9, జూన్ 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో: (322): భండారు శ్రీనివాసరావు

నాకూ సెంటి మెంట్లు వున్నాయ్!

భగవంతుడు అనే వాడికి ప్రతిరోజూ వంగి వంగి నమస్కారం పెట్టక్కర లేదు. రోజూ, ఆ రోజు ముగిసే సమయానికి ‘దేవుడా! ఓ దండం!’ అంటూ కృతజ్ఞత చెబితే చాలు.
ఆయన నాకు అన్నీ ఇచ్చాడు. కొన్ని తీసుకున్నాడు. అంతే కానీ నా జీవితంతో చెడుగుడు మాత్రం ఆదుకోలేదు. ఆయన చేతిలో వున్న సాయం చేస్తూనే వస్తున్నాడు, ఏనాడూ పూజలు, పునస్కారాలు చేయకపోయినా.
పని లేకుండా పడి వుండడం కూడా ఒక పనేనేమో!
ఏమీ తోచక ఏదో ఒక పని చేస్తుంటాం, మా వయసు వాళ్ళం.
మొన్నశనివారం నాడు, ఇలాంటి పని లేని పనే ఒకటి చేస్తుంటే ఒక పెద్ద పని వచ్చి మీద పడింది. నిజంగా అది నా చేతిలో లేని పనే.
మా వెహికిల్ RC రెన్యువల్ గడువు వారం పది రోజుల్లో ముగియబోతోంది అనే విషయం ఆ వెతుకులాటలో తెలిసింది. ఏం చెయ్యాలో గూగుల్ చెప్పింది. ఆర్సీ ఒరిజినల్, వెహికిల్ ఇన్సురెన్స్, పియుసి . వెహికిల్ ఆర్సీ రెన్యువల్ కు, ఎప్పుడో చదివిన పీయుసీ సర్టిఫికేట్ కు సంబంధం ఏమిటి అని బుర్రబద్దలు కొట్టుకోకుండానే, గూగులమ్మే చెప్పింది, పొల్యుషన్ అండర్ కంట్రోల్ సరిఫికేట్ అని.
సరే! అన్నీ రెడీగానే వున్నాయని, నిన్న సోమవారం నాడు డ్రైవర్ ని పెట్టుకుని ఖైరతాబాదు ఆర్టీయే ఆఫీసుకు బయలుదేరాను.
బయలుదేరాను కానీ, అక్కడ ఎవర్ని కలవాలి? అసలే ఎండ దంచి కొడుతోంది నిన్న పొద్దటి నుంచే.
ఫోను డైరీ ఓపెన్ చేశాను. JCT, Ramesh అనే ఒక నెంబరు కనిపించింది. ఈ అధికారి ఇంకా అక్కడే వున్నారో లేదో కూడా తెలియదు. హిందూ పత్రిక రవికాంత రెడ్డి ద్వారా ఈ నెంబరు తీసుకున్న గుర్తు. ఫోన్ చేద్దామంటే అసలే ముఖ పరిచయం కూడా లేదు. దాంతో ఒక ఎస్సెమ్మెస్ పెట్టాను. ‘ఇదీ నా పని, ఎవరిని కలవాలి?’ అని. అసలే తెలియని నెంబరు నుంచి మెసేజ్, ఎవరు చూస్తారు ఈ రోజుల్లో. నిజానికి నేనే చూడను.
ఆశ్చర్యంగా అయిదు నిమిషాల్లో జవాబు వచ్చింది. ‘సచివాలయంలో మీటింగు వుంది, నేను ఆఫీసులో వుండడం లేదు, కిష్టయ్య గారని వుంటారు, వారిని కలవండి’
‘ఇలాంటి అధికారులు ఈ కాలంలో ఉంటారా’ అని ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపు ఆర్టీయే ఆఫీసు వచ్చింది.
‘ఎవరీ కిష్టయ్య గార’ని అక్కడ ఒక యూనిఫారంలో వున్న మనిషిని వాకబు చేస్తే, ఒక గది చూపించి అక్కడికి వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళడమే కాకుండా, లోపలకు తీసుకుని వెళ్లి కూర్చో బెట్టాడు.
అక్కడ సంగీత్ అనే ఉద్యోగి (పేరు చిత్రంగా వుంది కనుక గుర్తుండిపోయింది) నా వివరాలు కనుక్కుని ‘సార్! వచ్చే టైం అయింది’ అని చెబుతుండగానే, ఒక ఆజానుబాహువు అయిన వ్యక్తి లోపలకు వస్తూనే ‘ ‘మీరు శ్రీనివాసరావు గారు కదా! చెప్పండి ఏమిటి పని? ఇంతకీ మీరు గ్రీన్ టీ తాగుతారా , మామూలు చాయ్ తెప్పించనా?’ అంటూ, నా జవాబు కోసం ఎదురు చూడకుండానే రెండు గ్రీన్ టీ అని వెంటవచ్చిన తన నాలుగో తరగతి అధికారితో చెప్పేశారు.
నాకు ఆశ్చర్యం స్థానంలో, ‘ఇంతకీ నేను ఎవరని అనుకుంటున్నారు’ అనే అనుమానం అలుముకుంది. దాన్ని నివృత్తి చేస్తూ ఆయనే, ఆర్సీ ఒరిజినల్, మిగిలిన డాక్యుమెంట్స్ అడిగి తీసుకుని ‘మీరు అలా కూర్చుని టీ తాగండి, మా సంగీత్ గారు మీ డాక్యుమెంట్స్ సంగతి చూస్తారు’ అంటూ యాంటీ రూమ్ లోకి వెళ్లి సివిల్ డ్రెస్ స్థానంలో ఆఫీసు యూనిఫారం వేసుకుని బయటకి వచ్చారు.
కొత్తగా కలిసిన, ఇంకా పూర్తిగా పరిచయం కాని ఈ ఆర్టీవో కిష్టయ్య గారిలో నాకు కొట్టవచ్చినట్టు కానవచ్చిన ఓ విషయం ఏమిటంటే ఎవరితో మాట్లాడుతున్నా చిరునవ్వు చెదరక పోవడం, తన కింది సిబ్బందితో కూడా మన్ననగా వ్యవహరించడం.
ఒక పక్క నా పని సంగీత్ చూస్తున్నారు. పదిహేను సంవత్సరాల సర్వీసు దాటిన వెహికిల్ కనుక గ్రీన్ టాక్స్, ఇతర ప్రభుత్వ టాక్సులు వెరసి పదివేల చిల్లర అక్కడికక్కడే జీ పే ద్వారా చెల్లించాను. పక్కనే ఫోటో తీసే ఏర్పాటు వుంది. తర్వాత కార్డు ప్రింటయి వచ్చింది.
ఈలోగా రమేశ్ గారు సచివాలయం నుంచి వచ్చి, తన ఛాంబర్ కు వెడుతూ మధ్యలో ఆర్టీవో రూమ్ కు వచ్చి నా గురించి వాకబు చేస్తున్నప్పుడు, వారే రమేశ్ గారనే గ్రహింపు కలిగి ధన్యవాదాలు చెప్పాను. సాయం చేయాలనే మనసు వుండాలే కానీ ముఖ పరిచయాలు అక్కరలేదు. దేవుడికి నేనేం తెలుసని ఇలాంటి మంచి వ్యక్తులను నాతో కలిపాడు?
అమ్మబోతే అడవి లాంటి, పదిహేనేళ్ల నాటి పాత కారు ఆర్సీ రెన్యువల్ కోసం పదివేలు ఖర్చు చేసిన నన్ను చూసి మా డ్రైవర్ నవ్వుకుని వుంటాడు.
ఒకానొక కాలంలో నేను మా ఆవిడతో కలిసి తిరిగిన కారు అది. మరో అయిదేళ్లు దాంట్లోనే తిరగమని సర్కారు వారు ఇచ్చే అనుమతి కోసం నేను ఖర్చు పెట్టిన పది వేలు నిజానికి చాలా చిన్ని మొత్తం. తిరిగినా తిరక్క పోయినా అది నా కళ్ళ ముందు వుంటుంది.
నాకు సెంటిమెంట్స్ గట్రా లేవని పైకి చెప్పుకు తిరుగుతా కానీ,
నేనూ సెంటిమెంట్లకు అతీతం కాదు.
నిరుడు అమెరికా వెళ్ళినప్పుడు మా ఆవిడ నిర్మల నీళ్ళు పోసి పెంచిన తులసికోట ఆ మూడు నెలల కాలంలో పూర్తిగా ఎండిపోయింది. రెండు పూటలా నీళ్ళు పోస్తూ అది మళ్ళీ చిగురించేలా చేయడానికి రెండు నెలలు పట్టింది. అదీ నా సెంటిమెంటు.
కింది ఫోటో:
ఆర్టీవో కిష్టయ్య గారితో





(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: