8, ఆగస్టు 2013, గురువారం

‘అ ఆ లనుంచి ఆకాశం అంచులదాకా.........’

భండారు వంశం (కొత్త అధ్యాయం)
ఇంతవరకు కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారి కధనం. ఇక మా మూడో అక్కయ్య శ్రీమతి తుర్లపాటి సరస్వతి చెప్పిన  చిన్ననాటి ముచ్చట్లు.

‘అ ఆ లనుంచి ఆకాశం అంచులదాకా.........’ 
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో


రుక్మిణీ  కళ్యాణంలో  పద్యం శ్రావ్యంగా వినబడుతోంది. పాడుతున్న అమ్మాయికి పన్నెండేళ్ళు వుంటాయేమో. వింటున్న వాళ్లు మాత్రం ఆరుపదులు దాటిన  వాళ్ళే. పుస్తకం అవసరం లేకుండా కంఠతా వచ్చిన పద్యాన్ని రుక్మిణీ దేవే స్వయంగా ఆవహించి పాడుతున్నదా అన్నట్టుగా ఆలపిస్తున్నది  ఎవరో కాదు నా చెల్లెలు అన్నపూర్ణ. మధ్యలో మంచంలో మా బామ్మ, కొంత దూరంలో మరో మంచంలో మా  బామ్మ అమ్మ చెల్లాయమ్మ అమ్ముమ్మ. ముక్కాలిపీట  పై కాలు మీద కాలువేసుకుని తన్మయంగా వింటున్న మరో శ్రోత మా లలితమ్ముమ్మ. వొంటింట్లో పనిచేసుకుంటూనే ఓ చెవి ఇటు వేసి వింటున్నది మా అమ్మ.  ఈ దృశ్యం ఆ ఇంట్లో పరిపాటే.  


(మా మూడో అక్కయ్య గారు శ్రీమతి తుర్లపాటి సరస్వతి)  



ఎనభై ఏళ్ళ క్రితం సంగతి  .....
ఇప్పటికీ కుగ్రామంగా వున్న మా వూరు కంభంపాడు అప్పుడు  ఎలావుండి వుంటుందో  వూహించుకోవాల్సిందే.

మా నాన్నగారు వూరికి కరణం. పేరుకు బోలెడు ఆస్తి. వూరిచుట్టూ ఎటు చూసినా ఎంతదూరం వెళ్ళినా మా పొలాలే. నా తరువాత పుట్టిన అన్నపూర్ణను పక్కవూరు పెద  కరణం గారి అబ్బాయి అప్పారావుకుకు  ఇచ్చి పెళ్లి  చేసాము. ఈ సంగతి  ఇప్పుడెందుకంటే కొత్త అల్లుడు గుర్రం మీద అత్తగారింటికి వచ్చినప్పుడు  గుర్రాన్ని మేతకు వొదిలేవారు. ఇక  అది తిరిగి మేసినంత మేరా మా పొలాలే. కానీ ఏం లాభం? వందల ఎకరాల భూమి మీద వచ్చే అయివేజు (ఆదాయం లేదా రాబడి) మాత్రం అంతంత మాత్రమే. కరణీకం మీద వచ్చే జీతం రాళ్ళు నాలుగే ఇంటి ఖర్చుకు ఆధారం. వర్షాలు లేక పంటలు పండక రైతులు సర్కారుకు శిస్తు కట్టలేక ఇళ్ళూ పొలాలు వొదులుకుని వూళ్ళు వొదిలి వెళ్ళే రోజులవి.  (మరో భాగం మరో సారి)

కామెంట్‌లు లేవు: