12, ఆగస్టు 2013, సోమవారం

ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?


చలపతికి చాలా ఓపిక. అతడి భార్య అరుణకు ఓపిక మరింత ఎక్కువ. ఇద్దరు పిల్లల్ని ఎంతో ఓపిగ్గా పెంచుకోవడంలోనే వారిద్దరి ఓపిక హారతి కర్పూరంలా హరించుకు పోతోంది.
‘నాన్నా  దేవుడున్నాడా?’
‘వున్నాడురా’
‘మరి కనపడడేమి’
‘ఆయన దేవుడు కదా! అంచేత అలా కనబడకుండా ఉంటాడు’
‘కనపడనిదానికి అసలు వుండడం ఎందుకు?’
‘ఒరేయ్ నీకు పుణ్యం వుంటుంది. నన్ను నీ ప్రశ్నలతో చంపకురా!’
‘అమ్మా! పెరుగు ఎలా వస్తుంది’
‘ఏవిటే అర్ధంలేని ప్రశ్నలు మీ అన్నయ్య లాగా. పాలు కాచి పెరుగు తోడు పెడితే పెరుగు వస్తుంది’
‘మరి తోడు పెట్టడానికి పెరుగు ఎక్కడినుంచి వస్తుంది?’
‘ఏవండీ నన్ను పనిచేసుకోనీకుండా చంటిది ప్రశ్నలతో చంపేస్తోంది. కాస్త దీన్ని దగ్గరకు తీసుకోండి’
చలపతి ఆలోచనలో పడ్డాడు. తన చిన్నతనంలో తనకు ఇన్ని అనుమానాలు వచ్చేవా?
వచ్చేవి. కానీ వాటిని విసుక్కోకుండా తీర్చేందుకు బామ్మా తాతయ్యా వుండేవారు.



తాతయ్య వేలు పట్టుకుని తాను  బడికి వెళ్ళేవాడు. ఇప్పుడో! తన పిల్లల్ని ‘ఆటో అంకుల్’ స్కూలుకు  ‘తోలుకు’ పోతున్నాడు.
బామ్మ పొద్దుగుంకుతుండగానే గోరుముద్దలు తినిపించి, వొళ్ళో పండుకోబెట్టుకుని చిచ్చెకొడుతూ ‘అనగనగా ఒక రాజు కధలు’ చెప్పేది. ఇప్పుడో! పిల్లలు తమ గదిలో  కంప్యూటర్ ముందు కూర్చుని ‘గేములు’ ఆడుకుంటున్నారు.
చిన్నప్పుడు తనకు చిన్నగా  వొళ్ళు వెచ్చబడ్డా బామ్మా తాతయ్యా పెద్దగా గిలగిలలాడిపోయేవాళ్ళు. ఆడుకుంటూ కిందపడి మోకాలు చెక్కుకుపోతే అప్పుడు బామ్మ పడే ఆదుర్దా చూసితీరాలి. ఇప్పుడు అంతటి ప్రేమ పిల్లలపై  తమకూ వున్నా చూపించే తీరికలేని జీవితాలు తమ ఇద్దరివీ. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులే. సాయంత్రం ఇంటికి చేరేసరికి వున్న కాస్త వోపిక వొండుకు తినడానికే సరిపోతుంది.
తాను తన పిల్లలకు అన్నీ అమర్చాడు. మంచి స్కూల్లో చేర్పించాడు. విడిగా వారిద్దరికీ పడక గది ఏర్పాటు చేసాడు. కొంచెం ఖర్చయినా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాడు. వారం విడిచి వారం మల్టీప్లెక్స్ సినిమాలు చూపిస్తాడు. ఖరీదయిన రెస్టారెంటు తీసుకువెడతాడు. ఇక అరుణ మాట చెప్పనక్కరలేదు. ఇంట్లో వున్న కాసేపు ఆమెకు పిల్లల తోడిదే లోకం.
అయినా ఎక్కడో ఏదో లోపం జరుగుతుందోన్న అనుమానం. తాము ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేవరకు వాళ్ళిద్దరూ పక్కింటి ఆంటీ ఇంట్లో వుంటారు. తాము కనబడగానే వాళ్ళ కళ్ళల్లో కనబడే వెలుగు చూసినప్పుడు ‘లోపం’ గురించిన ఆ అనుమానం పెనుభూతంగా మారి భయపెడుతుంది. కానీ, అవసరం అనుమానాలను అణచిపెడుతుంది.
అమ్మానాన్నా ఎక్కడో వుంటారు. నెలకు ఇంత అని క్రమం తప్పకుండా డబ్బు పంపుతూనే ఉంటాడు. తెచ్చి తమ దగ్గరే అట్టిపెట్టుకునే ఆలోచన వచ్చినా  ఇంకేదో  ఆలోచన పట్టి ఆపుతుంది.
కానీ పిల్లలు ఏదో కోల్పోతున్నారు. బామ్మా తాతల ఆప్యాయత. అది తాము పూడ్చలేనిది.
వాళ్లకు మేధో వికాసం కలిగించే కంప్యూటర్లు ఇస్తే సరిపోతుందా? మానసిక స్వాంతన కలిగించే బామ్మా తాతల ప్రేమను అందివ్వాలా?

ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?

(Courtesy Image Owner)

కామెంట్‌లు లేవు: