ముందే మోగిన గంట
“డ్రైవరు వచ్చి చాలా సేపు అయింది. రెండూ
దూరాలే. గంట పైన పడుతుంది. ఇంకా తయారు కాలేదేమిటి” అన్నాను అసహనంగా.
“పనమ్మాయిని తోడు ఉండమని చెప్పాను. మీరూ
సంతోషు వెళ్లి రండి. నాకు కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తోంది” అన్నది మా
ఆవిడ.
నాకు తల తిరిగి
పోయింది. పెళ్ళయిన ఈ నలభయ్ అయిదేళ్ళలో ఎన్నడూ ‘మీరు వెళ్ళండి, నేను
ఉండిపోతాను’ అనే మాట ఆమె నోట వినబడలేదు. మా చుట్టపక్కాల్లో పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమి
జరిగినా ముందుండేది తనే, నేను కాదు. మా పెద్దన్నయ్యపర్వతాల
రావు గారి మనుమరాలు పెళ్లి. అంతకు ముందు జరిగిన మెహందీ
మొదలైన కార్యక్రమాలకు కూడా వెళ్లి, పగలల్లా అక్కడే వుండి వచ్చింది కూడా. శనివారం రాత్రి రెండు
పెళ్ళిళ్ళు. రెండూ తప్పకుండా
వెళ్లాల్సినవే కాదు, దగ్గర వుండి కనుక్కోవాల్సిన పెళ్ళిళ్ళు. ఒకటి మా పెద్దన్నయ్య మనుమరాలు
అపర్ణ పెళ్లి. రెండోది మా చిన్న మేనల్లుడు కొమరగిరి రఘురాం కొడుకు వివాహం. చుట్టాలందరం రెండింటికీ
వెళ్లాలని తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఏడెనిమిది గంటలు వుండాలి, అప్పగింతలూ అవీ
అయి తిరిగొచ్చేసరికి తెల్లారుతుందని ముందరే డ్రైవరుకు చెప్పి పెట్టాం. అతడూ
వచ్చాడు. వచ్చిన తరువాత ఇదీ పరిస్తితి.
అపోలోలో
పనిచేస్తున్న డాక్టరు బాబీకి ఫోను చేసాం. అతడు కొన్ని వివరాలు అడిగి యేవో మందులు
చెప్పాడు. వేసుకుని పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమని సలహా చెప్పాడు. డాక్టరు కదా!
షరా మామూలుగా కొన్ని టెస్టులు చేయించమన్నాడు. డ్యూటీ కాగానే వచ్చి చూస్తానని
అన్నాడు.
అంతే!
పెళ్లిళ్లకు వెళ్ళడం మానుకుని,
డ్రైవర్ని పంపించేసి, మా వాళ్లకు
వివరం చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాం.
కాల్
హెల్త్ కు ఫోన్ చేస్తే, వాళ్ళ తాలూకు
మనిషి ఇంటికి వచ్చి రక్తం నమూనాలు పట్టుకు పోయాడు.
పూర్తి
విశ్రాంతి తీసుకుని, డాక్టరు చెప్పిన మాత్తర్లు వేసుకుని పడుకుంటే ఉదయానికి కాస్త
తెప్పరిల్లింది. అని తనే చెప్పింది. మనం
నమ్మాలి.
అది ఆగస్టు మాసం
12వ తేదీ, 2017 వ సంవత్సరం.
మరో ఆగస్టు
వచ్చిందీ, పోయింది. ఆ తర్వాత ఆగస్టు వచ్చి పోతూ పోతూ మా ఆవిడని తీసుకుపోయింది.
2019 ఆగస్టు 17 రాత్రి పదిగంటలు.
మామూలుగా
నిద్రపోవడానికి ముందు, డబ్బూ డుబ్బూ లేకుండా సరదాగా ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాటలు వినడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు
కార్డ్సు ఆడుదామా అని తను అడగలేదు. అలెక్సా ఆన్ చేశాను. ఎప్పుడూ ఘంటసాల పాత పాటలు
వచ్చేవి. ఆ రోజు విచిత్రంగా ఘంటసాల భగవద్గీత మొదలయింది. మనసు ఏదో కీడు శంకించింది.
తల నొప్పిగావుంది,
అమృతాంజనం కావాలంది. అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం నాది. తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి
పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన
తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళు, కాదు కాదు ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా
తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. చూడలేక అంబులెన్స్ కు కబురు చేశాను. బాత్ రూం కు
పోతానంది. లేచి నిలబడ్డప్పుడు అడుగులు
తడబడుతుంటే, నేనే తీసుకువెళ్ళి తీసుకుని
వచ్చాను. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. అబ్బాయికి, కోడలుకి బెంగుళూరులో ఉద్యోగాలు. ఆసుపత్రికి తీసుకు వెళ్ళాను.
48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు
చేసిన సేవలు ఇవే.
ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావు కబురు చల్లగా చెప్పారు.
నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!
అపోలో హాస్పిటల్
లో పనిచేస్తున్న డాక్టర్ బాబీ ( మా ఆవిడ అక్కయ్య విజయ గారి కుమారుడు) మా కుటుంబంలో
ముఖ్యులకు వార్త చేరవేశాడు. నేనక్కడ ఒక శిలా విగ్రహంలా మా ఆవిడ స్ట్రెచర్ పక్కన
కూర్చుని వున్నాను. కొద్దిసేపట్లోనే వూళ్ళో వున్న మా కుటుంబ సబ్యులు చాలామంది ఆ
తెల్ల్ల్లవారుఝామునే ఆసుపత్రికి చేరుకున్నారు. పలకరిస్తున్నారు, పరామర్సిస్తున్నారు.
పూర్తి అయోమయంలో నేను.
కబురు తెలియగానే
బెంగుళూరులో వున్న నా కొడుకు, కోడలు దొరికిన బస్సు పట్టుకుని ఆఘమేఘాల మీద హైదరాబాదు చేరుకున్నారు, మంచు పెట్టెలో
దీర్ఘనిద్రలో వున్న మా ఆవిడని చూడడానికి. ఎక్కడో సుదూరంగా అమెరికాలో వుంటున్న మా
పెద్దవాడు సందీప్ కుటుంబంతో కలిసి దొరికిన ఫ్లయిట్ పట్టుకుని హైదరాబాదు బయలు దేరాడు.
మా అన్నయ్య
నన్ను మా ఇంటికి పోనివ్వలేదు. పన్నెండు రోజులు వాళ్ళ ఇంట్లోనే వున్నాను. నన్ను
చూడడానికి చుట్టాలు పక్కాలు, స్నేహితులు అందరూ అక్కడికే వచ్చారు. కొన్ని రోజుల వరకూ మా
అపార్ట్ మెంటులో వారికి ఈ విషయం తెలియనే తెలియదు. అందరూ నిద్రపోతున్న సమయంలో మేము
అంబులెన్సులో బయటపడ్డాము. మర్నాడు కనబడకపోతే, మా అన్నగారింటికో, ఊరికో వెళ్లామని అనుకున్నారట.
అంత నిశ్శబ్దంగా జరిగింది ఆఖరి ప్రయాణం.
అందరూ వచ్చారు.
ఎక్కడెక్కడినుంచో ఆఖరి చూపులకోసం. ఎవరికీ నమ్మకం కుదరడం లేదు, కబురు పొరబాటున
విన్నామా అని అనుమానం.
జూబిలీహిల్స్ మహా
ప్రస్థానంలో లో అంత్యక్రియలు. కొడుకులు చేస్తూ వుంటే నేను చూస్తూ కూర్చొన్నాను.
ఎగసి పడుతున్న మంటల
మధ్య కాలి బూడిద అవుతుంటే బాధ అనిపించడం లేదా!
నాకు ఏడుపు
రాలేదు. కంట్లో నీటి చుక్కలేదు. నేను మనిషినేనా!
ఆవిడ లేకుండానే రెండేళ్లు గడిచాయి.
అధిక మాసాలు, బహుళ పక్షాలు ఇలాంటివి
ఎప్పటికీ నా బుర్రకు ఎక్కవు.
ఇంగ్లీషు తేదీలు కాకుండా తెలుగు తిథుల ప్రకారం వార్షికాలు జరపడం ఆచారం. అందుకే
పురోహితుల వారికి ఫోను చేశాను.
‘శర్మ గారు. ఎల్లుండి.....’
‘అయ్యో! కొంచెం ముందు చెప్పక పోయారా! ఆ
రోజు నేను ఓ కార్యక్రమానికి ఒప్పుకున్నాను’
‘అలానా! మా ఆవిడ మూడో ఆబ్ధీకం ఆ రోజు. తిథుల ప్రకారం ముందుకు వచ్చింది. అంచేత మీకు ముందుగా..’
‘అమ్మగారిదా! భలే వాళ్ళే! వేరే ఎవరినైనా
ఒప్పుకున్న కార్యక్రమానికి పురమాయించి నేనే వస్తాను. అరిటాకులు, దర్భలు అన్నీ పట్టుకు వస్తాను. ఇద్దరు భోక్తలను కూడా వెంట బెట్టుకు
వస్తాను. మీరు నిశ్చింతగా వుండండి. అంతా సలక్షణంగా జరిపిస్తాను, నాదీ పూచీ’
బతికి ఉన్న నా
మాట కంటే, చనిపోయిన ఆమెకే ఎక్కువ విలువ అనే విషయం తెలిసింది.
సంఘంలో భార్యకు
వున్న గౌరవాన్ని చూసి గర్వపడే అవకాశం భర్తలకు ఇలా కూడా దొరుకుతుందన్న మాట.
(17-08-2025)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి