“మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అలాగే మీ సాయం కూడా కావాలి” అన్నాడతను.
గొంతు బొంగురుగా అదో రకంగా వుంది.
ఉర్దూ వార్తల టైం అవుతోంది. హెడ్ లైన్స్ డిక్టేట్
చేస్తుంటే మొదలయిన సంభాషణ ఇది.
“కాసేపు అలా కూర్చోండి. బులెటిన్ పని కాగానే మాట్లాడుకుందాం”
అన్నాను. అని నా పనిలో మునిగిపోయాను.
ఉర్దూ వార్తల తరవాత తెలుగు వార్తలు. ప్రాధాన్యాన్ని బట్టి వార్తల్లో కొన్ని మార్పులు
చేసి, సరి చూసి న్యూస్ రీడర్ చేతిలో కాగితాలు పెట్టాను. అతను వాటిని మరోమారు
చదువుకుంటూనే స్టూడియో వైపు వెళ్ళిపోయాడు.
అప్పుడు గమనించాను, ఆ బొంగురు గొంతు వ్యక్టి ఇంకా
అక్కడే వున్నాడు. వార్తలు మొదలయ్యాయి. అందరితో పాటు అతనూ వింటున్నాడు. ఆరూ ఇరవై
అయిదుకు ఠంచనుగా ‘ప్రాంతీయ వార్తలు
ఇంతటితో సమాప్తం’ అంటూ
న్యూస్ రీడర్ ముగించాడు.
“ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పాలని అన్నారు కదా!” అని
నేనే కదిలించాను.
“ఇక్కడా! బాగుండదేమో! అలా బయటకు వస్తారా”
అన్నాడతను.
“ఏం పర్వాలేదు. చూసారు కదా! మా న్యూస్ రూమ్. అంతా
ఒకటే హాలు. పనిచేసే మనుషుల మధ్య పార్టిషన్లు కూడా లేవు. అందరం ఒక కుటుంబం లాగా పనిచేసుకుంటాము.
రహస్యాలు ఏవీ వుండవు”
“ఆలానా! సరే! నాకు రేడియోలో వార్తలు చదవాలని
వుంది. అలాగే మీరిప్పుడు బులెటిన్ డిక్టేటర్ చేస్తుంటే గమనించాను. ఈ ఉద్యోగం నాకేమైనా
దొరుకుతుందా! మా దోస్తులు చాలామంది చెప్పారు, నా గొంతు రేడియోకి సూట్ అవుతుందని. బయట వాళ్ళు కూడా
వార్తలు చదువుతుంటారని, వెళ్లి ప్రయత్నించమని, అందుకే వచ్చాను. ఈ విషయంలో నాకేమైనా సాయం
చేయగలరా!”
“మీరు విన్నది కొంత నిజమే. మా దగ్గర ఇలా క్యాజువల్ గా వార్తలు చదివే
వాళ్ళు వున్నారు. ఇదిగో! ఈయన ఇప్పుడే స్టూడియో నుంచి వచ్చారు. మీరు ఇప్పటిదాకా
విన్న వార్తలు ఈయన చదివినవే.. బ్యాంకులో పనిచేస్తారు. మాకు అవసరంపడ్డప్పుడు ఇదిగో ఇలా వచ్చి, మా దగ్గర వార్తలు చదువుతుంటారు. అయితే.
ఇందుకు ఒక విధానం వుంది. ముందు వ్రాత పరీక్ష వుంటుంది. అందులో పాసయితే మళ్ళీ
ఆడిషన్ వుంటుంది. ఈ పరీక్షలు అవీ కూడా రెండేళ్ళకో, మూడేళ్ళకో పెడతాము. అవన్నీ దాటి
సెలక్టు అయితే నెలకో అయిదుసార్లు వార్తలు
చదివే అవకాశం వస్తుంది. ప్రతినెలా రాకపోవచ్చు. రెగ్యులర్ న్యూస్ రీడర్లు సెలవు
పెడితే ఆ ఖాళీలో ఇలా సెలక్ట్ అయిన క్యాజువల్స్ కి అవకాశం ఇస్తాము. కాబట్టి ఈ
పద్దతి ఫాలో అయి ప్రయత్నం చేసుకోండి” అని ఓ సలహా ఇచ్చి సంభాషణ ముగించబోయాను.
“..........”
“అయినా రేడియోలో వార్తలు చదవడం అంత సులభం అనే
అభిప్రాయం మీకు ఎందుకు కలిగింది” అని అడిగాను. తర్వాత అనిపించింది, ఈ
ప్రశ్న వేయకుండా వుంటే బాగుండేదని.
అతను చెప్పాడు.
“చిన్నప్పటి నుంచి రేడియో వార్తలు వింటున్నాను.
ఎప్పుడో ఒకప్పుడు వార్తలు చదవాలనే కోరిక మొదలయింది. దానితో చదువుకు పదో తరగతితో
బ్రేకు పడింది. నిన్ననే ఓ పత్రికలో చదివాను, ఓ హీరో సినిమా ఫస్ట్ షో చూడడంకోసం ఒక పూటల్లా
క్యూ లైన్లో నిలబడ్డాడుట. ఇప్పుడు అదే హీరోతో నటిస్తున్నానని చెప్పాడు. ఆయనకు
సాధ్యపడింది నాకెందుకు చేతకాదు?”
గదిలో ఉన్న వాళ్లందరికీ నవ్వు వచ్చింది, అతడి
మాటలు విని. కానీ పైకి ఎవ్వరూ నవ్వలేదు.
కొంచెం ఆలోచనలో పడ్డారేమో తెలియదు.
నాకయితే అనిపించింది.
“ఇన్నేళ్లుగా నేను చేస్తున్న పని ఇంత సులభమా!
ఏమో!”
(ఆకాశవాణి అమృతోత్సవాలను పురస్కరించుకుని
హైదరాబాదు రేడియో వారు నా అనుభవాలను ఓ అరగంట రికార్డు చేస్తాం రమ్మంటే వెళ్లాను.
ఒకప్పటి న్యూస్ రీడర్, నా
సహోద్యోగి సమ్మెట నాగమల్లేశ్వర రావు ఈ
కార్యక్రమ నిర్వాహకులు. రికార్డింగ్ పూర్తయిన తర్వాత, ఎటూ వచ్చాను కదా! అని పుట్టింటికి (న్యూస్
యూనిట్) కి వెళ్లాను. పుష్కరాల క్రితం అక్కడ చాలామందితో కలిసి పనిచేశాను. కొందరు కొత్తవాళ్ళు కనబడ్డారు.
కాసేపు అక్కడ మాటామంతీ జరిపి, ‘ఇచ్చోటనే కదా! ముప్పయ్యేళ్లు వార్తలు వండి
వార్చింది’ అని గుర్తు చేసుకుంటుంటే, గుర్తొచ్చిన జ్ఞాపకం ఇది)
(11-02-2022)
2 కామెంట్‌లు:
అప్పట్లో విజిటర్స్ లోపల న్యూస్ రూమ్ / హాల్ వరకూ కూడా వెళ్ళిపోగలుగుతుండేవారా ఏమిటండీ? ఈ రోజుల్లో ప్రతి చిన్నాచితకా భవనాల / షాపుల దగ్గర కూడా ఆ సోకాల్డ్ సెక్యూరిటీ వాళ్ళ ఓవరాక్షన్, అమర్యాద భరించలేకుండా ఉన్నాం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారులే అనుకుందామనుకున్నా కూడా ఆ ఓవరాక్షన్, అహంకారం బాగా ఎక్కువ. కార్పొరేట్లు తెచ్చి పెట్టిన దరిద్రం.
ఇంతకూ ఆ “బొంగురు గొంతు” ఆసామీ న్యూస్ రీడర్ గా ఎంపికయ్యాడా?
విన్నకోట నరసింహారావు గారికి: న్యూస్ రూమ్ లోకి ఎవరైనా రావచ్చు. చాలామంది న్యూస్ ఇవ్వడంకోసం వస్తుంటారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి