13, జూన్ 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (325) : భండారు శ్రీనివాసరావు

మరో అమ్మాయి కధ

(నిన్నటి తరువాయి)
జీవనయానంలో ఎంతో మంది తారసపడుతుంటారు. అయితే కొద్ది మందే యాదిలో వుంటారు.
ఈ అమ్మాయి అంకిత మా ఇంటికి వచ్చి అప్పటికి ఏడాది అవుతోంది.
నా కొడుకు కోడలు ఉద్యోగస్తులు. మనుమరాలిని చూసుకోవడానికి మా ఆవిడ లేదు.
అంచేత ఏదో ఏజెన్సీని సంప్రదించి ఓ కేర్ టేకర్ అమ్మాయిని పెట్టారు. ఆ అమ్మాయి పేరు తప్ప వాలకం నాకు ఏమాత్రం నచ్చలేదు. గాంధీ గారి కళ్ళజోడులాంటి గుండ్రటి పెద్ద కళ్లద్దాలు. ఆధార్ కార్డు ప్రకారం వయసు 22. కానీ ఆ పిల్ల పీలగా పద్నాలుగేళ్ళ అమ్మాయిలా వుంది.
అయినా ఛాయిస్ నాది కాదు.
మనుమరాలు జీవికని కనిపెట్టి చూసుకోవడమే ఆ అమ్మాయి పని.
ఇంట్లోనే వుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నా కంట్లో పడేది. చీదరించుకున్నట్టు చూసేవాడిని.
ఈలోగా ఘోరం జరిగిపోయి మా వాడు సంతోష్ ఆకస్మిక గుండె పోటుతో చనిపోయాడు.
నాకు ప్రపంచం యావత్తూ శూన్యంగా మారింది. ఆరోగ్యం దెబ్బ తిన్నది. కను చూపు మందగించింది. మా కోడలు నిషా శ్రద్ధ తీసుకుని కంటి ఆపరేషన్ చేయించింది.
కొన్ని రోజులు గంట గంటకీ కంట్లో చుక్కలు వేయాలి. ఆ పని అంకిత చూసింది. అలారం పెట్టుకుని కరక్టు టైముకి వేసింది.
ఆ తర్వాత బీపీ షుగర్ సమస్యలు. ఎప్పటికప్పుడు మిషన్ల మీద రీడింగ్ తీసుకుని ఒక పుస్తకంలో నోట్ చేసుకుని డాక్టర్లు అడగగానే ఫోన్లో చెప్పే బాధ్యత స్వచ్చందంగా తీసుకుంది. వేళకు గుర్తు పెట్టుకొని మందులు ఇచ్చేది.
ఈ నర్సింగ్ సర్వీసుతో ఆ అమ్మాయి పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
ఆడపిల్లలు లేని నాకు ఈ అమ్మాయిని ఆ దేవుడే పంపాడు అని నిర్ధారణకు వచ్చాను.
అయితే ఒక విషయం చెప్పాలి.
ఇంత మొండి పిల్లను నా జీవితంలో చూడలేదు.
పాలవాడో, పేపరు వాడో వచ్చి డబ్బులు అడుగుతాడు.
‘అమ్మా అంకితా వెళ్లి నా ప్యాంటు జేబులో పర్స్ తీసుకురా’ అంటే ససేమిరా వినదు. ‘హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చేటప్పుడే మా అమ్మ ఇతరుల డబ్బు తాకవద్దు అని చెప్పి పంపింది’ అంటుంది.
‘నేనే చెబుతున్నా కదా’ అన్నా వినదు. తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు బాపతు.
ఈ కాలంలో ఇంత నిజాయితీ అరుదు.
సంక్రాంతి, దసరా వంటి పండుగలకు, చీరలో డ్రెస్సులో కొనుక్కోమని వంటమనిషి వలలికి, (అసలు పేరు వనిత) పనిమనిషి మమతతో పాటు డబ్బు ఇస్తే అంకిత తీసుకోదు.
'మీరు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా జీతం పదిహేను వేలు లెక్క కట్టి ఇస్తున్నారు కదా! నా సంపాదనతోనే ఏదైనా కొనుక్కుంటాను, ఇక్కడ నాకు విడిగా పెట్టే ఖర్చు లేదు, నా అవసరాలు అన్నీ మీరే చూసుకుంటున్నారు. ఒక వేయి నేను వుంచుకుని మిగిలింది మా అమ్మకు జీపే చేస్తాను’ అంటుంది ధీమాగా, ఎంతో బాధ్యతగా. ‘ఆ వెయ్యి కూడా నా సినిమాల పిచ్చికి. నెలలో ఒక ఆదివారం సెలవు ఇస్తే ఆ రోజు మెట్రోలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నాలుగాటలు చూసి వస్తాను’ అనేది. ‘మరి భోజనం’ అంటే, ‘పర్వాలేదు, ఏదైనా మెస్సులో, కాదంటే సినిమాహాలుకి దగ్గరలో వుండే గుడిలో పెట్టే ప్రసాదం తినేస్తాను’ నాకు వచ్చే జవాబు ఇదన్న మాట.
‘ఏ రోజు ఎక్కడ ఉంటానో తెలవదు, ఏజెన్సీ వాళ్ళు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. కానీ ఒక్క విషయంలో మాత్రం నాదే నిర్ణయం. నేనా శారీరకంగా బలహీనురాలిని. నేను పెంచే పిల్లలు చిన్నవాళ్లు అయి వుండాలి. పనిచేసే ఇల్లు మెట్రోకి దగ్గరలో వుండాలి. ఇంట్లో కెమెరాలు వుండాలి. నేను ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తున్నానో ఆ ఇంటి వాళ్ళకి తెలియాలి. అనవసరంగా మాట పడే రకం కాదు నేను.
‘నాకు వేరే ఖర్చులు లేవు, సినిమా ఖర్చు తప్ప. డ్రెస్సులు అవీ అవసరం మేరకే. ‘పెద్ద లగేజీతో దిగింది’ అని ఇంటి వాళ్ళు అనుకోకూడదు. ఒక పెద్ద సంచీ, ఒక చిన్న సంచీ, అంతే! తాళం వున్న సూటు కేసు కూడా వాడను. నేను నిజాయితీగా వుంటాను. సరే. కానీ ఆ విషయంలో ఎవరికీ వీసమెత్తు అనుమానం వచ్చినా నేను భరించలేను’.
ఇలా వుంటాయి ఆ అమ్మాయి మాటలు.
మా మనుమరాలు జీవిక అంటే అంకితకు ప్రాణం. రైల్లో ఒక్కతే కటక్ వెళ్ళింది చూడడానికి. భాష తెలియదు. మా కోడలు నిషా భువనేశ్వర్ స్టేషన్ నుంచి కటక్ కు ఉబెర్ బుక్ చేసి ఓటీపీ పంపింది. ధైర్యంగా ఒంటరిగా వెళ్ళింది. ‘అమ్మకు లొకేషన్ షేర్ చేశాను, ఇంకా భయం ఎందుకు?’ అనే ధీమా.
కటక్ వెళ్ళే ముందే గూగుల్ లో అక్కడ చూడాల్సిన ప్రదేశాలు సెర్చ్ చేసింది. అన్నీ దేవాలయాలే. ఆ పేర్లు నేను కూడా వినలేదు. భాష తెలియకపోయినా ఉబెర్ ఆటోలో తిరుగుతూ అన్నీ చూసింది. ఏదో ఒక గుడిలో వాళ్ళు పెట్టిన ప్రసాదమే ఆ పూటకు భోజనం.
‘దాదాపు అయిదేళ్లుగా అనేక మంది ఇళ్ళల్లో చేశాను. ఎక్కడా ఎవ్వరూ మీరు ఇచ్చినంత స్వేచ్ఛ ఇవ్వలేదు. ఎండాకాలం ఏసీ వేసుకుని పడుకున్నా ఏనాడు ఒక్క మాట అనలేదు. మామూలుగా అయితే ఎక్కడైనా ఉద్యోగం మానేసినప్పుడు, కొత్తది దొరికేదాకా గరల్స్ హాస్టల్ లో వుంటాను. రోజుకి మూడు వందల యాభయ్ రూపాయలు. భోజనం టిఫిన్, పడక అన్నీ అందులోనే. బాత్ రూమ్ గీజరు వుంటాయి. మరో ముగ్గురు అమ్మాయిలు గదిలో నాకు తోడు. నేను దాచుకున్న డబ్బు అలాంటి సమయాల్లో ఉపయోగపడుతుంది. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు జాబ్ దొరికి తీరుతుంది. ఈ రోజుల్లో మా అవసరాలు అలాగే వున్నాయి. కొందరు ఇరవై వేలు ఇస్తాము అంటారు. కానీ నాకు ఇష్టం లేకపోతె ఒప్పుకోను. పదిహేను చాలు. నెలకు వేయి చొప్పున దాచుకుని లక్ష కూడబెట్టాలనేది నా కోరిక. అదీ పెళ్లి ఖర్చుకి. మా అమ్మావాళ్ళ మీద భారం వేయను. కట్నం లేకుండా చేసుకునేవాడినే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఖర్చు మాత్రం నాదే’
చూడగలిగిన కళ్ళు వుండాలే కానీ, ఆత్మాభిమానంలో కూడా మనిషి సౌందర్యం ఉట్టి పడుతుంది.
‘ఏడాదికి ఒకసారో, రెండు సార్లో, కరీంనగర్ జిల్లాలో కడగొట్టున వున్న మా ఊరు వెడతాను. రెండు బస్సులు మారి వెళ్ళాలి. బస్సు ఫ్రీ. డైరెక్ట్ బస్సు వుంది కానీ అందులో ఆడవాళ్ళకి కూడా టిక్కెట్టు తీయాలి. ఊళ్ళో మా వాళ్ళు పొలం కూలీలు. అక్కడ వున్నన్నాళ్ళు నేను కూడా కూలీకి వెడతాను.
‘ఏటా నవంబరులో కులదేవత పూజలు అవీ వుంటాయి. నెల రోజులు ఎక్కడా వుండను, వూరికి పోతాను. పనిలో చేరేటప్పుడే ఈ విషయం స్పష్టంగా చెబుతాను’
ఆ వయసు అమ్మాయి మాటల్లో, ఆ క్లారిటీ చూసి ఆశ్చర్య పోయాను.
మొన్నీ మధ్య కోడలు నిషా ఆఫీసు పని మీద, అమెరికా ట్రిప్ కోసం హైదరాబాదు వచ్చి ఓ నాలుగు నెలలు వుంది. మనుమరాలు జీవికని దగ్గర డే స్కూల్లో చేర్పించింది. ఇది తెలియగానే అంకిత వచ్చి మళ్ళీ పనిలో చేరింది. కిందటి నెల చివర్లో జీవికని తీసుకుని కోడలు కటక్ వెళ్ళిపోయింది. ‘ఏజెన్సీ నుంచి పిలుపు వచ్చేవరకు మీ ఇంట్లో ఉండవచ్చా మేడం’ అని అడిగి వుండి పోయింది.
మొన్న ఆదివారం ఆ పిలుపు వచ్చింది. ఎక్కడో జూబిలీ హిల్స్ ఇంట్లో పని కుదిరింది.
తన రెండు సంచులు సర్దుకుని, మధ్యాన్నం లంచ్ తర్వాత కొత్త ఇంటికి బయలుదేరి వెళ్ళింది, ఆటోలో, అత్తవారింటికి వెళ్ళే అమ్మాయిలా, నా కాళ్ళకు దండం పెట్టి మరీ.
కన్న కూతురు కాదు కానీ కన్న బిడ్డే!
వెడుతూ వెడుతూ ఒక మాట చెప్పింది, ‘జనవరిలో నేను కటక్ వెడతాను, అయిదో తేదీ జీవిక పుట్టినరోజు కదా!ముందు బుక్ చేసుకోకపోతే రైల్లో టిక్కెట్లు దొరకవు’
నాకు బుర్ర తిరిగింది. ఎప్పుడు జనవరి. ఇప్పుడు జూన్ లోనే ఉన్నాము, ఇంకా ఆరు నెలలు టైం వుంది.
ఆ అమ్మాయి దిగే స్టేషన్ వచ్చింది. దిగిపోయింది. మంచి జ్ఞాపకాలు మిగిల్చిపోతోంది. అంతే అనుకోవాలి.
ఈ రోజుల్లో పనివాళ్ళు దొరుకుతారేమో కానీ పనిమంతులు దొరకడం కష్టం.
ఈ పోస్టు అంకితకే అంకితం.
తోకటపా:
మా పిల్లలలాగే అంకితకు కూడా తన ఫొటో సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేయడం అస్సలు ఇష్టం వుండదు. మా మనుమరాలు జీవికతో వున్న ఫోటోల్లో తాను వుంటే, అది ఎడిట్ చేసే దాకా వూరుకోదు. అంత పెంకి ఘటం.
కాకపోతే అంకిత INSTA లో వుంది.
అదీ ఎవరికోసం
హీరో మహేష్ బాబు కోసం.
తాను ఆ నటుడికి dhfm అంటే Die hard fan for Mahesh Babu ట.
(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: