“కారే రాజులు? రాజ్యముల్ కలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వా
రేరీ? సిరి మూటన్ కట్టుకొని పోవంజాలిరే?...........................”
రేరీ? సిరి మూటన్ కట్టుకొని పోవంజాలిరే?...........................”
ఇది పోతన గారి పద్యం. వామనావతార ఘట్టంలోది. వామనుడు
నిజానికి విష్ణువని, బలిని నాశనం
చెయ్యటానికే వచ్చాడని గ్రహించిన శుక్రుడు వామనుడికి దానం ఇవ్వొద్దని బలిని హెచ్చరించినప్పుడు
ఈ లోకంలో ఏదీ శాశ్వితం కాదన్న భావాన్ని బలి
వ్యక్తం చేసే సందర్భం.
పోతనగారి కవితా భావావేశాన్ని ఇక్కడికి వొదిలి చికాగో
లోని ఎడ్జ్ వాటర్ బీచ్ హోటల్లో జరిగిన ఒక సమావేశం గురించి చెప్పుకుందాం. ఆ రోజు ఆ హోటల్లో ఏడుగురు అతిరధ మహారధులు సమావేశం
అయ్యారు. వారిలో ఎవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ఎందుకంటే ఇదంతా తొంభయ్ ఏళ్ళ కిందటి ముచ్చట. 1923లో జరిగిన ఈ సమావేశానికి హాజరయిన
గొప్పగొప్ప వాళ్ళందరూ కేవలం పాతికేళ్ళ కాలం గడిచేసరికి ఏమయ్యారో చెప్పడానికే పోతనగారి పద్యం జ్ఞాపకం
చేసుకోవాల్సివచ్చింది.
వారిలో ఒకరు అతిపెద్ద
ఉక్కు కర్మాగారం – బెత్లేహం స్టీల్ కార్పోరేషన్ అధిపతి చార్లెస్ ఎం. స్కెవాబ్. కంపెనీ
అప్పుల్లో కూరుకుపోయి దివాళా తీసి దీన స్తితిలో చనిపోయాడు.
అప్పట్లో అతిపెద్ద పెట్రోలు కంపెనీ అధినేత హోవార్డ్
హబ్ సన్. పాపం మతిచెడిన స్తితిలో ఈ అపర కుబేరుడు కన్ను మూసాడు.
గోధుమ వ్యాపారంలో కోట్లు గడించిన సంపన్నుడు ఆర్ధర్ క్యుతెన్
సర్వస్వం కోల్పోయి అతి పేదరికంలో అంతిమ శ్వాస విడిచాడు.
ఆరోజుల్లో న్యూ యార్క్ స్టాక్ ఎక్చేంజ్ చైర్మన్
రిచర్డ్ విట్నీ జైలు పాలయ్యాడు.
ప్రెసిడెంట్ హార్డింగ్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రి
ఆల్బర్ట్ ఫాల్ కొంతకాలం జైలు వూచలు లెక్కబెట్టాడు.
క్షమాబిక్ష పొంది ఇంటికి వెళ్ళిన కొద్దికాలానికే మరణించాడు.
వాల్ స్ట్రీట్
షేర్ల వ్యాపారంలో చేయితిరిగిన జెస్సీ లివర్ మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అలనాడు వ్యాపార సామ్రాజ్యాన్ని కంటి చూపుతో శాసించిన ఇవార్
క్రుగర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్ నేషనల్ సెటిల్ మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ లియోన్ ఫ్రేజర్ సైతం ఆత్మహత్య చేసుకుని
మరణించాడు.
అతి పెద్ద యుటిలిటీ కంపెనీ అధినేత అయిన సామ్యూల్
ఇన్సల్ చేతిలో చిల్లి గవ్వ లేకుండా అసువులుబాసాడు.
వీరంతా డబ్బు యెలా సంపాదించాలి అన్న యావలోనే
జీవితాల్ని గడిపారు కానీ యెలా జీవించాలి అన్న విషయాన్ని ఏనాడు పట్టించుకోలేదు.
డబ్బు చెడ్డది కాదు. మనిషికి అత్యవసరమైన కూడూ గుడ్డా ఏర్పాటు చేసుకోవడానికి ధనం అవసరమే.
కానీ అదే సర్వస్వం కాదు. అది శాశ్వితం కూడా కాదు. అలనాడు బలి చక్రవర్తి చెప్పింది
అదే.
(నెట్లో సంచారం చేస్తున్న ఒక ఆంగ్ల వ్యాసానికి
సంక్షిప్తంగా స్వేచ్చగా చేసిన అనువాదం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి