6, ఫిబ్రవరి 2022, ఆదివారం

నాయకుల 'అదృశ్యాలు', మీడియా ఊహాగానాలు - భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు ఆదివారం 06-02-2022 ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)


కొన్ని విషయాలు జరిగినప్పుడు చిత్రంగా తోస్తాయి. కొంతకాలం గడిచిన తర్వాత కూడా వాటిని తలచుకుంటే బహు విచిత్రంగా అనిపిస్తాయి. ఇలాంటి ఘటనలు చరిత్రలో ఎన్నో కనబడతాయి. మరీ క్రీస్తు పూర్వం నాటివి కూడా కాదు సుమా!
నిత్యం మీడియాలో తమ మొహం కనబడాలని చాలామంది రాజకీయ నాయకులు అనుకోవడం కద్దు. వాళ్ళు అలా ఏ ఒక్క రోజు మీడియాలో కనబడకపోయినా, మీడియాకు అదే ఒక వార్తగా మారి సంచలనం కావడం కూడా కొత్తేమీ కాదు.
ఏడేళ్ల కిందట అనుకుంటా, కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ, ఎవరితో చెప్పాపెట్టకుండా ఎటో వెళ్లిపోయారని ఓ వార్త గుప్పుమంది. అలిగివెళ్ళారని కొన్ని వార్తలు చెబుతుంటే, ఏకంగా హిమాలయాలకు వెళ్ళారని మరికొన్ని వదంతులు వెల్లువెత్తాయి.
అలిగి వెళ్ళిన మాట నిజం కాకపోవచ్చు. హిమాలయాలకు వెళ్ళిన మాటలో కూడా వాస్తవం లేకపోవచ్చు. కానీ కనబడకుండా వెళ్ళిన మాట నిజం. రోజుల తరబడి ఆయన ఎవ్వరికీ దర్శనం ఇవ్వని మాటా నిజం. పైగా అప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ ఏ ఒక్క రోజు కూడా చట్టసభ గుమ్మం తొక్కిన జాడలేదు. కనబడకుండా పోయిన ఈ యువనేత గురించి ట్విట్టర్ వంటి ఆధునిక ప్రసార మాధ్యమాల ద్వారా మాత్రమే సంగతులు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఇదొక చిత్రం.

రాహుల్ గాంధీ అనామకుడు కాదు. ఆయన్ని గురించి తెలిసిన వారు ఎక్కువ. గుర్తు పట్టడం అతి సులభం. పటిష్టమైన వ్యక్తిగత భద్రత కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఎక్కడకు వెళ్ళాలన్నా క్షణాలమీద బందోబస్తు ఏర్పాట్లు జరిగిపోతాయి. చుట్టూ అంగరక్షకులు నిరంతరం కాపలాగా వుంటారు. వారి చేతుల్లోని వాకీటాకీలు రాహుల్ రాకపోకల్ని ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటాయి. గతంలో టీవీల్లో రాహుల్ భద్రతాఏర్పాట్లు చూసిన వారికి రాహుల్ అదృశ్యం వార్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన అంగరక్షకులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. కనబడకుండా పోయిన ఈ యువనేత తనని కంటికి రెప్పలా కాపాడాల్సిన కాపలాదారులని కూడా వెంటబెట్టుకు పోయాడా లేదా తెలియదు. వాళ్ళు వెంట వుంటే ఆచూకీ కనుక్కోవడం అంత కష్టమైన పనికాదే! రాహుల్ అదృశ్యం గురించి రకరకాల వ్యాఖ్యానాలు మాత్రం అనుదినం మీడియాలో వచ్చాయి. సోషల్ మీడియా సంగతి చెప్పనక్కరలేదు. ఆయన ఆనుపానులు కనుక్కోవాలంటే పోలీసులకు నిమిషాల్లో పని. మీడియాకు కూడా ఇదేమంత కష్టమైన పనికాదు. అయినా కానీ, అదృశ్యం గురించిన వ్యాఖ్యానాలు, మాట విరుపులతో కూడిన సమాచారమే కాని రవంత అదనంగా ఎవ్వరూ ఏ వివరాలు ఇవ్వని పరిస్తితి. ఒక మాజీ ప్రధాన మంత్రి కుమారుడు ఏకంగా కొన్ని రోజులపాటు కనబడకుండా పొతే ఇదా పరిస్తితి అనుకోవాల్సివచ్చింది. ఇదొక చిత్రం అన్నది అందుకే.

సరే! రాహుల్ గాంధి కనబడడం లేదు. ఇంట్లో లేరు. బయట లేరు. ఆయన కనబడడం లేదని ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి కాబట్టి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి విచారించడం ఆ రోజుల్లో మరో సంచలన వార్త అయింది. వెళ్ళిన పోలీసులు 'అదృశ్యం' గురించి వాకబు చేశారంటే అదీ లేదు. వెళ్లి ఎలాటి సమాచారం అడిగారో తెలుసా! అది మరీ చిత్రం.
'రాహుల్ యెంత ఎత్తు ఉంటాడు? కళ్ళ రంగు ఏమిటి? కాలిజోడు కొలతలు ఏమిటి?'

రాజకీయాల్లో సీరియస్ నెస్ తగ్గించడం కోసం ఇలా కాస్త హ్యూమరసం వొలకబోశారేమో అని అప్పుడు జనాలు అనుకున్నారు. ఇది కొత్తేమీ కాదని, 1991 లో తమిళనాడులోని శ్రీపెరంబదూరు ఎన్నికల సభలో శ్రీలంక ఉగ్రవాది మానవబాంబుగా మారి రాజీవ్ గాంధీని పొట్టనబెట్టుకున్న దుర్ఘటనలో, ఆ పేలుడు ధాటికి యువ గాంధీ శరీరం తునాతునకలు అయినప్పుడు, 'రాజీవ్' ఆనాడు ధరించిన కాలిజోడు సాయంతోనే ఆయన ఆనవాళ్ళు పోల్చుకున్న 'చరిత్ర'ను ఆనాడు ఓ కేంద్ర మంత్రి గుర్తు చేయడం ఈ యావత్ 'ఎపిసోడు'కి కొసమెరుపు. ఇది మరింత చిత్రంగా లేదూ.
ఇంతకీ రాహుల్ ఎక్కడ వున్నట్టు? ఎక్కడికి వెళ్లినట్టు? ట్వీట్ చేయగలగాలంటే అది కారడవుల్లోనో, హిమాలయ సానువుల్లోనో కుదిరేపని కాదు. ట్వీట్ ఆధారంతో ఆయన ఆనుపానులు కనుక్కోలేనివేమీ కావు. అయినా, సరే ఆచూకీ తప్ప ఆయన గురించిన అన్ని విషయాలు మీడియాలో వచ్చాయి. చిత్రం అని అన్నది ఇందుకే.
సరే! ఇదేదో మన దేశానికి మాత్రమే ప్రత్యేకం అని అనుకోవడానికి వీల్లేకుండా సరిగ్గా ఆ సమయంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాడలేకుండా పోయారు. ఆయనేమీ చిన్నా చితకా మనిషి కాదు. అయిదడుగుల ఏడంగుళాల మనిషి. అంతర్జాతీయ రాజకీయ గూఢచర్యంలో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న 'కేజీబీ' పుట్టిన దేశానికి సాక్షాత్తు అధ్యక్షుడు. రాజకీయాల్లోకి రావడానికి ముందు 'కేజీబీ' సంస్థలో పుతిన్ పదహారేళ్ళపాటు సీనియర్ అధికారిగా పనిచేశారు కూడా. అయినా పదిరోజులపాటు 'అదృశ్యం' అయిన పుతిన్ అచూకీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఊహాగానాలు మాత్రం ఆరున్నొక్క రాగం అందుకున్నాయి. క్రమంగా ముదిరి వదంతులుగా మారాయి. పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఓ పుకారు షికారు చేస్తే, కాదు అసలు ప్రాణాలతోనే లేడని మరో పుకారు పుట్టింది. సైనిక కుట్ర జరిగి నిర్బంధంలో ఉన్నాడని మరో వదంతి వచ్చి జత చేరింది. ఇవేవీ కావు పుతిన్ అదృశ్యానికి అసలు కారణం ఆయన ప్రేయసి అని, విదేశంలో బిడ్డకు జన్మ ఇస్తున్న ఆమెను చూడడానికి రెక్కలు కట్టుకుని వెళ్ళాడని ఇంకో ఊహాగానం రెక్కలు విప్పుకుంది. ఇలా రోజుకో పుకారు పురుడు పోసుకుంటూ వుంటుంటే, సరిగ్గా పదిరోజుల తరువాత పుతిన్ అజ్ఞాతాన్ని వీడి తనపై వస్తున్న వదంతులకు తెర దించాడు. తన ఆకస్మిక అదృశ్యానికి ఏ కారణం చెప్పకుండా, ఊహాగానాలను మాత్రం కొట్టిపారేసే ప్రయత్నం చేసారు. 'పుకార్లు లేకపోతే జీవితం రొటీన్ గా మారి విసుగు పుడుతుంది' ఇదీ చివరకు ఆయన ఇచ్చిన వివరణ. బహుశా ఏ నల్ల సముద్రం తీరంలోనో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ మీడియాలో తనపై వస్తున్న వదంతులను ఆస్వాదిస్తూ పది రోజులు పది నిమిషాల్లా గడిపి ఉంటారని అనుకోవాలి. నిజంగానే యెంత చిత్రం అనిపిస్తోంది కదూ.
ఇలాటి అదృశ్య సంఘటనలు చాలా దేశాల్లో జరిగాయి. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా వున్న క్సీ జిన్ పింగ్ (విదేశీ పేర్లను ఇష్టం వచ్చినట్టు రాసుకునే స్వేచ్ఛ ఉందన్న భావం బలపడుతున్న కాలం ఇది. లోగడ ఇలాటి పేర్లు రాయాల్సి వచ్చినప్పుడు ఆలిండియా రేడియో ఇంగ్లీష్ వార్తలు విని రాయమని పాత రోజుల్లో ఎడిటర్లు చెప్పేవాళ్ళు) అధ్యక్ష పదవికి నామినేట్ అయిన కొద్ది రోజులకే కనిపించకుండా పోయారు. రాడార్ కూడా పసికట్ట లేనంతగా ఆయన 'అదృశ్యం' అయ్యారని అప్పట్లో మీడియా కోడై కూసింది. సరే మళ్ళీ బయటకు వచ్చి ఆ దేశపు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అది వేరే విషయం. కానీ కనబడకుండా అన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారన్న గుట్టు ఇప్పటికీ బయటకు రాలేదు.
కాకపోతే, కనబడకుండా పోయిన ఇలాటి సంచలన రాజకీయ నాయకులు మనకు చరిత్రలో అనేకమంది కానవస్తారు.
హ్యూగో చావెజ్ ఆషామాషీ నాయకుడు కాదు. దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశాధ్యక్షుడిగా వున్నప్పుడు ఏకంగా ఓ నెల రోజులపాటు ఎవ్వరి కంటికీ కనిపించకుండా పోయి సంచలనం సృష్టించారు. 2011 జూన్ నెలలో ఇది జరిగింది. అప్పుడు అయన తీవ్ర అనారోగ్యం గురించిన వార్తలే సంచారం చేసాయి. అనుదినం టీవీ తెరలపై కానవస్తూ, ట్విట్టర్లో దర్శనం ఇచ్చే ఛావెజ్ అన్ని రోజులు కనబడకుండా పోవడం ఆ రోజుల్లో పెద్ద వార్తగా తయారయింది. ఆయనపై వెలువడిన వదంతులను ఖండించడానికి ఆయన ప్రభుత్వం చాలా శ్రమ పడింది. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రోతో కలిసి ఛావెజ్ వాహ్వ్యాళి గా నడిచివెడుతున్న ఫోటోలను పత్రికలకు విడుదల చేసినా, పుకార్ల పటిమ ఏమాత్రం తగ్గలేదు.
అమెరికాకు చెందిన మరో రాజకీయ నాయకుడిది సామాన్యంగా ఎదురయ్యే సమస్యే. కాని అయన దాన్ని దాచిపెట్టి తన అదృశ్యానికి వేరే కారణాలు చెప్పాడు. అదే ఆయన్ని ఇబ్బందులలోకి నెట్టింది. ఆయన సౌత్ కరోలినా గవర్నర్ మార్క్ సాన్ ఫర్డ్, 2009 జూన్ లో వున్నట్టుండి నాలుగు రోజులపాటు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ‘మా ఆయన ఏదో పుస్తకం రాయడానికి వెళ్ళాడు, ఇంట్లో పిల్లల అల్లరి వల్ల ప్రశాంతత కరువై అజ్ఞాతంలోకి వెళ్ళారని’ మార్క్ సాన్ ఫర్డ్ భార్య యేవో సాకులు చెప్పింది. కానీ ఈలోగా ఆయనే బయట పడి, తన మనసులో మాట బయటపెట్టాడు. 'నేను నా భార్యకు ద్రోహం చేసాను. నాకెంతో ప్రాణప్రదం అయిన నా ప్రియురాలితో గడపడానికి వెళ్లానని చెప్పేసి, ఆయనే తన తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకున్నాడు. అయన బుద్ది ఏడాదిలోనే మరో వంకర తిరిగింది. మొదటి ఎపిసోడుతో చిన్నబుచ్చుకున్న మొదటి భార్య విడాకులు తీసుకుంది. దాంతో మరింత ధైర్యంతో సాన్ ఫర్డ్ దొరవారు మళ్ళీ కనబడకుండా పోయారు. కాకపోతే తన స్థానంలో తరువాత గవర్నర్ చార్జి తీసుకునే కార్యక్రమంలో హఠాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతే కాదు, నలుగురు చూస్తుండగానే అక్కడకు వచ్చిన తన మాజీ భార్య బుగ్గపై ముద్దు పెట్టుకుని తనలో దాగున్న ప్రబంధ నాయకుడిని మరోమారు ప్రపంచానికి ఎత్తి చూపారు.
సరదా సంగతులు ఇలాగే చిత్రంగా వుంటాయి.



కామెంట్‌లు లేవు: