24, జనవరి 2025, శుక్రవారం

ఇదీ అసలు కధ – భండారు శ్రీనివాసరావు

  

నిజానికి రాద్దాం అనుకున్నది ఇది. పొరబాటున పోస్టు చేసింది వేరొకటి. తొందర్లో తప్పులు తొక్కటం అంటే ఇదే. 

‘భార్యను చంపి, ముక్కలు చేసి, కుక్కర్ లో ఉడికించి’ ...అంటూ ఈరోజు (గురువారం, 23-01-2025) పత్రికల్లో ఒక  భయంకరమైన కధనం వచ్చింది. చదవగానే కడుపులో తిప్పే ఇలాంటి వార్తను తక్షణమే మరచి పోవాలి. లేదా పేజీ తిప్పేయాలి.  కానీ నేను ఆ పని చేయకుండా 65 ఏళ్ళ కిందటి ఒక పాత క్రైం స్టోరీ పోస్టు చేశాను. తీరా చూస్తే ఈ వార్తకు ఆ స్టోరీకి పోలికే లేదు. అందుకే మళ్ళీ ఈ పోస్టు. వద్దు వద్దు అనుకుంటూ మళ్ళీ ఈపోస్ట్  లేమిటి అని మరోలా అనుకోవద్దు. తప్పు దిద్దుకునే ప్రయత్నంలో మరో పొరబాటు అని పెద్ద మనసుతో సరిపుచ్చుకోండి.

ఇది కూడా జరిగిన ఘోరమే. ఇది కూడా పాత రోజుల్లో కొన్ని పత్రికల్లో వచ్చింది. 

ఖమ్మం సాయిబాబాగా ప్రసిద్ధి చెంది అక్కడ ఒక ఆశ్రమం కూడా నిర్మించుకుని కొన్నేళ్ళ క్రితం పరమపదం చేరుకున్న జీవై కృష్ణమూర్తి స్వయంగా మా బాబాయి గారి అల్లుడు. మా అక్కయ్య మధురకు భర్త. పూర్వాశ్రమంలో సమర్ధుడైన పోలీసు అధికారి. యూనిఫారంలో ఆయన్ని చూస్తే మాకు ఒణుకు. నేరగాళ్లకు సింహస్వప్నం. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి గారి (ఆయన అప్పుడు కారులో లేరు, పైగా ఆ రోజుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు) కారును ట్రాఫిక్ ఉల్లంఘన కింద బుక్ చేస్తే, పనిష్ మెంటుగా నేర విభాగానికి బదిలీ చేశారు. 

ఆ రోజుల్లో జరిగిన కధ ఇది. నేను చాలా చిన్నపిల్లవాడిని. మా పెద్దవాళ్లు మాట్లాడుకుంటుంటే విన్న కధను గుర్తు చేసుకుని చెబుతున్నాను. ఆ కాలం నాటి వాళ్ళు ఎవరైనా వుంటే చదివి చెప్పండి. పొరబాటు వుంటే సరిదిద్దుకుంటాను.  

ఆ రోజుల్లో హుస్సేన్ సాగర్ ఒడ్డున కొన్ని కుక్కలు ఆహారం కోసం వెతుకుతూ కాలి గోళ్ళతో  తవ్వుతుంటే మనిషి చేయి ఒకటి బయటకు వచ్చింది. ఎవరో చెబితే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒకచోట చేయి, మరో చోట మనిషి తాలూకు మరో అంగం ఇలా పలుచోట్ల దొరికాయి. ఒక చోట ఆ మనిషి ధరించిన వస్త్రం (తరువాత అది ఆడవాళ్ళు ధరించే నైటీ అని తెలిసింది) కనబడింది. 

అప్పుడు మా బావగారు క్రైం ఇన్స్పెక్టర్. ఆ నైటీ భాగాన్ని పరిశీలనగా చూస్తే చాకలి గుర్తు కనిపించింది. (ఆ రోజుల్లో పేపర్లో అలాగే రాశారు కాని, ఈ రోజుల్లో ఇలా ఒక కులం పేరు రాయడం తప్పని తెలుసు. నన్ను మన్నించాలి). దర్యాప్తు చేస్తే ఆ గుర్తు బొంబాయిదని తేలింది. కృష్ణమూర్తిగారు బొంబాయి (ఇప్పుడు ముంబై) వెళ్లి ఆ గుర్తు ఆధారంగా తన పరిశోధన కొనసాగిస్తే, అది నానావతి అనే ఒక డాక్టర్ ఇంటిది అని తెలిసింది. తీగెను కదిలిస్తే డొంక కదిలింది.

కుటుంబ కలహాల కారణంగా ఆ డాక్టరుకు భార్యపై తగని కోపం ప్రబలింది. ఆ ఉద్రేకంలో ఆమెను ఇంట్లోనే హత్య చేశాడు. తరువాత పరిణామాలు ఆయన్ని భయపెట్టాయి. డాక్టరుగా అనేక ఆపరేషన్లు చేశాడు. శరీరంలో ఏ భాగాన్ని ఎలా కత్తిరించాలో బాగా తెలుసు. ఎలా కట్ చేస్తే రక్తం ఎక్కువగా స్రవించదో కూడా తెలిసిన మనిషి. ఆ పరిజ్ఞానంతో శరీర భాగాలను ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద సూటు కేసులో పెట్టి, రైల్వే స్టేషన్ కు వెళ్లి హైదరాబాదుకు వెళ్ళే రైలు ఎక్కాడు. తెలతెలవారుతుండగా ఆ సూటుకేసును రైలు బోగీ గుమ్మంనుంచి హుస్సేన్ సాగర్ లోకి నెట్టి వేశాడు. ఆ రోజుల్లో రిజర్వేషన్ల గొడవ లేదు కాబట్టి తిరుగు రైలులో బొంబాయి వెళ్ళిపోయాడు. హుస్సేన్ సాగర్ లో పడ్డ ఆ  సూటు కేసు తెరుచుకుని శరీర భాగాలు చెల్లాచెదురు అయ్యాయి. అవి ఒడ్డుకు కొట్టుకు వచ్చి భూమిలో కూరుకుపోయి చివరికి వీధి కుక్కల నోటికి ఒక చేయి దొరికింది. 

ఇదీ జరిగిన కధ. 

అప్పుడూ ఈ క్రైం స్టోరీ కధలు కధలుగా అంధ్రపత్రిక దినపత్రికలో వచ్చిన గుర్తు.

తోకటపా: బొంబాయిలో నానావతిని అరెస్టు చేసి మా బావగారు హైదరాబాదు తీసుకువచ్చారు. అప్పుడు సిటీ పోలీసు నేర విభాగం రేడియో స్టేషన్ కు దగ్గరలో వున్న సిటీ పోలీసు కంట్రోల్ రూమ్ పైన వుండేది. ముద్దాయిని విచారిస్తున్న సమయంలో అతడు  హఠాత్తుగా  మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు.




(ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్త)


(23-01-2025)

9 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆ ముద్దాయి పేరు కూడా నానావతేనా ?
మీ బావగారు నేరపరిశోధనలో చాలా ఓపిక గల పోలీసాఫీసరులా ఉన్నారు. ముంబైలో బట్టలుతికేవారు ఎన్ని వందలమంది ఉంటారు ! ఆ గుర్తు ఎవరిదో తెలుసుకోవడం కోసం అంత మందిని వాకబు చేసారా 😳 ? గ్రేట్ 🙏.

Punishment గా ట్రాఫిక్ నుంచి నేరవిభాగానికి బదిలీ చేసారా ? ఆశ్చర్యం. మన సినిమాల్లో రివర్స్ లో చూపిస్తుంటారే 🤔 ? నచ్చని పోలీసాఫీసరుని నేరవిభాగం నుంచో, లా & ఆర్డర్ విభాగం నుంచో ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసినట్లు చూపిస్తారే - చెప్పింది చెయ్యవా, సరే, నిన్నిప్పుడే ట్రాఫిక్ కు ట్రాన్స్ఫర్ చేసాను పో అని డైలాగ్ చెబుతుంటారు కదా 😃😃.

Zilebi చెప్పారు...

ವಿನರಾ ಗಾರೂ,

ஆ டிடெக்டிவ் கன்னா மீ டிடெக்‌ஷன்‌ பேஷோ :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“జిలేబి” గారు,
మమ్మల్నెందుకిలా చావగొడతారు ?

బాగానే వచ్చిన కన్నడ భాషా పరిజ్ఞానం తుప్పు పట్టింది. ఫరవాలేదు manage చెయ్యగలను అనుకున్న మలయాళ భాషా పరిజ్ఞానం కూడా దాదాపు పూర్తిగా మసకేసింది.

మీరేమో “పై గుర్తు (pi)” ఎక్కువగా కనిపిస్తున్న తమిళ భాష లిపిలో ఏదో వ్రాసేసి మా ముందుంచితే దాన్ని అర్థం చేసుకోవడానికి … అరవల ఊతపదంలాగా …. “ఛాన్సే” లేదు.

కాబట్టి పైన మీ అరవ వ్యాఖ్య లోని కవిహృదయం ఏమిటో సెలవిచ్చి పుణ్యం కట్టుకోరాదూ ?

అజ్ఞాత చెప్పారు...

" ఆ డిటెక్టివ్ కన్నా మీ డిటెక్షన్ భేషు" అని చెప్పింది బిలేజి.

అజ్ఞాత చెప్పారు...

It may not be a punishment. Knowing that he could book a politician's car for traffic violation, he could do much better in crime department would have been the thought, I think :) and he proved it as well.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

That’s one way of looking at it, అజ్ఞాత (3:48 pm) గారు. 👏👏

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అజ్ఞాత (3:27 pm) గారు, అలా అంటారా ? మీక్కూడా తమిళ భాష లిపి తెలుసా ? అలాక్కానివ్వండి 🙂.
Thanks.

అజ్ఞాత చెప్పారు...

తమిళ్ తెరియాదు. అయితే గూగుల్ ట్రాన్స్ లేట్ ద్వారా తర్జుమా చేయడం జరిగింది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అప్ర్పిడియా. సరి. నన్రి.
🙂🙂