14, ఫిబ్రవరి 2022, సోమవారం

ప్రేమంటే ఇదిరా! -భండారు శ్రీనివాసరావు

 పత్రికలకి కొన్ని వార్తలు పట్టవు. అయినా అలాటి వార్త ఒకటి నా కంట పడింది. ఏదో పత్రికలో కాదు, యాధాలాపంగా రిమోట్ తో టీవీ ఛానళ్లు మారుస్తుంటే.

పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతున్నారు. మాట్లాడడం ఆయనకు కొత్త కాదు. కాని ఎప్పుడు మాట్లాడినా వినేవాళ్ళకు కొత్తగానే వుంటుంది.

ఆయన తీసుకున్న అంశం కొత్తగానే కాదు కాస్త విచిత్రంగా కూడా వుంది.

వేలంటైన్స్ డే. ప్రేమికుల దినం. దాన్ని గురించి మాట్లాడడమే కాదు, ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం రోజున దాన్ని హైదరాబాదులో నిర్వహించారు కూడా.

ఇక ఈ ‘కూడా’లు కాస్త పక్కనబెట్టి అసలు విషయం చెప్పుకుందాం.

స్వామివారు ఏమిటి? ప్రేమికుల దినోత్సవం జరపడం ఏమిటి? దాన్ని గురించి మాట్లాడ్డం ఏమిటి అనే ప్రశ్నలకు తమ అనుగ్రహ భాషణంలో ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు.

వేలంటైన్స్ డే' ప్రాశస్త్యం గురించి చెప్పారు. దాని ఆవిర్భావం గురించి వివరించారు. ఒక యువకుడు, ఒక యువతి ప్రేమించుకోవడం ఒక్కటే ప్రేమ అనుకోరాదన్నారు.

అది కూడా ప్రేమే. కాదనను. కానీ పిల్లలపట్ల తల్లి చూపే ప్రేమ, తల్లి పట్ల పిల్లలు చూపే ప్రేమ, తండ్రి పట్ల పిల్లలు, పిల్లల పట్ల తండ్రులు ప్రదర్శించే ప్రేమ, భగవంతుడి పట్ల భక్తుడి ప్రేమ, భక్తుడి విషయంలో భగవంతుడు చూపే ప్రేమ, అన్నింటికీ మించి దేశం పట్ల, హనుమంతప్ప వంటి వీరుల పట్ల జాతి ప్రజలు చూపాల్సిన ప్రేమ, ఇలా సాగే ఈ ప్రేమలు అన్నింటినీ, వాటి వైశిష్ట్యాన్ని ఎత్తి చూపాల్సిన దినం, ప్రేమికుల దినం’ అంటూ చక్కని సరికొత్త నిర్వచనం ఇచ్చారు పరిపూర్ణానంద స్వామి వారు. యెంత చక్కటి తాత్వికత! యెంత గొప్ప ఆలోచన.

నిజమే కదా! ప్రేమ్ దివస్ అంటే ప్రేమికుల రోజు కాదు, ప్రేమ మహత్తును అందులోని మత్తును జగత్తుకు తెలపాలనే సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కళ్ళు చెదిరే విన్యాసాలు లేవు కానీ, కళ్ళు చమర్చే అంశాలు వున్నాయి. ప్రేమికుల రోజునే దీన్ని నిర్వహించడం ద్వారా స్వామి, నేటి తరానికి కొత్త సందేశం ఇచ్చారు. అంతే కాదు, ప్రేమ అంటే ఏమిటో, అది ఎన్ని రకాలుగా తన రూపాలను విస్తరిస్తుందో ఈ కార్యక్రమంలో ఎత్తి చూపారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఒక మాతృమూర్తిని తీసుకువచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఆమె కడుపున పడ్డ బిడ్డడు భూమిన  పడ్డాడు కాని, అప్పటి నుంచి ఇప్పటివరకు మానసిక ఎదుగుదల లేదు. ‘అమ్మా’ అనిపించుకోని ఆడజన్మ నిరర్ధకం అంటారు. పాపడు పుట్టి ముప్పయి రెండేళ్ళు అవుతున్నాయి. కాని ఏనాడు నోరు తెరిచి ‘అమ్మా’ అని పిలవలేని నిర్భాగ్య దామోదరుడు అతడయితే, పిలిపించుకోలేని దౌర్భాగ్యం ఈ కన్న తల్లిది. తల్లిప్రేమ తూచగలిగిన తరాజు ఈలోకంలో లేదు. ఏమీ లేకపోయినా అన్నింటికీ మించిన అమ్మతనం ఆమె సొంతం. ఆ బిడ్డడి పట్ల కన్నతల్లి ప్రేమ చూపడంలో ఆ పేదరాలు ‘పేదది’ అనిపించుకోలేదు. ఇన్నేళ్ళు వచ్చినా ఆ పాపడికి పసితనపు ‘తెలియనితనం’ పోలేదు. ఇప్పటికీ దైహిక సంబంధమైన ప్రాకృతిక పనులన్నీ ఆ తల్లి ఒడిలోనే. అయినా, అసహ్యించు కూకుండా, ఏవగించుకోకుండా ప్రేమతో  సేవలు చేస్తూనే వస్తోంది. అన్నేళ్ళు వచ్చినా ఆ పాపడు ఆ తల్లికి ఇంకా ఒడిలోని బిడ్డే. అందుకే, ఈ కార్యక్రమ నిర్వాహకులు ‘ తల్లి ప్రేమలో కల్తీ వుండదు’ అని నిరూపించిన ఆ మాతృమూర్తిని సగౌరవంగా వేదిక మీదకు తోడ్కొని వచ్చి సన్మానం చేసారు. ముఖ్య అతిధిగా వచ్చిన అప్పటి తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ శ్రీ మధుసూధనాచారి, ఆమె పరిస్తితి చూసి విచలితులై తన జేబులో వున్న కరెన్సీ నోట్లు అన్నింటినీ, ఎన్ని వున్నాయో లెక్కపెట్టుకోకుండా ఆ అమ్మ చేతిలో పెట్టి దణ్ణం పెట్టారు.

అలాగే, స్వామి కన్నుపడిన మరో అదృష్టవంతుడు, పుట్టుకతో దురదృష్టవంతుడు అయిన కనుచూపు లేని సంగీత కళాకారుడు మోహన కృష్ణ. చిన్నతనంలో అంతంతగా వున్నా కనుచూపు ఒక వయసు రాకముందే పూర్తిగా పోయింది. కన్నతల్లి లాలనలో పెరిగిన కళ్ళు లేని మోహన కృష్ణ ఇంతేనా ఈ జీవితం అని నిరుత్సాహపడకుండా సంగీతాన్నే తన జీవితం చేసుకున్నారు. సంగీత ప్రపంచంలోనే పెరిగిపెరిగి, వయస్సులోనే కాకుండా సంగీతంలో కూడా చాలా పెద్దవాడయాడు. సంగీతాన్ని అంతగా ప్రేమించిన వాడు కనుకనే సంగీత సరస్వతి అతడిని అంతగా కరుణించింది. ఈ వేడుకలో సన్మానం పొందినవారిలో మోహన కృష్ణ ఒకడు కావడానికి ఈ ప్రేమే కారణం.

పత్రికలు చదివే వారికి వరంగల్ ‘ప్రణీత’ గుర్తుండేవుంటుంది. రౌడీలు చిమ్మిన యాసిడ్ మొహాన పడి అందవికారిగా మారిన ప్రణీత, పట్టుదలతో చదువు కొనసాగించి, బీటెక్ పూర్తిచేసి ఇంజినీర్ కాగలిగింది. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం మిన్న అని నమ్మిన ఓ యువకుడు, ఆమె గురించి విని, అమెరికా నుంచి వచ్చి ఏరికోరి మరీ ఆమెను పెళ్ళాడాడు. ఈ వేదిక మీద ఆమెను చూసిన వారు చప్పున గుర్తుపట్టి వుండరు. ఎందుకంటె ఆత్మబలం ఇచ్చిన దమ్మూ ధైర్యం ఆమె మొహం మీది మరకలను కనబడకుండా కప్పివేశాయి. ఈ నిజమైన ప్రేమకు కూడా ఈ వేదికపై ఘనమైన  సత్కారం జరిగింది.

భారతీయతకు కుటుంబ వ్యవస్థ వెన్నెముక. కాలక్రమంలో కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని గ్రహించిన ఓ కుటుంబం, మనకు మాత్రమే  సొంతం అయిన ఈ ‘కుటుంబ వ్యవస్థను’ రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడుతోంది. ఆ కుటుంబం మన మహబూబ్ నగర్ జిల్లాలోనే వుంది. మొత్తం అరవై రెండు మంది సభ్యులు వున్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కు నానోజీ మహాశయులు. అత్తలు, కోడళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఒదినెలు, మరదళ్ళు, కోడళ్ళు, ఆడపడుచులు, మనుమలు, మనుమరాళ్ళు, మునిమనుమలు ఇలా అందరూ ఒక్క గూడు కిందనే కలసికట్టుగా వుంటున్నారు. ఒక చూరు కిందనే కలిసి వండుకుంటారు. కలిసి తింటారు. ‘పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, పొరపొచ్చాలు లేని మంచి కుటుంబం’గా అందరు మెచ్చే విధంగా జీవిస్తున్నారు. కుటుంబ ప్రేమకు ఉదాహరణగా నిలచిన ఆ కుటుంబానికి కూడా ఈ వేదికమీద సన్మానం జరిగింది.

ఇప్పుడు చెప్పండి ఇది వినూత్నంగా నిర్వహించిన ప్రేమికుల దినమా కాదా! ప్రేమ్ దివస్ అవునా కాదా!

దీన్ని నిర్వహించిన భారత్ టుడే టీవీ ఛానల్ నిర్వాహకులకు

అభినందనలు

తెలపాలా లేదా!

మొత్తం ఈ కార్యక్రమానికి ఇంతటి ఉద్దీపన కలిగించిన మాన్యులు పరిపూర్ణానంద స్వామి వారికి సాష్టాంగనమస్కారం నమస్కారం చేయాలా వద్దా!

నేనయితే మరో మాట లేకుండా, మరో ఆలోచన రాకుండా ఆ రెండూ ఇంట్లోనుంచే  చేసేసాను.



 

గమనిక: రేళ్ల కిందట 2016 లో ప్రేమికుల దినోత్సవం నాడు రాసింది. ఇప్పుడు ఈ స్వామి గారు కూడా ఒక రాజకీయ పార్టీలో చేరారు. ఇక ఆయన ఏం చెప్పబోయినా అందులో మంచికంటే రాజకీయమే జనాలకు ముందు కనబడుతుంది. మనకున్న దురదృష్టాల్లో ఇదొకటి.

(14-02-2022)

కామెంట్‌లు లేవు: