5, ఆగస్టు 2013, సోమవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)

(నిన్నటి తరువాయి)
(ఈ భాగం నుంచి ఓ సాహసానికి పూనుకుంటున్నాను. ఇంతవరకు మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు రాసి భద్రం చేసిన ‘భండారు వంశం’ రచనను ఏరోజుకారోజు పోస్ట్ చేస్తూ  వచ్చాను. నిన్నటితో, ఆయన రాసిపెట్టినది పూర్తయింది.  నేను మా వూళ్ళో వున్నది చాలా తక్కువ. చిన్నప్పుడే చదువుకోసం బెజవాడలో మా అక్కయ్య  దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడప్పుడు సెలవుల్లో మా వూరు  వచ్చేవాడిని. మా అన్నయ్యకున్న ధారణశక్తి నాకులేదు. అయినా ధైర్యం చేసి దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాను.)    

కంభంపాడు గ్రామంతో ముడిపడివున్న మరో పేరు చామర్తి వీరభద్రరావు గారు. ఆయన ఒక రకంగా ఈ మారుమూల కుగ్రామానికి ఆధునిక హంగులు అద్దారని చెప్పవచ్చు. వారి పూర్వీకులది ఖమ్మం జిల్లా సూర్యాపేట దగ్గరలోని వూరు. ఈయన,  తల్లి లలితమ్మ గారి  కడుపులో ఉండగానే, గ్రామకక్షల కారణంగా  ప్రత్యర్ధులు వీరభద్రరావు గారి తండ్రిని హత్య చేయడంతో భయపడిపోయిన  ఆవిడ మా వూరు వచ్చేసింది. వీరభద్రరావు గారు భోలా మనిషి. కళా ప్రియుడు. నాటకాలు వేసేవారు. బెజవాడ వెళ్లి రకరకాల భంగిమల్లో తీయించుకున్న ఫోటోలు అనేకం వాళ్ళింట్లో ఉండేవి. అప్పట్లో అందరివీ మట్టి ఇళ్ళు.  షాబాదు  బండలు పరిచిన మొదటి ఇల్లు ఆయనదే.


(కీర్తిశేషులు చామర్తి వీరభద్రరావు గారు) 

పంచెకట్టు అలవాటయిన వూళ్ళో పంట్లాముల  (ప్యాంట్లు) సంస్కృతి ప్రవేశ పెట్టింది కూడా ఆయనే. ప్యాంటులో చొక్కా దోపుకుని (ఇన్ షర్ట్ వేసుకుని) బూట్లు వేసుకుని తిరుగుతుంటే అంతా సినిమా నటుడ్ని చూసినట్టు కళ్ళార్పకుండా నిలబడిపోయేవారు. చక్కటి ఆకర్షణీయమైన విగ్రహం. అలాగే, వూళ్ళో మొట్టమొదట రేడియో కొన్నదీ ఆయనే. ఇప్పుడు కార్లలో వాడే పెద్ద ఎక్సైడ్ బ్యాటరీతో పనిచేసేది. ఆ రోజుల్లో అదో అద్భుతం. చిన్న పెట్టెలోనుంచి పాటలు, మాటలు వినబడుతుంటే వూళ్ళో వాళ్ళు భయంతో బిక్కచచ్చిపోయేవాళ్ళు. భానుమతి పాటలంటే ఆయన చెవి కోసుకునేవాళ్ళు. బెజవాడ వెళ్లి సినిమా చూసొచ్చి ఆయన చెప్పే కబుర్లే వూళ్ళో వాళ్లకి మంచి కాలక్షేపం. హార్మనీ పెట్టె ముందు పెట్టుకుని రాగాలు తీస్తూ పద్యాలు పాడేవారు. ఆయన ఇల్లంతా ఎప్పుడూ నాటకాలు ఆడేవాళ్ళతో, రిహార్సల్స్ తో చాలా సందడిగా వుండేది. చిన్నాపెద్దా తేడా లేకుండా, కులాల పట్టింపులు లేకుండా   వూళ్ళో అందరితో బాగా కలివిడిగా వుండేవారు. మా వూరికి మొదటి సారి కరెంటు వచ్చినప్పుడు వీధి దీపం కింద నిలబడి ఆయన సంతోషంతో డాన్స్ చేయడం అందరికీ గుర్తు. ఇక లలితమ్ముమ్మ మా బామ్మగారికి మంచి దోస్తు. ప్రతి రోజూ సాయంకాలం కర్ర పొడుచుకుంటూ మా ఇంటికి వచ్చి బామ్మతో ముచ్చట్లు చెబుతుండేది. వయస్సు మీదపడి నడవలేని రోజుల్లో కూడా ఒక చిన్న చెక్కబండిమీద ఆమెను కూర్చోబెట్టి లాక్కుంటూ తీసుకువచ్చేవారు. బామ్మ తన మంచం మీద. లలితమ్ముమ్మ ఆ మంచం  పక్కనే ముక్కాలు పీట మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే దృశ్యం ఇప్పటికీ కళ్ళల్లో కదలాడుతుంది. వాళ్ళు పోయారు కాని వాళ్ళ జ్ఞాపకాలు మిగిలాయి.
ఇంకో విశేషం ఏమిటంటే వీరభద్రరావు గారి పెద్దమ్మాయే మా రెండో వొదినె గారు శ్రీమతి విమలాదేవి, మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి భార్య.    
(మరో భాగం మరో సారి)              

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

bhandaru vamsha charitra bhalegaa undi!

PRASAD చెప్పారు...

సార్, వీరభద్రరావు గారిలో జ్వాలానరసిం హారావు గారి పోలికలు బాగా కనబడుతున్నాయి. వీళ్ళకేమైనా బంధుత్వం వుందా ????

ప్రసాద్ శర్మ