24, జూన్ 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో: (331) - భండారు శ్రీనివాసరావు

 

పేరులోనే వుంది
దాదాపు యాభయ్ ఏళ్ళ నాటి ముచ్చట.
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో సోవియట్ యూనియన్ వర్ధిల్లిన కాలంలో, మాస్కో రేడియో నుంచి దాదాపు ఎనభైకి పైగా ప్రపంచ భాషల్లో వార్తా ప్రసారాలు జరిగేవి. నేను తెలుగు విభాగం బాధ్యుడిగా 1987 నుంచి అయిదేళ్లపాటు మాస్కోలో పనిచేశాను. అప్పుడు సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్.
ఇన్ని ప్రపంచ భాషలకు సంబంధించిన వార్తలను ముందు ఇంగ్లీష్ భాషలో తయారు చేసి వాటి ప్రతులను అన్ని విభాగాలకు పంపేవారు. వాటిని ఆయా భాషల నిపుణులు తమ భాషలలోకి అనువదించి ప్రసారం చేసే వాళ్ళు. నాకు సహాయకుడిగా, కొద్ది కొద్దిగా తెలుగు తెలిసిన, గీర్మన్ అనే రష్యన్ ఉండేవాడు.
‘మీరు వార్తల బులెటిన్ అసలు ప్రతి ఇస్తున్నారు సరే. మీ వార్తల్ని మీరు అనుకున్నట్టు యధాతధంగా అనువదిస్తున్నామా లేదా అనే సంగతి మీకెలా తెలుస్తుంది’ అని అడిగాను, ఓసారి. దానికి ఆయన చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.
‘ప్రతి వార్తలో దాదాపు మా నాయకుడి పేరు అనేకసార్లు వస్తుంది. మీరు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ అంటారో దాన్ని మా వాళ్ళు విని, మా దగ్గర వున్న ఒరిజినల్ బులెటిన్లో ఆ పేరు ఎన్ని సార్లు వచ్చిందో సరి చూసుకుని, అప్పుడు మీరు సరిగా అనువాదం చేస్తున్నారో లేదో కనుక్కుంటారు’ అని కర్ణుడి జన్మ రహస్యం నా చెవిన వేశాడు.
అంటే ఇక ఎటువంటి పరిస్తితిలోనూ సర్వనామాలు ఇక్కడ అనువాదపు పనిలో పనికి రావు అనేది బోధపడింది.
అందుకా, ‘ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ప్రకటించారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఇంకా ఇలా అన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ పేర్కొన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఉద్ఘాటించారు’ అంటూ ఒకే పేరాలో నా చేత అష్టోత్తరం చదివిస్తున్నారు అనే వాస్తవం ఎరుకలోకి వచ్చింది.
సరే! ఆ శకం ముగిసింది. సోవియట్ శకం కూడా నేను మాస్కోలో వున్నప్పుడే అంతం అయింది.
ఇలాంటిదే మరో విశేషం నా కంట పడింది.
ఆఫ్రికా దేశం అయిన ఉగాండాను ఇదీ అమీన్ అనే నియంత పాలించేవాడు. రేడియో కంపాలాలో ప్రతి రోజు అయన గురించిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అయ్యేవి.
ఆయనకు రేడియోలో తన పూర్తి పేరు చెప్పాలని మక్కువ. నియంత తలచుకుంటే కానిదేముంది. కాకపోతే ఒక ఇబ్బంది ఎదురయింది. పూర్తి పేరు అయితే పరవాలేదు కానీ తనకున్న బిరుదులు, మెడల్స్ కూడా జోడించి చెప్పాలని ఆదేశం. నియంత పాలించే ఆ దేశంలో, ఆయన ఆదేశం శిరోధార్యమాయే. దాంతో ఒకటికి పదిసార్లు రేడియోలో ఆయన పేరు వచ్చేది. ఒకటికి పదిసార్లు జనం దాన్ని వినాల్సి వచ్చేది. ఎలా అంటే ఇలా:
“His Excellency the President of the Republic of Uganda, General al Haji Idi Amin Dada, VC, DSO, MC……”
ఏమి సేతురా లింగా.....
తోకటపా:
ఎనభయ్యవ దశకం పూర్వార్థంలో, ఆకాశవాణి, దూరదర్శన్ లు మాత్రమే రాజ్యమేలుతున్న రోజుల్లో, వాటిని ఇందిరా వాణి అనీ, రాజీవ్ దర్శన్ అనీ గిట్టని వాళ్ళు ముద్దుగా పిలిచేవారు. వాటి మీద, అవి ప్రసారం చేసే కార్యక్రమాలమీద ఏలినవారి పెత్తనం, సర్కారువారి ముద్ర అంతగా వుండేవని చెప్పడం అందులోని శ్లేష. ఆ తరవాత రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు, అక్కడి దేశాధినేత అనండీ , పార్టీ నేత అనండీ, మిహాయిల్ గోర్భచేవ్, రష్యన్ టీవీ తెరపై గంటలు గంటలు కనబడే తీరు చూసిన తర్వాత మానవ మనస్తత్వం మనస్తత్వం తాలూకు అసలు తత్వం బోధపడింది.
మేము అలా అనుకుంటూ సంతోషంగా ఆ రష్యన్ టీవీ కార్యక్రమాలు చూస్తూ రోజులు గడుపుతున్న రోజుల్లో ఒక ఆరబ్ దేశం నుంచి నాకు తెలిసిన ఒక తెలుగు మిత్రుడు ఏదో పని మీద మాస్కో వచ్చి, మా ఇంట్లో రష్యన్ టీవీ ప్రోగ్రాములు చూసి ఎంతగానో మురిసి ముక్కచెక్కలవ్వడం చూసి, మాకు మతి పోయింది. కదిలిస్తే అతగాడు చెప్పిన కధ, అర్జున విషాద యోగాన్ని తలపించింది.
ఆ దేశంలో టీవీ తెరపై, ఉదయం నుంచీ రాత్రి పడుకునే వరకూ బోధలు ప్రవచిస్తూ , సూక్తులు వల్లిస్తూ ఒకే ఒక్క పెద్దమనిషి అస్తమానం దర్శనం ఇస్తాడట. ఆ ప్రోగ్రాములు చూసీ చూసీ వచ్చిన ఆ పెద్దమనిషికి, రష్యన్ టీవీ కార్యక్రమాలు చల్లని వేళలో ప్రియురాలి వెచ్చని కౌగిలిలా ఎంతో ఉల్లాసాన్ని కలిగించాయి. అందుకే అన్నారు మనుషుల బాధలు, ఇబ్బందులు అన్నీ సాపేక్షం (రిలెటివ్). ఇతరులతో పోల్చి చూసుకుంటే సగం బాధ తగ్గిపోతుందంటారు .
మానవ మనస్తత్వం తీరే అంత. మన ఇంట్లో కరెంటు పోతే, కరెంటు కంప్లైంట్ చేయడానికి ముందు, పక్క వాటాలో కరెంటు వుందో లేదో చూడాలనిపిస్తుంది. పొరుగు వారింట్లో కూడా కరెంటు పోతే ‘అదో తుత్తి’.
కింది ఫోటో:
40 ఏళ్ళ క్రితం రేడియో మాస్కోలో నా ఫోటో గుర్తింపు కార్డు


(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: