సంకల్పానికి చిత్తశుద్ధి తోడయితే దానికి ఒనగూడే బలం గురించి, రేడియోలో విన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి అనుగ్రహ భాషణం నుంచి (యధాతధంగా కాకపోయినా, మూలభావం దెబ్బతినకుండా)
“నిప్పు రాజేయడానికి అగ్గిపెట్టె కోసం వెతుకులాడేవాడికి అది దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. కానీ, నిమ్ముకున్న రెండు కర్ర ముక్కల్ని, రెక్కలు విరిగేలా రాపాడిస్తూ సంకల్పబలంతో నిప్పు పుట్టించాలని ప్రయత్నించేవాడికి విజయం తప్పక సిద్ధిస్తుంది.
“సంకల్పబలంతో ముందుకు సాగేవాడిని విమర్శించేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు ఈ లోకంలో ఎలాగూ వుంటారు. అది లోక సహజం. హంస కాళ్ళపై నేలపై నడిచినంత మాత్రాన అది హంస కాకుండా పోదు. కాకి ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నంత మాత్రాన అది హంస కానేరదు. కాకి కాకుండా పోదు.”
"కృతజ్ఞత అనేదానికి అర్ధం చెప్పాలంటే ముందు కొబ్బరి మొక్క గురించి తెలుసుకోవాలి. చారెడు నీళ్ళు పోసి ఆ మొక్కని పెంచితే, అది పెరిగి పెద్దది అయి, చిన్నప్పుడు తన దాహం తీర్చిన వాళ్ళు, తీర్చని వాళ్ళు అనే తేడా లేకుండా చల్లని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన కొబ్బరి నీళ్ళను జీవితాంతం అందిస్తుంది"
21, నవంబర్ 2017, మంగళవారం
20, నవంబర్ 2017, సోమవారం
కాగితాన్వేషణ – భండారు శ్రీనివాసరావు
మొన్న పెన్షన్ స్లిప్ మెయిల్ లో పంపారు. వివరాలు అన్నీ సరిగానే వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం కలిసి ఫోటో దిగలేదు కానీ, రిటైర్ అయ్యేముందు పెన్షన్ పుణ్యమా అని ఇద్దరం పొలోమని స్టూడియోకి వెళ్లి మరీ ఫోటో తీయించుకుని ఆఫీసులో ఇచ్చాము. తీరా ఇప్పుడు చూస్తే నామినీ పేరు గల్లంతు. ఇలాటి విషయాల్లో కాలయాపన పనికిరాదు అనే మా మాజీ స్టేషన్ డైరెక్టర్ శాస్త్రి గారి మాట విని కోటీలోని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. 1975లో రేడియోలో చేరినప్పటి నుంచి నా అక్కౌంటు అక్కడే, అప్పట్లో అన్నీ మానవ సంబంధాలు. స్లిప్పు రాయడం, టోకెన్ తీసుకోవడం, మన నెంబరు పిలిచినదాకా ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెబుతూ కాలక్షేపం చేయడం, లేదా బ్రాంచి మేనేజర్ దగ్గర భేటీ వేయడం అలా కాస్త కాలక్షేపం కాస్త స్వకార్యం. ఇప్పడు అలా లేదు. ఒక పెద్ద అధునాతన ఎయిర్ పోర్ట్ మాదిరిగా వుంది. అన్నీ కంప్యూటర్లు, వాటి వెనక కనీకనపడక సిబ్బంది తలకాయలు. పనిచేస్తున్నారో, సెల్ ఫోన్లు చేస్తున్నారో తెలవదు. అంతా హడావిడి. బయట కస్టమర్లది కూడా అదే తంతు. ఒకరికొకరు తెలవదు, ఎవరికి వారికి తమ పని ముందు చక్కబెట్టుకుని చక్కా పోవాలనే ఆత్రుత. ‘చివరికి ఇక్కడ కాదు, పెన్షనర్ల విభాగం మరో పక్కన అదే ఆవరణలో వుంది, అక్కడికి వెళ్లండని చల్లగా కబురు. ఆ బిల్డింగు పెద్ద పెద్ద పొడవాటి మెట్ల వరుసతో చాలా అందంగా, అధునాతనంగా వుంది. మొదటి అంతస్తులో వుంది ఈ విభాగం. మా ఆవిడను తీసుకుని వెళ్ళిన రోజు జనం లేరు, ఖాళీగా వుంది. బయట రిసెప్షన్ లో ఎవరూ లేరు. గాజు తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి అక్కడ ఒకర్ని వాకబు చేసాను. అతడు ఆశ్చర్యంగా నా వంక చూసి, ‘ఇక్కడి దాకా ఎలా వచ్చారు. లోపలకు ఎవరూ రాకూడదు, బయట రిసెప్షన్ వరకే మీకు అనుమతి’ అంటూ నాకు ఓ క్లాసు పీకాడు. బయటకు వచ్చి చూస్తే రిసెప్షన్ సీటు ఖాళీగా వుంది. కాసేపటికి ఒకావిడ వచ్చి అక్కడ నిల్చుంది. ఆవిడ ఉద్యోగా, నాలాగా వచ్చిన మనిషా అని తేరిపార చూస్తుంటే ఆవిడ కళ్ళు విప్పార్చి ‘ఏం కావాలి’ అని అడిగింది. వెళ్లి చెప్పాను. పేరు, అక్కౌంట్ నెంబరు వివరాలు అడిగి తెలుసుకుంది. నేను, ‘మా ఆవిడ మా ఆవిడే’ అనడానికి నాదగ్గర ఉన్న అన్ని ఆధారాలు అంటే ఆధార్ కార్డు, పెన్షనర్ కార్డు, ఏళ్ళతరబడి అదే బ్యాంకులో ఉన్న బ్యాంకు జాయింటు అక్కౌంట్ వివరాలు, పాసుపోర్టు ఇలా అన్నీ ఆవిడ ముందు పెట్టాను. ‘పెన్షన్ పేమెంటు ఆర్డరు ఏదీ’ అని అడిగింది. రిటైర్ అయిన తరువాత నాలుగిళ్ళు మారాను. ఈ సంధి కాలంలో ఏటీఎంలు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు వగైరాలు వచ్చిపడి కొన్ని పాత కాగితాలకు కాలం చెల్లిపోయిందని నిర్లక్ష్యం చేసిన జాబితాలో ఈ కాగితం కూడా చేరి పోయివుంటుంది. కానీ ఆ కాగితం లేనిదే పని జరగదు అనే తెలివి తెచ్చుకుని ఇంటికి చేరి ఇంటిల్లిపాదీ ఆ కాగితాన్వేషణ కార్యక్రమంలో తలమునకలు అయ్యాము. ఇల్లంతా చిందర వందర కావడం తప్పిస్తే కాగితం జాడ లేదు. అతి ముఖ్యమైన వాటిని అతి జాగ్రత్తగా దాచే నైపుణ్యం కలిగిన మా ఆవిడే వాటి పత్తా కనుక్కుంది. పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మల్లో దాచినట్టు, పెన్షన్ పత్రాలను ఒక సీనా రేకుల పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భద్రంగా అటక ఎక్కించింది.దాన్ని దింపి చూస్తే ఎప్ప్పుడో పుష్కరం నాడు దిగిన మా దంపతుల ఫోటో ఉన్న పెన్షన్ పేమెంటు ఆర్డరు బుక్కు కనిపించింది. తెల్లారగానే దాన్ని పట్టుకుని, దారి మధ్యలో జిరాక్స్ కాపీలు తీయించి, ఈరోజు అక్కడికి పడుతూ లేస్తూ వెళ్లాను.
పోయి చూస్తె, ఆ రిసెప్షన్ హాలు మొత్తం పెన్షనర్లతో కిటకిట లాడుతోంది. నా మొహం చూసి నాలాగే పనిమీద వచ్చిన ఒకాయన, ‘సోమవారం మాస్టారు, సోమవారం రష్ ఇలాగే వుంటుంది’ అన్నాడు. కాసేపటి తరవాత ఆయనే కలిగించుకుని ‘అలా నిలుచుండి పొతే అలాగే వుంటారు. ముందు ఆ రిసెప్షన్ బల్ల మీద ఉన్న రిజిస్టర్ లో మీ వివరాలు రాయండి’ అన్నాడు. “ఇక్కడ నిఘా కెమెరాలు వున్నాయి, కాస్త నవ్వు మొహం పెట్టండి’ అనే బోర్డులు వున్నాయి కానీ, ఈ ముఖ్యమైన సంగతి తెలిపే సమాచార సూచిక అక్కడ ఏమీ కనబడలేదు.
రిజిస్టర్ లో వివరాలు రాసి ఓ పక్కన నిలుచున్నాను. ఈసారి సీట్లో మరో అమ్మాయి కూర్చుని వుంది. ప్రతి ఒక్కరి కేసు తన కేసే అన్నంత శ్రద్ధగా వచ్చిన వారికి విసుక్కోకుండా పని చేసి పెడుతోంది. లైన్లో ఉన్న వాళ్లకు ఈ ఆలస్యం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పని తీరు నాకు బాగా నచ్చింది. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చాడు. అప్పుడే నా వంతు వచ్చింది. ఆ అమ్మాయి నాతో అన్నది, ‘చూడండి. నిజానికి వరసలో మీరే వున్నారు. ఈయన రిజిస్టర్ లో రాయలేదు. కానీ పెద్దాయన కదా! మీరు ఒప్పుకుంటే ముందీ పెద్దమనిషి విషయం కనుక్కుంటాను’
ఈ రకంగా వృత్తి ధర్మం నెరవేరుస్తున్న ఒక ఉద్యోగిని చూడడం చాలా అరుదు. ఆ పెద్ద మనిషి పని పూర్తి చేసిన తరువాత నన్ను పిలిచింది. వివరాలు అన్నీ మరో మారు పరిశీలించింది. నేను రిటైర్ అయినప్పుడు నామినీ విషయంలో పుట్టిన తేదీ పట్టింపు లేదు. కానీ అదిప్పుడు తప్పనిసరి. నేను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఒక వైద్యుడు రోగికి చెప్పినంత వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి పనిచేసే విధానం చూసిన తరువాత నాకు నా పని కాలేదన్న విచారం కలగలేదు. ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.
నిజానికి ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి ఉద్యోగులే.
రిజిస్టర్ లో వివరాలు రాసి ఓ పక్కన నిలుచున్నాను. ఈసారి సీట్లో మరో అమ్మాయి కూర్చుని వుంది. ప్రతి ఒక్కరి కేసు తన కేసే అన్నంత శ్రద్ధగా వచ్చిన వారికి విసుక్కోకుండా పని చేసి పెడుతోంది. లైన్లో ఉన్న వాళ్లకు ఈ ఆలస్యం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పని తీరు నాకు బాగా నచ్చింది. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చాడు. అప్పుడే నా వంతు వచ్చింది. ఆ అమ్మాయి నాతో అన్నది, ‘చూడండి. నిజానికి వరసలో మీరే వున్నారు. ఈయన రిజిస్టర్ లో రాయలేదు. కానీ పెద్దాయన కదా! మీరు ఒప్పుకుంటే ముందీ పెద్దమనిషి విషయం కనుక్కుంటాను’
ఈ రకంగా వృత్తి ధర్మం నెరవేరుస్తున్న ఒక ఉద్యోగిని చూడడం చాలా అరుదు. ఆ పెద్ద మనిషి పని పూర్తి చేసిన తరువాత నన్ను పిలిచింది. వివరాలు అన్నీ మరో మారు పరిశీలించింది. నేను రిటైర్ అయినప్పుడు నామినీ విషయంలో పుట్టిన తేదీ పట్టింపు లేదు. కానీ అదిప్పుడు తప్పనిసరి. నేను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఒక వైద్యుడు రోగికి చెప్పినంత వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి పనిచేసే విధానం చూసిన తరువాత నాకు నా పని కాలేదన్న విచారం కలగలేదు. ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.
నిజానికి ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి ఉద్యోగులే.
లేబుళ్లు:
కాగితాన్వేషణ Pension Papers
13, నవంబర్ 2017, సోమవారం
“ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం, ప్రాంతీయ వార్తలు చదువుతున్నది చుండూరు వెంకట రంగారావు...”
ఈరోజు కార్తీక సోమవారం (13-11-2017) మధ్యాన్నం ఒంటిగంటా పది నిమిషాలకు రేడియోలో ఈ గొంతు వినపడింది. ఈ సాయంత్రం వార్తలు కూడా రంగారావు గారే చదవాలి. కానీ చదవడానికి ఆయన లేరు. సాయంత్రం బులెటిన్ కు సిద్ధం అవుతూ రేడియో స్టేషన్ లోనే కుప్పకూలిపోయారు. న్యూస్ రూమ్ లో పనిచేసే ఇతర సిబ్బంది వెంటనే ఆయన్ని దగ్గరలోని హైదర్ గూడా అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ ఫలితం దక్కలేదు. ఏ వార్తలు అయితే ఆయన చదవాలో ఆ బులెటిన్ లోనే రంగారావు గారి మరణ వార్తను ప్రసారం చేయాల్సి వచ్చిందని న్యూస్ సిబ్బంది బాధ పడ్డారు.
వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి
లేబుళ్లు:
చుండూరు వెంకట రంగారావు
11, నవంబర్ 2017, శనివారం
‘మీలో పార్టీ మారని వారు ఎవరో చెప్పండి’ – భండారు శ్రీనివాసరావు
ఎవరయినా
ఒక పెద్ద పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మరో పార్టీలోకి జారిపోతే ఆ సందర్భాన్ని
'పార్టీ మార్పిళ్ళకు
పరాకాష్ట’ అని గిట్టని పార్టీల వాళ్లు
వ్యాఖ్యానిస్తుంటారు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ
కాదు, చివరా కాదు. అందుకే
విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా ఉండడానికి సిద్ధపడి
వుండాలి. సమర్ధించేవారు ఇంకో సందర్భంలో విమర్శించడానికి సంసిద్ధంగా వుండడం కూడా
అంతే అవసరం. ఎందుకంటే ఈ పార్టీ మార్పిళ్ళు అనేవి అన్ని పార్టీలకి
తప్పనిసరి అవసరం కాబట్టి. ఎవరూ దీనికి అతీతులు కాదు కాబట్టి. మరో 'మార్పిడి' జరిగేవరకు పాత దానిపై
దుమారం సాగిపోతుంది, ఆ తరువాత అది పాత పడిపోతుంది. కొత్తది తెర మీదికి వస్తుంది.
చర్చ మళ్ళీ మొదలవుతుంది. ఇదో విష చక్ర భ్రమణం.
'నిలకడగా
నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా
స్వచ్చంగా కనబడుతుంది'
పార్టీ మార్పిడులను
సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. మరి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా
తీసుకోవాలేమో.
పార్టీలు
ఏర్పడినప్పుడే మార్పిళ్ళ సంస్కృతికి కూడా బీజాలు పడ్డాయంటారు. పార్టీలు వుంటేనే
కదా మార్పిళ్ళు జరిగేది. అందుకే రాజకీయుల అవసరాలకు తగ్గట్టు పార్టీలు కూడా
పుట్టుకొస్తుంటాయి.
1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి
సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో అందరి నోళ్ళలో నానుతున్న ఏకైక పార్టీ
కాంగ్రెస్ మాత్రమే. కమ్యూనిష్టు పార్టీలు వుండేవి కాని వాటి పాత్ర పరిమితంగా
వుండేది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల పుణ్యమా అని అనేక పార్టీలు
పుట్టుకొచ్చాయి. కొన్ని కాలపరీక్షకు తట్టుకున్నాయి. కొన్ని కాలగర్భంలో
కలిసిపోయాయి. మరికొన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటూ తమ ఉనికిని
కాపాడుకుంటున్నాయి.
2014 జూన్ రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం
ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా
రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోవడానికి కొద్దికాలం
ముందు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం
పార్టీ, ఇటు తెలంగాణాలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రాల
చీలిక దరిమిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు
ఒక్కటే ఒక్కటి, పార్టీ మార్పిళ్ళు. రెండు రాష్ట్రాలమధ్య
సహజంగా పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు అలాగే వుండిపోతే, కొత్తగా
తెరమీదకు వచ్చిన ఈ పార్టీ మార్పిళ్ళ వ్యవహారం అన్ని సమస్యలను కారుమబ్బులా కమ్మేసి, అనేక
అనైతిక, అవాంఛనీయ, అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీయడమే కాకుండా వివాదాలు ముదిరి
పాకానపడి చివరికి కేసులు, కోర్టుల వరకు వెళ్ళింది.
ఈ చిక్కుముళ్ళు
ఎప్పుడూ విడివడతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్తితి. 'మీరంటే
మీరే కారణం' అంటూ వివాదాలకు కేంద్ర బిందువులయిన రెండు ప్రధాన పార్టీలు
వీధులకెక్కి వీరంగాలు చేస్తూ వుండడం, అటూ
ఇటూ పార్టీల నాయకులు. కార్యకర్తలు, అభిమానులు
వేర్వేరు పారావారాలుగా విడిపోయి వాదోపవాదాలకు దిగడంతో సామరస్య పరిష్కారం ఆశలు
సన్నగిల్లుతున్నాయి. దీనికి ముగింపు
ఎప్పుడన్నది కాలమే చెప్పాలి.
పోతే, ఇన్ని
సమస్యలకు మూలకారణంగా పేర్కొంటున్న పార్టీ మార్పిళ్ళు ముందే చెప్పినట్టు పార్టీలు
పుట్టినప్పుడే పురుడు పోసుకున్నాయి. అసలు కొత్త పార్టీలు పుట్టుకు రావడానికి
ప్రధాన కారణం పార్టీల్లో పుట్టుకొచ్చే రాజకీయ అసంతృప్తులే అనే వాదం వుంది.
సాధారణంగా
ప్రతిపక్షంలో వున్నవాళ్ళు పాలకపక్షం వైపు చూడడం సహజం. కానీ,పాలక
పక్షం నుంచి ప్రతిపక్షం వైపు దూకే సాంప్రదాయానికి ఎప్పుడో రామాయణ కాలంలోనే
విభీషణుడు విత్తు నాటాడు. తటస్థులను తమవైపు తిప్పుకోవడం మహాభారతంలో కానవస్తుంది.
స్వతంత్రం వచ్చిన
కొత్తల్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఏకపక్షంగా సాగిన వ్యవహారం ఏమీ
కాదు. స్వతంత్రం తెచ్చిన ఖ్యాతి, తొలి ఎన్నికల్లో అ
పార్టీకి బాగా ఉపయోగపడిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పటితో పోలిస్తే అప్పుడున్న
పార్టీల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. జనత పార్టీ, స్వతంత్ర
పార్టీ, జనసంఘం పేర్లు ఈనాడు కొందరికి తెలిసి వుండవచ్చునేమో కాని, 1952 లో
జరిగిన ఎన్నికల్లో సోషలిష్టు పార్టీ, ప్రజా
సోషలిష్టు పార్టీ, నేషనలిష్టు డెమొక్రాటిక్ పార్టీ, కృషికార్
లోక్ పార్టీ, కే.ఎల్.పీ, ఎన్.సీ.ఎఫ్, జస్టిస్ పార్టీ,
ప్రజాపార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, పీపుల్స్
డెమొక్రాటిక్ ఫ్రంట్ ఇలా అనేక పార్టీలు వుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ (అప్పటికి
ఒక్కటే) సరేసరి. వీటిల్లో
కొన్ని పార్టీల పేర్లు చూడగానే, 'తల్లి పార్టీ ఏమిటి? అందునుంచి
వేరుపడి ఏర్పడ్డ కొత్త పార్టీ ఏమిటి?' అన్న
విషయం సులభంగానే బోధపడుతుంది.
గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా
ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు.
పార్టీ మార్పిడి కూడా లాటరీ వంటిదే.
కొందరికి లాభం. కొందరికి ఖేదం.
పార్టీ మారిన వెంటనే చేరిన పార్టీలో
తారాజువ్వలా పైకి దూసుకు పోయిన సందర్భాలు వున్నాయి. పార్టీ మారి పుష్కరాలు గడిచినా
వేసిన గొంగడి చందంగా చతికిలపడి పోయిన ఉదాహరణలు వున్నాయి. పేర్లు చెప్పుకుంటూ పొతే
జాబితా కొండవీటి చేంతాడు అంత అవుతుంది.
పార్టీ మార్పిళ్లలో అర్ధం కానిది ఒకటే.
రాజకీయుల్లో ఎవరిని కదిలించినా గెలుపు
తధ్యం అంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే మనసా, వాచా, కర్మణా సిద్ధమైపోయారని
చెబుతారు. ఇంతాచేసి, తమమీద తమకే
నమ్మకం లేనట్టు చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుతుంటారు.
ఏవిటో అంతా వరదలో కొట్టుకుపోతున్నట్టుగా
వుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.
ముక్తాయింపు :
ప్రధాన
రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడుతున్న మాట:
"ఈరోజు ప్లస్సెంత ? మైనస్ యెంత?"
7, నవంబర్ 2017, మంగళవారం
మరో మంచి లక్ష్యం దిశగా తెలంగాణా ప్రభుత్వం
నేను రేడియోలో పనిచేసే రోజుల్లో సమైక్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వర
రావు గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఆయన మా
రేడియోకు ప్రధాన శ్రోత. రోడ్డుమార్గాన ఖమ్మం జిల్లాకు వెళ్లి వస్తున్నప్పుడు,
మధ్యాన్నం 1.10 లేదా సాయంత్రం 6.15 అయితే చాలు, మంత్రి గారు
ప్రయాణిస్తున్న మోటారు వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయేది. ప్రాంతీయ వార్తలు పూర్తిగా
విన్న తరువాత మళ్ళీ బయలుదేరేది. (అప్పట్లో ఇప్పటి నాలుగు లేన్ల రహదారి లేదు, అంచేత
ఎక్కడపడితే అక్కడ కారు ఆపుకునే వెసులుబాటు వుండేది)
ఇప్పుడు కూడా నాగేశ్వర రావు గారు తెలంగాణా ప్రభుత్వంలో
రోడ్లు, భవనాల శాఖ మంత్రి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టే ఉద్దేశ్యంతో
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు ఈ మధ్య వేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆయన
చైర్మన్. లోగడ 108, 104 పధకాల రూపకల్పనలో పాలుపంచుకున్న
తెలంగాణా బిడ్డలు డాక్టర్ ఏ.పీ.రంగారావు, డాక్టర్ బాలాజీ ఊట్ల, ‘క్రియ’ సంస్థ
ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు
ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించేందుకు 1033 అంబులెన్స్ సర్వీసుకు రూపకల్పన చేసి నూతన సాంకేతికపరిజ్ఞానంతో రోడ్డు
ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. తుమ్మల నాగేశ్వర రావు
గారు ఈ ప్రయోగ వివరాలను తెలుసుకుని వారిద్దరినీ క్యాబినెట్ ఉపసంఘం సమావేశానికి
ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావాల్సిందని కోరారు. ఈ నెల పదో తేదీన జరిగే తొలి
సమావేశంలో తగిన చర్చలు జరిగి, ముఖ్యమంత్రి
కేసీఆర్ ఆశించిన ఫలితాల సాధన దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.
“ఎవరా మేనకోడలు ఏమా కధ!”
అని చాలామంది అడుగుతున్నారు. నిరుడు జూన్
లో జరిగిన విషయం ఇది. నేనే మరచిపోయాను. కేటీఆర్ గుర్తుపెట్టుకున్నారు. అది ఆయన
గొప్పతనం. తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి గారిని
ఉద్దేశించి రాసింది. చివరి వాక్యం అందుకోసమే.
అప్పటి పోస్టింగు ఇదిగో!
ఇలాగా కూడా జరుగుతుందా! – భండారు శ్రీనివాసరావు
కొన్ని విషయాలు వింటుంటే నిజమా
అనిపిస్తుంది.
మామేనకోడలుకు చెల్లెలు వరస అయిన అమ్మాయి
బీటెక్ పాసయింది. ఎం టెక్ కూడా చేసింది. వాళ్ళు వుండేది నల్గొండలో.
సర్వీసు కమీషన్ వాళ్ళు మునిసిపల్
ఇంజినీరింగ్ విభాగంలో టెక్నికల్ ఆఫీసరు పోస్టుకు పరీక్ష పెడితే రాసింది. ఇంటర్వూకు
పిలిస్తే వెళ్ళింది. ఏదో మోటారు సైకిల్ కంపెనీ వారి ‘ట్యాంకులో పెట్రోలు నింపండి, ఇక మరచిపొండి’ అనే ప్రకటన తరహాలో ఆ విషయం
మరిచిపోయింది.
నిన్ననో మొన్ననో ఆమెకు నియామక పత్రాలు
పోస్ట్ లో అందాయి. ఆ అమ్మాయికి ఆనందం, ఇంట్లో వాళ్లకి ఆశ్చర్యం. ఆ
ఉద్యోగం కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, ఏ రకం అయిన పైరవీలు చేయలేదు.
అందుకే ఆ ఆనందం, అందుకే ఆ
ఆశ్చర్యం.
ఆర్డరులో చూస్తే బోధన్ పోస్టింగు
ఇచ్చారు. ఆ అమ్మాయే ధైర్యం చేసి ఆ విభాగం చీఫ్ ఇంజినీరును కలిసి ముందు థాంక్స్
చెప్పింది, తరువాత
వచ్చిన పని చెప్పింది.
ఆ అమ్మాయికి ఈసారి ఆనందంతో పాటు
ఆశ్చర్యం.
ఎందుకంటే క్షణాల్లో ఆ ఆర్డరు మార్చి
బోధన్ బదులు నల్గొండకు పోస్టింగు ఇచ్చారు.
పైరవీ లేదు, పైసా ఖర్చులేదు. ఆ కుటుంబం
ఆనందమే ఆనందం.
(ఘంటా చక్రపాణి గారూ వింటున్నారా!)
27 జూన్, 2016.
ఇది రాసి నేను మరచిపోయాను. కనీసం
ఎవరికీ ట్యాగ్ కూడా చేయలేదు. అయినా ఇది పడవలసిన వారి కంట్లో పడింది. ఏడాది తరవాత
కూడా గుర్తుంచుకుని కేటీఆర్ ఒక ఇంటర్వ్యూ లో కోట్ చేసారు. అందుకే నాకు కూడా
ఆ అమ్మాయికి మల్లే ఆశ్చర్యంతో కూడిన ఆనందం.
అంతే! వేరే ఏమీ లేదు.
లేబుళ్లు:
“ఎవరా మేనకోడలు ఏమా కధ!”,
KTR
6, నవంబర్ 2017, సోమవారం
దిస్ ఈజ్ కేటీఆర్ - భండారు శ్రీనివాసరావు
“ప్రభుత్వం అన్నాక పొగిడే వాళ్ళు
వుంటారు, తెగిడే వాళ్ళు వుంటారు. పూలూ వేస్తారు, రాళ్ళూ వేస్తారు. మా పార్టీ
వాళ్ళు ఆహా ఓహో అంటారు, అది సహజం, దానికి పొంగి పోకూడదు. అలాగే ప్రతిపక్షాల వాళ్ళు
విమర్శలు గుప్పిస్తారు. అదీ సహజమే. వాటికి కుంగి పోకూడదు. కానీ నిష్పాక్షికులయిన
జర్నలిష్టులు ఏదైనా రాస్తే, అది ప్రతికూలంగా వున్నా విషయం ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం
చేయాలి. అలాగే వాళ్ళు ఓ మాట మంచిగా రాస్తే
ప్రశంసగా తీసుకోవాలి”
ఇలాగే కాకపోయినా ఇదే అర్ధం వచ్చే
రీతిలో మాట్లాడారు తెలంగాణా పురపాలక, ఐ.టీ. శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక
రామారావు(కే.టీ.ఆర్)
ఈరోజు అనుకోకుండా ఓ పుష్కరం తర్వాత
అసెంబ్లీకి వెళ్లాను. నేను చూసిన అసెంబ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది.
ఎన్నో ఏళ్ళ పాటు రేడియో విలేకరిగా ఆ భవనంతో, అక్కడ జరిగే కార్యకలాపాలతో నాకు
అనుబంధం వుంది. అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ కమిటీ సభ్యుడిగా కూడా వున్నాను. 1975 నుంచి 2005 వరకు ముప్పయి ఏళ్ళపాటు నిరాఘాటంగా అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ పాసు, అక్రిడిటేషన్
కార్డు కలిగిన ఒక సీనియర్ జర్నలిష్టు అనే
భావనతో కాబోలు తెలంగాణా ప్రభుత్వం ఇంకా వాటిని కొనసాగిస్తోంది. ఈ ఉదారతకు నా ధన్యవాదాలు.
మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత జ్వాలా
పుణ్యమా అని తెలంగాణా అసెంబ్లీ భవనంలో కాలు మోపాను. వున్న కాసేపు ఆనందంగా
గడిచింది. మా కాలంలో పనిచేసిన కొందరు
జర్నలిష్టులు (ఇండియా టుడే అమర్ నాద్ మీనన్, వార్త నాగేశ్వరరావు) అసెంబ్లీ
కార్యదర్శి శ్రీ నరసింహాచారి మొదలయిన వారిని కలుసుకునే అవకాశం కూడా దొరికింది.
నన్ను కూర్చోబెట్టింది సీఎం పేషీ
అధికారులు కూర్చునే గది. సీఎం ఛాంబర్ ఆ పక్కనే వుంటుంది. మధ్యాన్నం అవుతోంది. అసెంబ్లీ
ఇంకా కొనసాగుతోంది. అక్కడి టీవీలో చూస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడు శ్రీ
జానారెడ్డి, ఉప నాయకుడు మల్లు భట్టి తమదయిన శైలిలో వాక్బాణాలు విసురుతుంటే ముఖ్యమంత్రి అంతకంటే పదునుగా
జవాబు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే వెనకటి
రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి. వై.ఎస్
రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత. ఒకరికొకరు తీసిపోరు. ముఖ్యంగా అసెంబ్లీ చర్చల్లో. వాదమయినా,
సంవాదమైనా హుందాగా సాగుతుంటే వినే వాళ్లకు చూడ ముచ్చటగా వుంటుంది. మళ్ళీ తెలంగాణా అసెంబ్లీ జరిగే తీరు చూసి సంతోషం
అనిపించింది.
ఇంతట్లో జామపండు తింటూ తెల్లటి
దుస్తులు ధరించిన వ్యక్తి గదిలోకి వచ్చారు. ఒక పక్కకు వెళ్లి పండు తింటూనే పక్క
వ్యక్తి చెప్పేది వింటున్నారు. తీరా చూస్తే ఆయన ఎవరో కాదు, మంత్రి కేటీఆర్.
ఢిల్లీలో ఈ మధ్య బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూలో నాపేరు ప్రస్తావించిన
విషయం గుర్తు చేసి, కృతజ్ఞతలు చెప్పాను.
అప్పుడు కేటీఆర్ అన్న మాటల్నే నేను
ఇందులో నాందీ ప్రస్తావనగా పేర్కొన్నాను.
“నిష్పాక్షికులయిన జర్నలిష్టులు ఏదైనా
రాస్తే, అది ప్రతికూలంగా వున్నా విషయం ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్ళు ఓ మాట మంచిగా రాస్తే ప్రశంసగా
తీసుకోవాలి”
దిస్ ఈజ్ కేటీఆర్!
కింది ఫోటో: హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సందర్భంలో
లేబుళ్లు:
దిస్ ఈజ్ కేటీఆర్ - భండారు శ్రీనివాసరావు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)


