పాత తరం జర్నలిస్టులకు గుర్తుండే వుండాలి. చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కాంగ్రెస్ లో గ్రూపు తగాదాల కారణంగా బొద్దులూరి రామారావు అనే ఎమ్మెల్యే (కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. ఆయన స్వగ్రామం రామిరెడ్డి పల్లె మా ఊరు దగ్గరే.) అచ్చు చెన్నారెడ్డి గారిని అనుకరిస్తూ నల్లకళ్ళ జోడు ధరించి, పొన్నుకర్ర విలాసంగా ఊపుకుంటూ అసెంబ్లీలో హడావిడి చేస్తూ విలేకరుల దృష్టిని ఆకర్షిస్తూ ఉండేవాడు. మంచి వక్త, మాటకారి. బెజవాడ దగ్గర కొండపల్లి వద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమలకు సంబంధించిన ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కొంతకాలం చైర్మన్ గా పనిచేశారు కూడా. ఈ తెలుగుదేశం పత్రికకు ఈ రామారావు గారికి సంబంధం ఏమిటంటారా! ఈ పత్రిక ఎడిటర్ సూర్యదేవర రాజ్యలక్ష్మి దేవి ఈయనకు దగ్గరి బంధువు. ఈ పత్రిక ప్రచురణ విజయవాడ నుంచి అయినా, ఆ రోజుల్లోనే హైదరాబాదులో కార్యాలయం వుండేది.
ఆగస్టు ఎనిమిది ఆవిడ వర్ధంతి. ఆ నాడు నాకు ఈ తెలుగుదేశం పత్రిక ఫోటోతో పాటు రాజ్యలక్ష్మి గారి గురించి కొన్ని వివరాలు వాట్సప్ లో పంపారు. రాజ్యలక్ష్మి దేవి స్వతంత్ర సమరంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం సంస్థానానికి విముక్తి దొరకలేదు. నిజాం వ్యతిరేక పోరాట నాయకులకు సంఘీభావం తెలిపి వారితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. 2010 ఆగస్టు ఎనిమిదిన ఆమె మరణించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి