20, నవంబర్ 2017, సోమవారం

కాగితాన్వేషణ – భండారు శ్రీనివాసరావు


రిటైర్ అయి పుష్కరం దాటింది. ఆ కాలంనాటి రాతలు, కోతలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్. అన్నీ కంప్యూటర్ల మీదే. అయినా ప్రతిదానికీ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మాత్రం తప్పడం లేదు. అదృష్టం! ఎవరూ దక్షిణలు అడగడం లేదు.




మొన్న పెన్షన్ స్లిప్ మెయిల్ లో పంపారు. వివరాలు అన్నీ సరిగానే వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం కలిసి ఫోటో దిగలేదు కానీ, రిటైర్ అయ్యేముందు పెన్షన్ పుణ్యమా అని ఇద్దరం పొలోమని స్టూడియోకి వెళ్లి మరీ ఫోటో తీయించుకుని ఆఫీసులో ఇచ్చాము. తీరా ఇప్పుడు చూస్తే నామినీ పేరు గల్లంతు. ఇలాటి విషయాల్లో కాలయాపన పనికిరాదు అనే మా మాజీ స్టేషన్ డైరెక్టర్ శాస్త్రి గారి మాట విని కోటీలోని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. 1975లో రేడియోలో చేరినప్పటి నుంచి నా అక్కౌంటు అక్కడే, అప్పట్లో అన్నీ మానవ సంబంధాలు. స్లిప్పు రాయడం, టోకెన్ తీసుకోవడం, మన నెంబరు పిలిచినదాకా ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెబుతూ కాలక్షేపం చేయడం, లేదా బ్రాంచి మేనేజర్ దగ్గర భేటీ వేయడం అలా కాస్త కాలక్షేపం కాస్త స్వకార్యం. ఇప్పడు అలా లేదు. ఒక పెద్ద అధునాతన ఎయిర్ పోర్ట్ మాదిరిగా వుంది. అన్నీ కంప్యూటర్లు, వాటి వెనక కనీకనపడక సిబ్బంది తలకాయలు. పనిచేస్తున్నారో, సెల్ ఫోన్లు చేస్తున్నారో తెలవదు. అంతా హడావిడి. బయట కస్టమర్లది కూడా అదే తంతు. ఒకరికొకరు తెలవదు, ఎవరికి వారికి తమ పని ముందు చక్కబెట్టుకుని చక్కా పోవాలనే ఆత్రుత. ‘చివరికి ఇక్కడ కాదు, పెన్షనర్ల విభాగం మరో పక్కన అదే ఆవరణలో వుంది, అక్కడికి వెళ్లండని చల్లగా కబురు. ఆ బిల్డింగు పెద్ద పెద్ద పొడవాటి మెట్ల వరుసతో చాలా అందంగా, అధునాతనంగా వుంది. మొదటి అంతస్తులో వుంది ఈ విభాగం. మా ఆవిడను తీసుకుని వెళ్ళిన రోజు జనం లేరు, ఖాళీగా వుంది. బయట రిసెప్షన్ లో ఎవరూ లేరు. గాజు తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి అక్కడ ఒకర్ని వాకబు చేసాను. అతడు ఆశ్చర్యంగా నా వంక చూసి, ‘ఇక్కడి దాకా ఎలా వచ్చారు. లోపలకు ఎవరూ రాకూడదు, బయట రిసెప్షన్ వరకే మీకు అనుమతి’ అంటూ నాకు ఓ క్లాసు పీకాడు. బయటకు వచ్చి చూస్తే రిసెప్షన్ సీటు ఖాళీగా వుంది. కాసేపటికి ఒకావిడ వచ్చి అక్కడ నిల్చుంది. ఆవిడ ఉద్యోగా, నాలాగా వచ్చిన మనిషా అని తేరిపార చూస్తుంటే ఆవిడ కళ్ళు విప్పార్చి ‘ఏం కావాలి’ అని అడిగింది. వెళ్లి చెప్పాను. పేరు, అక్కౌంట్ నెంబరు వివరాలు అడిగి తెలుసుకుంది. నేను, ‘మా ఆవిడ మా ఆవిడే’ అనడానికి నాదగ్గర ఉన్న అన్ని ఆధారాలు అంటే ఆధార్ కార్డు, పెన్షనర్ కార్డు, ఏళ్ళతరబడి అదే బ్యాంకులో ఉన్న బ్యాంకు జాయింటు అక్కౌంట్ వివరాలు, పాసుపోర్టు ఇలా అన్నీ ఆవిడ ముందు పెట్టాను. ‘పెన్షన్ పేమెంటు ఆర్డరు ఏదీ’ అని అడిగింది. రిటైర్ అయిన తరువాత నాలుగిళ్ళు మారాను. ఈ సంధి కాలంలో ఏటీఎంలు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు వగైరాలు వచ్చిపడి కొన్ని పాత కాగితాలకు కాలం చెల్లిపోయిందని నిర్లక్ష్యం చేసిన జాబితాలో ఈ కాగితం కూడా చేరి పోయివుంటుంది. కానీ ఆ కాగితం లేనిదే పని జరగదు అనే తెలివి తెచ్చుకుని ఇంటికి చేరి ఇంటిల్లిపాదీ ఆ కాగితాన్వేషణ కార్యక్రమంలో తలమునకలు అయ్యాము. ఇల్లంతా చిందర వందర కావడం తప్పిస్తే కాగితం జాడ లేదు. అతి ముఖ్యమైన వాటిని అతి జాగ్రత్తగా దాచే నైపుణ్యం కలిగిన మా ఆవిడే వాటి పత్తా కనుక్కుంది. పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మల్లో దాచినట్టు, పెన్షన్ పత్రాలను ఒక సీనా రేకుల పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భద్రంగా అటక ఎక్కించింది.దాన్ని దింపి చూస్తే ఎప్ప్పుడో పుష్కరం నాడు దిగిన మా దంపతుల ఫోటో ఉన్న పెన్షన్ పేమెంటు ఆర్డరు బుక్కు కనిపించింది. తెల్లారగానే దాన్ని పట్టుకుని, దారి మధ్యలో జిరాక్స్ కాపీలు తీయించి, ఈరోజు అక్కడికి పడుతూ లేస్తూ వెళ్లాను.



పోయి చూస్తె, ఆ రిసెప్షన్ హాలు మొత్తం పెన్షనర్లతో కిటకిట లాడుతోంది. నా మొహం చూసి నాలాగే పనిమీద వచ్చిన ఒకాయన, ‘సోమవారం మాస్టారు, సోమవారం రష్ ఇలాగే వుంటుంది’ అన్నాడు. కాసేపటి తరవాత ఆయనే కలిగించుకుని ‘అలా నిలుచుండి పొతే అలాగే వుంటారు. ముందు ఆ రిసెప్షన్ బల్ల మీద ఉన్న రిజిస్టర్ లో మీ వివరాలు రాయండి’ అన్నాడు. “ఇక్కడ నిఘా కెమెరాలు వున్నాయి, కాస్త నవ్వు మొహం పెట్టండి’ అనే బోర్డులు వున్నాయి కానీ, ఈ ముఖ్యమైన సంగతి తెలిపే సమాచార సూచిక అక్కడ ఏమీ కనబడలేదు.
రిజిస్టర్ లో వివరాలు రాసి ఓ పక్కన నిలుచున్నాను. ఈసారి సీట్లో మరో అమ్మాయి కూర్చుని వుంది. ప్రతి ఒక్కరి కేసు తన కేసే అన్నంత శ్రద్ధగా వచ్చిన వారికి విసుక్కోకుండా పని చేసి పెడుతోంది. లైన్లో ఉన్న వాళ్లకు ఈ ఆలస్యం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పని తీరు నాకు బాగా నచ్చింది. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చాడు. అప్పుడే నా వంతు వచ్చింది. ఆ అమ్మాయి నాతో అన్నది, ‘చూడండి. నిజానికి వరసలో మీరే వున్నారు. ఈయన రిజిస్టర్ లో రాయలేదు. కానీ పెద్దాయన కదా! మీరు ఒప్పుకుంటే ముందీ పెద్దమనిషి విషయం కనుక్కుంటాను’
ఈ రకంగా వృత్తి ధర్మం నెరవేరుస్తున్న ఒక ఉద్యోగిని చూడడం చాలా అరుదు. ఆ పెద్ద మనిషి పని పూర్తి చేసిన తరువాత నన్ను పిలిచింది. వివరాలు అన్నీ మరో మారు పరిశీలించింది. నేను రిటైర్ అయినప్పుడు నామినీ విషయంలో పుట్టిన తేదీ పట్టింపు లేదు. కానీ అదిప్పుడు తప్పనిసరి. నేను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఒక వైద్యుడు రోగికి చెప్పినంత వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి పనిచేసే విధానం చూసిన తరువాత నాకు నా పని కాలేదన్న విచారం కలగలేదు. ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.
నిజానికి ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి ఉద్యోగులే.

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Very good narrative sir. We need such employees with service motive.

అన్యగామి చెప్పారు...

మీరు తరచూ ప్రోత్సాహకరంగా ఉండే సంగతులు వ్రాసిన, ఇది వాటికంటే ఈ కథ మెరుగైనది. చక్కగా పనిచేసే మనిషి గురించి ఇలాచెప్పటమే చేసేవాళ్ళకి, యువతకి, మిగిలిన వాళ్ళకి ఆదర్శం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ అజ్ఞాత: ధన్యవాదాలు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@anyagaami : ధన్యవాదాలు

Lalitha చెప్పారు...

ఈ పోస్ట్‌లో మీరు రాసిన స్టేట్‌బాంక్ అమ్మాయి విషయం చాలా బావుందండి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Lalitha TS: ధన్యవాదాలు