Sharing dais with former Vice President of India Shri Venkayya Naidu while releasing a book ' విలీనం - విభజన' గతం స్వగతం, మన ముఖ్యమంత్రులు' written by Senior Editor Shri I. Venkata Rao in Hyderabad today.
క్లుప్తంగా నా పరిచయ వాక్యాలు:
" వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు మాట్లాడతారు..
అని ఆరోజు బెజవాడ పి.డబ్ల్యూ.డి. మైదానంలో జరుగుతున్న సభలో మైకులో అనౌన్స్ చేయగానే అక్కడ గుమికూడిన వేలాది జతల కళ్ళన్నీ స్టేజ్ వైపు తిరిగాయి.
వెంకయ్య నాయుడు అంటే ఎవరో నడికారు మనిషి అనుకున్నారు అందరూ. అయితే తెల్లటి దుస్తుల్లో చొక్కా ప్యాంటు వేసుకున్న నవ యువకుడు వచ్చి మైకు పట్టుకున్నాడు. అంతే!
మెరుపులు లేకుండానే పిడుగులు పడ్డాయి. అద్భుతమైన అంత్యప్రాసలతో కూడిన ఆయన ప్రసంగం వింటూ జనం చేసిన కరతాళ ధ్వనులతో మైదానం దద్దరిల్లింది.
అదే నేను వెంకయ్య నాయుడి గారిని మొదటిసారి చూడడం.
పరిచయ వాక్యాలు పలకమని మిత్రులు గౌరవనీయులు ఐ వెంకట్రావు గారి ఆదేశం లాంటి అభ్యర్ధన. ఇక్కడ ఎవరిని పరిచయం చేయాలి? పరిచయం అవసరం వున్న వారివ్వరూ ఇక్కడ పైనా కిందా కూడా నా కంటికి కనపడడం లేదు. అందరూ జగమెరిగిన వారే!
వెంకయ్య నాయుడు అన్న ఆ పేరే వారికి ట్రేడ్ మార్క్.
వారి పక్కన నిలబడి నోరు మెదపడమే ఒక సాహసం. ఇంకా మాట్లాడడం, పరిచయం చేయడం అంటే ఏం చెప్పాలి. నేను కుప్పిగంతులు వేయకా తప్పదు. మీరు వినకా తప్పదు. చూడకా తప్పదు.
వారితో నాకు వ్యక్తిగతం కన్నా వృత్తిగత పరిచయం ఎక్కువ. సమైక్య రాష్ట్రంలో వారు ఏ సభలో, ఏ సమావేశంలో పాల్గొన్నా రేడియో న్యూస్ యూనిట్ కి ఫోన్ వచ్చేది. ట్రంక్ కాల్స్ రోజుల నుంచి std రోజులవరకు ఇదే కొనసాగింది.
ఈ క్రమంలో ఆయన పార్టీ పరంగా ఎక్కని మెట్లు లేవు. ఎన్ని మెట్లెక్కి శిఖరాగ్రం చేరుకున్న తర్వాత కూడా ఆయన బాణీ మారలేదు. ప్రవర్తనలో తేడా రాలేదు. ఎక్కడ కనపడ్డా ఏం శ్రీనివాస రావు ఎలా వున్నావ్? అని అడిగే వారు. అదీ భుజం మీద చేయి వేసి. ఇది నా ఒక్కడి అనుభవం కాదు. ఈ హాలులో ఆశీనులైన జర్నలిస్టులు అందరిదీ ఇదే అనుభవం. ఆ మాటకు వస్తే, ఒకానొకకాలంలో, సమైక్య రాష్ట్రంలో మారు మూల ప్రాంతాలలో వున్న పాత్రికేయులందరిది కూడా.
రేడియోలో వార్తలకు సంబంధించి అత్యధిక సమయం పది నిముషాలు. 6.15 అంటే 6.15 కు మొదలు పెట్టాలి. 6.25 కు క్షణం తక్కువ కాకుండా క్షణం ఎక్కువ కాకుండా ముగించాలి. ఈ ఒడుపు రేడియోలో పనిచేసే మాకన్నా వెంకయ్య నాయుడి గారికే బాగా తెలుసు. బంగారం తూచినట్టు సరిగ్గా, మాకు ఎంత కావాలో అంతే చెప్పేవారు.
వెంకయ్య నాయుడి గారిలో ఒక మంచి సుగుణం ఏమిటంటే, ఆయన ఎంత పెద్ద పదవిలో వున్నా అదే సౌజన్యం. అదే ఔదార్యం. అదే మంచితనం. మరో అరుదైన గుణం ఎక్కి వచ్చిన మెట్లను గుర్తు పెట్టుకోవడం. ఎంత గ్యాప్ వచ్చినా అందర్నీ పేరు పేరునా పలకరించడం. ఆయన అసాధారణ ధారణ శక్తికి ఇదో నిదర్శనం.
ఇక వెంకట్రావు గారు. వృత్తిలో ఎంత చురుకో, వ్యక్తిగా అంత నెమ్మది. 70 వ దశకంలో బెజవాడ ఆంధ్ర జ్యోతిలో అయిదేళ్లు వారితో కలిసి పనిచేసే అవకాశం, కలిసిమెలిసి తిరిగే అదృష్టం నాకు దక్కింది. లబ్బీపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం రోడ్డులో వారి నివాసం. పశువుల ఆసుపత్రి సందులో నా ఇల్లు. ఈ రెంటి మధ్యలో ఆంధ్రజ్యోతి. నేను సబ్ ఎడిటర్ గా ఏబీకే ప్రసాద్ గారితో నైట్ షిఫ్ట్. మధ్యలో ఎప్పుడో చప్పుడు కాకుండా వచ్చి అప్పుడు రిపోర్టర్ గా వున్న వెంకట్రావు గారు తాను తెచ్చిన వార్తలు రాస్తూ కనపడే వారు.
ఇవన్నీ పాత జ్ఞాపకాలు.
'విస్తళ్లు వేసాం, వడ్డన మొదలైంది, కాళ్ళు చేతులు కడుక్కోండి' అన్న తర్వాత నా వంటి వాడు ఇలా పరిచయ వాక్యాల పేరుతో మెదళ్ళు తినడం అన్యాయం కదా!
వెంకయ్య నాయుడు గారి మృష్టాన్న ప్రసంగం సిద్ధంగా వుంది. చెవులరా విని ఆనందించండి.
కనుక ముగిస్తున్నాను.
https://youtu.be/fwIgONV1hIU?si=EagKeqUeLNIT9pB5
Video Courtesy: Shri Kondaveeti Jayaprasad MD, Metro TV.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి