7, జూన్ 2026, ఆదివారం

జీవితం తెరిచి పెట్టిన పుస్తకం: భండారు శ్రీనివాస రావు

 

ముందు ముందు మానవ జీవితాల్లో వచ్చే పెనుమార్పులు గురించి ఊహా కధనాలతో ఇంగ్లీష్ లో అనేక పుస్తకాలు వచ్చాయి. చిన్నప్పుడు విన్న బ్రహ్మం గారి కాలజ్ఞానం, పెద్దప్పుడు చదివిన నాస్ట్రడామస్ కూడా ఒక ఉదాహరణ. ఇటీవలి కాలంలో Veerendranath Yandamoori యండమూరి వీరేంద్రనాద్ నవలలు కొన్ని ఈ కోవలోనే రూపుదిద్దుకున్నాయి.
2013 నాటికి ఏఐ (కృత్రిమ మేధ), చాట్ జీపీటీ మొదలైన పదాలు కూడా వాడుకలో లేవు.
“మరుగేలరా ఓ రాఘవా” అని పాడుకునే రోజులకు రోజులు దగ్గర పడుతున్నాయని అప్పటికే కొన్ని సూచనలు కనిపించడం మొదలైంది. ఇక ముందు ముందు మనుషుల జీవితాల్లో చాటు మాటులు వుండవు. అంతా బహిరంగమే. ‘బతుకు బస్ స్టాండ్’ అనుకుంటూ బాధపడే భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిపే ఓ ఆంగ్ల కధనానికి నా తెలుగు స్వేచ్ఛానువాదాన్ని పదమూడు సంవత్సరాల కిందటే నా బ్లాగులో పోస్టు చేశాను. అదే ఇది:
2020లో బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేయడం కోసం చట్నీస్ కు ఫోన్ చేస్తే ఆ సంభాషణ ఇలా సరసంగా సాగుతుంది.
“గుడ్ మార్నింగ్. నాకు వెంటనే నాలుగు ప్లేట్లు .....”
“ఒక్క నిమిషం సర్! మీ మల్టీ పర్పస్ కార్డ్ నెంబర్ చెబుతారా?”
“కార్డు నెంబరా! ఒక్క నిమిషం ఆగండి చూసి చెబుతాను..... నా నెంబరు ... 889861356102049 998-45-54610"
“థాంక్స్. అయితే మీ పేరు శ్రీనివాసరావు. శ్రీనగర్ కాలనీ దగ్గర యెల్లారెడ్డి గూడా, హనుమాన్ మందిర్ పక్కన మధుబన్ అపార్ట్ మెంటులో మూడో అంతస్తులోని ఫ్లాట్లో వుంటారు. మీరక్కడ ఎనిమిదేళ్లుగా అద్దెకు వుంటున్నారు. మీ లాండ్ లైన్ నెంబరు 23731056. అది బీ యస్ ఎన్ ఎల్ కనెక్షన్ కావడం వల్ల ప్రస్తుతం పనిచేయడం లేదు. అంచేత మీ మొబైల్ నెంబరు ఒక్కటే మీ కాంటాక్ట్ నెంబరు. ఈ వివరాలు కరక్టే కదా! ఇక ఇప్పుడు చెప్పండి. మీకేమి కావాలి?”
“నాకేమి కావాలో చెబుతాను సరే! ఇంతకీ నా ఫోను నెంబర్లు, నా వివరాలు మీ దగ్గర ఎలా వున్నాయి?”
“సిష్టంతో కనెక్ట్ అయివున్నాం సర్”
“సరే! నాకు త్వరగా నాలుగు ప్లేట్లు బాబాయి ఇడ్లీ ...”
“వన్ మినిట్ సర్! మీరు మొన్న ఉదయం మీ భార్యతో కలసి వెళ్లి యూసుఫ్ గూడాలోని విజయ డయాగ్నాస్టిక్ సెంటర్ లో షుగర్ చెక్ చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం మీరు ఉదయం పూట ఇడ్లీ తినడం అంత శ్రేయస్కరం కాదు. మీ ఆవిడ రిపోర్ట్ బాగానే వుంది. ఆమెకు ఇడ్లీ చెబుతాను. మీకు బ్రౌన్ బ్రెడ్ శాండ్ విచ్ ఆర్డర్ చేస్తాను.”
“ఓకే! బిల్లు సుమారుగా ఎంతవుతుంది?”
“యెంత సర్! చాలా తక్కువ. సర్వీస్ చార్జ్ కాకుండా పన్నెండు వందలు”
“కార్డు మీద పే చెయ్యవచ్చా?”
“తప్పకుండా. కాకపోతే చిన్న ప్రాబ్లం సర్! కంప్యూటర్ చెబుతున్నదాన్నిబట్టి చూస్తే మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ రికార్డు ఏమీ బాగా లేదు. ఇప్పటికే మూడు వాయిదాలు కట్టలేదు. హౌసింగ్ లోన్ బకాయి కూడా పేరుకు పోయి వుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా క్యాష్ మాత్రమే కట్టాల్సి వుంటుంది”
“ ఓ షిట్! ************”
“సర్! మీరు అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసలే మీ మీద బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఒక కేసు నమోదయి వుంది. మూడు రోజుల క్రితం బార్ నుంచి కారులో వస్తూ పోలీసులకు పట్టుపడి వాళ్ళతో తగాదా పెట్టుకున్నారని రికార్డ్ చెబుతోంది. కాబట్టి మరో కేసుకు అప్పుడే తొందర పడవద్దని మర్యాద పూర్వకంగా సలహా ఇస్తున్నాను.”
“ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!”
“అదిగో సర్! అదే వద్దన్నాను. తల్లి ఏమిటి తల్లి! బల్లి లాగా...”
ఇవతల వ్యక్తి పరిస్తితి చెప్పక్కరలేదు. ఊహించుకోవచ్చు. ఏదో చిత్రంలో బ్రహ్మానందం పాత్ర మాదిరిగా కింద పడి గిల గిలా కొట్టుకుంటున్నాడు.
ఈ కధనంలో పేర్కొన్న ఊహలను మించిన సాంకేతిక ఆవిష్కరణలు ఇప్పటికే మొదలయ్యాయి. మనం కళ్ళారా చూస్తున్నాము కూడా.
ముందు ముందు మనుషులకు ప్రైవసీ అంటూ ఏమీ వుండదు. జీవితాలు అన్నీ తెరిచిపెట్టిన పుస్తకాలే.

కామెంట్‌లు లేవు: