24, ఫిబ్రవరి 2022, గురువారం

యుద్ధాలు మిగిల్చేది ఏమిటి? - భండారు శ్రీనివాసరావు


‘తాతల తండ్రుల చంపుకొనుటకా ఈ భండనంబు కృష్ణా!’

కురుక్షేత్ర రణక్షేత్రంలో మహా భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తెల్లగుర్రముల రధమును తోలే నల్లనయ్యను అప్పటికి అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అడుగుతాడీ ప్రశ్న. తదుపరి కృష్ణుడు గీతార్ధసారం ఎరిగించిన తరువాత ఎరుకనబడిన సవ్యసాచి అన్నదమ్ములతో కలసి సాగించిన ఆ మహా సంగ్రామం అనంతరం కూడా నివృత్తి కాని సందేహం ఇదే.

ఎందుకంటె పద్దెనిమిది రోజులపాటు జరిగిన ఈ మహాయుద్ధంలో విజయం సాధించిన యుధిష్టురుడికి మిగిలిందేమిటి? గుట్టలకొద్ది సైనికుల శవాలు. ఆనవాలు పట్టలేని ఆత్మీయుల కళేబరాలు.
కౌరవ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్నఅనేక అక్షౌహిణుల సైన్యం నిహతమయింది. శవాల గుట్టల నడుమ, గెలిచినవారి పక్షాన బతికిబట్టగలిగింది ధర్మజ,భీమ,అర్జున,నకుల,సహదేవులు, కృష్ణుడితో కలిపి మరో ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరిలో సాత్యకిని మినహాయిస్తే యుయుత్సుడి విషయం మళ్ళీ అనుమానమే అంటారు చరిత్రకారులు. అంటే విజయలక్ష్మి వరించిన ధర్మజుని పక్షంలో మిగిలింది కేవలం ఏడుగురు మాత్రమే. అటు ఓడిన కౌరవ పక్షంలో ప్రాణాలతో బయటపడింది నలుగురే నలుగురు. అశ్వథామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కుమారుడయిన విశ్వకేతు. ఎవరి కారణంగా ఈ మహారణం చెలరేగిందో ఆ కురుసార్వభౌముడు, దుర్యోధనుడితో పాటు దుశ్శాసనాది అతడి సోదరులందరూ ఈ మహా యుద్ధంలో అసువులు బాశారు.

పదిహేను లక్షల యాభయ్ మూడు వేల తొమ్మిది వందల సైనికులతో కూడిన ఏడు అక్షౌహిణుల పాండవదండుకు సైన్యాధ్యక్షుడు పాంచాల రాజు ద్రుష్టద్యుమ్నుడు కాగా, ఇరవై నాలుగు లక్షల అయిదు వేల ఏడు వందల సైన్యం కలిగిన పదకొండు అక్షౌహిణుల కౌరవసేనకు తొలుదొల్త నాయకత్వం వహించింది భీష్మ పితామహుడు. యుద్ధ పరిసమాప్తి నాటికి ఇరువైపులా మొత్తం సైనికులందరూ తుడిచిపెట్టుకుపోయారు.

2 కామెంట్‌లు:

Chiru Dreams చెప్పారు...

ఏదైతేనేమి.. ఎంతమంది చస్తేనేమి.. ధర్మసంస్థాపన జరిగిందికదా! అది చాలు.

అజ్ఞాత చెప్పారు...

ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం:
రణరక్త ప్రవాహసిక్తం
బీభత్సరస ప్రధానం. - శ్రీ శ్రీ