు.
ఉదయం పదిన్నర కు బాల్టిమోర్ నుంచి రోడ్డు మార్గంలో న్యూయార్క్ బయలుదేరాం.
ఏడుగురం వసతిగా కూర్చుని, ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రయాణించే విశాలమైన వాహనం.
ఫిలడెల్ఫియా, డెలావేర్ మీదుగా న్యూజెర్సీ చేరుకున్నాము. డెలావేర్ అనేది అమెరికాలో చాలా చిన్న రాష్ట్రం. స్టేట్ సేల్ టాక్స్ వుండని కారణంగా అనేక పెద్ద కంపెనీలు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాయి. ఖరీదైన సెల్ ఫోన్లతో సహా అనేక వస్తువులు బయటకంటే చౌకగా లభిస్తాయి.
చుట్టుపక్కల అనేక రాష్ట్రాల వారు ఆ రాష్ట్రానికి వెళ్లి కొనుగోళ్లు చేస్తుంటారు.
అమెరికా మాజీ ప్రెసిడెంటు బైడన్ ఈ రాష్ట్రానికి చెందిన వారే. గతంలో వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు ఆయన కుటుంబం ఇక్కడే వుండేదిట. ఆయన రైల్లో ప్రతిరోజూ న్యూయార్క్ ఆఫీసుకు వెళ్లి వస్తుండేవారు అని మాతో పాటు వున్న మిత్రుడు చెప్పారు.
ఇక న్యూ జెర్సీలో ఆగి ఇండియా స్క్వేర్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వీధిలోని సదరన్ స్పయిస్ రెస్టారెంట్ లో భోజనాలు చేశాము.
తర్వాత కాలి నడకన కలయ తిరిగాము. పక్కనే వున్న పాన్ షాపులో కిళ్ళీలు తీసుకున్నాము. అచ్చం ఇండియాలో వున్నట్టే వుంది. ఆ షాపుకు ఒక తాడు వేలాడ తీసివుంది. ఎవరో వచ్చి ఒక్కటంటే ఒకటే సిగరెట్ కొనుక్కుని, ఆ తాడు కొసన ఉన్న నిప్పుతో సిగరెట్ వెలిగించుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది. అమెరికా వచ్చిన తర్వాత మొదటిసారి ఆ వీధిలో కారు హారన్లు వినిపించాయి. ఒకచోట రోడ్డు మీద రంగురంగులలో వేసిన రంగవల్లి కనిపించింది. అలాగే ‘మీ చేయి చూసి జాతకం చెప్పబడును’ అనే బోర్డు కూడా.
నదీ గర్భంలో సుమారు వందేళ్లకు పూర్వం నిర్మించిన హాలండ్ టన్నెల్ ద్వారా హడ్సన్ నదిని దాటి అవతల న్యూయార్క్ హార్బర్ కు వెళ్లాము. అక్కడ నుంచి పెద్ద బోటులో ప్రయాణిస్తూ, నది రెండు వైపులా అటు న్యూ జెర్సీ, ఇటు న్యూయార్క్ లోని రమ్యహర్మ్య భవనాలు వీక్షిస్తూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేరుకున్నాము.
అద్భుతమైన నిర్మాణం. వందేళ్లకు పూర్వమే ఆ భారీ శిల్పం రూపొందించిన తీరు విభ్రమ కలిగించేదిగా వుంది.
పారిస్ లో ఆ భారీ విగ్రహాన్ని నిర్మించి విడి భాగాలుగా విడతీసి ఆ నాటి తెర చాప పడవల్లో న్యూయార్క్ తీరానికి తరలించిన తీరును వివరించే లఘు చిత్రాలను అక్కడ భారీ (ఐ మాక్స్) తెరలపై ప్రదర్శిస్తున్నారు. వాటిని చూసాము.
తరువాతి అడంగు న్యూయార్క్ డౌన్ టౌన్ లోని గ్రౌండ్ జీరో. అంటే ఉగ్రవాదుల దాడులకు గురై నేలమట్టం అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల స్థానంలో నిర్మించిన అమర వీరుల స్మారక ప్రదేశం. అలాగే అదే ప్రాంతంలో మరో సమున్నతమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాన్ని కొత్తగా నిర్మించారు.
అక్కడికి చాలా దగ్గరలో వున్న ప్లాజా అనే భవనాన్ని చూడడానికి వెళ్ళాము. ఈ భవనంతో మాకో బాదరాయణ సంబంధం, అనుబంధం వుంది. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వం మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు, ఈ భవనం 29 వ అంతస్తులో అనుకుంటా కొన్ని సంవత్సరాలు నివసించారు. అప్పుడు ఆయన న్యూయార్క్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ వుండే వారు.
తర్వాత గ్రౌండ్ జీరో పక్కనే అపూర్వ నిర్మాణ కౌశలంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ రైల్వే చూసాము.
అక్కడ నుంచి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను శాసించే న్యూయార్క్ స్టాక్ ఎక్సెంజి దగ్గర ప్రఖ్యాతిగాంచిన భారీ బుల్ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాము.
నమ్మకమో, మూఢ నమ్మకమో తెలియదు, వీటికి ఎవరూ అతీతులు కారేమో అనిపించే దృశ్యాన్ని అక్కడ చూసాను.
షేర్ లావాదేవీల్లో కలిసి రావాలని కోరుకుంటూ అనేక మంది ఆ బుల్ విగ్రహం వద్దకు వెడతారు. తప్పేమీ లేదు. ఎవరి నమ్మకాలు వారివి. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే ఆ బుల్ వృషణాలను తాకి మనసులో కోరుకుంటే వారు కోరుకున్నట్టుగా షేర్ ధరలు పెరుగుతాయట. ఈ నమ్మకం అక్కడి వారిలో ఎంతగా వున్నదో తెలియడానికి అక్కడ కనిపించిన క్యూలే సాక్ష్యం.
ఇక చివరి మజిలీ ప్రపంచ ప్రఖ్యాత టైమ్ స్క్వేర్.
నిజానికి న్యూయార్క్ లోని అనేకానేక వీధుల్లో అదొకటి. కానీ దాని వైభోగమే వేరు. పర్యాటకులు అందరూ కట్టగట్టుకుని వచ్చినట్టు ఆ ప్రాంతం అంతా జనంతో కిటకిటలాడుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా అక్కడే వినియోగిస్తున్నట్టు ధగధగలాడుతోంది.
నా కంటికి మాత్రం అదో కలవారి తిరునాళ మాదిరిగా అనిపించింది.
కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి కారులో మళ్లీ వూరు చేరే సరికి అర్ధరాత్రి రెండు గంటలు దాటింది.
మా అన్నయ్య కొడుకు సత్యసాయి నేను ఇండియా వెళ్ళిపోతున్న సందర్భంగా వాళ్ళ ఇంట్లో వీడ్కోలు విందు ఇచ్చాడు. వున్న వూళ్ళో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రదేశాల నుంచి మా బంధుమిత్రులు దాదాపు నలభై మంది వచ్చారు. ఇంతమంది చుట్టూ వుంటే ఒంటరివాడిని ఎందుకవుతాను?
అమెరికాలో అనేక ప్రదేశాలు తిరిగాను. విమానాల్లో, కార్లలో ప్రయాణించాను. పెద్ద పెద్ద హోటళ్లలో బస చేసాను. ఎక్కడా ఒక్క రూపాయి (డాలర్) ఖర్చు చేయనివ్వకుండా వెంట వుండి అన్నీ వాళ్ళే చూసుకున్నారు. నా పట్ల ఇంతటి అవ్యాజానురాగం చూపించడానికి నాకు తెలిసి ఏ ఒక్క కారణం లేదు, కేవలం మా అమ్మ, నాన్న కడుపున పుట్టిన నా అదృష్టం తప్ప.
తోకటపా:
వైట్ హౌస్ పైన ఎగురుతున్న అమెరికన్ జాతీయ పతాకం కిందనే నలుపు తెలుపులో మరో జెండా ఎగురుతుంటుంది. యుద్ధాల్లో మరణించిన లేదా ఆచూకీ తెలియకుండా పోయిన అమెరికన్ సైనికుల స్మృత్యర్ధం రూపొందించిన పతాకం అది.
కింది ఫోటోలు:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి