మంటలు అంటుకున్న విమానం అంత ఎత్తు నుంచి పెద్ద చప్పుడుతో రన్ వే పై కూలిపోయింది. తలుపు తెరుచుకుంది. అయితే పదిహేను అడుగుల పై నుంచి ప్రయాణీకులు దూకి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి. అందరికంటే ముందు దూకింది ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఇలా దూకడంలో ఆయనకు కొన్ని దెబ్బలు తగిలాయి. ఒకరి వెంట మరొకరు కిందికి దూకారు. చిట్టచివరి ప్రయాణీకులకు ఒళ్ళు కాలిపోయింది. వారిలో ఇద్దరు చనిపోయారు. మొత్తం పదిహేడు మంది ఈ దుర్ఘటనలో గాయపడ్డారు. ప్రయాణీకుల లగేజి పూర్తిగా కాలిపోయింది. బహుశా మరునాడు కాబోలు ముఖ్యమంత్రి దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి చూసినట్టు వదంతులు షికార్లు చేసాయి. ఢిల్లీకి తరలిస్తున్న డబ్బు సంచుల కోసం ఆ వెతుకులాట అని ప్రతిపక్షాల వాళ్ళు బహిరంగంగానే చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడయితే, విస్తరించిన మీడియా పుణ్యమా ఇటువంటి పుకార్ల ప్రభావం చాలా వుండేది. ఆ రోజుల్లో కొన్ని కారిడార్లలో మాత్రమే వినిపించేవి. వినిపించినంత వేగంగా సమసియేవి. ఇలాంటిదే మరో వదంతి సంజయ్ గాంధి ఢిల్లీలో విమానం నడుపుతూ, అది కూలిపోయి చనిపోయినప్పుడు, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రమాద స్థలికి వెళ్లి దేనికోసమో దేవులాడినట్టు వెలుగు చూసింది కానీ పెద్ద చర్చ లేకుండానే ముగిసిపోయింది.
చిత్రం
ఏమిటంటే ఆ పార్టీకి జాతీయ నాయకురాలైన ఇందిరా గాంధి ఆ ఎన్నికల్లో ఓడిపోయింది.
ఓడిపోవడమే కాదు,
కేంద్రంలో అధికారాన్ని,
ప్రధాని పదవిని కోల్పోయింది. దేశం మొత్తంలో కేవలం రెండే రెండు రాష్ట్రాలలో,
కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్ లలో మాత్రమే అధికారం దక్కించుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి
దేవరాజ్ అర్స్,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఈ ఇద్దరు మాత్రమే
ఇందిరాగాంధీకి, ఆమె
పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. దీనితో అసలే స్వతంత్ర ప్రవృత్తి కలిగిన
చెన్నారెడ్డికి ఈ అవకాశం అవధులు లేని స్వేచ్ఛను ప్రసాదించింది. అధిష్టానమే తనపై
ఆధారపడాల్సిన పరిస్థితి. దీనితో ఆయన పాలనపై లేనిపోని కొన్ని కానిపోని అభాండాలు,
నీలినీడలు కమ్ముకున్నాయి. నోట్ అప్రూవుడ్.
నాట్ అప్రూవుడ్ అనే అపహాస్యపు వ్యాఖ్యలు ఆయన ఎదుర్కున్నారు. తన వద్దకు వచ్చిన
ప్రతి ఫైలుపై ముందు నాట్ ( NOT APPROVED) అని సంతకం చేసి, డబ్బు
ముట్టిన సంగతి నిర్ధారించుకుని మళ్ళీ అదే ఫైలుపై ఒక్క అక్షరం అదనంగా చేర్చి నోట్
అప్రూవుడ్ (NOTE APPROVED) అని రాసే వారని వార్తలు వ్యాఖ్యలతో
పాటు, చందారెడ్డి
అనే నిక్ నేం ఆయన పేరుకు జత చేరింది. ఇవన్నీ ఢిల్లీకి మోసేవాళ్ళు ఆ
పార్టీలోఎప్పుడూ సిద్ధంగానే వుంటారు. కాకపొతే అధిష్టానం కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
డాక్టర్
మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ
స్వప్నం. ఆయన మాట వేదవాక్యం.
ఎదురు చెబితే, నలుగురి
ఎదుటా ఆయన
నోట ఏ మాట పడాల్సివస్తుందో అని
బెదిరిపోయేవారు. ఆయన పేషీలో ఎస్.ఆర్.
రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన ఓ ఐ.ఏ.యస్. అధికారి వుండేవారు. చెన్నారెడ్డి
గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో కొలువుతీరి కూర్చునేవారు.
తన వద్దకు పనుల
మీద వచ్చిన అనుయాయులను సంతృప్తి పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో
నిబంధనల
ప్రకారం చేయలేనివి కొన్ని వుంటాయి. తన నోటి మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి
ఆయన. అంచేత అలాటి వ్యక్తి ఆర్డరు వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి వుంటుంది. రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా
ప్రవర్తించేవారు. చెన్నారెడ్డి
గారు నలుగురిలో వున్నప్పుడు ఒక పని
చెప్పీ చెప్పగానే, వెంటనే
'యస్. సర్.
తప్పకుండా అలాగే చేద్దాము' అనేవారు.
పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి మళ్లేవారు. అధికారులు
తన మాట 'తూచ'
తప్పకుండా
వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే, తీరా ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం
వెనక్కి వచ్చినప్పుడు, రామమూర్తిగారు
అందులోని మర్మాలను, ఇబ్బందులను
ముఖ్యమంత్రికి
విడమరచి చెప్పి, ఏ
పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ, 'నో సర్! ఇది కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు.
చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల పంకించి ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత
పట్టుపట్టేవారు కాదు. ఇవన్నీ
చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో 'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి' అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి
అధికారులు ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.
నేను
రేడియోలో చేరినప్పుడు పన్యాల రంగనాధ రావు గారు మా న్యూస్ ఎడిటర్. వారు రామోజీ రావు
గారు ప్రచురించబోయే సినీ వారపత్రిక సితార లో పనిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగానికి
రాజీనామా చేశారు. అంతవరకూ ఫీల్డ్ పబ్లిసిటి విభాగంలో పనిచేస్తున్న నర్రావుల
సుబ్బారావు గారిని హైదరాబాదు వార్తా
విభాగం న్యూస్ ఎడిటర్ గా బదిలీ చేశారు. ఆయన కంటే పై అధికారి ఢిల్లీలో వుంటారు. అంటే
హైదరాబాదుకు సంబంధించినంత వరకు ఆయనే మా న్యూస్
రూమ్ హెడ్. నర్రావుల సుబ్బారావు గారి
ఆహార్యం చూస్తే ఎవరూ ఆయన్ని ప్రభుత్వ అధికారి అనుకోరు. మోచేతుల కిందకి చొక్కా, పంచెకట్టుతో, చేతిలో చుట్టతో అచ్చం ఒక రైతు మాదిరిగా
కనిపించేవారు. ఆకారంలోనే కాదు, నిజంగానే ఆయన రైతు పక్షపాతి. ఆ నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది.
వర్షాలు కురవక పలానా జిల్లాలో పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా
ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు
రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎదురులేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎన్నో వార్తలు ప్రసారం చేసినా కూడా సుబ్బారావు గారు తరువాత
అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.
ఒకసారి
ముఖ్యమంత్రి చెన్నారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రశ్నోత్తరాల
సమయంలో సుబ్బారావు గారు లేచి పలానా ప్రాంతంలో పంటలు ఎండి పోతున్నాయని, అధికారులు చేతులు ముడుచుకుని
కూర్చున్నారని ఫిర్యాదు చేశారు ఆయన తరహాలో. చెన్నారెడ్డి గారి తరహా కూడా
విలేకరులకు తెలుసు. ఆ ప్రశ్న ఆయనకు సుతరామూ నచ్చలేదు. అది ఆయన మాటల్లో కనబడింది.
“చూడు
సుబ్బారావ్! నువ్వు విలేకరిగా ఈ ప్రశ్న వేస్తే జవాబు చెబుతాను. రైతుల ప్రతినిధిగా
వేస్తే ఇక్కడ సమాధానం చెప్పాల్సిన
అవసరం నాకు లేదు”
ఇరువురూ
హుందాగా వ్యవహరించడంతో రసాభాస కాకుండా అది అక్కడకి ముగిసిపోయింది.
రేడియోమీద
కానీ, రేడియో
వార్తలమీద కానీ సర్కారువారికి పట్టో, పెత్తనమో వుంటుందని ఆ రోజుల్లో ఓ అభిప్రాయం ప్రచారంలో వుండేది. ఇలాటి ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన
ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.
నా
ఈడువాడే, కొంచెం
చిన్నవాడు కూడా ఓ జర్నలిస్టు స్నేహితుడు ఉండేవాడు. ప్రముఖ పత్రికలో పనిచేసేవాడు.
నన్ను ఎప్పుడూ సర్కారీ జర్నలిస్ట్ అని ఎద్దేవా చేస్తుండేవాడు. నేనొకసారి అతడితో
అన్నాను.
‘గంటలో
ప్రాంతీయ వార్తలు వస్తాయి. నువ్వు ఒక వార్త ఇవ్వు ఏదైనా సరే. అది నీ ముందే రేడియోకి
ఇస్తాను. అలాగే నేను నీకొక వార్త చెబుతాను. అది రేపటి నీ పత్రికలో వచ్చేట్టు చూడు.
ఆ తర్వాత జర్నలిస్టుల స్వేచ్చ
గురించి తీరిగ్గా మాట్లాడుకుందాము’
అతడు
చెప్పిన వార్త రేడియోలో వచ్చింది. నేను చెప్పిన వార్త అతడి పేపర్లో రాలేదని వేరే
చెప్పక్కరలేదు. మరునాడే కాదు, ఎప్పటికీ
రాదని అతడికీ తెలుసు.
ఆ
తర్వాత అతడెప్పుడూ సర్కారీ జర్నలిస్టు అనే పదం నా వద్ద తేలేదు.
కింది
ఫోటో :
ఆకాశవాణి
హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ విభాగం న్యూస్ ఎడిటర్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన ఎన్.జి. రంగా గారి శిష్యులు, కీర్తిశేషులు
నర్రావుల సుబ్బారావు గారు (ఫోటో కర్టేసి
వారి కుమారుడు రావు గారు)
(ఇంకా
వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి