16, ఫిబ్రవరి 2022, బుధవారం

“లచ్చన్నా! ఢిల్లీ పోదాం” అన్నారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్”

 

పొద్దున్నే ఫోన్ మోగింది.

“పదిహేనేళ్లు పైగా అయింది మిమ్మల్ని కలిసి. ఇవ్వాళ నమస్తే తెలంగాణా పత్రికలో మీ ఫోటో, నెంబరు కనబడింది. ఉగ్గబట్టుకోలేక వెంటనే ఫోన్ చేస్తున్నా” అన్నాడు అవతల నుంచి లక్ష్మన్న.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి లక్ష్మన్నే ఆయనకు అధికారిక కారు డ్రైవర్.  లక్ష్మన్న ఇంట్లో పెళ్లి జరిగితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో  డ్రైవర్ ఇంటికి వెళ్లి రావడం ఆ రోజుల్లో ఓ సంచలనం.

“ఎన్టీఆర్ గారు నన్ను ఎప్పుడూ లచ్చన్నా అని ఆప్యాయంగా పిలిచేవారు. అసలు నన్నిలా మొదటి సారి పిలిచింది ఆయన గారి భార్య బసవ తారకం గారు. ఓసారి జూబ్లీ హాలులో ఏదో అధికారిక విందు వుంటే, ముఖ్యమంత్రి గారినీ, వారి భార్య బసవతారకం గారినీ కారులో తీసుకు వెడుతున్నాను. అమ్మగారు కారులో కూర్చోగానే నాపేరు అడిగారు. లక్ష్మన్న అని చెప్పాను. ఆవిడ నవ్వుతూ ‘సరిపోయింది, రాముడికి లక్ష్మణుడు దొరికాడు” అని అంటూ ‘అంతేనా లచ్చన్నా’ అన్నారు. అంతే అప్పటి నుంచి నాపేరు లచ్చన్న అయిపోయింది”

లక్ష్మన్న మంచి ఉద్వేగంలో వుండి అనేక సంగతులు చెప్పుకొచ్చాడు.

“చివరిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఓసారి కారులో వెడుతుంటే “ఈసారి ఢిల్లీ వెడదాం పద. నువ్వూ వద్దువు కాని. దేశాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే గట్టి లాస్ (చట్టాలు) కావాలి. ఇప్పుడున్నవి సరిపోవు. మనం వెళ్లి ఆ పని చేయాలి” అన్నారు. దురదృష్టం! ఆ తర్వాత కొన్ని నెలలకే ఆయన ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయారు”

“ప్రతిపక్షంలో వున్నప్పుడు సభలో లేని సారుని కూడా సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి సారు అసెంబ్లీ గుమ్మం  తొక్కలేదు. నేనూ బయటకు వచ్చేశాను. సెలవు పెట్టి ఆయన గారి వద్దనే పనిచేశాను. మళ్ళీ  సారు ముఖ్యమంత్రి కాగానే నన్ను తిరిగి తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి సీఎం గారు,  రామచంద్రరావు (పీఆర్వో) గారిని పిలిచి ‘లచ్చన్న ఉద్యోగం మళ్ళీ రెగ్యులరైజ్ చేయించండి. ఆ ఆర్డరు కాపీ తెప్పించి లచ్చన్నకు ఇవ్వండి’ అని చెప్పారు. అన్నట్టే నా ఉద్యోగం రెగ్యులర్ అయింది. నాలుగు ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చారు.

“మీ అన్నగారు (పర్వతాలరావు గారు, రామచంద్రరావు గారికి ముందు సీఎం పీఆర్వో) దేవుడు. లిఫ్ట్ బాయి దగ్గర నుంచి  డ్రైవర్లని, జవానులని చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా  అందర్నీ రోజూ  పలకరించి యోగక్షేమాలు అడిగేవారు.  ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకునేవారు. చేయదగిన, చేతనైన సాయం చేసేవారు, మరోసారి అడిగే పని లేకుండా.

“మీ గురించి చాలా ఏళ్ళుగా వాకబు చేస్తున్నా. టీవీల్లో కనబడేవారు. కానీ ప్రయత్నించినా మీ నెంబరు దొరకలేదు. చివరికి ఈరోజు నమస్తే తెలంగాణా పత్రికలో దొరికింది”

చెప్పాడు లచ్చన్న  ఉరఫ్  లక్ష్మన్న.



(16-02-2022)

  

 

కామెంట్‌లు లేవు: