(నిన్నటి తరువాయి)
పర్వతాలయ్య గారి తమ్ముడు
లక్ష్మీనారాయణ గారు వ్యవహార దక్షుడు. వూళ్ళో తగాదాలు వస్తే ఆయన దగ్గరకు వచ్చి
పంచాయితీ పెట్టేవారు. సన్నగా,పొడుగ్గా, నిటారుగా ఉండేవాడు. ఎనభయ్ నాలుగేళ్ళకు పైగా
జీవించాడు. ఆయనకు సంతానం కలగలేదు. మా పినతండ్రి రామప్రసాదరావు గారిని దత్తు
తీసుకున్నారు. మా తాతగారు ప్రవ్తాలయ్య గారు బండ్లు కట్టుకుని భద్రాచలం వెళ్లి దైవ
దర్శనం చేసుకుని వచ్చారు. బహుశా ఆయనకు భద్రాద్రి రామునిపై వున్న భక్తి కారణంగా మా
నాన్నగారికి రాఘవ రావు అనీ, మా బాబాయికి రామప్రసాదం అనీ పేరిడి ఉండవచ్చు. ఆయనకు
కనకమ్మగారని మేనత్త (రామయ్యగారి సోదరి) వుండేది. గోపినేనిపాలెం రాజయ్యగారు ఆమె కొడుకే అనుకుంటా. అయితరాజు
గోపాలరావు గారి భార్య, భండారు కామేశ్వర రావు గారి అత్తగారు జగ్గమ్మక్కయ్య,
కనకమ్మగారి సంతతికి చెందినదే. తాయమ్మ, లచ్చమ్మ గార్లు ఆయన తోబుట్టువులు.
లచ్చమ్మగారు సుబ్బయ్య తాతయ్య రేకుల ఇంట్లో వొంటరిగా ఉంటూ వొండుకుని తింటూ
అకస్మాత్తుగా చనిపోయింది. అంతా పురుగు చేష్ట (పాము కాటు వంటిది) అనుకున్నారు.
ఆమెకు సంతానం లేదు. బాల వితంతువు. డాక్టర్ జమలాపురం రామారావు (అంతా రాములు మామయ్య
అంటారు. గమ్మతేమిటంటే చిన్నా పెద్ద అందరికీ ఆయన రాములు మామయ్యే.) ఆయన తాయమ్మ గారి
సంతానం. పర్వతాలయ్యగారు బతికుండగా లోలోపల రగులుతూ వచ్చిన విబేధాలు ఆయన పోగానే
ఒక్కసారి భగ్గుమన్నాయి. మా తాతగారిలా మా నాన్నగారు సర్దుకుపోయే మనిషి కాదు. మా
బామ్మ గారిలాగే ఆయనకూడా ఒకరికి లొంగి
వుండే రకం కాదు. గ్రామానికి ఎవరు వచ్చినా మా ఇంటనే భోజనం చేసేవారు. హోటళ్ళు అవీ
లేని రోజుల్లో అలాటి ఆదరణ ఎంతో ఆకట్టుకునేది. మా ఇంట్లో భోజనం చేసిన అధికారులందరూ
మా నాన్న అన్నా, మా కుటుంబం అన్నా ఆదరాభిమానాలు చూపేవారు. మా నాన్నగారికి అధికారుల
వద్ద ప్రాపకం అల్లా లభించిందే కాని ఒకరి సిఫారసు వల్ల కాదు.
(కీర్తిశేషులు లక్ష్మయ్య తాతయ్య - వరం బామ్మ)
అప్పటిదాకా గ్రామంలో
తిరుగులేని పెద్దరికం అనుభవిస్తున్న లక్ష్మీనారాయణ గారిది విచిత్రమైన మనస్తత్వం.
‘మీరే’ అని పెద్దపీట వేసి పిలిస్తే ప్రాణం ఇచ్చేమనిషి. తన మాట కాదంటే, వాడి అంటూ
చూసే రకం. ఏది చేసినా కుటుంబంలో పెద్దవాడినయిన తనని సంప్రదించి చేయాలన్నది ఆయన
కోరిక. అయితే మా నాన్నగారికి తనకు తోచింది చేయడం అలవాటు. ఒకరిని సలహా అడగడం
తక్కువ. ఇద్దరూ వ్యవహార దక్షులు, స్వతంత్రులు కావడంతో వాళ్ళ మధ్య సామరస్యం
ఎక్కువకాలం సాగలేదు. పరిస్తితి మాట పట్టింపులతో మొదలయి, క్రమంగా మాటలు లేకపోవడం
దాకా వచ్చింది. ఆ శతృత్వం 15,20 ఏళ్ళపాటు సాగింది. ఈ లోపల ఇద్దరి నడుమా ఓ అరవై
డెబ్బయ్ కేసులు, దావాలు నడిచివుంటాయి. ఈ గ్రంధ నడిచినన్నాళ్ళు వేమిరెడ్డి సోదరులు
అయిదుగురూ మా నాన్నగారి పక్షాన పెట్టని
కోటలా నిలబడ్డారు. మునసబు వాసిరెడ్డి అక్కయ్య గారు కూడా మా నాన్న గారి వైపే
వుండేవారు. మునసబు కరణాలు కలిసి వస్తుంటే మా రాములు మామయ్య సరదాగా ‘అక్కయ్య,
బావయ్య వస్తున్నార’ని నవ్వేవాడు. (మరో
భాగం మరో సారి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి