5, జనవరి 2025, ఆదివారం

నిన్నా మొన్నా ఈరోజు – భండారు శ్రీనివాసరావు

 మొన్న రెండు కార్లలో  బయలుదేరి మా స్వగ్రామం కంభంపాడు వెళ్ళాము. మా అన్నయ్య పిల్లలు కూడా వచ్చారు.  నిజానికి సొంత ఊరు వెళ్ళడంలో విశేషం ఏముంటుంది?

ఈరోజు మూడో ఏట అడుగుపెడుతున్న మా మనుమరాలు జీవికకి మా ఊరు చూపించాలి అనేది మా కోడలు నిషా కోరిక. మా వాడు సంతోష్ చనిపోవడానికి ముందు భార్యాభర్తలు ఇద్దరూ అమ్మాయిని ఊరికి తీసుకువెళ్లి పూర్వీకులు నివసించిన పల్లెటూరు చూపించాలని అనుకున్నారట, వచ్చే నెలకు వాడు చనిపోయి ఏడాది అవుతుంది కాబట్టి ఈలోగా ఆ  ఊరుకు వెళ్లి రావాలని కోడలు అనుకోవడంతో, అలానే వెళ్లి నిన్న సాయంత్రం తిరిగి హైదరాబాదు వచ్చాము. పల్లెటూరు ఛాయలు ఏమీ లేని ఊరును జీవికకు చూపించాము. చూపించాలి అనుకున్న ఎడ్లు లేవు, ఎడ్ల బండ్లు లేవు. అరకలు లేవు.  మా ఇంట్లో ఎదురింటి వాళ్ళు పెంచుకుంటున్నఒక నల్లటి గవిడి గేదె, దానికి పుట్టిన పదహారు రోజుల వయసున్న నల్లటి గేదె దూడను  చూపించాము. మదర్ బఫెలో, బేబీ బఫెలో అంటూ వాటితో కాసేపు ఆడుకుంది. భోజనాలు అయిన తర్వాత ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో మా తోటలో (తోట అనడానికి అక్కడ పళ్ళ చెట్లు ఏమీ లేవు, మిరపతోట, మొక్క జొన్న తోట మాత్రం వున్నాయి) మా అమ్మగారు చనిపోయినప్పుడు మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు కట్టించిన మా అమ్మానాన్నల గుడికి వెళ్లి దణ్ణాలు పెట్టుకున్నాము. మర్నాడు ఖమ్మం మీదుగా హైదరాబాదు తిరిగివస్తుంటే అంధ్రజ్యోతిని ఢిల్లీ గడ్డపై దశాబ్దాలుగా వెలిగిస్తున్న ప్రముఖ పాత్రికేయులు  అప్పరసు కృష్ణారావుగారి ఫోను. అయిదారుగురితో ఈ సాయంత్రం  చిన్న కలయిక వంటి గోష్టి, తప్పకుండా  రండి అంటూ. ఇంటికి చేరి భోజనం చేసి డ్రైవర్ను పిలిపించుకుని వారున్న హోటలుకు వెళ్లాను. మామూలుగా అయితే ఏదో కారణం చెప్పి తప్పించుకునే వాడినే. కానీ కృష్ణారావు గారి ఆఫరు మామూలుగా లేదు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారిపై  వారు రాసిన పుస్తకాన్ని సాహిత్య అకాడమి ప్రచురించింది. వచ్చి ఆ పుస్తకాన్ని తన చేతుల మీదుగా అందుకోమని ఆహ్వానం. వెళ్లాను. వెళ్ళే సరికే, పీవీ గారి తనయుడు పీవీ ప్రభాకర రావు గారు, సీనియర్ సంపాదకులు కె. రామచంద్ర మూర్తిగారు, జ్వాలా నరసింహా రావు, మా శర్మ గారు, సీనియర్ పాత్రికేయులు, కృష్ణారావు గారి సోదరులు ఏ. శ్రీనివాసరావు, జగాన్ని ఎరిగిన జర్నలిస్టు మా శర్మ గారు అక్కడ వున్నారు. తరువాత కొంతసేపటికి ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్ గారు, సీనియర్ పాత్రికేయుడు నందిరాజు రాధాకృష్ణ వచ్చి కలిసారు. మాటలు ముచ్చట్ల మధ్యలో కాలం తెలియలేదు.

తరువాత, మా అన్నయ్య కుమారుడు రాజేంద్ర ప్రసాద్ పుట్టిన రోజు వేడుకల కోసం మరో హోటల్ కు వెళ్లాను. ఈ విధంగా ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో బంధు మిత్రులతో సమాగమం. ఆనందంగా గడిచింది అనే వేరే చెప్పనక్కరలేదు.

ఈ వయసులో ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు.

ఇక ఈరోజు, ముందే చెప్పినట్టు మా మనుమరాలి పుట్టిన రోజు.

‘వాడే వుండి వుంటే’ అని ఉబికి వస్తున్న ఆలోచనను గుండెల్లోనే అదిమిపెట్టుకుంటూ,  చిన్నారి జీవికకు హృదయపూర్వక ఆశీస్సులు, అభినందనలు.

కింది ఫోటోలు:


కుడి నుంచి: శ్రీయుతులు ఏ. కృష్ణారావు, నేను, కె. రామచంద్ర మూర్తి, కె. శ్రీనివాస్, నందిరాజు, మా శర్మ, ఏ. శ్రీనివాసరావు, పీవీ ప్రభాకర రావు, జ్వాలా నరసింహా రావు 




(తోటలో అమ్మానాన్నల గుడిలో)










(05-01-2025)

కామెంట్‌లు లేవు: