6, నవంబర్ 2017, సోమవారం

దిస్ ఈజ్ కేటీఆర్ - భండారు శ్రీనివాసరావు


“ప్రభుత్వం అన్నాక పొగిడే వాళ్ళు వుంటారు, తెగిడే వాళ్ళు వుంటారు. పూలూ వేస్తారు, రాళ్ళూ వేస్తారు. మా పార్టీ వాళ్ళు ఆహా ఓహో అంటారు, అది సహజం, దానికి పొంగి పోకూడదు. అలాగే ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు గుప్పిస్తారు. అదీ సహజమే. వాటికి కుంగి పోకూడదు. కానీ నిష్పాక్షికులయిన జర్నలిష్టులు ఏదైనా రాస్తే, అది ప్రతికూలంగా వున్నా విషయం ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.  అలాగే వాళ్ళు ఓ మాట మంచిగా రాస్తే ప్రశంసగా తీసుకోవాలి”
ఇలాగే కాకపోయినా ఇదే అర్ధం వచ్చే రీతిలో మాట్లాడారు తెలంగాణా పురపాలక, ఐ.టీ. శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు(కే.టీ.ఆర్)
ఈరోజు అనుకోకుండా ఓ పుష్కరం తర్వాత అసెంబ్లీకి వెళ్లాను. నేను చూసిన అసెంబ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది. ఎన్నో ఏళ్ళ పాటు రేడియో విలేకరిగా ఆ భవనంతో, అక్కడ జరిగే కార్యకలాపాలతో నాకు అనుబంధం వుంది. అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ కమిటీ సభ్యుడిగా కూడా వున్నాను.  1975 నుంచి 2005 వరకు  ముప్పయి ఏళ్ళపాటు నిరాఘాటంగా  అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ పాసు, అక్రిడిటేషన్ కార్డు కలిగిన  ఒక సీనియర్ జర్నలిష్టు అనే భావనతో కాబోలు తెలంగాణా  ప్రభుత్వం ఇంకా  వాటిని  కొనసాగిస్తోంది. ఈ ఉదారతకు నా  ధన్యవాదాలు.
మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత జ్వాలా పుణ్యమా అని తెలంగాణా అసెంబ్లీ భవనంలో కాలు మోపాను. వున్న కాసేపు ఆనందంగా గడిచింది.  మా కాలంలో పనిచేసిన కొందరు జర్నలిష్టులు (ఇండియా టుడే అమర్ నాద్ మీనన్, వార్త నాగేశ్వరరావు) అసెంబ్లీ కార్యదర్శి శ్రీ నరసింహాచారి మొదలయిన వారిని కలుసుకునే అవకాశం కూడా  దొరికింది.
నన్ను కూర్చోబెట్టింది సీఎం పేషీ అధికారులు కూర్చునే గది. సీఎం ఛాంబర్ ఆ పక్కనే వుంటుంది. మధ్యాన్నం అవుతోంది. అసెంబ్లీ ఇంకా కొనసాగుతోంది. అక్కడి టీవీలో చూస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడు శ్రీ జానారెడ్డి, ఉప నాయకుడు మల్లు భట్టి తమదయిన శైలిలో  వాక్బాణాలు విసురుతుంటే ముఖ్యమంత్రి అంతకంటే పదునుగా  జవాబు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే వెనకటి రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి. వై.ఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత. ఒకరికొకరు తీసిపోరు. ముఖ్యంగా అసెంబ్లీ చర్చల్లో. వాదమయినా, సంవాదమైనా హుందాగా సాగుతుంటే వినే వాళ్లకు చూడ ముచ్చటగా వుంటుంది.  మళ్ళీ తెలంగాణా అసెంబ్లీ జరిగే తీరు చూసి సంతోషం అనిపించింది.
ఇంతట్లో జామపండు తింటూ తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి గదిలోకి వచ్చారు. ఒక పక్కకు వెళ్లి పండు తింటూనే పక్క వ్యక్తి చెప్పేది వింటున్నారు. తీరా చూస్తే ఆయన ఎవరో కాదు, మంత్రి కేటీఆర్.
ఢిల్లీలో ఈ మధ్య  బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూలో నాపేరు ప్రస్తావించిన విషయం గుర్తు చేసి, కృతజ్ఞతలు చెప్పాను.
అప్పుడు కేటీఆర్ అన్న మాటల్నే నేను ఇందులో  నాందీ ప్రస్తావనగా పేర్కొన్నాను.
“నిష్పాక్షికులయిన జర్నలిష్టులు ఏదైనా రాస్తే, అది ప్రతికూలంగా వున్నా విషయం ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.  అలాగే వాళ్ళు ఓ మాట మంచిగా రాస్తే ప్రశంసగా తీసుకోవాలి”

దిస్ ఈజ్ కేటీఆర్!  
కింది ఫోటో:  హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సందర్భంలో  

            


2 కామెంట్‌లు:

Surya Mahavrata చెప్పారు...

Congratulations sir !!

Ram చెప్పారు...

Congratulatiosn Sir, that quality is missing in telugu media, mistakes are there from both sides, govt and influenced media, If normal user wanted to see plain news no place exist in telugu for now, atleast people like you are still taking care of those vaccume.