వార్త: ఐ.ఏ.ఎస్. అధికారులకు జైలు శిక్ష
31, మార్చి 2022, గురువారం
ఐ.ఏ.ఎస్. అధికారులకు జైలు శిక్ష
30, మార్చి 2022, బుధవారం
ఇడ్లీల గొప్పతనం ఇంతింత కాదయా!
ఈరోజు ఇడ్లీల దినోత్సవం అంటున్నారు. కాబట్టి ఒక కధ
చెప్పుకుందాం.
భారత దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు.
ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు
హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు.
తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది. ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి
రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో
కడుపు నింపుకున్నారు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల
టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని రెండు ఇడ్లీలు తీసి తినడం ఆ
ఆంగ్లేయుడు గమనించాడు. తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత
ఆయనలో మొదలయింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.
మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే
వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు. అయ్యరు గారు రైల్వే
భోజనాన్ని మృదువుగా తిరస్కరించి తన క్యారియర్ తెరిచి రెండో గిన్నెలో వున్న మరో
రెండు ఇడ్లీలు కమ్మగా తినడం ఆ బ్రిటిష్ వ్యక్తి గమనిస్తూనే వున్నాడు. యెంత
ఆలోచించినా తోటి ప్రయాణీకుడు తింటున్నవేమిటి అనేది ఆయనకు అర్ధం కాలేదు. దాంతో ఆయన
ఉత్కంఠ మరింత పెరిగింది.
రైలు బెర్హంపూరులో ఆగింది. మళ్ళీ అదే సీను.
బ్రిటిషర్ ఇక తట్టుకోలేక నేరుగా అడిగేశాడు.
“అయ్యా! ఇలా అడగడం
మర్యాద కాదని తెలిసీ అడుగుతున్నాను. మీరు తింటున్న ఆ తెల్లటి పదార్ధాలను నేను
ఎప్పుడూ చూడలేదు. అవేమిటో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా వుంది”
అయ్యరు ఇలా జవాబిచ్చారు.
“ఇవి ఐ.క్యు.
టాబిలెట్స్. అర్ధం మీకు తెలుసుగా. మేధస్సు పెంచడానికి వీలైన పోషకాలు వీటిలో
వున్నాయి. వీటిని తిని, భోజనం
గట్రా ఏమీ లేకుండా మేము రోజులతరబడి వుండగలం”
“వీటిని ఎలా తయారు
చేస్తారు” బ్రిటిషర్ ఆరా.
అయ్యరు గారు ఇడ్లీలు తయారు చేయడానికి కావాల్సిన
సంభారాలు గురించీ, తయారు
చేసే విధానం గురించీ వివరంగా చెప్పారు.
“మంచి సంగతులు మీనుంచి
తెలుసుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతె నాకూ ఓ రెండు టాబ్ లెట్లు ఇవ్వగలరా! వూరికే
కాదు, మీరు
చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించుకుంటాను” అని ఆంగ్లేయుడు అభ్యర్ధించాడు.
అయ్యరు ఒక క్షణం ఆలోచించి చెప్పాడు.
“నా దగ్గర ఇంకా మూడే
మిగిలాయి. కలకత్తాలో నేను మా చుట్టాల ఇంటికి వెడుతున్నాను, కనుక నాకు ఇబ్బంది
లేదు. మీరే చెప్పారు కాబట్టి ఇడ్లీకి ఓ ఇరవై రూపాయల చొప్పున ఇవ్వండి చాలు”
బ్రిటిషర్ యెగిరి గంతేసినంత పనిచేసి అరవై రూపాయలు
అయ్యరుకు ఇచ్చి మూడు ఇడ్లీలు తీసుకుని తిన్నాడు.
మర్నాడు ఉదయానికల్లా హౌరా స్టేషన్ వచ్చింది.
రైలు దిగి ఎవరి దారిన వారు విడిపోయే సమయంలో బ్రిటిషర్
అడిగాడు. “ఈ టాబ్ లెట్లు తయారు చేసే విధానం చెప్పారు. అంతా చెప్పారా! ఏమైనా
మరచిపోయారా!”
“చెప్పేందుకు ఏమీ లేదు, అంతా వివరంగా
చెప్పాను”
“మరి ఈ టాబ్ లెట్ల
ఖరీదు అంత వుండకూడదే”
“చెప్పాను కదా ఇవి
మేధస్సును వికసింప చేసే ఐ.క్యు. ట్యాబ్ లెట్లని. మీరు మూడే తిన్నారు. రాత్రికి
ఇప్పటికీ మీలో యెంత తేడా వచ్చిందో చూడండి. అంటే అవి పనిచేయడం మొదలయిందన్న మాట” అని
అంటూ అయ్యరు తన హోల్డాలు, టిఫిన్
క్యారియర్ చేతబుచ్చుకుని చక్కాపోయాడు.
(ఒక ఇంగ్లీష్ కధనానికి
స్వేచ్చానువాదం)
29, మార్చి 2022, మంగళవారం
చంద్రబాబు నాయుడు – నేను.
28, మార్చి 2022, సోమవారం
లోనారసి
27, మార్చి 2022, ఆదివారం
ప్రజల మనిషి బండారు దత్తాత్రేయ – భండారు శ్రీనివాసరావు
“మనిద్దరం చుట్టాలం అనుకుంటున్నారు చాలామంది” అన్నారు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ.
“కాకపోతే
ఏమైంది, మీరు నాకు
అంతకంటే ఎక్కువే” అన్నాను నేను.
పదేళ్లు
అయిందో, పదిహేను ఏళ్ళు
అయిందో గుర్తు లేదు, దత్తాత్రేయ గారిని
నేను కలిసి.
ఈరోజు
ఆదివారం సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం వేదిక దిగివస్తున్నప్పుడు
మా నడుమ నడిచిన ముచ్చట ఇది.
నలభయ్
ఏళ్ళ పై చిలుకు సాగిన పాత్రికేయ జీవితంలో ప్రజల మనిషి అనదగ్గ రాజకీయ నాయకులు ఇద్దరు
కనబడ్డారు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి శ్రీ.
టి. అంజయ్య,
రెండోవారు శ్రీ దత్తాత్రేయ. ప్రజల నడుమ ఉంటేనే ఆక్సిజన్ అందుతుంది అనేట్టు జనంతో
మమేకమైన రాజకీయ జీవితాలు వీరిద్దరివి. మనుషులను మనుషులుగా గుర్తిస్తారు కనుకనే
సామాన్య జనంలో వీరిరువురికీ అమితమైన ఆదరణ. ఈ కారణం చేతనే ఇన్నేళ్ళు గడిచిన తర్వాత
కూడా నన్ను గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించారు. వయసులో నాకంటే ఆయన ఏడాది చిన్న.
‘గట్టిగానే వున్నావు సుమా ‘ అన్నారు నా చేయి తన చేతిలోకి తీసుకుని చిన్నగా
నొక్కుతూ.
ఆరోగ్యంగా
వున్నాను అని దత్తాత్రేయ గారెకి అనిపించింది అంటే అది మాత్రం దేవుడి దయే
అనుకున్నాను మనసులో.
నాదేముంది, దత్తాత్రేయ గారి లాంటి ప్రజాసేవకులు
నాలుగు కాలాల పాటు చల్లగా వుంటే సమాజానికి
మంచి జరుగుతుందని కూడా అనుకున్నాను.
27-03-2022
మిత్రుల మనసుల్లో బతికున్న విద్యారణ్య – భండారు శ్రీనివాసరావు
మిత్రుడు, పాత్రికేయుడు ఇటీవలే ఆకస్మికంగా మరణించిన విద్యారణ్య సంస్మరణ సభ ఈరోజు ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఎంతో బలమైన ఆత్మీయ బంధం లేనిదే అంతమంది అటువంటి సభలకు రారు. చిన్న వయసులోనే చనిపోయాడు అనే బాధ మినహాయిస్తే తన జీవితకాలంలో సంపాదించుకున్న మంచి పేరే అంతమందిని అక్కడకు చేర్చింది. ఒక్క పాత్రికేయ రంగం నుంచే కాదు అనేక రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు హాజరై విద్యారణ్య దివ్య స్మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ విషయంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం తీసుకున్న చొరవ హర్షణీయం.
అక్కడ
ప్రసంగించిన వారి పలుకులు వింటుంటే నాకు తెలిసిన విద్యారణ్యలో నాకు తెలియని ఇన్ని
కోణాలు దాగున్నాయా అనిపించింది. హర్యానా గవర్నర్
శ్రీ బండారు దత్తాత్రేయ తదితరులు విద్యారణ్య గురించి సొంత అనుభవాలు
చెబుతుంటే విద్యారణ్య ఎవరన్నది నాకు బోధపడింది.
విద్యారణ్యతో
మూడు దశాబ్దాలకు పైగా పరిచయం. ముందు అంధ్రపత్రిక విలేకరిగా ఉన్నప్పటి నుంచి. మా
మధ్య వృత్తిలో పోటీ లేదు కానీ, చేసే పనిలో
కొంత సారూప్యత వుంది. నేను సాయంత్రం
ఆరుంబావు వార్తల సమయానికి అప్పటికి పోగుచేసిన
వార్తలు అందివ్వాలి. విద్యారణ్య పరిస్థితి ఉడ్డుగుడుచుకున్నట్టు వుండేది. డాక్ (సాయంత్రం) ఎడిషన్ కల్లా ఏదైనా బ్యానర్
వార్త పట్టుకోవాలి. ఆ తాపత్రయంలో అతడు ఉండేవాడు.
రేడియోలో
ఏదైనా వార్త మిస్ కాకుండా వుండాలంటే విద్యారణ్య లాంటి మితృలు వుండాలి. ఎప్పుడు ఏ
వార్త వివరాలు అడిగినా విసుక్కోకుండా వివరంగా చెప్పేవాడు. రీజినల్ న్యూస్ యూనిట్ లో విద్యారణ్య వేలు
దూర్చని విభాగం లేదు. రేడియో సిబ్బంది బయట
గేటు దగ్గర సెంట్రీ నుంచి అందరూ విద్యారణ్యని చప్పున పోల్చుకునేవారు. అక్కడ
పనిచేసే నాకు అలాంటి భాగ్యం లేదు. చాలాసార్లు మా గేటు దగ్గర కాపలా మనిషి నన్ను ఆపి, లోపల ఎవరితో మీకు పని, వివరాలు రాయండని గౌరవించిన అనుభవాలు కోకొల్లలు. ఎందుకంటే నేను ఆఫీసుకు వెళ్ళే
సందర్భాలు చాలా తక్కువ. బయట తిరగడాలు బాగా ఎక్కువ.
ఎన్ని
మాట్లాడినా ఎన్ని చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం. విద్యారణ్య మా మధ్య లేడు. ఇక
ఉండడు.
మరో నిజం ఏమిటంటే విద్యారణ్య ఇక నుంచి మా మనసుల్లోనే ఉంటాడు.
(27-03-2022)
ఆదివారం ఆంధ్రప్రభ – భండారు శ్రీనివాసరావు
తెలుగు నాటకం – భండారు శ్రీనివాసరావు
( మార్చి, 27, ప్రపంచ రంగస్థల దినోత్సవం)
అలనాటి అసెంబ్లీ ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha today, Sunday, 27-03-2022)
26, మార్చి 2022, శనివారం
ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం! - భండారు శ్రీనివాసరావు
దృశ్యం ఒక్కటే.
25, మార్చి 2022, శుక్రవారం
నేను – తెలుగుదేశం
1982 లో
నాటి ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు
తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో నాకు మొదట పరిచయం అయిన వ్యక్తి
కంభంపాటి రామ్మోహన్. ఆయన ఇంటిపేరు మా ఊరి పేరు (కంభంపాడు) ఒకటి కావడం కాకతాళీయం
అయినా మా నడుమ ఏర్పడ్డ పరిచయం చక్కని స్నేహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
దీనికి మరో కాకతాళీయ కారణం నేను రేడియో విలేకరిగా పనిచేస్తూ వుండడం, ఆయన టీడీపీలో పత్రికా వ్యవహారాలు
చూస్తూ వుండడం.
తదనంతర
కాలంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్
ముఖ్యమంత్రి కావడం,
తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ వదిలేసి
టీడీపీలో చేరడం,
పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత రామ్మోహన్, చంద్రబాబు నేతృత్వంలో పార్టీ పత్రికా
వ్యవహారాలు చూడడం, ఈ క్రమంలో రామ్మోహన్ తో
నా పరిచయం కొత్త చిగుళ్లు తొడిగింది. దాదాపు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడడం, నిత్యం
హిమాయత్ నగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కలవడం నాకే కాదు, నాటి తోటి పత్రికా
విలేకరులు అందరికీ అనుభవైకవేద్యం.
పార్టీకోసం
పడిన శ్రమ ఊరికే పోలేదు. నేను మాస్కో వెళ్ళే ముందో లేక కొద్ది రోజుల తర్వాతో
గుర్తు లేదు, ఆయన పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
అయ్యారు. తరువాత రాజ్యసభ సభ్యత్వం. ఆ తర్వాత ఢిల్లీలో క్యాబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ అధికార
ప్రతినిధి ఇలా యుక్తవయసులోనే మంచి పదవులు. బహుశా పదవి వున్నా లేకపోయినా పార్టీని అప్పటినుంచి
ఇప్పటివరకు అంటిపెట్టుకుని ఉన్న అతి కొద్దిమంది నాయకుల్లో రామ్మోహన్ ఒకరు అంటే
అతిశయోక్తి కాదు.
ఇలాంటి
వ్యక్తికి పార్టీతో ఎన్నో అనుభవాలు వుంటాయి. గ్రంధస్థం చేస్తే బాగుంటుంది అని నేను ఎన్నోసార్లు
ఇచ్చిన సూచనకు అన్నిసార్లు చిరునవ్వే సమాధానం.
ఇన్నాళ్ళకు
ఆయన మనసులో ఈ ఆలోచన పుట్టినట్టుంది. నేను – తెలుగు దేశం అనే పేరుతొ ఒక పుస్తకం
రాసారు.
ఈనెల
28 వ తేదీన పుస్తకం
ఆవిష్కరణ. అదీ హైదరాబాదులో. ముఖ్య అతిధులు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా
చంద్రబాబు నాయుడు.
All the best Rammohan
(25-03-2022)
‘ఈగ’ ఖరీదు
ఇంతవరకు పరాజయం
అంటూ ఎరుగని రాజమౌళి దర్సకత్వంలో ఈరోజు విడుదల అయిన ట్రిపుల్ ఆర్ సినిమా
గురించి సాంఘిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న పోస్టులు
గమనించిన తర్వాత ఎప్పుడో 2012 లో జులై 15 వతేదీన చూసిన ఈగ సినిమా గురించిన ఓ జ్ఞాపకం ఇది)
‘ఈగ’ ఖరీదు
అక్షరాలా నాలుగువేల ఎనిమిది వందల ఎనభై
రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి.
హైదరాబాదులో
థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా
వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే
ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన
శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం
మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల
కుటుంబసభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన, సాధారణంగా నేను
కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ ‘కొత్త సినిమా ప్రేక్షక వర్గంలో’ చేరుతూనే
వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది
సక్రుత్తు గా జరిగే విషయం.
నిన్న శనివారం
కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ‘ఈగ’ సినిమా చూసాము. చూసినవాళ్లలో
మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది.
‘ఈగ’ వీక్షణానంతరం ‘సాయి’ వాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా సెల్లు
సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్ మెసేజి. ‘ఫలానా
షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు
ఇంత’ అంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను, ఆ కార్డుకు ‘యాడాన్’ కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన
మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో
కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే
మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ ‘యేమయిందంటూ’ తన తరహాలో
గుడ్లురిమి చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అలా నలుగురిలో
పడ్డ పాము ఎవరిచేతిలో చావకుండా ‘ఇప్పుడేంచేయాల’న్న ప్రశ్నను మాముందుంచి తాను
చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం
యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది.
బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ‘ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు
కొట్టేసిన దొంగ గారు, ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేద’న్న ‘ఈగ’ సినిమా
డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత
దర్జాగా వెళ్లిపోయాడన్నది’ ఆ ఎలర్టు సారాంశం.
ఈ తరహా చర్చల్లో
పడితే, ‘ఈగ’ సినిమా బడ్జెట్ పదికోట్లనుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ
గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం
పసికడుతున్న తరుణంలో ‘రాచ పీనుగ తోడు లేకుండా కదలదు’ అన్నట్టు
పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావుకబురు
చల్లగా చెప్పింది. దాంతో అందరం ఎమర్జెన్సీ యమర్జెంటుగా ప్రకటించేసుకున్నాం. తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ, సెల్ ఫోన్లతో
మరికొందరూ, లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండి’ అనే
బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా పాటించే పనిలో
పడ్డాం. ఆ కంగారులో ‘యాడాన్’ కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా
జయప్రదంగా స్తంభింపచేశాం. దరిమిలా, ‘మూడు వర్కింగు డేస్ నుంచి పదిహేను దినాలలోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామ’ని – మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామాలు
వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు.
‘అమ్మయ్య’ అని
అనుకుంటున్న సంతోషం కాస్తా కాసేపటిలోనే ఆవిరావిరయిపోయింది.
అదేమిటంటే మేము
మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ లేదు, జేబులో కార్డూ లేదు’ అనే పాత రోజులకన్న మాట.
ఇంతకీ, ‘ఈగ’
సంగతేమిటంటారా! ‘ప్రధమ కబళే మక్షికాపాతః’ అన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ‘ఈగ’ ను
కమ్మేసింది.
ఇంటిల్లిపాదిదీ
ఒకటే మాట. ‘సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’ సినిమాలు బాగా
చూసేవారు కాబట్టి వాళ్ల మాటే రైట్ అనుకోవాలి.
(15-07-2012)