వెంగళరావు
గారి తరువాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారికి పరిపాలనాదక్షుడు అనే మంచి
పేరుతొ పాటు చండశాసనుడు అనే కితాబు కూడా వుండేది.
1978 లో
మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు
మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన వైపు
మళ్లిపోతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ లో ఉన్న భాట్టం శ్రీరామ మూర్తి ఓ ఘాటు
వ్యాఖ్య చేసారు.
'చెన్నారెడ్డి
గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు
చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా! ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి
లేచిపోతున్నట్టుగా వుంది'
ఈ
వ్యాఖ్య శాసన సభలో దుమారం రగిలించింది.
పార్టీ
మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. ‘లేచిపోవడం’ అనే పదానికి అభ్యంతరం
తెలిపారు. అది సభలో వాడతగిన పదమా కాదా అన్న దానిపై కొలిక్కిరాని చర్చ విస్తృతంగా జరిగింది.
పార్టీ
మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి కూడా తరువాత
కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏకం
తప్పితే అనేకం అన్నట్టు, టీడీపీ తీర్థం కూడా తదనంతర కాలంలో పుచ్చుకున్నారు.
మర్రి
చెన్నారెడ్డి వ్యవహార శైలి విభిన్నం. ఆయన తార్నాక లోని సొంత ఇంట్లోనే వుండి,
దానికి
అన్నిరకాల హంగులు సమకూర్చుకున్నారు. బహుశా సొంత నివాసాలకు ప్రభుత్వ ఖర్చుతో వసతులు
ఏర్పాటు చేసుకునే సాంప్రదాయానికి అప్పుడే బీజం పడిందని అనుకోవాలి. ఆ రోజుల్లో
మొత్తం హైదరాబాదులో లిఫ్ట్ సౌకర్యం ఉన్న ప్రైవేటు గృహాలు రెండే ఉండేవని, వాటిల్లో ఒకటి చెన్నారెడ్డి గారి
తార్నాక నివాసం అని జనం చెప్పుకునేవారు. ముఖ్యమంత్రి పేషీ కోసం సీ బ్లాకులో తన
అభిరుచులకు తగ్గట్టుగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఖరీదయిన ఆధునిక
ఫర్నిచర్ తో చూడముచ్చటగా వుండేది. సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. ఇద్దరు ముగ్గురు
సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు పనిచేసే వారు. శ్రీయుతులు ఎస్ ఆర్ రామమూర్తి, గోవిందరాజన్, సంతానం, యుగంధర్, పరమహంస మొదలయిన వారు వున్నా వారిలో
ఎక్కువకాలం వున్నది పరమహంస గారే. రామమూర్తిగారు తదనంతర కాలంలో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి అయ్యారు. ఎస్పీ రాంక్ ఐ పీ ఎస్ అధికారి శ్రీ మురళీధర్ ప్రధాన
భద్రతాధికారి. పీ ఆర్ వొ గా సమాచారశాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మా
పెద్దన్నయ్య పర్వతాలరావు గారిని నియమించుకున్నారు. (అంతకు ముందు కొద్దికాలం సి.
నరసింహారెడ్డి గారు కూడా ఈ బాధ్యతలు నిర్వహించారు. పర్వతాలరావు గారికి చెన్నా టు
అన్నా అనే పేరు వుండేది. అంటే చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రాం, విజయభాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు ఇలా వరసగా అయిదుగురు
ముఖ్యమంత్రుల వద్ద పీఆర్వో గా పనిచేసారు)
చెన్నారెడ్డి
గారు ఎటువెళ్ళినా కొంతమంది మంత్రులు మరో పని ఏమీ లేదన్నట్టు ఆయన వెంటే వెళ్ళేవారు.
దాంతో, సీ ఎం కాన్వాయ్
లో వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ఆయన ఢిల్లీ వెళ్ళినా, ఢిల్లీ నుంచి వచ్చినా వీడ్కోలు, స్వాగతాలకు మంత్రుల కార్లు బేగంపేట
విమానాశ్రయానికి బారులు తీరేవి. ఇక సచివాలయంలో ఆయన పేషీలో మంత్రుల దర్బారు గంటలు గంటలు సాగేది. ఐ.ఎ.ఎస్. అధికారులు ఫైళ్ళు చేతపట్టుకుని బయట ఆయన
పిలుపుకోసం ఎదురు చూస్తూ వుండేవారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కిన కాంగ్రెస్ నాయకుల్లో
చెన్నారెడ్డి గారొకరు. మొదటి సారి, అలాగే
రెండోసారి కూడా ఆ పదవి కోల్పోవడానికి కారణం సొంత పార్టీలో ఆయన పట్ల చెలరేగిన
అసమ్మతి. మరో విశేషం ఏమిటంటే ఆ రెండుసార్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
రావడానికి కారణం కూడా చెన్నారెడ్డి గారే కావడం. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆయన
వ్యతిరేకులు ఆయన దిగిపోయేదాకా నిద్రపోలేదు.
చెన్నారెడ్డి
గారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. మొదటిసారి సీఎం అయినప్పుడు చేతిలో
వెండి పిడి తాపడం చేసిన పొన్నుకర్రతో అధికార దర్పం ప్రదర్శించిన తీరు ఆయన్ని
విమర్శలకు గురిచేసింది. ఆయన పార్టీకే చెందిన బీ. రామారావు అనే జగ్గయ్యపేట
ఎమ్మెల్యే ఆయన్ని అనుకరిస్తూ శాసనసభలో పొన్నుకర్ర వూపుకుంటూ తిరగడం ఒక ఉపాఖ్యానం.
పేరుకుపోయిన
ఫైళ్ళను ఒక్క పెట్టున క్లియర్ చేయడానికి ఆయన అనేక పద్దతులు అనుసరించేవారు.
ఒక్కోసారి వూరికి బాగా దూరంగా వున్న బీ హెచ్ ఈ ఎల్ గెస్ట్ హౌస్ ల్లో రాత్రి
పొద్దుపోయేదాకా వుండి పని పూర్తి చేసేవారు. అలాగే హైదరాబాదు నుంచి యే విశాఖపట్నమో
వెళ్ళాల్సి వస్తే, ఫైళ్ళు
వెంటబెట్టుకుని రైల్లో ప్రయాణం చేసేవారు. రైలు కాజీపేటలో ఆగగానే అప్పటివరకు సంతకం
చేసిన ఫైళ్ళను హైదరాబాదు చేర్చడానికి ప్రభుత్వ వాహనం ఒకటి అక్కడ స్టేషన్లో
సిద్దంగా వుండేది. అలాగే ఖమ్మం, విజయవాడ
వచ్చేసరికి మరికొన్ని ఫైళ్ళు చూసి సంతకం చేసేవారు. అవన్నీ ఆ రాత్రికి రాత్రే
హైదరాబాదులోని సచివాలయానికి చేరేవి.
చెన్నారెడ్డి
గారికి అభిజాత్యం ఎక్కువ కావొచ్చుకాని, ప్రచారంలో వున్నట్టు కుల దురభిమానం లేదని
ఆయన్ని బాగా ఎరిగున్న వారు చెబుతుంటారు. రెండోసారి పదవీ గండం దాపురించినప్పుడు,
రేపోమాపో
ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్న సమాచారం తెలియగానే
చెన్నారెడ్డి మద్దతుదారులయిన నాటి మంత్రులు శ్రీ బాగారెడ్డి, శ్రీ హషీం కలసి నామినేటేడ్ పదవుల
భర్తీ కోసం ఒక జాబితా తయారు చేసి ఇచ్చారు. దాన్నొకసారి పరకాయించి చూసిన
చెన్నారెడ్డి గారు 'ఇదేమిటయ్యా
అందరూ రెడ్లే వున్నారు, వేరేవాళ్ళు
ఎవరూ మీ కంటికి ఆనలేదా!' అని
నిలదీశారు. అప్పుడు వాళ్లు ఇచ్చిన సమాధానం ఆనాటి వాస్తవ రాజకీయ పరిస్తితికి అద్దం
పడుతుంది.'రెడ్లు
కానివాళ్ళు ఇంకా మన వెంట ఎవరున్నారు సారూ, అందరూ అటే (అసమ్మతి వైపు) వెళ్ళిపోయారు".
ఏ రాష్ట్రంలో
అయినా స్తానికంగా ఏ నాయకుడయినా బలపడుతున్నాడని అనుమానం వచ్చినా సరే, కాంగ్రెస్ అధిష్టానం వూరుకునేది
కాదు. వెంటనే అతడి మీద నిర్దాక్షిణ్యంగా వేటు వేసేది. ఒక్కోసారి ఆ చర్య
ఆత్మహత్యాసదృశమైనా సరే ఎంతమాత్రం ఉపేక్షించేది కాదు. చెన్నారెడ్డి వంటి నాయకులు
కూడా అధిష్టానానికి అణగిమణగి వున్నట్టు వుండేవారు కాని, ఒక్కోసారి ఆ అసహనం బయటకు
వస్తుండేది. చెన్నారెడ్డి వ్యతిరేకులు ఆ రోజుల్లో ప్రభలు వెలిగిపోతున్న సంజయ్
గాంధీ సాయంతో నాయకత్వ మార్పిడి విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి రాగలిగేట్టు చేయగలిగారు.
అప్పట్లో సంజయ్ ఏది చెబితే అంత. ఆయన మాటకు ఎదురు వుండేది కాదు. తనని తొలగించే
ప్రయత్నంలో సంజయ్ హస్తం వుందని భావించే వారేమో, ఆయనంటే చెన్నారెడ్డి గారికి గుర్రుగా
వుండేది. ఈ నేపధ్యంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో రాష్ట్రంలో
ముఖ్యమంత్రి మార్పు తాత్కాలికంగా వాయిదాపడింది. సంజయ్ అస్థికలను, దేశంలోని ప్రధాన నదులతో పాటు,
గోదావరి నదిలో
నిమజ్జనం చేసేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు వచ్చిన అస్థికల
పాత్రను ప్రత్యేక రైలు బోగీలో వెంట
తీసుకుని ముఖ్యమంత్రి రాజమండ్రి వెళ్లారు. ఒక బోటులో చెన్నారెడ్డి ఆయన పరివారం
గోదావరి నదిలో కొంత దూరం వెళ్లారు. ఆకాశవాణి విలేకరిగా టేప్ రికార్డర్ తో నేనూ
వెంట వెళ్లాను. నిమజ్జనం అయిన తరువాత అక్కడ విలేకరులతో మాట్లాడారు. చుట్టూ మూగిన
జనాలతో అంతా గందరగోళంగా వుంది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి రైలు ఎక్కిన తరువాత
నాకు కబురు వచ్చింది. వెళ్లాను. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఒక ఐ ఏ ఎస్ అధికారి
పరమహంస గారు, 'సీ ఎం
మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసారా’ అని అడిగారు. ఔనన్నాను. వినిపించమన్నారు.
కేసెట్ రివైండ్ చేసి వినిపించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. సంజయ్
గాంధీ మరణం తనకు బాగా బాధ కలిగించిందని చెన్నారెడ్డి చెప్పారు. కానీ ఆ వాక్యం ఇలా
మొదలయింది. "ఐ యాం హ్యాపీ దట్ ...సంజయ్.....(సంజయ్ గాంధీ మరణించడం నాకు
చాలా....ఆనందం...) తరువాత నాలుక కరుచుకుని బాధ కలిగించిందని అన్నారు.
ముఖ్యమంత్రి
పేషీలో పనిచేసేవారు యెంత అప్రమత్తంగా వుంటారో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. మొత్తం
మీద అసమ్మతి సెగలు పనిచేసో, లేక
దాన్ని అడ్డం పెట్టుకుని చెన్నారెడ్డి అడ్డు తొలగించుకోవాలని శ్రీమతి గాంధీ
భావించారో, కారణం
ఏదయినా, 1980 అక్టోబర్
10 న ముఖ్యమంత్రి
పదవికి రాజీనామా చేశారు.
చెన్నారెడ్డి 1989
లో రెండోమారు
ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను
మాస్కోలో వున్నాను. అప్పుడు ఆయన పేషీలో పీ ఆర్ వొ గా చేరింది నా మిత్రుడు జ్వాలా
నరసింహారావు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రానికి
తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు వద్దకూడా, జ్వాలా సీ పీ ఆర్ వొ గా దాదాపు పదేళ్లు పనిచేశాడు. పాతికేళ్ళ
విరామం తరువాత ఆయన అదే పదవిలో చేరడం ఒక విశేషం.
1989 లో కూడా ఇదే
అదే సీను రిపీట్ అయింది. పీసీసీ అధ్యక్షుడిగా వుండి, ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీని
వోడించి, కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదే . కానీ ఏడాదిలోనే
చెన్నారెడ్డిని తిరిగి మాజీ ముఖ్యమంత్రిని చేసింది కూడా అదే అసమ్మతి. అదే
అధిష్టానం.
చెన్నారెడ్డి గారితో
నా సొంత అనుభవం ఒకటి చెప్పాలి.
ఆయన మొదటిసారి
ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆకాశవాణి ఏర్పాటుచేసిన ఒక శిక్షణ కోసం ఢిల్లీ
వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పట్లా జర్నలిష్టులకు ఢిల్లీ ఏపీ భవన్ గెస్ట్ హౌస్ లో
ప్రత్యేక కేటగిరీ వుండేది కాదు. గెస్ట్ హౌస్ కూడా ప్రస్తుతం వున్న విలాసవంతమైన పలు
అంతస్తుల భవనం కాదు. పక్కనే ఆనుకుని వున్న అశోకా రోడ్లో మొదటి నెంబరు భవనం. పాతదే
అయినా చాలా వసతిగా వుండేది. రోజు కిరాయి కూడా తక్కువే. అయితే, శిక్షణ కోసం వెళ్లడం వల్ల ఎక్కువ
రోజులు వుండాల్సి వచ్చింది. హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత ప్రైవేట్ అతిధుల
జాబితాలో పెట్టి బిల్లు పంపించారు. వందల్లోనే వున్నా అప్పటి ప్రమాణాల ప్రకారం
భారమే అనిపించి, సీ.ఎం.
చెన్నారెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఆయన ఓ ధరఖాస్తు ఇమ్మన్నారు. వెంటనే ఓ
జీవో జారీ అయింది. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిష్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వ
అధికారులతో సమానంగా పరిగణిస్తూ ఇచ్చిన జీవో అది. దాని కాపీ మా ఆఫీసు చిరునామాతో
నాకు కూడా పంపారు. చాలాకాలం వుంది కానీ, మేము మాస్కో వెళ్ళినప్పుడు ఎక్కడో కాగితాల్లో మరుగునపడి, ఇప్పుడు కానరావడం లేదు. జర్నలిష్టులు
ఎవరి వద్ద అన్నా వుంటే చూడండి. ఆ జీవోలో నా పేరు కూడా వుంది.
(After careful consideration of the representation of Bhandaru Srinivasa
Rao, the government…) 'పలానా
శ్రీనివాసరావు ఇచ్చిన ధరకాస్తును జాగ్రత్తగా పరిశీలించిన మీదట ప్రభుత్వం .....'
అని వుంటుంది.
చిన్న
తోక పిట్ట: మర్రిచెన్నారెడ్డి గారు పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ప్రకారం
అచ్యుతరెడ్డి అని నామకరణం చేసారు. చనిపోయిన తన తండ్రిని తలచుకుంటూ తల్లి శంకరమ్మ, పిల్లవాడిని చెన్నారెడ్డి అంటూ
పిలిచేది. చివరికి ఆ పేరే స్థిరపడిపోయిందట.
కింది
ఫోటో:
ఇందిరాగాంధితో
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి