ఇక
తెలుగు దేశం ప్రచారం చాలా పకడ్బందీగా, ప్రణాళిక ప్రకారం సాగింది.
ఎన్టీఆర్
చైతన్య రధం ఒక గ్రామం చేరే లోగా మరో జీపు ముందుగానే అక్కడికి చేరుకునేది.
వేములపల్లి శ్రీ కృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే పాట, శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా
తెలుగు తల్లికి మల్లె పూదండ’ అనే పాటలను మైకుల్లో వినిపించేవాళ్ళు. వస్తున్నది
రామారావు వంటి సుప్రసిద్ధ నటుడు. వేస్తున్నది ఉర్రూతలూగించే ఈ పాటలు. జనాలు
విరగబడేవాళ్ళు. వాళ్ళను చూడగానే ఎన్టీఆర్ ప్రసంగం మరింత వేడెక్కేది. ఇక ఈలలూ, చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయేది.
ప్రచారం
ఉధృతం అవుతున్న కొద్దీ కాంగ్రెస్ నాయకులకు తత్వం బోధపడింది. అపజయం తప్పదేమో అనే
సందేహం పట్టుకుంది. దీనికి తొలి సూచన నంద్యాలలో జరిగిన ఇందిరాగాంధీ ఎన్నికల
ప్రచారంలో కనబడింది. ఆ సభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి బొజ్జా వెంకట
రెడ్డి ‘ బడుగు బలహీన వర్గాలను కాపుకాసే కాంగ్రెస్ కు ఓటు వేస్తారా, సినిమా వేషాలతో జిమ్మిక్కులు చేసే
తెలుగు దేశం పార్టీకి ఓటేస్తారా’ అని అడిగితే సభకు వచ్చిన వాళ్ళలో చాలామంది మా ఓటు
ఎన్టీఆర్ కే అని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు నీరసపడిపోయాయి. తిరుపతి ఎన్నికల సభల
నాటికి విషయం ధృవపడింది. ఆ రోజు ఒకే రోజున తిరుపతిలో రెండు సభలు. ఒకటి ప్రధాని
ఇందిరాగాంధీ సభ. రెండోది ఎన్టీఆర్ సభ. ఇందిర సభకి హాజరైన వారిలో చాలామంది ఎన్టీఆర్
ప్రచార రధం బయలుదేరింది అనే విషయం తెలుసుకుని అక్కడికి పరిగెత్తి వెళ్ళడం చూసి
కాంగ్రెస్ అధినేత్రికి ఫలితం ఎలా వుండబోతోందో ముందే తెలిసిపోయింది.
ఎన్నికలుముగిశాయి.
ఫలితాలు వెలువడుతున్నాయి.
1983 అసెంబ్లీ
ఎన్నికలకు ఒక ప్రత్యేకత వుంది. అదేమిటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను
మొదటిసారి ప్రయోగాత్మకంగా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉపయోగించారు.
షాద్
నగర్ లో ఈవీఎం
కౌంటింగ్ కావడం వల్ల గంటల్లోనే ఫలితం వెలువడింది. కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ పి.
శంకరరావు సమీప ప్రత్యర్ధి, టీడీపీ
అభ్యర్ధి పుట్టపాగ రాధాకృష్ణపై విజయం సాధించారు. రిటర్నింగ్ ఆఫీసరు అధికారికంగా
ప్రకటించిన ఆ సమాచారాన్ని మొదట హైదరాబాదులోని ప్రాంతీయ వార్తా విభాగానికి,
తరువాత ఢిల్లీ
ఆలిండియా రేడియో కేంద్రానికీ అందించాను. మధ్యాన్నం ప్రాంతీయ వార్తలతో పాటు
గంటగంటకూ వెలువడే ఎన్నికల ప్రత్యేక బులెటిన్లలో కూడా ఆ వార్తను ప్రసారం చేసారు.
అలాగే సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఇంగ్లీష్, తెలుగు వార్తల్లో కూడా శంకరరావు
గెలిచిన వార్త ప్రసారం అయింది. మిగిలిన చోట్ల సాధారణ పద్దతిలో బ్యాలెట్ పత్రాలను
లెక్కించడం వల్ల తెలుగు దేశం అభ్యర్ధుల ఆధిక్యతలకు సంబంధించిన సమాచారం మినహా
ఫలితాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఆ రోజుల్లో రేడియోలో
ఆధిక్యతలు ప్రకటించే సాంప్రదాయం లేదు. అనధికారికంగా టీడీపీ విజయపధంలో
దూసుకుపోతున్నట్టు సమాచారం వస్తున్నా ఆ వివరాలను ప్రసారం చేయలేని పరిస్తితి.
ఇప్పటిలా వేరే వార్తా మాధ్యమాలు లేకపోవడం వల్ల అందరూ రేడియో వార్తల మీదనే
ఆధారపడాల్సిన రోజులవి. షాద్ నగర్ లో ఈవీఎం లు వాడి కాంగ్రెస్ ఏదో
గందరగోళం చేసిందని వదంతులు బయలుదేరాయి. దరిమిలా కొన్ని గంటల తర్వాత మాన్యుయెల్ గా
కౌంటింగ్ జరిగిన ప్రాంతాల నుంచి ఫలితాలు రావడం మొదలయింది.
కావాలనే రేడియోలో వార్తలు తొక్కిపడుతున్నారని ఆ
పార్టీ అభిమానుల్లో సందేహాలు కలిగాయి. నేను షాద్ నగర్ నుంచి తిరిగివచ్చేసరికి కొందరు టీడీపీ కార్యకర్తలు రేడియో స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. విషయం
వివరించి చెప్పడంతో శాంతించారు.
అదే
రాత్రి ఫలితాలు చాలావరకు తెలిసిపోయాయి. ప్రభుత్వం స్థాపించడానికి ఏర్పాటు చేసే
మెజారిటీ టీడీపీకి అప్పటికే లభించింది. ఎన్టీఆర్ ని కలిసి ఆయన స్పందన రికార్డు
చేయడానికి స్కూటరు మీద ఆబిడ్స్ నివాసానికి వెళ్లాను. వాకబు చేస్తే ఆయన అప్పటికే
నిద్రకు ఉపక్రమించారని తెలిసింది.
దటీజ్
ఎన్టీఆర్.
రాష్ట్రమంతా సంబరాలు జరుగుతుంటే ఆయన మాత్రం ఆయన
అలవాటు ప్రకారం వేళకు నిద్రపోయారు.
మరునాడు
అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్పందన విచిత్రం
అనిపించింది.
“కాంగ్రెస్
పార్టీ ఎన్నటికీ తుడిచిపెట్టుకునిపోదు. చూస్తుండండి, మళ్ళీ అధికారంలోకి వస్తుంది”
అప్పుడు
భేషజం అనిపించిన ఆయన మాటలు ఆరేళ్ళ తరువాత నిజమయ్యాయి. 1989 లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీని ఓడించి మళ్ళీ అధికార
పగ్గాలు చేపట్టింది.
కింది
ఫోటో:
ఎన్నికల ప్రచారంలో చైతన్య రధంపై ఎన్టీ రామారావు
(ఇంకా
వుంది)
2 కామెంట్‌లు:
Your narrative is quite enthralling
Please publish this series in English as well.
ధన్యవాదాలు. ఆలోచన వుంది. తెలుగులో ఇప్పటికి 75 భాగాలు పూర్తి అయ్యాయి. ఇంకా 1983 ప్రాంతంలోనే వున్నాను. మరో 75 రాయాలేమో. వయసు, టైం సహకరించాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి