3, ఆగస్టు 2013, శనివారం

సంయమనం నేటి అవసరం


ఈరోజు (03-08-2013) శనివారం సాయంత్రం హైదరాబాదు శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో  రాష్ట్ర విభజన అంశంపై హెచ్.ఎం.టీ.వీ. నిర్వహించిన ప్రత్యేక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నేను చేసిన సూచనలు:



“రెండు నిమిషాల్లో ముగిస్తానన్న హామీతో మొదలు పెడుతున్నాను. ఆ హామీ నిలబెట్టుకుంటానన్న హామీ కూడా ఇస్తున్నాను.   
“హెచ్.ఎం.టీ.వీ. బాధ్యతాయుతమైన మీడియా పాత్ర నిర్వహిస్తోంది. సంతోషం. నిజానికి ఇది నేటి అవసరం కూడా. Need of the Day.
“చాలామంది మాట్లాడారు. చక్కని సూచనలు చేసారు. విలువైన సలహాలు ఇచ్చారు.
“నేను సలహాలు చెప్పదలచుకోలేదు. మరో నాలుగురోజుల్లో – ఏడో  తేదీకి  నాకు 68 ఏళ్ళు నిండుతాయి కనుక సలహాలు ఇచ్చే వయస్సు వున్నా, అనుభవం లేదు కాబట్టి కొన్ని సూచనలు మాత్రమే చేస్తాను.
“గతం గురించీ, వీలయితే వర్తమానం గురించి మరచిపోదాం. గతంలో ఏం జరిగిందన్న దాన్ని గురించి వర్తమానంలో చర్చించుకోవడం వల్ల భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుంది. కాబట్టి, గతాన్ని, వర్తమానాన్ని కొన్నాళ్ళు పక్కన బెట్టి భవిష్యత్తు గురించే ఆలోచిద్దాం.
“జరిగిన ‘నిర్ణయం’ గురించి తవ్వుకోవడం వల్ల వొరిగేదేమీ వుండదు. కాకపోతే నిర్ణయం తీసుకోవడం బాగా ఆలస్యంగా, చాలా అనూహ్యంగా జరగడం వల్లనే ఈ పరిస్తితి ఉత్పన్నమైంది. సరైన సమయంలో సరయిన నిర్ణయం అంటూ  ఏండ్లూ పూండ్లు నానుస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇకనుంచి అయినా బాధ్యత తీసుకోవాలి. ఢిల్లీ లో కూర్చుని వూరికే ప్రకటనలు చేస్తూ కూర్చుంటే కుదరదు. కేంద్ర హోమ్  మంత్రి గారు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తామన్నారు. అసలు ఈసరికే ఆయన రాష్ట్రంలో మకాం పెట్టి వుంటే బాగుండేది.
“నిర్ణయం అమలు జరిగే తీరు పట్ల కొందరిలో అనుమానాలు, భయ సందేహాలు వున్నాయి. సహజం కూడా. వీలైనంతవరకు వాటన్నిటిని వీలైనంత త్వరగా – పరిస్తితులు పూర్తిగా చేయిదాటక ముందే నివృత్తి చేయాలి. మీన  మేషాలు లెక్కిస్తూ కూర్చునే వ్యవధానం లేదు.
“చివరిగా ఒక మాట.
“మాట పెదవి దాటితే పృధివి దాటుతుంది. అంచేత, రానున్న కొద్ది మాసాలు అందరూ సంయమనం పాటించాలి. ఇతరులు పాటించాలని డిమాండ్ చేయడం కాదు. అది ఎవరికి వారు బాధ్యతగా తమ నుంచే ప్రారంభించాలి.
“రాజకీయ నాయకులు టీవీ ఛానళ్లతో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంతవరకు రాసుకొచ్చిన ప్రకటనలనే చదివి వినిపించాలి. ఇందులో భేషజాలకు తావుండకూడదు. ఏదైనా అనేసి – ఆ తరువాత తీరిగ్గా – అల్లా మాట్లాడ్డం మా ప్రాంతంలో మామూలు  అంటే సరిపోదు. అలాటివాటిని సాధారణ సందర్భాలలో ఎవరూ పట్టించుకోరు. కాని ఇప్పుడు అలా కాదు. మాటలు తూటాలవుతాయి. అందుకే ప్రతి మాటా బంగారం తూచినట్టు బేరీజు వేసుకుని, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి.
“రెండు నిమిషాలు అయిపోయాయి. ఇక  ముగిస్తున్నాను.”

-భండారు శ్రీనివాసరావు (03-08-2013)                      

9 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఇరువైపు నేతలు ఆచితూచి సంయమనంతో పెద్దమనిషి తరహాగా మాట్లాడాలి!రెచ్చగొట్టకూడదు!మైకులముందు రెచ్చిపోకూడదు!ముందుముందు తప్పక చేయాల్సిన కర్తవ్యం ఆలోచించాలి!విభజన ప్రక్రియ ఎప్పుడో మొదలైపోయింది!ఈసారి కాంగ్రెస్ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని,చాలా పకడ్బందీగా విభజనకు ఉపక్రమించింది!పూర్వంలా మళ్ళీ వెనుకడుగు వేయడం జరుగదు!ఆంధ్రసీమ నాయకులకు ఆ విషయం సంపూర్ణంగా తెలుసు!UPA ఏకగ్రీవంగా విభజన తీర్మానం చేసింది!దాదాపు అన్ని రాజకీయపక్షాలు విభజనకు అభ్యంతరంలేదని వ్రాతమూలకంగా లేఖలు ఇచ్చి commit అయ్యాయి!కాంగ్రెస్,తెలుగుదేశం పక్షాలు తెరాస తో పొత్తు పెట్టుకొని ఒక్కొక్కసారి ఎన్నికలలో తెలంగాణలో గట్టెక్కాయి!అందరి అభీష్టానుసారమే విభజన జరిగింది!ఇప్పుడు ఏ రాజకీయపక్షం కూడా అమాయకత నటించి చేయగలిగిందేమీ లేదు!విభజన ఆగదు అని ఆంధ్రసీమవాసులు గుర్తించి ఉద్యమాలు,రెచ్చిపోవడాలు,విధ్వంసం వెంటనే ఆపాలి!

Ambedkar చెప్పారు...

ఇప్పుడు గొడవంతా హైదరాబాద్ గురించే కదా..! హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టుకుని అధికారం అండతో ప్రజా ధనం ఖర్చు చేసి ఆ ఆస్తుల చుట్టూ రాత్రికి రాత్రే నందన వనాలు సృష్టించి తమ స్థిరాస్తి విలువలు పదింతలు చేసుకున్న బడా బాబులు మూడు ప్రాంతాల నుంచీ వున్నారు. సాలీనా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంలో హైదరాబాద్ నుంచి వస్తున్నది మిగతా అన్ని జిల్లాల దానికంటే ఐదింతలు ఎక్కువ. అర్థ శతాబ్దికి పైగా జరిగిన అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే. ఆఖరుకు బంగాళాఖాతంలో సంభవించే తుఫానుల పరిశోధన కేంద్రం మొదలు, సముద్రంలో రొయ్యలు ఎలా పెంచాలో సూచించే కార్యాలయం వరకు అన్నీ హైదరాబాద్ లోనే ఉండాలా..? తీరప్రాంతం, కరువు ప్రాంతం ఎక్కువగా ఉన్న సీమాంధ్ర జిల్లాలైనా, వెనుకబడిన ప్రాంతాలు అధికంగా ఉన్న తెలంగాణా కైనా - అదర్ దెన్ హైదరాబాద్ - ప్రాంతాల మౌళిక సదుపాయాల అభివృద్దికి ఖర్చు చేసిన నిధులు అంతంత మాత్రమే. అందుకనే హైదరాబాద్ ను వదలుకోవడానికి - అటు వాళ్ళు, ఇటు వీళ్ళు - ఎవరూ ఇష్టపడటం లేదు. తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని వాదిస్తున్నది ఎవరో తెలుసా...? అవతలి వాడు పక్కకు తప్పుకుంటే హైదరాబాద్ మీద వచ్చే రెవెన్యూ అంతా మనకే దక్కుతుంది కదా ఆశపడుతున్నారు. తెలుగు మాట్లాడే వాళ్ళకి రెండు రాష్ట్రాలు కావాలనుకుంటున్న వారంతా పెద్ద మనసు చేసుకుని హైదరాబాద్ అనే మూడో రాష్ట్రం, ఇంకా కావాలనుకుంటే గ్రేటర్ రాయల సీమ అనే నాలుగో రాష్ట్రం, లేదా జిల్లాకు ఒక రాష్ట్రం కూడా ఒప్పుకోవచ్చు కదా..? ఏం... ఆంధ్రా వాళ్ళకు కాంట్రాక్టర్లున్నారు... రెండు మూడు లక్షల కోట్ల ప్యాకేజీ వాళ్ళ మొఖాన పారేస్తే మయసభ లాంటి రాజధానిని కట్టుకుంటారు అని మీరంతా ఉచిత సలహాలు దంచేశారే... ఏం అనుకోనంటే ఒక మాట అడుగుతాను... హైదరాబాద్ సపరేట్ రాష్ట్రం చేసి మిగతా ఎనిమిదో, తిమ్మిదో జిల్లాలకు కూడా కొత్త రాజధాని కట్టుకోవచ్చు కదా? కావాలంటే కేంద్రాన్ని మరో లక్ష కోట్లు అధికంగా ఇమ్మని అందరూ కలసి ఉద్యమాలు చేద్దాం.. హైదరాబాద్ ను మన దేశానికి రెండో రాజధానిగా అభివృద్ది చేసుకుందాం. ఏమంటారు.

అజ్ఞాత చెప్పారు...

హైదరాబాదుని నిరర్థక ఆస్తిగా (NPA) చేసేవరకు ఈ గొడవలు ఆగేలా లేవు.

అందరూ అది గ్రహించి త్వరగా సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది.

అజ్ఞాత చెప్పారు...

సుర్య ప్రకశ్ అపకారి గారు మస్తు శాంతి ప్రవచనాలు చెప్పిన్రు, ఇగ దం బిర్యాని తిని గుడంబ తాగి బోనాలకు పోండ్రి.
వాళ్ళకేంగావాలో వాల్లకు తెలుసులెండ్రి.

అజ్ఞాత చెప్పారు...

అపకారికి నుపకారము
నెపమెన్నుక చేయువాడే
ఆంధ్రుడు సుమతి.

edo చెప్పారు...

గత పన్నెండు సంవత్సరాలు గా రెచ్చగొట్టుడు,బూతులు గట్రా మాట్లాడిన వారికి ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు మొదలెట్టారు. నాయకుల కు కూడా సమ్యమనం గురించి తెలుసు. అది ప్రస్తుతానికి తెలంగాణ నాయకులకు చాలా అవసరం. ఆంధ్ర నాయకులకు దాని అవసరం లేదు. ఇప్పుడు జనాలు రెచ్చిపోతే వారికి మంచిది.
HMTV should be banned in seemandhra

Jai Gottimukkala చెప్పారు...

ఇవే సలహాలు ఇన్నాళ్ళుగా & ఇప్పటికీ తెలంగాణాను అడ్డుకుంటున్న వారికి ఇస్తే బాగుంటుంది.

టాంకుబండు విగ్రహాల గురించి పొలోమని రెచ్చిపోయిన మేధావులు ఈనాడు మౌనంగా ఎందుకు ఉన్నారో ఆత్మవిమర్శ చేసుకోండి.

Wake up, December 23 style U-turn is not possible today.

Jai Gottimukkala చెప్పారు...

"హైదరాబాద్ సపరేట్ రాష్ట్రం చేసి మిగతా ఎనిమిదో, తిమ్మిదో జిల్లాలకు కూడా కొత్త రాజధాని కట్టుకోవచ్చు కదా?"

Let Hyderabadis ask, no need of Andhras to interfere, thank you. Kaiku hamare maamale mein dakhal dete bhai? Kal lal bus se utare woh bhi baat karne lag gaya. Aapki kirikiri hamareko nakko.

అజ్ఞాత చెప్పారు...

"వృధ్ధనారీ పతివ్రత అట..", ఆంధ్ర వాళ్ళ కి అన్యాయం చేసి ఇప్పుడు శాంతివచనాలు చెబుతున్నారు.