16, జనవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (73) – భండారు శ్రీనివాసరావు

 అంజయ్య తర్వాత ముఖ్యమంత్రి అయిన శ్రీ భవనం వెంకట్రాం అతి సౌమ్యులు. శాసన మండలి సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా భవనంతో సన్నిహిత పరిచయంలేని విలేకరి అంటూ ఆ రోజుల్లో ఎవరూ వుండేవారు కాదు. ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన తొలిరోజుల్లోనే ఆయన తన పేరు లోని రెడ్డి అనే రెండు అక్షరాలను తొలగించుకున్నట్టు అధికారికంగా ప్రకటన చేయడం విశేషం. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ ఆనాటి సీనియర్ పాత్రికేయుడు, తన స్నేహితుడు అయిన  శ్రీ నరిసెట్టి ఇన్నయ్య ఇంటికి వెళ్లి భోజనం చేయడం నాకు తెలుసు. చాలా నిరాడంబరంగా వుండేవారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన తనకు మంత్రిగా కేటాయించిన క్వార్టర్ లోనే వుండేవారు. ఆయన్ని కలవాలంటే ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు. విలేకరులకు విందు భోజనాలు ఏర్పాటుచేయడం శ్రీ వెంకట్రాం కు ఓ సరదా. ఒకసారి గండిపేటలో విందు ఏర్పాటు చేసి విలేకరులను బస్సులో తీసుకుపోయారు. కానీ ఆయన ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేదు.

దానికి  కాంగ్రెస్ పార్టీలోని అంతఃకలహాలు  కావచ్చు, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ నుంచి ఎదురవుతున్న పెను సవాలు కావచ్చుశ్రీ భవనం వెంకట్రాం కొద్ది కాలంలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 
తరువాత ముఖ్యమంత్రి అయిన శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి చాలా కొద్ది కాలం మాత్రమే ఆ పదవిలో వున్నారు. అంటే కేవలం నాలుగు నెలలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈలోగా ఎన్నికలు రావడం, ఎన్టీఆర్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిపోయాయి.
శ్రీ విజయ భాస్కర రెడ్డి రూపంలోనూ, వ్యవహారంలోనూ మేఘ గంభీరుడు. నిజాయితీకి నిలువుటద్దం. కానీ ఎన్టీఆర్ వేవ్ లో ఈ మంచి లక్షణాలు ఏవీ పనిచేయలేదు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఏర్పడ్డ ఏహ్యభావాన్ని ఆయన చెరిపేయలేకపోయారు. ఓ పక్క ఫలితాలు వస్తున్నాయి.  మెజారిటీ స్థానాల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత కనబడుతోంది. ముఖ్యమంత్రి స్పందన కోసం విలేకరులు ఆయన అధికార నివాసానికి వెడితే ఆయన ఏ మాత్రం తొణుకూబెణుకూ లేకుండా తమ పార్టీ విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేయడం విస్మయం అనిపించింది.
సరే! పొలోమని బేగంపేట నుంచి ఆబిడ్స్ లో ఉన్న రామారావు గారింటికి వెళ్ళాము. అక్కడ పరిస్తితి మరింత విచిత్రం అనిపించింది. తెలుగుదేశం గెలుస్తోందని ఉప్పండడంతో ఊరంతా పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటూ వుంటే ఎన్టీఆర్ మాత్రం పెందలాడే నిదురించే తన అలవాటు ప్రకారం నిద్రకు ఉపక్రమించారు.
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత  శ్రీ విజయభాస్కర రెడ్డి తిరిగి కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. వారం వారం హైదరాబాదు వచ్చి తమ వూరు వెడుతుండేవారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శ్రీ రాం భూపాల్ చౌదరి ఒకసారి పొద్దున్నే ఆయన దగ్గరికి వెడుతూ ఎందుకో జ్వాలాని, నన్నూ వెంటబెట్టుకు వెళ్ళారు. ఎలాగో వెళ్ళాము కనుక, అందులోను కేంద్ర మంత్రి కనుక రేడియోకి ఏదైనా వార్త ఇస్తారా అని అడిగాను. ఆయన ఏదో కేంద్ర పధకం గురించి చెప్పారు. నేను అక్కడినుంచే విజయవాడ వార్తావిభాగానికి ఫోను చేసి న్యూస్ ఎడిటర్ శ్రీ ఆర్వీవీ కి  చెప్పాను. ఈ వార్త ఎప్పుడు, సాయంత్రం వస్తుందా అని అడిగితే, కాదు ఇప్పుడు ఆరూ నలభయ్ అయిదు ప్రాంతీయ వార్తల్లో వస్తుందన్నాను. ఇప్పుడే కదా చెప్పింది అప్పుడే ఎలా వస్తుంది అనుకుంటూ పనివాడిచేత ట్రాన్సిస్టర్  రేడియో తెప్పించారు. మేము అక్కడ ఉండగానే వార్తలు మొదలయ్యాయి. మొదటి  హెడ్ లైన్ ఆ వార్తతోనే మొదలయింది. ఆయన ఆసక్తిగా విని,  థాంక్స్ చెప్పడం సంతోషం అనిపించింది.

పేట్రియాట్ ఆంగ్ల దినపత్రిక పత్రిక హైదరాబాద్  కరస్పాండెంట్  ప్రభాకరరావు విజయభాస్కర రెడ్డి గారికి  మంచి దోస్తు. విజయ భాస్కర్ రెడ్డిని భాస్కర్ అని పిలిచేంత చనువు వుంది. సేనియర్ అయినా శషభిషలు లేని మనిషి. ఆయన్ని అందరూ పేట్రియాట్ ప్రభాకర్ అనేవారు. ఆలిండియా రేడియో డైరెక్టర్ వీవీ శాస్త్రి గారి బదిలీ విషయంలో ప్రభాకర రావు గారు ఒక మాట చెబితే మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఢిల్లీ వెళ్ళిన వెంటనే ఆ పని చేయడమే కాకుండా ఫోన్ చేసి ఆ విషయం ప్రభాకర రావుతో చెప్పారు. విజయభాస్కర రెడ్డి గారు ఎక్కువకాలం పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వున్న కారణంగా హైదరాబాదు స్థానిక విలేకరులతో అంతగా ఆయనకు పరిచయాలు లేవు. అలా అని విలేకరులను దూరం పెట్టేవారు కాదు. ఆరడుగుల భారీ కాయం.  చిన్న చిన్న పనులకోసం కూడా చనువు తీసుకోవడానికి సాహసించలేని గాంభీర్యం ఆయనది. పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన వద్ద అణకువగానే మెలిగేవారు. అన్నేళ్ళు రాజకీయ రంగంలో వున్నా, అనేక పెద్ద పదవులు నిర్వహించినా ఎలాంటి మాటా, మచ్చాపడకుండా నిజాయితీగా జీవించారు.

కాకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకుంటే,  ఎన్నికలకు ముందు  ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసిన రెండు పర్యాయాలు కూడా పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకుకురాలేక పోగా, చేతులారా అధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి తెలుగుదేశం పార్టీకి అప్పగించారనే అపకీర్తి మాత్రం మూటగట్టుకున్నారు.   

 

కింది ఫోటో:

మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల  విజయభాస్కర రెడ్డి.  



(ఇంకా వుంది)

 

 

కామెంట్‌లు లేవు: