20, ఆగస్టు 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (212)– భండారు శ్రీనివాసరావు

 ఇంటింటి రామాయణం

 

‘ఫ్రిజ్ పనిచేయడం లేదు

మొన్న ఉదయం వంటకు  వచ్చినప్పుడు వలలి వనిత చెప్పింది. ఫ్రిడ్జ్ లో లైట్ వెలగడం లేదట.

ఇంట్లో ఏమి జరుగుతోంది అనేది ఎవరైనా వచ్చి చెప్పేవరకు నాకు తెలియదు. అదీ నా మేనేజ్ మెంట్ స్థాయి.  

అంతకు ముందు ప్లంబరు కోసం యాతన, తర్వాత గ్యాస్ స్టవ్, ఇప్పుడు ఫ్రిజ్, రేపు మరోటి. ఎస్సారార్ కాలేజీలో ఇకనామిక్స్ లెక్చరర్ రామనరసింహం గారు చెప్పేవారు, మిషన్ ఆల్వేస్ ఫెయిల్స్ అని. యంత్రం అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు రిపైర్ కు రాక తప్పదు అని వారి భావన.   

రిపేర్లకే వేలకు వేలు ఖర్చు. వచ్చి చూసినందుకు ఇంత, తెరిచి చూస్తే కొంత,   ఇది పోయింది, అది పోయింది అని మరికొంత, ఇది కొనాలి, అది కొనాలి  అని ఇంకొంత,  చివరికి పని పూర్తి చేసినందుకు మరింత.  పైగా ఎప్పుడు వస్తారో తెలియదు, వచ్చిన దాకా భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూచోవాలి.

ఈ సమయంలో మా పెద్దక్కయ్య కుమారుడు, కీర్తిశేషుడు డాక్టర్ ఏపీ రంగారావు గుర్తుకు వచ్చాడు. ఆయన చేసిన ఆలోచనలు స్పురణకు వచ్చాయి.

ముందు ఫ్రిడ్జ్ గొడవ చూద్దాము.

దగ్గరలో వున్న ఫ్రిజ్ మెకానిక్ ఎవరు అని గూగుల్ ని అడిగాను. అది చెప్పిన నెంబరుకు ఫోన్ చేశాను.  ఒక నెంబరు చెబుతా రాసుకోండి అంది ఆ నెంబరు. చేస్తే జవాబు లేదు. చేయగా చేయగా ఒక అరగంటకు దొరికాడు.  ‘దూరంగా వున్నాను,  లొకేషన్ పంపండి, రావడానికి రెండు గంటలు పడుతుంది అన్నాడు. అన్నాడు కానీ నాలుగు గంటల తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాడు. చూశాడు. విప్పాడు. చెప్పాడు.

‘రెండు చిన్న పరికరాలు పాడయ్యాయి. ఒకటి 1250, మరోటి 1850. రిపైర్ చార్జీ  450, తర్వాత పని తీరు నచ్చితే పండగ మామూలు మీ ఇష్టం’ అన్నాడు.

‘ఊ’ అనడం తప్పిస్తే మా బోంట్లకు చేసేది ఏముంది. ‘బాగా రిపైర్ చేసి పెట్టు, మళ్ళీ నీ పేరు మరొకరికి చెప్పేలా’ అన్నాను, కాసింత ఉత్సాహం కలిగిస్తూ. బాసింపట్టు వేసుకుని పని మొదలు పెట్టాడు. నేను ఓ కుర్చీ దగ్గరకు జరుపుకుని కూచున్నాను, ఈ పని అయిపోతే భోజనం చేయాలి.

మొన్న స్టవ్ రిపైర్ కు వచ్చిన వాడు ఇంతే! మోటారు సైకిల్ కు మైకు తగిలించుకుని స్టవ్ రిపైర్, స్టవ్ రిపైర్ అని అరచుకుంటూ పోతుంటే మూడో అంతస్తులో వున్న నాకు వినపడింది. నిజానికి నాకు రిపైర్ అవసరం లేదు, కాస్త క్లీన్ చేస్తే చాలు. వాచ్ మన్ ని పంపి పిలిపించాను. క్లీనింగ్ చేస్తే చాలు అన్నాను.

‘అగ్గిపెట్టె వుందా’ అన్నాడు. ఆ సందర్భంలో ఆ జవాబు అసందర్భం అనిపించింది. అయినా దేవుడి మందిరంలోని అగ్గిపెట్టె తెచ్చి ఇచ్చాను. అతడు స్టవ్ వెలిగించి  ఓ అగ్గిపుల్ల గీసి నాలుగు  బర్నర్ల చుట్టూ తిప్పాడు. బర్నర్ల నుంచి నీలిమంటలు వచ్చాయి. ‘చూశారా! గ్యాస్ లీక్ అవుతోంది.  వీటి నాబ్స్ మార్చాలి’ అన్నాడు. ఇది ఇంత, అది ఇంత అని చెప్పి కొత్తవి వేసి (అన్నీ అతడు వెంట తెచ్చుకున్న బ్యాగులోనే వున్నాయి), బాగయింది చూసుకోండి అని మళ్ళీ వెలిగించి చూపించి, 3, 200 పట్టుకుపోయాడు. పోతూ పోతూ, పాలు పొంగినప్పుడల్లా వెంటనే ఓ బట్టతో శుభ్రం చేయండి, ఈ సమస్య రాదు అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చి మరీ పోయాడు. ఇదంతా పూర్తయ్యేసరికి సాయంత్రం అయిదున్నర. అప్పుడు భోజనం.

ఇదంతా గుర్తుకు వచ్చి ఫ్రిడ్జ్ రిపైర్ కు వచ్చిన  మనిషితో అన్నాను. ‘ఇంత ఖర్చు పెట్టేబదులు కొత్తది కొనుక్కుంటే పోలా’ అని. అతడు వెంటనే జవాబు చెప్పాడు. ‘కొనుక్కోవచ్చు, నలభయ్ వేలు అవుతుంది. ఇది 2008 మోడల్. నేను ఈ కంపెనీకే పనిచేస్తాను.  అప్పటి మోడల్స్ పనిచేసినట్టుగా ఇప్పటివి పనిచేయడం లేదు. చిన్న చిన్న రిపైర్లు వచ్చినా చాలా కాలం పనిచేస్తుంది అని.  కొత్తది కొనే బదులు నాలుగువేల రిపైర్ బెటర్ అని నా మైండ్ ని ట్యూన్ చేశాడు, తన మార్కెటింగ్ తెలివితేటలతో.

సరే! అతడు ఆ పనిచేసి ఫ్రిడ్జ్ లో లైట్ వెలిగించేసరికి ఇంట్లో దీపాలు వెలిగించే వేళ అయింది. కార్తీకం కాకపోయినా ఒక పూట ఉపవాసం.  

ఇప్పుడు డాక్టర్ రంగారావు గారి ఆలోచనల సంగతి చెప్పుకుందాం.  

రెండు దశాబ్దాల కిందటి సంగతి.    

 

అప్పుడు మా పిల్లలు బయటి ఊళ్లలో ఉద్యోగాలు చేస్తుంటే, మా ఆవిడా నేనూ ఒంటరిగా కాపురం వెలిగిస్తున్న రోజుల్లో  ఒక సమస్య ఎదురయింది.  సమస్య కాదు, ఇబ్బంది. నిజానికి చాలా చిన్న సమస్య. కానీ పరిష్కారం వెనువెంటనే కనబడక పోవడంతో అది క్షణక్షణానికి పెరిగి పెద్దదయింది.

ఇంట్లో కరెంటు పోయింది. ‘ఇంట్లో’ అని ఎందుకు అంటున్నాను అంటే అపార్ట్ మెంట్లో కరెంటు  వుంది. మా ఫ్లాట్ లోనే పోయింది. పోయిందా అంటే పూర్తిగా పోలేదు. ‘వస్తావు పోతావు నాకోసం’ అన్నట్టు ఒక క్షణం పోతుంది. మరు నిమిషం వస్తుంది. ఇలా దాగుడుమూతలు ఆడే కరెంటుతో, ఆ కరెంటుతో నడిచే ఉపకరణాలకు నష్టమని పూర్తిగా మెయిన్ ఆఫ్ చేసి చెమటలు కక్కుతూ నేనూ మా ఆవిడా అవస్థ పడుతూ పరిష్కారం ఎలా అని ఆలోచించాము. కరెంటు అవస్థలు తగ్గిన కాలం కాబట్టి, ఆపద్ధర్మ లైట్లు, కొవ్వొత్తులు ఇంట్లో కనబడకుండా పోయాయి. ఏ ఎలక్ట్రీషియన్ కు ఫోను చేసినా బిజీ బిజీ. ఎవ్వరూ దొరకలేదు. ఈ వచ్చీ రాని కరెంటుతో రాత్రి గడపడం యెట్లా అనుకుంటూ వుంటే మా వాచ్ మన్ ఎవరో ఇద్దర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు మా పక్క అపార్ట్ మెంట్లో మొన్నీ మధ్యనే దిగారట. ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్లకి ఆ ఇల్లు మా వాచ్ మనే కుదిర్చిపెట్టాడుట. ఆ పరిచయంతో వాళ్ళని రాత్రి పదిగంటలకు వెంట బెట్టుకు వచ్చాడు. ఆ ఇద్దరు కాసేపు చూసి ఏం మాయ చేసారో కాని, మా ఇన్వర్టర్ లో ఒక లోపాన్ని పసికట్టారు. దాన్ని సరిచేసి ఇంట్లో వెలుగు నింపారు.

మా సమస్య తీరింది కానీ మరో సమస్య. చూడబోతే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళలా వున్నారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వడం అంటే చిన్నబుచ్చినట్టు అవుతుందేమో. ఇవ్వకుండా ఉత్త చేతులతో పంపడం ఎలా!

చివరికి మా ఆవిడే కల్పించుకుని మాకు అంతకు ముందు రోజే ఎవరో పంపిన ఖరీదైన పళ్ళ బుట్టను వాళ్ళ చేతుల్లో పెట్టి సాగనంపింది. ఈ నేపధ్యంలో, డాక్టర్ రంగారావు గారికి ఒక ఆలోచన వచ్చింది.

అప్పటికే ఆయన రూపకల్పన చేసిన 108, 104 సర్వీసులు ఉమ్మడి రాష్ట్రంలో కుదురుకుంటున్నాయి.

ఆయన సరిగ్గా ఇదే కోణంలో  ఆలోచించారు. సామాన్య మనుషులకు  ఎదురయ్యే పెద్ద సమస్యల్లో ఒకటి టెన్షన్. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్న సమస్య పెద్దదిగా కనబడి మరింత పెద్దది అవుతుంది. దానితో పెరిగిన టెన్షన్ తో అనారోగ్యం పెరిగి పెద్దది అవుతుంది. దీనికి పరిష్కారం కనుగొంటే బీపీ షుగర్ వంటి వ్యాధులకు మొదట్లోనే అడ్డుకట్ట వేయవచ్చన్నది ఆయన ఆలోచన. అది చిటికెలో, చౌకలో  అయ్యే పరిష్కారం అయితే మహాబాగు.  

ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న సంసారాలు ఏర్పడుతున్న తరుణంలో ఎదురయిన సమస్యలని ఎవరికి వారే పరిష్కరించుకోవాల్సి వుంటుంది. మునుపటి రోజుల్లో ఇంట్లోనే ఎవరో ఒకరు చేయి వేసేవాళ్ళు. ఫోను చేస్తే 108 అంబులెన్స్  వచ్చినట్టు, ఒక ఏకీకృత వ్యవస్థ ద్వారా మనకు కావాల్సిన ప్లంబర్లను, ఎలక్ట్రీషియన్లు మొదలయిన పనివాళ్ళని ఫోను చేసి ఇంటికి పిలిపించుకునే సౌకర్యం అన్నమాట. సరే ఈనాడు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత అర్బన్ క్లాప్స్ వంటి యాప్స్ వచ్చాయనుకోండి. నేను చెప్పేది ఇలాటి సంస్థలు ఏవీ లేని కాలంలోని ముచ్చట. పైగా వినియోగదారుడికి చేతి చమురు  వదలాల్సిన అక్కర లేని ముచ్చట. పెద్ద చదువు లేకపోయినా ఇటువంటి మరమ్మతులు సొంత తెలివితేటలతో చక్కబెట్టగల పనివారికి కొరతలేని దేశం మనది. కాకపోతే వారికి స్థిరమైన ఆదాయం వుండదు.

అటువంటి పనివారి వివరాలను ముందు జంట నగరాలలో ఆ రోజుల్లోనే ఏరియా వారిగా వారి టెలిఫోన్ నెంబర్లతో సహా సేకరించడం జరిగింది. 108, 104 లాగానే ఈ సర్వీసులకు కూడా ఒకే  టోల్ ఫ్రీ నెంబరు వుంటుంది. ప్రభుత్వం లేదా ఒక గుర్తింపు పొందిన వ్యవస్థ ఆధ్వర్యంలో కాబట్టి వచ్చిన వాళ్ళు,  వచ్చిన పని కాకుండా ఇంట్లో ఉన్న ముసలీ ముతక మీద అఘాయిత్యానికి పూనుకునే అవకాశం వుండదు.  వచ్చిన పని చేస్తూనే ఇంట్లో ఖరీదైన వస్తువులను చక్కబెట్టుకుని పోయే వీలుండదు. చిన్నా చితకా పనులన్నీ, పెద్ద అవస్థలు పడకుండా జరిగిపోతూ ఉండడంతో  జనంపై మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయి.

అయితే అనేక మంచి పధకాల మాదిరిగానే ఇది కూడా అటకెక్కింది.

ఇతి వార్తాః 

కింది ఫోటో:

ఫ్రిడ్జ్ మెకానిక్ శ్రీనివాస్



(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: