26, జూన్ 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో : (333) – భండారు శ్రీనివాసరావు

 

ఓం నమో శ్రీ నారసింహాయ
ఒక పుస్తకం చదువుతాం. మంచి పుస్తకం చదివాము అనిపిస్తే రచయితకు అభినందనలు తెలియచేయాలని ప్రయత్నిస్తాం. కుదరక పొతే చదివిన ఆ పుస్తకం గురించి మనకు తెలిసిన నలుగురితో చెప్పుకుంటాం. కుదిరితే ఫేస్ బుక్ లో నాలుగు మంచి వాక్యాలు రాస్తాం.
కానీ సత్యానందంగారి రూటే సపరేటు.
ఆయన గారు పూర్వాశ్రమంలో ఓ బ్యాంకు ఉద్యోగి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే అగ్రశ్రేణి బ్యాంకులో చాలా కాలం పనిచేసి ప్రస్తుతం రామా కృష్ణా అంటూ కాలక్షేపం చేస్తున్నారు. నిజంగానే సుమా. ప్రతి నిత్యం రాముడి గుడికి వెడతారు. సజ్జన సాంగత్యంలో పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో శేష జీవితం గడుపుతున్నారు.
ఒకరోజు ఓ పుస్తకం ఆయన కంటపడింది. చదివారు. మళ్ళీ చదివారు. తీరిక వున్నప్పుడు కొన్ని సార్లు, తీరిక చేసుకుని చాలా సార్లు ఆ పుస్తకాన్ని పదే పదే చదివారు. అదే పనిగా అనేక సార్లు చదివారు. తనకు నచ్చిన ఆ పుస్తకాన్ని ఇంట్లో వారి చేత చదివించారు. తెలిసిన వారికి ఇచ్చి చదివించారు.
ఇక ఇది పని కాదనుకున్నారు. ఆ పుస్తకాన్ని పునర్ ముద్రించి నలుగురికీ లభ్యం అయ్యేలా చూడాలని సంకల్పించారు.
ఆయనేమీ బ్యాంకులో డబ్బులు మూల్గుతున్న సంపన్నులు కారు. అతి సాధారణ జీవితం గడుపుతున్న అతి మామూలు వ్యక్తి.
అయితేనేం ఆయన సంకల్ప బలం గొప్పది. సంకల్ప ముహూర్తం అంతకన్నా గొప్పది. అందుకే ఆయన సంకల్పం సిద్ధించింది. ఆ పుస్తకం అచ్చు గుద్దినట్టు పాత పుస్తకమే కొత్త రూపంలో బయటకు వచ్చింది.
ఆ పుస్తకం పేరు ఓం నమో శ్రీ నారసింహాయ
ఆ పుస్తక రచయిత మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడే సైదాబాదు రామాలయం ఆవరణలో, స్వామివారు శ్రీరామచంద్ర మూర్తి సన్నిధిలో, నాలుగేళ్ల క్రితం, 2022 లో ఒక రోజున, భారత ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్ వంటి అత్యున్నత పదవిని నిర్వహించిన శ్రీమతి రంజనా కుమార్ చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది.
(విచిత్రం ఏమిటంటే ఈ పుస్తకం ఏడు సంపుటాలు వెలువడినప్పుడు కూడా ఎలాంటి ఆవిష్కరణ జరగలేదు. మా అన్నగారు పర్వతాల రావు గారు, రాష్ట్రంలోని ప్రధానమైన నారసింహ క్షేత్రాలను దర్శించి ఆ పుస్తకాలను భక్తులకు ఉచిత పంపిణీ నిమిత్తం ఆయా దేవాలయాలకే సమర్పించారు)
రంజనా కుమార్ తమ వయసును కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఆసాంతం వుండి పోయారు. ఆమె గతంలో ఇండియన్ బ్యాంక్ చైర్మన్, నాబార్డ్ చైర్మన్ వంటి ఉన్నతోద్యోగాలు చేసే ముందు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేశారు. తెలుగు కొంచెం కొంచెం తెలిసిన కాశ్మీరీ.
పుస్తకం చదివారో, లేదా ఎవరిచేతనయినా చదివించుకుని తెలుసుకున్నారో కానీ రంజనా కుమార్ గారు అద్భుత ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పుస్తకం గురించి కన్నా, రాసిన రచయిత ప్రస్తావన ఎక్కువ ఉండేలా జరిగిన ప్రసంగాలను ఈ ఆవిష్కరణ సభలో విన్నాను. అంతటి పెద్ద మనిషికి చిన్న తమ్ముడిని అయినందుకు మరోమారు గర్వపడ్డాను.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెన్నై స్టేట్ బ్యాంక్ సీ.జీ.ఎం. గా వున్నప్పుడు ఇండియన్ బ్యాంక్ చైర్మన్ గా శ్రీమతి రంజనాకుమార్ పనిచేశారు. అంచేత వారిద్దరికీ పూర్వ పరిచయం కొంత వుంది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత కలుసుకున్నప్పుడు వారిద్దరూ పాత విషయాలను మననం చేసుకున్నారు.
పర్వతాల రావు గారి పుత్రుడు రాఘవరావు, అతడి కుమారుడు పరాశర, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీమాన్ శ్రీనివాసాచారి, రామాలయ కమిటీ చైర్మన్ శ్రీ నరసింహా రెడ్డి, అప్పటి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అరుణారెడ్డి, సత్యానందం గారితో సహా అనేకమంది బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ అధికారులు, కాలనీ వాసులు అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తోకటపా:
ఓం శ్రీ నమో నారసింహాయ పుస్తకం చదివిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారికి ఒక సందేహం కలిగింది. అది స్వయంగా నాతోనే చెప్పారు. మీ అన్నయ్యను అడిగి చెప్పు అని కూడా అన్నారు. ఈ విషయం గురించి మరో సారి.



(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: