“దేవుడు మనిషికి రెండు చెవులు ఇచ్చింది ఎక్కువ వినడానికి, ఒక్క నోరే ఇచ్చింది తక్కువ మాట్లాడడానికి” అని వాక్రుచ్చాడు ఓ మితభాషి.
నిజమే! వినడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ
చెప్పేవాడు ఓ విజ్ఞాన ఖని అయితే మన పంట పండినట్టే.
ఈ ఉదయం వచ్చిన అనేకానేక ఫోన్లలో కోమాండోరి
(ఇంటిపేరు విని రాసింది కనుక తప్పయితే క్షంతవ్యుడను) శేషాచారి గారిది ఒకటి. మాటల నడుమ తెలిసింది వారి వయసు తొంభయ్ అని.
కొద్దిగా వణుకు వున్నా, మాట స్పుటంగా
వుంది. ఉస్మానియాలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారుట. చైతన్యపురిలో
నివాసం.
షరా మామూలుగా నమస్తే తెలంగాణా లోని నా వ్యాసం
గురించి ప్రస్తావించారు. నా పట్ల వారి ప్రశంసలు
ఇక్కడ అప్రస్తుతం.
ప్రతిరోజూ అనేక పత్రికలు చదివే అలవాటు వారికి
వుందట. అలా నా వ్యాసం కూడా చదివారు. అందులో నెంబరు వుండడం చేత ఫోన్ చేశారు.
మాటల మధ్యలో శేషాచార్యుల వారు అనేక అంశాలు
ప్రస్తావించారు. తొమ్మిది పదుల వయసులో ఆయన ధారణ శక్తి అద్భుతం అనిపించింది. వారు
చెప్పిందే ఈవ్యాసం శీర్షికలో పేర్కొన్న ‘మాధవుడు
ఏక పదమా! సమాసమా!’
మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడు. వినగానే ఏకపదం
అనిపిస్తుంది. ఉత్పత్తి అర్ధం తీసుకుంటే మా అంటే అమ్మ. అమ్మ అంటే అమ్మవారు,
జగజ్జనని. అంటే శ్రీ మహావిష్ణువు సతీమణి. ధవుడు అంటే భర్త. అమ్మవారి భర్త
శ్రీమన్నారాయణుడు అంటారు శేషాచార్యుల వారు.
మధ్యలో ఏదో అనుమానం కలిగి అడిగారు, మీరు
ఫ్రీగా వున్నారా! అని.
‘పరవాలేదు, నేను 24 X 7 ఫ్రీ మనిషిని. పైగా మీ మాటలు వింటుంటే
రాసుకోవడానికి నాకు ముడి సరుకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో నా స్వార్ధం కూడా
వుంది,
చెప్పండి’ అన్నాను
వారితో.
‘ఒకసారి అంటే ఇప్పుడు కాదులెండి చాలా దశాబ్దాలు
గడిచిపోయాయి. సారస్వత పరిషత్ లో జరిగిన ఓ సభకు ప్రముఖ కవి జాషువా గారు,
కవిసామ్రాట్ విశ్వనాధ గారు వచ్చారు. నేనూ వెళ్లాను.
‘జాషువా గారు సాత్వికులు. విశ్వనాధ వారి సంగతి
లోక విదితం. ప్రధమ కోపం అంటారు.
‘జాషువాగారు నాలుగు పద్యాలు చదివారు. తర్వాత ఆయన
ఇలా అన్నారు, నా
పద్యాలకు అర్ధం అడక్కండి, కానీ
రాయడానికి కారణాలు అడగండి చెబుతాను అంటూ జాషువాగారు తన గబ్బిలం పుస్తకం గురించి
చెబుతుంటే సభలో అందరూ ఆయన కవితాభినివేశానికి మ్రాన్పడి పోయారు. అంతసేపూ వేదిక మీద
ఉన్న విశ్వనాధవారు తనకు వేసిన గులాబీ పూలదండను
చేతితో నలుపుతున్నట్టు అనిపించి కొంత భయపడ్డారు కూడా.
ఇంతలో జాషువాగారి ప్రసంగం ముగిసింది. సభికుల
హర్షధ్వానాల నడుమ విశ్వనాధ లేచి నిలబడ్డారు. అప్పటివరకు పూలదండ నుంచి తెంచిన
గులాబీ రేకులను దోసిట్లోకి తీసుకుని జాషువా శిరస్సుపై అభిషేకిస్తున్నట్టు
వెదజల్లారు.
రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ జాషువాను
పుంభావసరస్వతి అని కీర్తించారు.
శేషాచార్యుల వారు ఈ వృత్తాంతం చెబుతూ కొద్ది సేపు
మౌనంగా వుండి గతకాలపు జ్ఞాపకాలను తలచుకున్నారు.
తర్వాత నేనే చొరవ తీసుకుని వారి వివరాలు అడిగి
తీసుకున్నాను. లోగడ అంటే నేను రేడియోలో చేరక పూర్వమే శేషాచార్యులవారు ఆకాశవాణిలో సంస్కృత
కార్యక్రమాల్లో పాల్గొన్నారట. అధర్వణ వేదాన్ని విశదీకరిస్తూ అనేక ప్రసంగాలు
చేశారట.
ఇటువంటి విలువకట్టలేని నిక్షేపాలు ఆకాశవాణి వద్ద
అనేకం ఉండేవి. ఉండేవి అని ఎందుకు అంటున్నాను అంటే తదనంతర కాలంలో వాటి విలువ తెలియని వాళ్ళు వాటిని పదిలంగా
భద్రపరచి వుంటారనే నమ్మకం లేదు కనుక.
పాదాభివందనాలు శేషాచార్యుల వారూ. పరగడుపునే
పరమాన్నం తినిపించారు.
(16-02-2022)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి