20, ఆగస్టు 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (212)– భండారు శ్రీనివాసరావు

 ఇంటింటి రామాయణం

 

‘ఫ్రిజ్ పనిచేయడం లేదు

మొన్న ఉదయం వంటకు  వచ్చినప్పుడు వలలి వనిత చెప్పింది. ఫ్రిడ్జ్ లో లైట్ వెలగడం లేదట.

ఇంట్లో ఏమి జరుగుతోంది అనేది ఎవరైనా వచ్చి చెప్పేవరకు నాకు తెలియదు. అదీ నా మేనేజ్ మెంట్ స్థాయి.  

అంతకు ముందు ప్లంబరు కోసం యాతన, తర్వాత గ్యాస్ స్టవ్, ఇప్పుడు ఫ్రిజ్, రేపు మరోటి. ఎస్సారార్ కాలేజీలో ఇకనామిక్స్ లెక్చరర్ రామనరసింహం గారు చెప్పేవారు, మిషన్ ఆల్వేస్ ఫెయిల్స్ అని. యంత్రం అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు రిపైర్ కు రాక తప్పదు అని వారి భావన.   

రిపేర్లకే వేలకు వేలు ఖర్చు. వచ్చి చూసినందుకు ఇంత, తెరిచి చూస్తే కొంత,   ఇది పోయింది, అది పోయింది అని మరికొంత, ఇది కొనాలి, అది కొనాలి  అని ఇంకొంత,  చివరికి పని పూర్తి చేసినందుకు మరింత.  పైగా ఎప్పుడు వస్తారో తెలియదు, వచ్చిన దాకా భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూచోవాలి.

ఈ సమయంలో మా పెద్దక్కయ్య కుమారుడు, కీర్తిశేషుడు డాక్టర్ ఏపీ రంగారావు గుర్తుకు వచ్చాడు. ఆయన చేసిన ఆలోచనలు స్పురణకు వచ్చాయి.

ముందు ఫ్రిడ్జ్ గొడవ చూద్దాము.

దగ్గరలో వున్న ఫ్రిజ్ మెకానిక్ ఎవరు అని గూగుల్ ని అడిగాను. అది చెప్పిన నెంబరుకు ఫోన్ చేశాను.  ఒక నెంబరు చెబుతా రాసుకోండి అంది ఆ నెంబరు. చేస్తే జవాబు లేదు. చేయగా చేయగా ఒక అరగంటకు దొరికాడు.  ‘దూరంగా వున్నాను,  లొకేషన్ పంపండి, రావడానికి రెండు గంటలు పడుతుంది అన్నాడు. అన్నాడు కానీ నాలుగు గంటల తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాడు. చూశాడు. విప్పాడు. చెప్పాడు.

‘రెండు చిన్న పరికరాలు పాడయ్యాయి. ఒకటి 1250, మరోటి 1850. రిపైర్ చార్జీ  450, తర్వాత పని తీరు నచ్చితే పండగ మామూలు మీ ఇష్టం’ అన్నాడు.

‘ఊ’ అనడం తప్పిస్తే మా బోంట్లకు చేసేది ఏముంది. ‘బాగా రిపైర్ చేసి పెట్టు, మళ్ళీ నీ పేరు మరొకరికి చెప్పేలా’ అన్నాను, కాసింత ఉత్సాహం కలిగిస్తూ. బాసింపట్టు వేసుకుని పని మొదలు పెట్టాడు. నేను ఓ కుర్చీ దగ్గరకు జరుపుకుని కూచున్నాను, ఈ పని అయిపోతే భోజనం చేయాలి.

మొన్న స్టవ్ రిపైర్ కు వచ్చిన వాడు ఇంతే! మోటారు సైకిల్ కు మైకు తగిలించుకుని స్టవ్ రిపైర్, స్టవ్ రిపైర్ అని అరచుకుంటూ పోతుంటే మూడో అంతస్తులో వున్న నాకు వినపడింది. నిజానికి నాకు రిపైర్ అవసరం లేదు, కాస్త క్లీన్ చేస్తే చాలు. వాచ్ మన్ ని పంపి పిలిపించాను. క్లీనింగ్ చేస్తే చాలు అన్నాను.

‘అగ్గిపెట్టె వుందా’ అన్నాడు. ఆ సందర్భంలో ఆ జవాబు అసందర్భం అనిపించింది. అయినా దేవుడి మందిరంలోని అగ్గిపెట్టె తెచ్చి ఇచ్చాను. అతడు స్టవ్ వెలిగించి  ఓ అగ్గిపుల్ల గీసి నాలుగు  బర్నర్ల చుట్టూ తిప్పాడు. బర్నర్ల నుంచి నీలిమంటలు వచ్చాయి. ‘చూశారా! గ్యాస్ లీక్ అవుతోంది.  వీటి నాబ్స్ మార్చాలి’ అన్నాడు. ఇది ఇంత, అది ఇంత అని చెప్పి కొత్తవి వేసి (అన్నీ అతడు వెంట తెచ్చుకున్న బ్యాగులోనే వున్నాయి), బాగయింది చూసుకోండి అని మళ్ళీ వెలిగించి చూపించి, 3, 200 పట్టుకుపోయాడు. పోతూ పోతూ, పాలు పొంగినప్పుడల్లా వెంటనే ఓ బట్టతో శుభ్రం చేయండి, ఈ సమస్య రాదు అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చి మరీ పోయాడు. ఇదంతా పూర్తయ్యేసరికి సాయంత్రం అయిదున్నర. అప్పుడు భోజనం.

ఇదంతా గుర్తుకు వచ్చి ఫ్రిడ్జ్ రిపైర్ కు వచ్చిన  మనిషితో అన్నాను. ‘ఇంత ఖర్చు పెట్టేబదులు కొత్తది కొనుక్కుంటే పోలా’ అని. అతడు వెంటనే జవాబు చెప్పాడు. ‘కొనుక్కోవచ్చు, నలభయ్ వేలు అవుతుంది. ఇది 2008 మోడల్. నేను ఈ కంపెనీకే పనిచేస్తాను.  అప్పటి మోడల్స్ పనిచేసినట్టుగా ఇప్పటివి పనిచేయడం లేదు. చిన్న చిన్న రిపైర్లు వచ్చినా చాలా కాలం పనిచేస్తుంది అని.  కొత్తది కొనే బదులు నాలుగువేల రిపైర్ బెటర్ అని నా మైండ్ ని ట్యూన్ చేశాడు, తన మార్కెటింగ్ తెలివితేటలతో.

సరే! అతడు ఆ పనిచేసి ఫ్రిడ్జ్ లో లైట్ వెలిగించేసరికి ఇంట్లో దీపాలు వెలిగించే వేళ అయింది. కార్తీకం కాకపోయినా ఒక పూట ఉపవాసం.  

ఇప్పుడు డాక్టర్ రంగారావు గారి ఆలోచనల సంగతి చెప్పుకుందాం.  

రెండు దశాబ్దాల కిందటి సంగతి.    

 

అప్పుడు మా పిల్లలు బయటి ఊళ్లలో ఉద్యోగాలు చేస్తుంటే, మా ఆవిడా నేనూ ఒంటరిగా కాపురం వెలిగిస్తున్న రోజుల్లో  ఒక సమస్య ఎదురయింది.  సమస్య కాదు, ఇబ్బంది. నిజానికి చాలా చిన్న సమస్య. కానీ పరిష్కారం వెనువెంటనే కనబడక పోవడంతో అది క్షణక్షణానికి పెరిగి పెద్దదయింది.

ఇంట్లో కరెంటు పోయింది. ‘ఇంట్లో’ అని ఎందుకు అంటున్నాను అంటే అపార్ట్ మెంట్లో కరెంటు  వుంది. మా ఫ్లాట్ లోనే పోయింది. పోయిందా అంటే పూర్తిగా పోలేదు. ‘వస్తావు పోతావు నాకోసం’ అన్నట్టు ఒక క్షణం పోతుంది. మరు నిమిషం వస్తుంది. ఇలా దాగుడుమూతలు ఆడే కరెంటుతో, ఆ కరెంటుతో నడిచే ఉపకరణాలకు నష్టమని పూర్తిగా మెయిన్ ఆఫ్ చేసి చెమటలు కక్కుతూ నేనూ మా ఆవిడా అవస్థ పడుతూ పరిష్కారం ఎలా అని ఆలోచించాము. కరెంటు అవస్థలు తగ్గిన కాలం కాబట్టి, ఆపద్ధర్మ లైట్లు, కొవ్వొత్తులు ఇంట్లో కనబడకుండా పోయాయి. ఏ ఎలక్ట్రీషియన్ కు ఫోను చేసినా బిజీ బిజీ. ఎవ్వరూ దొరకలేదు. ఈ వచ్చీ రాని కరెంటుతో రాత్రి గడపడం యెట్లా అనుకుంటూ వుంటే మా వాచ్ మన్ ఎవరో ఇద్దర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు మా పక్క అపార్ట్ మెంట్లో మొన్నీ మధ్యనే దిగారట. ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్లకి ఆ ఇల్లు మా వాచ్ మనే కుదిర్చిపెట్టాడుట. ఆ పరిచయంతో వాళ్ళని రాత్రి పదిగంటలకు వెంట బెట్టుకు వచ్చాడు. ఆ ఇద్దరు కాసేపు చూసి ఏం మాయ చేసారో కాని, మా ఇన్వర్టర్ లో ఒక లోపాన్ని పసికట్టారు. దాన్ని సరిచేసి ఇంట్లో వెలుగు నింపారు.

మా సమస్య తీరింది కానీ మరో సమస్య. చూడబోతే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళలా వున్నారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వడం అంటే చిన్నబుచ్చినట్టు అవుతుందేమో. ఇవ్వకుండా ఉత్త చేతులతో పంపడం ఎలా!

చివరికి మా ఆవిడే కల్పించుకుని మాకు అంతకు ముందు రోజే ఎవరో పంపిన ఖరీదైన పళ్ళ బుట్టను వాళ్ళ చేతుల్లో పెట్టి సాగనంపింది. ఈ నేపధ్యంలో, డాక్టర్ రంగారావు గారికి ఒక ఆలోచన వచ్చింది.

అప్పటికే ఆయన రూపకల్పన చేసిన 108, 104 సర్వీసులు ఉమ్మడి రాష్ట్రంలో కుదురుకుంటున్నాయి.

ఆయన సరిగ్గా ఇదే కోణంలో  ఆలోచించారు. సామాన్య మనుషులకు  ఎదురయ్యే పెద్ద సమస్యల్లో ఒకటి టెన్షన్. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్న సమస్య పెద్దదిగా కనబడి మరింత పెద్దది అవుతుంది. దానితో పెరిగిన టెన్షన్ తో అనారోగ్యం పెరిగి పెద్దది అవుతుంది. దీనికి పరిష్కారం కనుగొంటే బీపీ షుగర్ వంటి వ్యాధులకు మొదట్లోనే అడ్డుకట్ట వేయవచ్చన్నది ఆయన ఆలోచన. అది చిటికెలో, చౌకలో  అయ్యే పరిష్కారం అయితే మహాబాగు.  

ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న సంసారాలు ఏర్పడుతున్న తరుణంలో ఎదురయిన సమస్యలని ఎవరికి వారే పరిష్కరించుకోవాల్సి వుంటుంది. మునుపటి రోజుల్లో ఇంట్లోనే ఎవరో ఒకరు చేయి వేసేవాళ్ళు. ఫోను చేస్తే 108 అంబులెన్స్  వచ్చినట్టు, ఒక ఏకీకృత వ్యవస్థ ద్వారా మనకు కావాల్సిన ప్లంబర్లను, ఎలక్ట్రీషియన్లు మొదలయిన పనివాళ్ళని ఫోను చేసి ఇంటికి పిలిపించుకునే సౌకర్యం అన్నమాట. సరే ఈనాడు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత అర్బన్ క్లాప్స్ వంటి యాప్స్ వచ్చాయనుకోండి. నేను చెప్పేది ఇలాటి సంస్థలు ఏవీ లేని కాలంలోని ముచ్చట. పైగా వినియోగదారుడికి చేతి చమురు  వదలాల్సిన అక్కర లేని ముచ్చట. పెద్ద చదువు లేకపోయినా ఇటువంటి మరమ్మతులు సొంత తెలివితేటలతో చక్కబెట్టగల పనివారికి కొరతలేని దేశం మనది. కాకపోతే వారికి స్థిరమైన ఆదాయం వుండదు.

అటువంటి పనివారి వివరాలను ముందు జంట నగరాలలో ఆ రోజుల్లోనే ఏరియా వారిగా వారి టెలిఫోన్ నెంబర్లతో సహా సేకరించడం జరిగింది. 108, 104 లాగానే ఈ సర్వీసులకు కూడా ఒకే  టోల్ ఫ్రీ నెంబరు వుంటుంది. ప్రభుత్వం లేదా ఒక గుర్తింపు పొందిన వ్యవస్థ ఆధ్వర్యంలో కాబట్టి వచ్చిన వాళ్ళు,  వచ్చిన పని కాకుండా ఇంట్లో ఉన్న ముసలీ ముతక మీద అఘాయిత్యానికి పూనుకునే అవకాశం వుండదు.  వచ్చిన పని చేస్తూనే ఇంట్లో ఖరీదైన వస్తువులను చక్కబెట్టుకుని పోయే వీలుండదు. చిన్నా చితకా పనులన్నీ, పెద్ద అవస్థలు పడకుండా జరిగిపోతూ ఉండడంతో  జనంపై మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయి.

అయితే అనేక మంచి పధకాల మాదిరిగానే ఇది కూడా అటకెక్కింది.

ఇతి వార్తాః 

కింది ఫోటో:

ఫ్రిడ్జ్ మెకానిక్ శ్రీనివాస్



(ఇంకావుంది)

17, ఆగస్టు 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (211 ) : భండారు శ్రీనివాసరావు

 ముందే మోగిన గంట

డ్రైవరు వచ్చి చాలా సేపు అయింది. రెండూ దూరాలే. గంట పైన పడుతుంది. ఇంకా తయారు కాలేదేమిటి” అన్నాను అసహనంగా.

పనమ్మాయిని తోడు ఉండమని చెప్పాను. మీరూ సంతోషు వెళ్లి రండి. నాకు కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తోంది” అన్నది మా ఆవిడ.

నాకు తల తిరిగి పోయింది. పెళ్ళయిన ఈ నలభయ్ అయిదేళ్ళలో ఎన్నడూ ‘మీరు వెళ్ళండి, నేను ఉండిపోతాను’ అనే మాట ఆమె నోట వినబడలేదు. మా చుట్టపక్కాల్లో పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమి జరిగినా ముందుండేది తనే, నేను కాదు.  మా పెద్దన్నయ్యపర్వతాల రావు గారి   మనుమరాలు పెళ్లి. అంతకు ముందు జరిగిన మెహందీ మొదలైన  కార్యక్రమాలకు కూడా  వెళ్లి,  పగలల్లా అక్కడే వుండి  వచ్చింది కూడా. శనివారం రాత్రి రెండు పెళ్ళిళ్ళు.  రెండూ తప్పకుండా వెళ్లాల్సినవే కాదు, దగ్గర వుండి కనుక్కోవాల్సిన పెళ్ళిళ్ళు. ఒకటి మా పెద్దన్నయ్య మనుమరాలు అపర్ణ పెళ్లి. రెండోది మా చిన్న మేనల్లుడు కొమరగిరి రఘురాం  కొడుకు వివాహం. చుట్టాలందరం రెండింటికీ వెళ్లాలని తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఏడెనిమిది గంటలు వుండాలి, అప్పగింతలూ అవీ అయి తిరిగొచ్చేసరికి తెల్లారుతుందని ముందరే డ్రైవరుకు చెప్పి పెట్టాం. అతడూ వచ్చాడు. వచ్చిన తరువాత ఇదీ పరిస్తితి.

అపోలోలో పనిచేస్తున్న డాక్టరు బాబీకి ఫోను చేసాం. అతడు కొన్ని వివరాలు అడిగి యేవో మందులు చెప్పాడు. వేసుకుని పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమని సలహా చెప్పాడు. డాక్టరు కదా! షరా మామూలుగా కొన్ని టెస్టులు చేయించమన్నాడు. డ్యూటీ కాగానే వచ్చి చూస్తానని అన్నాడు.

అంతే! పెళ్లిళ్లకు వెళ్ళడం మానుకుని, డ్రైవర్ని పంపించేసి, మా వాళ్లకు వివరం చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాం.

కాల్ హెల్త్  కు ఫోన్ చేస్తే, వాళ్ళ తాలూకు మనిషి ఇంటికి వచ్చి రక్తం నమూనాలు పట్టుకు పోయాడు.

పూర్తి విశ్రాంతి తీసుకుని, డాక్టరు చెప్పిన మాత్తర్లు వేసుకుని పడుకుంటే ఉదయానికి కాస్త తెప్పరిల్లింది. అని తనే  చెప్పింది. మనం నమ్మాలి.

అది ఆగస్టు మాసం 12 తేదీ, 2017 వ సంవత్సరం.  

మరో ఆగస్టు వచ్చిందీ, పోయింది. ఆ తర్వాత ఆగస్టు వచ్చి పోతూ పోతూ మా ఆవిడని తీసుకుపోయింది.

2019 ఆగస్టు 17 రాత్రి పదిగంటలు.

మామూలుగా నిద్రపోవడానికి ముందు, డబ్బూ డుబ్బూ లేకుండా సరదాగా ఓ పదాటలు కార్డ్సు ఆడటంఅలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాటలు వినడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు కార్డ్సు ఆడుదామా అని తను అడగలేదు. అలెక్సా ఆన్ చేశాను. ఎప్పుడూ ఘంటసాల పాత పాటలు వచ్చేవి. ఆ రోజు విచిత్రంగా ఘంటసాల భగవద్గీత మొదలయింది. మనసు ఏదో కీడు శంకించింది.

తల నొప్పిగావుంది, అమృతాంజనం కావాలంది. అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం నాది.  తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళుకాదు కాదు ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. చూడలేక అంబులెన్స్ కు కబురు చేశాను. బాత్ రూం కు పోతానంది.  లేచి నిలబడ్డప్పుడు అడుగులు తడబడుతుంటే,  నేనే తీసుకువెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. అబ్బాయికి, కోడలుకి  బెంగుళూరులో ఉద్యోగాలు. ఆసుపత్రికి తీసుకు వెళ్ళాను.   48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే. 


ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావు కబురు చల్లగా చెప్పారు. 
నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!

అపోలో హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ బాబీ ( మా ఆవిడ అక్కయ్య విజయ గారి కుమారుడు) మా కుటుంబంలో ముఖ్యులకు వార్త చేరవేశాడు. నేనక్కడ ఒక శిలా విగ్రహంలా మా ఆవిడ స్ట్రెచర్ పక్కన కూర్చుని వున్నాను. కొద్దిసేపట్లోనే వూళ్ళో వున్న మా కుటుంబ సబ్యులు చాలామంది ఆ తెల్ల్ల్లవారుఝామునే ఆసుపత్రికి చేరుకున్నారు. పలకరిస్తున్నారు, పరామర్సిస్తున్నారు. పూర్తి  అయోమయంలో నేను.

కబురు తెలియగానే బెంగుళూరులో వున్న నా కొడుకు, కోడలు దొరికిన బస్సు పట్టుకుని ఆఘమేఘాల మీద హైదరాబాదు చేరుకున్నారు, మంచు పెట్టెలో దీర్ఘనిద్రలో వున్న మా ఆవిడని చూడడానికి. ఎక్కడో సుదూరంగా అమెరికాలో వుంటున్న మా పెద్దవాడు సందీప్ కుటుంబంతో కలిసి దొరికిన ఫ్లయిట్ పట్టుకుని హైదరాబాదు బయలు దేరాడు.

మా అన్నయ్య నన్ను మా ఇంటికి పోనివ్వలేదు. పన్నెండు రోజులు వాళ్ళ ఇంట్లోనే వున్నాను. నన్ను చూడడానికి చుట్టాలు పక్కాలు, స్నేహితులు  అందరూ అక్కడికే వచ్చారు. కొన్ని రోజుల వరకూ మా అపార్ట్ మెంటులో వారికి ఈ విషయం తెలియనే తెలియదు. అందరూ నిద్రపోతున్న సమయంలో మేము అంబులెన్సులో బయటపడ్డాము. మర్నాడు కనబడకపోతే,  మా అన్నగారింటికో, ఊరికో వెళ్లామని అనుకున్నారట. అంత నిశ్శబ్దంగా జరిగింది ఆఖరి ప్రయాణం.

అందరూ వచ్చారు. ఎక్కడెక్కడినుంచో ఆఖరి చూపులకోసం. ఎవరికీ నమ్మకం కుదరడం లేదు, కబురు పొరబాటున విన్నామా అని అనుమానం.  

 

జూబిలీహిల్స్ మహా ప్రస్థానంలో లో అంత్యక్రియలు. కొడుకులు చేస్తూ వుంటే నేను చూస్తూ కూర్చొన్నాను.

ఎగసి పడుతున్న మంటల మధ్య కాలి బూడిద అవుతుంటే బాధ అనిపించడం లేదా!

నాకు ఏడుపు రాలేదు. కంట్లో నీటి చుక్కలేదు. నేను మనిషినేనా!    

ఆవిడ లేకుండానే  రెండేళ్లు గడిచాయి.

అధిక మాసాలు, బహుళ పక్షాలు ఇలాంటివి ఎప్పటికీ నా బుర్రకు ఎక్కవు.

ఇంగ్లీషు  తేదీలు కాకుండా తెలుగు తిథుల  ప్రకారం వార్షికాలు జరపడం ఆచారం. అందుకే పురోహితుల వారికి ఫోను చేశాను.

శర్మ గారు. ఎల్లుండి.....’

అయ్యో! కొంచెం ముందు చెప్పక పోయారా! ఆ రోజు నేను ఓ కార్యక్రమానికి ఒప్పుకున్నాను’

అలానా! మా ఆవిడ మూడో ఆబ్ధీకం ఆ రోజు. తిథుల ప్రకారం ముందుకు వచ్చింది. అంచేత మీకు ముందుగా..’

అమ్మగారిదా! భలే వాళ్ళే! వేరే ఎవరినైనా ఒప్పుకున్న కార్యక్రమానికి పురమాయించి నేనే వస్తాను. అరిటాకులు, దర్భలు అన్నీ పట్టుకు వస్తాను. ఇద్దరు భోక్తలను కూడా వెంట బెట్టుకు వస్తాను. మీరు నిశ్చింతగా వుండండి. అంతా సలక్షణంగా జరిపిస్తాను, నాదీ పూచీ’

బతికి ఉన్న నా మాట కంటే, చనిపోయిన ఆమెకే ఎక్కువ విలువ అనే విషయం తెలిసింది.

సంఘంలో భార్యకు వున్న గౌరవాన్ని చూసి గర్వపడే అవకాశం భర్తలకు ఇలా కూడా దొరుకుతుందన్న మాట.



(17-08-2025)

 

16, ఆగస్టు 2025, శనివారం

చావుకు వయసెంత? – భండారు శ్రీనివాసరావు

 

మౌత్ కి ఉమర్ క్యా హై? దో పల్ భీ నహీ!”
అని రాసుకున్న కవి పండితుడు అటల్ బిహారీ వాజ్ పాయ్ మరణించిన రోజు నేడు.
“ ఏదో ఒక రోజు నేను మాజీ ప్రధానిని కావచ్చేమో కానీ, మాజీ కవిని ఎన్నటికీ కాను”
అని చెప్పుకున్న రాజకీయ దురంధరుడు అటల్ బిహారీ వాజ్ పాయ్ చనిపోయిన రోజు ఈ రోజు.
2018 ఆగస్టు 16 న ఆ మహానుభావుడు కన్నుమూశాడు.
ఒక రకంగా అదృష్టవంతుడు. రోజురోజుకూ దిగజారిపోతూ, అధఃపాతాళానికి పడిపోతున్న రాజకీయ విలువలను కళ్ళారా చూడకుండానే కన్నుమూశాడు.
డెబ్బయ్ ఏళ్ళ నాటి సంగతి.
అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ఇప్పుడు బీజేపీ. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద చేత్తో రాసిన ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు.
ఆ రోజుల్లో, ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, గాంధీజీ మునిసిపల్ స్కూలు ఆవరణలో సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు.
ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్థిర
పాలన అందించిన ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్.
భాష అర్ధం కాని వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు చివరి రోజుల్లో మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.
చనిపోయి ఏడేళ్లు ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ ప్రజల మనస్సులో జీవించేవున్న వాజ్ పాయ్ వర్ధంతి ఈరోజు.
కింది చిత్రం: పెన్సిల్ స్కెచ్ : శ్రీ పీ.వీ.ఆర్. మూర్తి
(16-08-2025)



15, ఆగస్టు 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (210) : భండారు శ్రీనివాసరావు

 

పని లేకపోవడం కూడా ఒక పనే!
“నెంబరు చెప్పండి” అన్నాడు ఎయిర్ టెల్ ఉద్యోగి రవి నా ఫోన్ తన చేతిలోకి తీసుకుని.
ఆరేళ్ల క్రితం చనిపోయిన మా ఆవిడ ఫోను నెంబరు చెప్పాను “ 9959692977”. దాదాపు చాలా కాలం నుంచి ఈ నెంబరు వాడకంలో లేదు. మొబైల్ ఎక్కడో బీరువాలో దాచిపెట్టాను. ఆ నెంబరుని మరో కొత్త మొబైల్ లో వేసి వాడుకుంటే తను నాకు తోడుగా వుంటుందనే సెంటిమెంటు. అంతకంటే ఏం లేదు. రెండో ఫోన్ అవసరం ఏమాత్రం లేదు.
అతడు స్పీకర్ ఆన్ చేసి నెంబర్ నొక్కాడు. రింగవుతోంది. ఇంతలో ఒక గొంతు ‘హలో’ అంది. అక్కడ వున్న అందరం ఆశ్చర్యపోయాము. ఫోన్ కట్ చేసి అడిగాడు, ‘ఈ ఫోను ఇప్పుడు ఎక్కడ వుంది’ అని.
ఇంట్లోనే వుంది. అదీ తాళం వేసిన బీరువాలో.
ఇన్నేళ్ళుగా మోగని ఫోను ఇప్పుడెలా రింగవుతోంది. హలో అన్నది ఎవరు?
ఇదెలా సాధ్యం?
మొన్న ఉదయం ప్రాభాత సంకీర్తన పూర్ణా టిఫిన్స్ తో మొదలయింది. ‘వర్షం లేకపోతే వచ్చి, అంతకు ముందు రోజు పెట్టిన బాకీ తీరుస్తాను’ అని ఇచ్చిన మాట ప్రకారం వెళ్లాను. నా పోస్టు చూసి ‘ఆ హోటలు మా ఇంటికి దగ్గరే, ముందుగా చెబితే వచ్చి కలిసేవాడిని కదా’ అన్నారు ఫేస్ బుక్ స్నేహితులు KOTNANA SIMHACHALAM Naidu గారు. వారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఎలాగూ వర్షం పడడం లేదు కదా అని. ఎన్నాళ్ళబట్టో ఆయన మా ఇంటికి వద్దామని అనుకుంటున్నారు. సరే ఈ విధంగా కలవవచ్చులే అనుకుని ‘హోటల్ కే రండి’ అని ఫోను చేసి వెళ్లాను. ఈ సారి ఇంటి తాళం చెవితోపాటు, పర్సు జేబులో పెట్టుకున్నానా లేదా అని ఒకటికి రెండు సార్లు తడిమి చూసుకుని బయలుదేరాను.
ఆ పెద్దమనిషి మాట ప్రకారం వచ్చారు. వారిని ప్రత్యక్షంగా చూడడం ఇవ్వాళే. వారి జీవితానుభవాలు ఫేస్ బుక్ పోస్టుల్లో చదివిన తర్వాత ఆయన జీవితంలో ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకున్నాను. ఇన్నాల్టికి కలుసుకున్నాను.
టిఫిన్ కార్యక్రమాలు, మాటా మంతీ, మంచీ చెడు మాట్లాడుకోవడం పూర్తయిన తర్వాత వర్షం మొదలుకాకముందే ఆటోలో వారిని దారిలో అమ్మవారి గుడి దగ్గర దింపి ఇంటికి వచ్చాను.
వాతావరణం వాళ్ళు చెబుతున్న వర్షం జాడ లేదు. ఆకాశం నిర్మలంగానే వుంది. మా ఆవిడ నిర్మల జ్ఞాపకం వచ్చింది.
ఆమె జీవించి వున్న కాలంలో మా పెద్దబ్బాయి సందీప్ ఒక చిన్న సైజు ఐ ఫోన్ ఇచ్చాడు. అది ఆ కాలం నాటిది. అయినా అది మార్చడానికి ఆమెకు ఇష్టం వుండేది కాదు, పిల్లవాడు ఇచ్చిన గిఫ్ట్ అని ఆమె సెంటిమెంటు.
అమెరికా వెళ్ళినప్పుడు మా వాడు నాకు ఒక కొత్త తాజా మోడల్ ఐ ఫోన్ కొంటున్నట్టు చెప్పాడు. నేను వద్దన్నాను. నాకు ఫీచర్స్ కంటే తేలికగా ఆపరేట్ చేసుకునే యూజర్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇష్టం. దాంతో నాకున్న సాంసంగ్ లేటెస్ట్ మోడల్ ఒకటి కొనిచ్చాడు.
అంతవరకూ వాడుతున్న పాత దానిలో మా ఆవిడ ఫోన్ చిప్ వేసి వాడకంలోకి తేవాలని నా సంకల్పం. చెప్పాను కదా! కేవలం సెంటిమెంటు.
ఖాళీగా వున్నాను. వర్షం లేదు. వచ్చే సూచన కూడా లేదు.
దగ్గరలో ఎయిర్ టెల్ ఆఫీసు ఎక్కడ అని అడిగాను గూగులమ్మని. నవోదయా కాలనీ, మై హోం దగ్గర అని చూపించింది. మా ఇంటికి దగ్గరే. ఉబెర్, ర్యాపిడోలని ట్రై చేస్తే పదినిమిషాలు పడుతుంది రావడానికి అన్నారు. గూగుల్ మ్యాపు వాళ్ళు ఎనిమిది నిమిషాల నడక అన్నారు. సరే అని నడకనే ఎంచుకున్నాను.
వర్షం లేదన్న మాటే కానీ వర్షపు నీళ్ళు కాలనీ రోడ్లలో అలాగే నిలవవున్నాయి. జాగ్రత్తగా నడుచుకుంటూ వెడుతుంటే, నా వెనుక వస్తున్న కారు నామీద బురద నీళ్ళు చల్లకుండా, బాగా ఎడంగా వెళ్లి కొద్ది దూరంలో ఆగింది. ఎవరీ పెద్దమనిషి, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఇంత జాగ్రత్తగా బండి నడుపుతున్నాడు అనుకున్నా.
అందులోనుంచి దిగాడు ఆ కారు తాలూకు ఓనరు. నా వైపే నడుచుకుంటూ వచ్చాడు. ‘రండి గురువు గారూ, నేను ఇటే వెడుతున్నాను. మిమ్మల్ని దింపి వెడతాను. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి’ అన్నాడు.
తీరా చూస్తే అతడు నా ఒకప్పటి రేడియో కొలీగ్. చక్కటి గాత్ర సౌలభ్యం కలిగిన అనౌన్సర్. పేరు మురళీ కృష్ణ. అంబడిపూడి మురళీకృష్ణ. మరో ఇంటి పేరు వృత్తిరీత్యా వచ్చింది వుంది. అదే వాచస్పతి. ఆలిండియా రేడియోలో సీనియర్ గ్రేడ్ అనౌన్సర్ గా పనిచేశాడు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలకి దశాబ్దాల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా సినిమా రంగంలో కూడా అడుగుపెట్టి చిన్నా పెద్దా (వయసులో) వేషాలు అడపాదడపా వేస్తున్నాడు. వినగానే గుర్తు పట్టగల స్వరం, చూడగానే పోల్చుకోగల రూపం.
నాలుగడుగులు వేస్తె నేను వెళ్ళే ఆఫీసు వుంది అన్నాకూడా వినకుండా, డోరు తెరిచి కారు ఎక్కించాడు.
ఇద్దరం కలిసి దాపునే వున్న ఎయిర్ టెల్ ఆఫీసుకు వెళ్ళాము. అక్కడ రవి అనే ఉద్యోగి నేను చెప్పిన దంతా విన్నాడు. కంప్యూటర్ లో డిటైల్స్ చెక్ చేశాడు. ఆరేళ్లుగా వాడకుండా వున్న ఫోనుకు జాయింటుగా బిల్లులు చెల్లిస్తున్న సంగతి తెలుసుకుని మనసులో నవ్వుకున్నాడేమో తెలియదు కానీ, నా ఫోన్ తీసుకుని మా ఆవిడ నెంబరు చెప్పమన్నాడు.
చెప్పాను. అతడు స్పీకర్ ఆన్ చేసి నేను చెప్పిన నెంబరు డయల్ చేశాడు. అది రింగ్ అయింది. కాసేపటి తర్వాత ఎవరో హలో అన్నారు. అందరం ఆశ్చర్యపోయాం.
ఇదెలా సాధ్యం?
నేను ఫోను తీసుకుని మళ్ళీ నెంబరు డయల్ చేశాను. ‘మీరు ప్రయత్నిస్తున్న వారు ప్రస్తుతం అందుబాటులో లేరు, మరోసారి ప్రయత్నించండి ‘ అని వినబడింది.
రవికి కారణం అర్ధం అయింది. తాను డయల్ చేసిన నెంబరు సరిచూసుకున్నాడు. అన్ని తొమ్మిదులు వున్న నెంబరు కాబట్టి ఎక్కడో తభావతు జరిగి ఎవరి నెంబరుకో కనెక్ట్ అయింది.
అర్ధం కాని విషయం మరోటి చెప్పాడు. సాధారణంగా ఉపయోగంలో లేని నెంబర్లు తాత్కాలికంగా పనిచేయడం మానేస్తాయి. లేదా వాటిని మరొకరికి కేటాయించే అవకాశం వుంటుంది. అంచేత అవసరం వున్నా లేకపోయినా అప్పుడప్పుడూ ఒకటో రెండో కాల్స్ చేయడమూ, రిసీవ్ చేసుకోవడమూ జరుగుతుండాలి(ట).
పాత నెంబరు తోనే కొత్త ఫోన్ లో చిప్ వేయడానికి నా కనుపాపల ముద్రలు ఫోటో తీసుకున్నాడు. డబ్బులు అడగకుండానే కొత్త చిప్ వేసి ఇచ్చాడు.
అసలు సమస్య అప్పుడు ఎదురయింది. ఓపెన్ చేయడానికి పాస్ వర్డ్ అడిగింది. ఆ నెంబరు తీసుకుని ఇరవై ఏళ్ళు దాటింది. అప్పుడు ఈ పాస్ వర్డుల గోల వున్నట్టు లేదు.
ఏమి చేయాలో అతడే చెప్పాడు. ఏదైనా మొబైల్ స్టోర్ కు వెళ్ళమని.
మురళీ కృష్ణకు థాంక్స్ చెప్పి దగ్గరలో వున్న ఒక మొబైల్ షాపుకు వెళ్లాను. అతడు ‘అమీర్ పేట వెళ్ళండి, అక్కడ ఐ ఫోన్లు కూడా డేటా చెడకుండా ఓపెన్ చేసే ఘనులు వున్నార’ని చెప్పాడు.
మరో షాపులో అడిగితే గంట సమయం పడుతుంది, కానీ డేటా పోతుంది అన్నాడు. మా ఆవిడ ఫోన్ లో తన ఫ్రెండ్స్, బంధువులు కలిసి ఓ నలభై, యాభై మంది నెంబర్లు తప్ప వుండవు. ఫోన్ చేయడం , మాట్లాడడం తప్పిస్తే ఫోటోలు గట్రా వుండవు. అంచేత డేటా పోయినా సరే పరవాలేదన్నాను.
గంట తర్వాత ఫోన్ చేసి రమ్మన్నాడు. వెళ్లాను. వెళ్లి, చనిపోయిన మా ఆవిడ ఫోన్ ను బతికించి తెచ్చుకున్నాను.
ఇంత లాయలాస అవసరమా! అనొచ్చు. ముందే చెప్పాను కదా! సెంటిమెంటుకు రీజన్లు వుండవు. సెంటిమెంట్లు రీజన్లకు లొంగవు.
కింది ఫోటో:
కాల్ చేసినప్పుడు మా ఆవిడ ఫోన్ పై ఫ్లాష్ అయిన ఫోటో. (ఫోటోలు తీయడంలో నా ప్రజ్ఞకు నిదర్శనం)




(ఇంకా వుంది)

13, ఆగస్టు 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (209) : భండారు శ్రీనివాసరావు

నడక ఎంత నరకం
ఈరోజు ఉదయం తొమ్మిదిన్నరకు ఫోన్ చేసింది మా వలలి వనిత. ఈ పూట రావడం లేదు అనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఎన్నో ఏళ్ళుగా అలవాటయిన నాగాలే కనుక ఈ పూటకి బయటి బ్రేక్ ఫాస్టే దిక్కు.
స్విగ్గీ ఆర్డర్ అయినా ఒక్కళ్ళకు మూడు వందలకు తక్కువ కాదు అనేది అనుభవం చెప్పే మాట. దీని బదులు ఏ రాపిడో ఆటోలో ఏదైనా హోటల్ కు వెళ్లి తినివస్తే కూడా అంతే అవుతుంది. ఈ ఆలోచన చేసి, రాపిడో ఆటో పిలిపించుకుని కృష్ణా నగర్ లోని పూర్ణా టిఫిన్ సెంటర్ కు వెళ్లాను. దిగి జీపే ద్వారా వంద రూపాయలు ఆటో డబ్బులు చెల్లించాను. ఇవ్వాళ ఫేర్లు ఎందుకు ఎక్కువ వున్నాయని అడక్క ముందే, రాపిడో కెప్టెన్ హోదా సంపాదించుకున్న ఆటోడ్రైవర్ వెంకటేషే చెప్పాడు, ఈరోజు రేపూ భయంకరమైన వర్షాలు కురుస్తాయంటున్నారు, అంచేత వాన మొదలు కాకముందే ఎంతో కొంత సంపాదించి ఇంటికి చేరాలని, తక్కువ రేట్లు ఎక్కువకు సవరించడం జరిగిందని సంజాయిషీ చెప్పాడు. నిజంగా ఇలాంటి మెకానిజం డెవలప్ అయి వుంటే, జనాలకు జీతాలు కూడా, ఏ రోజుకారోజు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనిపించింది.
హోటల్లో అడుగు పెట్టగానే ఒకతను ఎదురు వచ్చి ఒక్కరే వచ్చారేమిటి అన్నాడు. మా అబ్బాయి సంతోష్ వున్నప్పుడు కారులో నన్నూ కోడల్ని, మనుమరాలి కేర్ టేకర్ని, వలలి రానప్పుడు ఈ హోటల్ కే తీసుకువచ్చేవాడు. కారు బయట ఆపుకుంటే టిఫిన్లు అక్కడికే తెచ్చి ఇచ్చేవాళ్ళు. అతడి పలకరింపుతో పాత గాయం మళ్ళీ సెల వేసినట్టు అయింది.
సరే ఒక ప్లేటు ఇడ్లీ చెప్పాను. 85 అని ఒక చీటీ మీద రాశాడు. ఎదురుగా వున్న స్కానర్ పై స్కాన్ చేశాను. పేమెంట్ ఫెయిల్ అని వచ్చింది. తప్పు పిన్ నొక్కానేమో అనుకుని మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ అదే ఎర్రర్. ఇప్పుడే కదా ఆటో వాడికి పే చేశాను. ఇంతలో ఏమైంది? పైగా ఫోన్ చేతిలో వుందని పర్సు తీసుకురాలేదు.
ఇంతలో హోటల్ కౌంటర్ లో వున్నతను ‘పర్వాలేదు, రేపు వచ్చినప్పుడు ఇవ్వండి’ అన్నాడు. అతడు ఎవరో నాకు తెలియదు. నేను సంతోష్ తండ్రిని అని అర్ధం అయినట్టుంది. ‘రేపు ఇవ్వవచ్చు అనుకోండి, కానీ రేపు కూడా వర్షాలు అంటున్నారు. రాలేకపోతే ఎలా!’ అన్నాను. ‘వచ్చినప్పుడే ఇవ్వండి. నెల రోజుల తర్వాత ఇవ్వండి, పెద్దవారు, వచ్చారు, టిఫిన్ చేసి వెళ్ళండి’ అన్నాడు.
ఏదో పైకి చెప్పలేని గిల్టీ ఫీలింగ్. తిఫిన్ తిన్నానంటే తిన్నాను. కానీ మనసు వేరే ఆలోచిస్తోంది.
సరే! హోటల్ బిల్లు సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు ఇంటికి పోవడం ఎలా! ఆటో బుక్ చేసుకుంటే దిగిన తర్వాత ఫేర్ చెల్లించడం ఎలా! లిఫ్ట్ లో వెళ్లి తాళం తీసి, డబ్బులు తీసుకువచ్చి ఇస్తాను అంటే ఏం బాగుంటుంది?
ఈ శుష్కఆలోచనలతో నడవడం మొదలు పెట్టాను. బయట బట్టతడుపు జల్లు మొదలైంది. తిరుపతి వెళ్లి వచ్చిన తలే కనుక జుట్టు తడుస్తుందనే బాధ లేదు. కానీ వర్షంలో ఆ రోడ్ల మీద నడవడం అనే బాధ వుంది చూసారు, అదీ భరించలేనిది. ఒక పక్క వర్షపు నీళ్ళు. మరో పక్క ఏమాత్రం వేగం తగ్గించకుండా ఆ నీళ్ళను సర్రున కోసుకుంటూ వెళ్ళే వాహనాలు. వర్షం మరింత పెద్దది అవుతుందేమో అనే భయంతో వన్ వే అని కూడా లెక్కచేయకుండా ఎదురుగా దూసుకువస్తున్న ద్విచక్ర వాహన చోదకులు. ఒక్క అడుగు అటూ ఇటూ చూడకుండా వేస్తే ఇక ఇంతే సంగతులు.
ఎవరి తొందరవారిదే, కాదనను, కానీ పాదచారుల సంగతి ఏమిటి? సరైన ఫుట్ పాతులు లేవు. ఈ లోగా అనేకమంది మిత్రుల ఫోన్లు. తలదాచుకునే చోటు లేదు. చిన్న వానే అయినా ఒక చోట నిలబడి మాట్లాడే వీలు లేదు, వీటికి తోడు ఎడతెగకుండా మోగుతున్న వాహనాల హారన్లు. అందుకే అందరికీ పొడి పొడి సమాధానాలే. పక్క నుంచి వాహనం వెళ్లినప్పుడు మరో పక్కకు దూకడం, అటునుంచి వాహనం ఎదురైనప్పుడు ఇటు గెంతడం.
కొంతదూరం ఇలా రోడ్ల మీద కధాకళీ, భరత నాట్యం చేస్తూ నడిచిన తర్వాత జ్ఞానోదయం అయింది. ఎక్కడైనా ఆటో దొరికితే అడిగినంత ఇచ్చి (అదే ఇంటికి చేరిన తర్వాత నా కధ చెప్పి) వెడదామని చూశాను.
ఎల్లారెడ్డి గూడా అనాలో, యూసుఫ్ గూడా బస్తీ అనాలో అక్కడ మునిసిపాలిటీ వాళ్ళ చెత్త డంప్ యార్డు వుంది. లోపలి సుందర దృశ్యం బయటకి కనబడకుండా చుట్టూ ఇనుప రేకుల దడి కట్టారు. దాని పక్కన ఆగివున్న ఆటో కనిపించింది. చూస్తే అందులో డ్రైవర్ లేడు. ఓ నాలుగు అడుగుల అవతల అల్పాచమానం చేస్తూ కనపడ్డాడు. అది చూసిన తర్వాత ఇక ఆగకుండా వడివడిగా అడుగులు వేయడం మొదలెట్టాను. వర్షం కూడా పెద్దది అయింది. తడిసిపోతానేమో అనే భయం పోయింది. అప్పటికే తడిసిపోయాను. ముద్దకాక ముందే ఇంటికి చేరితే చాలు. ఎందుకైనా మంచిదని ఒకసారి జేబు తడిమి చూసుకున్నాను. ఇంటి తాళం చెవి తగిలింది. పొద్దున్న హడావిడిలో మరచిపోయానేమో అన్న సందేహం తీరింది.
ఇంటికి సరిగ్గా పది అడుగుల దూరంలో వున్నప్పుడు హఠాత్తుగా, చిత్రంగా వర్షం ఆగిపోయింది.
ఇప్పుడు సాయంత్రం అయిదు అవుతోంది. వాతావరణ శాఖ నిన్నటి నుంచి పదేపదే చేస్తున్న భారీ, అతి భారీ వర్షం జాడ మా దగ్గర లేదు. ఇవ్వాలా రేపూ అన్నారు కదా! ఇంకా రాత్రి సమయం అంతే వుంది. రేపు కూడా వ్యవధి వుంది. చూద్దాం!
ఈ ఉదయపు వర్షపు నడకలో చాలా దృశ్యాలు కనిపించాయి. ఫోటో తీయడానికి వెగటు అనిపించి మానుకున్నాను.
(13-08-2025)
(ఇంకావుంది)

12, ఆగస్టు 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (208) : భండారు శ్రీనివాసరావు

 

మిస్టర్ పెళ్ళాం
ఆవిడ పేరు దుర్గ. బాండ్ జేమ్స్ బాండ్ మాదిరిగా దుర్గ, కనకదుర్గ.
ఆవిడ పేరు సీత.
ఓ యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేటలో పాటిబండ అప్పారావు వారింట్లో అద్దెకు వుండేవాళ్ళు. మాంటిసొరీ స్కూల్లో ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వుండేవాళ్ళు. ఆ ఇద్దరి స్నేహం అంతా ఇంతా కాదు, చదువయినా, ఆటలయినా ఇద్దరూ కలిసే.
చదువు అయిపోయింది అని అనుకునే లోగా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవడం షరా మామూలు. అల్లాగే పెరిగి పెద్దయిన తరువాత జరిగిన పెళ్ళిళ్ళు, చిన్నప్పటి స్నేహితులను విడదీశాయి. అప్పటి నుంచీ ఎక్కడా కలిసింది లేదు, ఎదురుపడ్డదీ లేదు. అలా యాభయ్ ఏళ్ళు గడిచిపోయాయి.
ఫేస్ బుక్ లో నా రాతలు, పెట్టే మా ఆవిడ ఫోటోలు చూసి సీతగారికి మనసు మూలల్లో అనుమానం, తన చిన్ననాటి స్నేహితురాలు దుర్గ కాదు కదా! అని. అనుకోవడం తడవు వారి భర్త గౌరవరం సుబ్బారావు గారి సహకారంతో ఫేస్ బుక్ లో నా నెంబరు పట్టుకుని ఓ సాయంత్రం ఫోను చేసారు. అంతే!
చిన్నప్పటి స్నేహితురాండ్రు ఫోనుకు అతుక్కుపోయారు.
చిన్నతనంలో బెజవాడ పాత బస్ స్టాండ్ దగ్గర పాటిబండ వారి మేడపై తొక్కుడు బిళ్ళల ఆటలు, అప్పారావు గారి భార్య తన పిల్లల్ని, అద్దెకు ఉండేవారి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించిన వైనాలు అన్నీ వారి ముచ్చట్ల నడుమ గిర్రున తిరిగాయి.
సుబ్బారావు గారితో నేనూ మాట్లాడాను. ఆయన ఎన్ ఎఫ్ సీ ఎల్ లో పని చేసి రిటైర్ అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరూ సత్యసాయి భక్తులు. తరచుగా పుట్టపర్తి వెళ్లి సాయి ఆశ్రమంలో సేవలు చేస్తుంటారు.
ఏది ఏమైనా అరవై ఏళ్ళు దాటిన తరువాత మా ఆవిడకు ఒసేయ్, ఏమే అనే ఫ్రెండు దొరికింది. అని సంతోషించాను.
ఇక మా ఇంట్లో
‘ఏమోయ్! ఒసే! ఇలా పిలుపులు లేవు. నేను ఆమెకు ‘ఏమండీ’. ఆమె నాకు ‘మిస్టర్’. పెళ్ళయిన మొదటి రోజునుంచీ ఇంతే!
పుట్టినప్పుడు బియ్యంలో రాసిన పేరు కనక దుర్గ. పొట్టిగా దుర్గ. ముద్దుగా చిట్టి.
ఇలా ఇన్ని పేర్లున్నా కాపురానికి వచ్చిన తర్వాత మా బామ్మగారు రుక్మిణమ్మ ఆమె పేరును నిర్మలగా మార్చేసింది.
నా బాసూ నా బానిసా నా భార్యే. నా తప్పులు సరిదిద్దడానికి బాసు. నా తప్పులు భరించడానికి బానిస. రెండు పాత్రల్లోనూ బానిస బతుకే. ఇలా 48 ఏళ్ళు నాతో కాపురం వెళ్లదీసింది.
ఫస్టు తారీఖు
1987 లో మాస్కో వెళ్ళేవరకు మా ఇంటిల్లిపాదికీ చిరపరిచితమైన పదం, ఈ ఫస్టు తారీకు. అందరం చకోర పక్షుల్లా ఎదురుచూసే రోజును ఎలా మరచిపోగలం!
చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కొలువు కాబట్టి నెల జీతం ఏనెలకానెల నెలాఖరురోజున ఇచ్చేవాళ్ళు. సూర్యుడు ఎటు పొడిచినా సరే మేము నలుగురం అంటే నేనూ మా ఆవిడా ఇద్దరు పిల్లలం, ఆరోజు సాయంత్రం మొదటి ఆట ఏదో ఒక సినిమా చూడాల్సిందే. హిమాయత్ నగర్ మినర్వా ( బ్లూ ఫాక్స్) లో భోజనం చేయాల్సిందే. ఆ రోజు తప్పిందంటే మళ్ళీ నెల రోజులు, రోజులు లెక్కపెట్టుకుంటూ ఆగాల్సిందే. ఎందుకంటే మళ్ళీ మర్నాటి నుంచే మాఇంట్లో నెలాఖరు మొదలు కాబట్టి.
మాస్కో వెళ్ళిన కొత్తల్లో ఏమో కానీ ఆ తరవాత్తరవాత అక్కడ ఫస్ట్ తారీకు అనే మాటే మరచిపోయాము. గమ్మత్తేమిటంటే అక్కడ నెలకు ముప్పయి రోజులు మాకు ప్రతి రోజూ ఫస్ట్ తారీకు మాదిరిగానే గడిచిపోయేవి.
తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ కధ మామూలే.
కాకపొతే కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డులు మళ్ళీ మొదటి తారీకును మరచిపోయేలా చేసాయి కానీ, ఆ తరవాత టిక్కెట్టు కొనకుండానే నరకాన్ని కూడా చూపించాయి. ఈ కార్డులు అనేవి లేకపోతే నాకసలు బీపీ అనే జబ్బు వచ్చేది కాదని మా ఆవిడ దృఢ విశ్వాసం.
ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా పాత రోజుల్ని రివైండ్ చేసే పనిలో పడ్డాము. పింఛను డబ్బులు బ్యాంకులో పడగానే, నెట్లో సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుని, ఉబెర్ లో బయలుదేరివెళ్లి మల్టీప్లెక్స్ లో సినిమా చూసేసి, ఎంచక్కా హోటల్లో భోజనం చేసేసి, ఉబెర్లో పడి ఇంటికి చేరేవాళ్ళం.
కాకపొతే అప్పుడు నలుగురం, ఇప్పుడు ఇద్దరం.
మరీ ఇప్పుడయితే అందులో సగం. అంటే ఒక్కడినే. కాకపోతే ఈ సినిమా తిరుగుళ్ళు లేవు.
‘మా ఆవిడ భయపడేది, అయితే నాకు కాదు. నేనూ భయపడతాను, అయితే ఆవిడకి కాదు.
‘ఇప్పటికే రెండు గుండె ఆపరేషన్లు. ఏటా ఒకసారి పుట్టింటికి వెళ్ళినట్టు ఆసుపత్రిలో మూడు నిద్రలు చేసివచ్చేది. ఇంటికి రాగానే జబ్బుల సంగతి మర్చిపోయి తన పనుల్లో మునిగిపోయేది.
‘నేనలా కాదు. ప్రపంచం నా ముందు బలాదూర్ అనుకుంటూ బలాదూరుగా తిరిగేవాడిని. కానీ చిన్న అస్వస్థత వస్తే చాలు, జావకారిపోతాను.
‘అలాంటిది నన్ను ఇన్నేళ్ళుగా కనిపెట్టుకుని వున్న ఆ 'గుండే' జారిపోతే..... అదే జరిగింది.
నా గుండె గట్టిది కాబట్టి ఆమె దాటిపోయి, అదీ ఆగస్టు నెలలోనే, ఆరేళ్ల తర్వాత కూడా కొట్టుకుంటూనే వుంది.
ఆగస్టు అంటే అదోరకమైన విరక్తి.
కింది ఫోటో:
2017 లో యాభై ఏళ్ళ తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితురాళ్ళ మాటా ముచ్చట





(ఇంకావుంది)